ఫ్లాష్ బ్యాక్ @ 50

ఉక్కుపిడుగు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుడివాడలో జన్మించిన అట్లూరి పూర్ణచంద్రావు చదువు పూర్తయ్యాక మద్రాస్ వెళ్లారు. విఠలాచార్య వద్ద ‘జయ- విజయ’ చిత్రానికి సహాయ దర్శకుడిగా పనిచేశారు. నిర్మాత భావన్నారాయణ వద్ద ప్రొడక్షన్ మేనేజర్‌గా 1959నుంచి 1966వరకు అనుభవం సంపాదించారు. నిర్మాతగా 1968లో ‘అగ్గిమీద గుగ్గిలం’ మొదలుపెట్టి, పలు భాషల్లో పలు చిత్రాలు రూపొందించారు. 1969లో ఈయన నిర్వహణలో ‘ఉక్కు పిడుగు’ చిత్రాన్ని నవభారత్ కంబైన్స్ బ్యానర్‌పై నిర్మించారు.

కథ: మహతి
మాటలు, పాటలు: వీటూరి
కళ: గోడ్‌గాంకర్
కూర్పు: కె బాలు
ఛాయగ్రహణం: ఆర్ మధు
స్టంట్స్: మాధవన్
సంగీతం: కోదండపాణి
నృత్యం: కెఎస్ రెడ్డి
నిర్మాతలు: పియస్ ప్రకాశరావు, ఆర్ సుధాకర్‌రెడ్డి
దర్శకత్వం: జి విశ్వనాథం

