ఫ్లాష్ బ్యాక్ @ 50

జగత్ కిలాడీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాపట్ల తాలూకా చెరువుజమ్ములపాలెంలో జన్మించారు పి ఏకామ్రేశ్వర రావు. మచిలీపట్నం కాలేజీలో బిఏ చదివే రోజుల్లోనే కళారంగంపై మక్కువతో ‘తుఫాన్’ నాటికలో కీలకమైన ‘రాఘవరెడ్డి’ పాత్ర పోషించి మెప్పించారు. తరువాత మద్రాసు చేరి కొంత కాలానికి నిర్మాత ఎన్‌ఎన్ భట్‌తో భాగస్వామిగా ‘సుఖ దుఃఖాలు’ చిత్రాన్ని రూపొందించారు. ఆ చిత్రంలో ఒక వేషం కూడా ధరించారు. ప్రముఖ నిర్మాత కె రాఘవ అప్పట్లో ఆ చిత్రానికి ప్రొడక్షన్ మేనేజర్‌గా వ్యవహరించారు. ఆయన స్నేహంతో తరువాత ఇద్దరి భాగస్వామ్యంలో ఫల్గుణా పిక్చర్స్ బ్యానర్‌పై 1969లో నిర్మించిన చిత్రమే -జగత్ కిలాడీలు. తరువాత జగత్ జెట్టీలు (1970), జగత్ జంత్రీలు (1971)లో నిర్మించారు.
‘జగత్ కిలాడీలు’ చిత్రానికి ప్రముఖ డిటెక్టివ్ నవలా రచయిత విశ్వప్రసాద్ కథ, మాటలు సమకూర్చారు. 1969 జూలై 25న సినిమా విడుదలైంది.

సంగీతం: ఎస్‌పి కోదండపాణి
నృత్యం: ఐసి తంగరాజ్, రాజ్‌కుమార్
కళ: బిఎన్ కృష్ణ
ఎడిటింగ్: ఎన్‌ఎస్ ప్రకాశం
స్టంట్స్: మాధవన్
ఛాయాగ్రహణం: కన్నప్ప
స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ఐయన్ మూర్తి
నిర్మాతలు: పి ఏకామ్రేశ్వర రావు, కె రాఘవ

శ్రీకృష్ణార్జునుల బొమ్మను చూపిస్తూ ఫల్గుణా పిక్చర్స్ బ్యానర్‌పై సినిమా మొదలవుతుంది. కృష్ణ, గుమ్మడి, ఎస్వీ రంగారావు మూడు వైపుల నుంచీ పిస్టల్స్‌తో గురి చూపిస్తున్నట్టున్న స్టిల్స్, రకరకాల డిజైన్స్‌తో టైటిల్ సాంగ్ (కిలాడీలు లోకమంతా కిలాడీలురా)పై టైటిల్స్ పడతాయి.
జమీందారు రాజారావు (కాశీనాథ తాత). ఆయన భార్య శ్యామలాదేవి (జి వరలక్ష్మి). వారి కుమారుడు ఆనంద్ (కృష్ణ). అతను విదేశాల్లో ఉంటాడు. వీరి వంశానికి చెందిన ఓ నిధి రహస్యం జమీందారు దంపతులు, కొడుకు ఆనంద్‌కు మాత్రమే తెలుసు. ఆ పట్టణంలో దోపిడీదొంగ, క్రూరుడు అయిన భయంకర్ (రావుగోపాలరావు) నిధిని చేజిక్కించుకునే ప్రయత్నంలో జమీందారును అంతంచేసి, అతని భార్యను గుహలో బంధిస్తాడు. భయంకర్ ఆచూకీ కోసం పోలీసు కమిషనర్ సిన్హా (గుమ్మడి) ప్రయత్నిస్తుంటాడు. తండ్రి మరణంతో విదేశాల నుంచి వచ్చిన ఆనంద్, తల్లి ఆచూకీ కోసం భయంకర్‌ను ఎదుర్కొనే ప్రయత్నాలు చేస్తాడు. పోలీస్ కమిషనర్ ఇంట్లో ఆశ్రయం పొందిన ఆనంద్ బాగోగులను సిన్హా తల్లి భారతీదేవి (మాలతీ), చెల్లెలు శాంతి (వాణిశ్రీ) చూస్తుంటారు. అలా శాంతి -ఆనంద్‌ల మధ్య ప్రేమ చిగురిస్తుంది. అదే పట్టణంలో ఉండే రౌడీ గంగులు (ఎస్వీ రంగారావు) భయంకర్ దోపిడీ ప్రయత్నాలను అడ్డుకుంటుంటాడు. ఈ క్రమంలో కథ అనేక మలుపులు తిరుగుతుంది. చివరకు సిన్హాను హత్యచేసిన భయంకర్, అతని స్థానంలో సిన్హాగా చలామణి అవుతున్నాడని తెలుస్తుంది. ఇక రౌడీగంగులు ఎవరో కాదు, సెంట్రల్ సిఐడి గంగారామ్ అన్న రహస్యం బయటపడుతుంది. భయంకర్, అతని ముఠాను పోలీసులు అరెస్ట్ చేయటం, ఆనంద్, సిఐడి గంగారామ్‌కు అభినందనలు, శాంతి- ఆనంద్‌ల వివాహంతో చిత్రం శుభంగా ముగుస్తుంది. రాజ్‌బాబు, బాలకృష్ణ, అర్జా జనార్ధనరావు, డాక్టర్ శివరామకృష్ణయ్య వివిధ పాత్రల్లో కనిపిస్తారు.
ఎన్‌ఏటి ‘సీతారామకల్యాణం’ చిత్రానికి సహాయ దర్శకునిగా పనిచేసి, ఆపైన ఎన్టీఆర్ నటించిన ‘ఇరుగు పొరుగు’ చిత్రానికి దర్శకత్వం వహించారు ఐఎన్ మూర్తి. ‘జగమేమాయ’ చిత్రం ద్వారా నటునిగా రాజబాబును పరిచయం చేసింది ఈయనే. జగత్ కిలాడీలు చిత్రానికి కథానుగుణమైన సన్నివేశాలను ఎంతో సునిశితంగా చక్కని టెంపో, సెంటిమెంట్ జోడించి క్రైమ్, యాక్షన్ థ్రిల్లర్‌ను తీర్చిదిద్దారు.
నిధి రహస్యం చెప్పినా తమను చంపేస్తారని రాజావారు చెప్పటంతో జమీందారిణి నిధి రహస్యం చెప్పకపోవటం, జమీందారును హత్యచేసి భయంకర్ ఆమెను బంధించటం, స్వదేశానికి వచ్చిన సమయంలో తనను బంధించబోయిన దుండగులను ఆనంద్ సాహసంతో ఎదుర్కోవటంలో అతని ధైర్యసాహసాలు ఓ సన్నివేశంతో వివరించటం.. ఇలా ప్రతి సన్నివేశాన్నీ అర్థవంతంగా తీర్చిదిద్దారు దర్శకులు. విలన్ల తీరు, డెన్‌లో చివరదాచిన స్థావరంలో అనుచరుని అంతుచూసి నిధి చేజిక్కించుకున్న భయంకర్‌ను హీరో గుర్రంపై చేజింగ్ వంటి పలు విన్యాసాలు.. విషం విరుగుడు మందు తాగి రౌడీగంగులు.. భయంకర్ వద్దకు వెళ్లటం, భయంకర్ దాడినుంచి తప్పించుకోవటం, అదేవిధంగా గాయపడి తన ఇంటికొచ్చిన రౌడీ గంగులుకు సిన్హా తల్లి భారతి ఆశ్రయమివ్వటం, దాన్ని సిన్హా వ్యతిరేకించటం.. ఇలా పలు సన్నివేశాలు విపులంగా సెంటిమెంటు జోడింపుతో తీర్చిదిద్దారు. భయంకర్ గురించి వార్తలు శాంతి, ఆనంద్‌కు వివరించటం, వారిమధ్య సాన్నిహిత్యం, ప్రేమకు దోహదపడే విధంగా మధ్యలో సన్నివేశాలు, రౌడీ గంగులు అనుచరులు రాజ్‌బాబు, మిగిలిన స్ర్తిలు (విజయభాను, మధుమతి, రేణుక పోషించారు) తమాషా సన్నివేశాలతో చక్కని అనుభూతి, ఉత్సుకతతో చిత్రాన్ని చిత్రీకరించి విజయపథంవైపు నడిపించారు.
యాక్షన్ చిత్రాల హీరోగా గూఢచారి 116నుంచి మంచి గుర్తింపు సాధించిన నటుడు కృష్ణ, ఈ చిత్రంలోనూ ఆనంద్‌గా ఎంతో ఈజ్‌తో తన పాత్రను పోషించి అలరించారు. వీరికి దీటుగా వాణిశ్రీ తన పాత్రతో మెప్పించింది. ఇక భయంకర్ మారువేషం (సిఐడి సిన్హా)లో గుమ్మడి సాఫ్ట్ విలనీనీ ఎంతో యుక్తమైన అభినయంతో ప్రదర్శిస్తే, రౌడీ గంగులు.. సిఐడి ఆఫీసర్‌గా ఎస్వీ రంగారావు ప్రత్యేకమైన తమాషా నటన ప్రదర్శించారు. ముఖ్య పాత్రల్లో ఇద్దరూ పోటాపోటీ నటన చూపించారు.