దర్శకుడు బి.విఠలాచార్య వద్ద జి విశ్వనాథం దర్శక, ఎడిటింగ్ శాఖల్లో సహాయకునిగా పనిచేసి అనుభవం గడించారు. 1963లో మంచిరోజులొస్తాయి సాంఘిక చిత్రానికి దర్శకత్వం వహించారు. ఎన్‌టి రామారావుతో గోపాలుడు-్భపాలుడు జానపద చిత్రం, కాంతారావు హీరోగా ‘ఆకాశరామన్న’ వంటి పలు చిత్రాలకు దర్శకత్వం వహంచారు. వీరి దర్శకత్వంలో రూపొందిన జానపద చిత్రం ఉక్కు పిడుగు 1969లో విడుదలైంది.
కళింగ సామ్రాజ్య ప్రభువుకు ఇద్దరు కుమారులు. వారి జన్మదినోత్సవ వేడుకలు సాగుతుండగా, సామంతరాజు భుజంగవర్మ (ప్రభాకర్‌రెడ్డి) రాజ్యంపై దండెత్తుతాడు. ప్రభువును అంతంచేసి రాజ్యం ఆక్రమిస్తాడు. మహారాణి, ఇద్దరు రాకుమారులను రహస్యమార్గంలో తప్పించిన మహామంత్రి, వాళ్లను కాపాడతాడు. మహారాణి శాంతిమతీదేవి (జూ.శ్రీరంజని) పెద్దకుమారుడు వసంతుని ఓ సాధువు (్ధళిపాళ) రక్షిస్తాడు. అలా వసంతుని సకల విద్యాప్రావీణ్యుని చేస్తాడు. మహామంత్రి (కాశీనాథ తాత) చిన్న కుమారుడు మార్తాండవర్మకు యుద్ధ విద్యలలో ప్రావీణ్యత కలిగిస్తాడు. భుజంగవర్మకు ఓ ఆడ శిశువు జన్మించగా, ఆమె భర్త చేతిలో తనకు మరణం ఉందని తెలిసి, ఆమెను ఒంటరిగా ప్రత్యేక మందిరంలో పెంచుతాడు. జ్వాలాభైరవుడు అనే (రాజనాల) మాంత్రికుడు అష్టసిద్దుల కోసం దేవిని ప్రార్థిస్తాడు. తల్లిపాలు ఎరగని తరుణిని బలిగా ఇవ్వాలన్న దేవి ఆదేశంతో, ఆమెను సాధించేందుకు తగిన వ్యక్తిగా వసంతుని (కాంతారావు) ఉపయోగించాలని ప్రయత్నాలు చేస్తాడు. అతని ద్వారా రాకుమారుని, నాగలోకపు యువరాణి సర్పకేశిని (విజయశ్రీ) తనవద్దకు తెప్పించుకుంటాడు. మార్తాండవర్మ, భుజంగవర్మ వద్ద సేనానిగా కొలువు సంపాదిస్తాడు. పరిస్థితుల కారణంగా మహారాణిని, తన ప్రియురాలు మల్లి (విజయలలిత)ని కోట చెరలో బంధిస్తాడు. సాధనతో మహాఖడ్గం సాధించి, మాంత్రికుని కుట్రచే దాన్ని పొగొట్టుకున్న వసంతుడు, సర్పకేశినివల్ల దాన్ని పొంది మాంత్రికుని అంతం చేస్తాడు. రాకుమారి పద్మావతి (రాజశ్రీ)తో పాటు రాజ్యానికి వచ్చి, నిజం వెల్లడించి భుజంగవర్మను సంహరిస్తాడు. తన సోదరుడు, తల్లి.. అందరితో కలిసి కళింగ సింహాసనం అధిష్టించటంతో చిత్రం ముగుస్తుంది.
చిత్రంలో రాజ్‌బాబు, మీనాకుమారి, కాశీనాథ తాత, పిజె శర్మ నటించారు. చిత్ర కథలో ఎన్నో ఆసక్తికర అంశాలు ప్రేక్షకులను మైమరిపిస్తాయి. గురువు ధూళిపాళ ఉపదేశంతో దేవీ అనుగ్రహాన్ని పొందిన వసంతుడు, మహాఖడ్గం సాధించి దాన్ని మరింత మహిమాన్వితం చేయటానికి 10 లక్షల జపం చేయటం, తల్లిపాలు ఎరగని తరుణిని దేవికి బలి ఇవ్వటానికి మాంత్రికుడు చేసే ప్రయత్నాలు.. అదీ వసంతుని ఖడ్గానికి మహిమలు వచ్చాకే స్వాధీనం చేసుకోవాలని భావించటం, మహిమలు వచ్చాక వసంతుని స్నేహితుడి వేషంలో మహాఖడ్గాన్ని తస్కరించటం, యోగి వేషంలో వచ్చి పాతాళ లోకంనుంచి సర్పకేశిని తెమ్మని వసంతునికి పురమాయించటం, విజయం సాధించి వచ్చిన వసంతుడు మోసపోవటం, ఆ దిగులుతో వెళ్తూ ఎడారిలో ఎండమావి వెంట పరుగులు పెట్టి కపింజరుడనే రాక్షసుని సంహరించటం, అతని సాయంతో మత్స్యవాహనంపై సముద్రాలు దాటడం, సర్పకేశిని శక్తులు ఆమె కేశంలో ఉన్నాయని తెలిసి పద్మావతిచే అవి ఖండింపచేసుకొనటం, పామురూపంలో సర్పకేశిని వసంతునికి మహాఖడ్గం తెచ్చి ఇవ్వటం, ఆమె రూపం కోల్పోయి నిశే్వష్టగా మారటం.. దర్శకుడు జి విశ్వనాథం ఈ అంశాలకు మరింత జోడింపును కూర్చి ఆకట్టుకునేలా చిత్రీకరించారు. అన్నను, తల్లిని గాయపడిన మార్తాండవర్మ కలుసుకోవటం, రాజాజ్ఞపై వసంతుని బంధించవచ్చి.. తల్లిలా సేదతీర్చిన మహారాణిని బంధించటం వంటి కొన్ని సెంటిమెంట్ సన్నివేశాలను జోడించి కథను వేగవంతంగా నడిపి ఉత్కంఠ పెంచారు.
జానపద చిత్ర కథానాయకుడిగా పేరుకాంచిన కాంతారావు వసంతునిగా ఎంతో ఈజ్‌తో తన పాత్ర పోషించి మెప్పించారు. మార్తాండవర్మగా సత్యనారాయణ తన విలనిజాన్ని అద్భుతంగా పోషించారు. హీరోను ధాటిగా, ధీటుగా ఎదుర్కొనటంలో నేర్పు ప్రదర్శించారు. తొలుత -తన బలపరాక్రమంతో గ్రామంలోవారిని పీడించటం, మల్లి మాటలకు రోషం మాని ఆలోచనతో రాజకొలువుకు చేరటం, ఉద్యోగధర్మం ప్రకారం రాజు పట్ల విధేయతతో తననాదరించిన తల్లివంటి శాంతిమతిదేవి, ప్రియురాలు మల్లిని ఖైదు చేయటం, సకాలంలో వసంతుడు వస్తాడోరాడోనని మహారాజు వారిని ఉరితీయమనగా దాన్ని సిద్ధపర్చటం, చివరకు వసంతుడు వచ్చినా వారికి శిక్ష అమలుచేయాలనే రాజాజ్ఞను ధిక్కరించి అన్నతో కలిసి పోరాడటం.. ఇలా చిత్రంలో మార్తాండునిగా సత్యనారాయణ సన్నివేశాలలో ఎంతో సహనం, సంయమనం, నిబ్బరం, శాంతం, ఆపైన శౌర్యంవంటి పాత్రోచిత లక్షణాలను ఆవిష్కరించి ప్రత్యేకత చూపారు. మిగిలిన నటీనటులు పాత్రోచితంగా నటించి అలరించారు.
ఉక్కుపిడుగు చిత్ర గీతాలను వీటూరి రచించారు. చిత్రం ప్రారంభంలో.. సభలో నర్తకీమణులు పాడే గీతం -జయహో వీరకుమారా (గానం: ఎస్ జానకి, బి వసంత). విజయలలితపై చిత్రీకరించిన గీతం -పళ్లో బాబూ పళ్లు పసందైన పళ్లు (గానం: ఎల్‌ఆర్ ఈశ్వరి). మరో గీతం -ఇదిగో, గోగో ఒడుపుగ కలలో వేస్కోరా (గానం: ఎల్‌ఆర్ ఈశ్వరి). రాజశ్రీపై చిత్రీకరించే గీతం -కమ్మని కలలా కనిపించాడే (గానం: పి సుశీల). కాంతారావు, రాజశ్రీల యుగళ గీతం -ఏ ఊరు ఎవరూ నీవారు కొనుమా అందాల రాణి (గానం: ఎస్‌పి బాలు, పి సుశీల). కాంతారావు ఎదుట పాటతో విజయశ్రీ చేసే నృత్యగీతం -సై అంటే సై అంటాను.. (గానం: ఎస్ జానకి బృందం). రాజశ్రీ, విజయశ్రీ ఇద్దరిపై మాంత్రికుని గుహలో సాగే మరో నృత్య గీతం -ఓ లోకాలేలే చల్లని తల్లి శరణము నీవే కల్పవల్లి (పి సుశీల, ఎస్ జానకి). చక్కని జానపద చిత్రంగా ప్రేక్షకులను అలరించిన చిత్రం -ఉక్కుపిడుగు.

-సీవీఆర్ మాణిక్యేశ్వరి