అయితే భయంకర్‌గా నటించిన రావుగోపాలరావు విలనినీ పాత్రోచితంగా మెప్పించేలా పోషించినా, ఆయన వాయిస్ సినిమాకు అంతగా సూటవలేదని కొందరు సినీ ప్రముఖులు నిర్మాతలకు సూచించారు. దాంతో నిర్మాతలు వేరే డబ్బింగ్ కళాకారునితో డబ్బింగ్ చెప్పించారు. కాని ఆ తరువాత రావుగోపాలరావు నటించిన పలు చిత్రాల్లో వారి అభినయానికి తోడుగా వారి ప్రత్యేకమైన వాయిస్‌కు ప్రశంసలు లభించాయి. ప్రత్యేకించి ‘ముత్యాలముగ్గు’ చిత్రంలో వీరి వాయిస్‌తో రూపొందిన క్యాసెట్లు విపరీతమైన అమ్మకాలు జరిగితే, ఆయన గొంతుకు ప్రత్యేకమైన క్రేజ్ రావటం చెప్పుకోదగ్గ అంశం. ఈ చిత్రంలో రౌడీగంగులు, భయంకర్, సిన్హా -ఈ మూడు పాత్రలనూ వైవిధ్యంతో కథలో చక్కని సమన్వయంతో రూపొందించటం ఆసక్తికరమైన అంశం.
ఎస్‌పి కోదండపాణి సంగీతంతో రూపొందించిన చిత్ర గీతాలు ఎంతో ఆకట్టుకున్నాయి. కృష్ణ, వాణిశ్రీలపై ఆహ్లాదకరంగా పావురాలతో చిత్రీకరించిన మధుర గీతం -ఎగిరే పావురమా/ దిగులెరగని పావురమా (గానం: పి సుశీల, రచన: దేవులపల్లి కృష్ణశాస్ర్తీ). వీరిరువురిపై చిత్రీకరించిన యుగళ గీతం -వేళ చూస్తే సందెవేళ/ గాలివీస్తే పైరగాలి (గానం: పి సుశీల, ఎస్పీ బాలు, రచన: దేవులపల్లి). కృష్ణశాస్ర్తీ భావుకతకు రెండు గీతాలూ అద్దం పడతాయి. ‘ఎగిరే పావురమా’ గీతం నేటికీ వీనులవిందుగా శ్రోతలను అలరిస్తుండటం హర్షణీయాంశం. విజయలలితపై చిత్రీకరించిన నృత్య గీతం -నా అందం, నా చందం నా సిగ్గు (గానం: ఎల్‌ఆర్ ఈశ్వరి, రచన: చిత్ర కథకుడు విశ్వప్రసాద్). బాలకృష్ణ, విజయభానులపై చిత్రీకరించిన గీతం -ఎక్కడన్నా బావా అంటే ఒప్పుకుంటాను (రచన: కొసరాజు, గానం: ఎస్పీ బాలు, విజయలక్ష్మి కన్నారావ్). టైటిల్ గీతం.. భయంకర్ డెన్‌లో భయంకర్, రౌడీ గంగులు, బృందం ముందు విజయలలిత నృత్యగీతం -కిలాడీలు లోకమంత కిలాడీలు (రచన: కొసరాజు, గానం: పి సుశీల). లోకంలో జరిగే అన్యాయాలను వెల్లడిస్తూ ఎస్వీ రంగారావు, రావుగోపాలరావుల రియాక్షన్‌తో అర్ధవంతంగా సాగుతుంది. క్రైమ్ చిత్రమైనా పాటల పరంగా మధురమైన చక్కని గీతాలతో ఆనందించదగ్గ చిత్రంగా ప్రేక్షకాదరణ పొందింది ‘జగత్ కిలాడీలు’. ఎస్వీ రంగారావు ఉపయోగించిన ‘ఝాటే’, ‘గూట్లే’ పదాలు చిత్రం విడుదల తరువాత ప్రజల సంభాషణల్లో చోటుచేసుకొని ప్రాచుర్యం పొందాయి.

-సీవీఆర్ మాణిక్యేశ్వరి