ఫ్లాష్ బ్యాక్ @ 50

కనకదుర్గ పూజా మహిమ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నాటక రాష్ట్రంలోని ఉడిపి గ్రామంలో 1920 జనవరి 28న జన్మించారు బి విఠలాచార్య. హరికథలు, బుర్రకథలు, జానపద కథలపట్ల ఆసక్తితో వివిధ దేశాల సాహిత్యాన్ని అధ్యయనం చేశారు. తొలిసారి మహత్మా పిక్చర్స్‌వారి కన్నడ చిత్రం ‘నాగకన్నిక’ చిత్ర నిర్మాణంలో చురుకుగా వ్యవహరించారు. ఆ అనుభవంతో 1952లో తొలిసారి ‘శ్రీ శ్రీనివాస కల్యాణం’ చిత్రానికి దర్శకత్వం వహించారు. తరువాత 1999లో స్వర్గస్తులు అయ్యేవరకూ 60కి పైగా చిత్రాలకు (తెలుగు, కన్నడ, తమిళ భాషల్లో) దర్శకత్వం వహించారు. 1955లో విఠల్ ప్రొడక్షన్స్ స్వీయ నిర్మాణ సంస్థ ప్రారంభించి ‘కన్యాదానం’ తెలుగు చిత్రాన్ని రూపొందించారు. ఆపైన కొన్ని సాంఘిక చిత్రాలు ఈ బ్యానర్‌పై నిర్మించినా అవి అంతగా విజయం సాధించ లేదు. దాంతో ‘జయ విజయ’ అనే జానపద చిత్రాన్ని రూపొందించటంతో అది సక్సెస్ అయ్యింది. కాంతారావు హీరోగా నటించిన ఆ సినిమా విజయంతో మరోసారి కాంతారావు, కృష్ణకుమారి జంటగా దైవభక్తి సాధనతో దుష్టబుద్ధి కలిగిన మంత్ర విద్యాప్రవీణుని ఎదుర్కొన్న ఓ సాహసవంతుని కథతో 1960లో రూపొందించిన మరో జానపద భక్తిరస చిత్రం -కనకదుర్గ పూజామహిమ.
కథ: బివి ఆచార్య
మాటలు, పాటలు: జి కృష్ణమూర్తి.
ఈయన ఏవీఎంవారి సదారమ చిత్రంతో రచయితగా ప్రవేశించారు. వీరిపట్ల అభిమానంతో దర్శకులు బి విఠలాచార్య, తన దర్శకత్వంలో రూపుదిద్దుకున్న అనేక చిత్రాల్లో అవకాశమిచ్చారు. పెళ్లిమీద పెళ్లి, కనకదుర్గ పూజామహిమ, వరలక్ష్మీవ్రతం, నవగ్రహ పూజామహిమ, అగ్గిదొర, అగ్గిపిడుగు. అందంకోసం పందెం, భూలోకంలో యమలోకం లాంటివి జి కృష్ణమూర్తి పని చేసిన ఇతర చిత్రాలు. ఈయన అడవి మనుషులు అనే చిత్రానికి దర్శకత్వం కూడా వహించారు.
సంగీతం: రాజన్ నాగేంద్ర
కళ: బిసి బాలు
ఛాయాగ్రహణం: జి చందు
కోడైరెక్టర్, ఎడిటర్: జి విశ్వనాథం
నృత్యం: విజె శర్మ
స్టంట్స్: పరమశివం
నిర్మాత, దర్శకుడు: బి విఠలాచార్య

మణిశిలా దేశానికి మహరాజు మిక్కిలినేని. ఆయన పట్టపురాణి (ఆదోని లక్ష్మి) పనె్నండేళ్ల తరువాత గర్భం దాలుస్తుంది. ఆమెతో అంతఃపురంలో వీణాగానంతో పరవశిస్తుంటాడు. ఆస్థాన పురోహితుడు కనకదుర్గాదేవి పూజకు రమ్మని ప్రభువును కోరగా, తిరస్కరిస్తాడు. పూజారినే పూజలు నిర్వహించమని ఆదేశిస్తాడు. దేవికి ఆగ్రహం కలుగుతుందని మహారాణి చింతిస్తుంది. ఆపైన మహరాజు, మహారాణితో వేసిన పందెం కారణంగా -ఆమె అంతఃపురం వదలి అడవులకు వెళ్లాల్సి వస్తుంది. కొద్ది రోజులకు పశ్చాత్తాపంతో మహరాజు రాజ్యభారాన్ని బావమరిది నరేంద్రవర్మ (ముక్కామల)కు అప్పగించి అడవులకు వెళ్తాడు. అడవిలో మహరాణి మగబిడ్డను ప్రసవించి, మునిశాపం కారణంగా భల్లూకంగా మారుతుంది. రాణి బిడ్డను సంతానం లేని కనకదుర్గాదేవి భక్తులైన దంపతులు చేరదీసి పెంచుకుంటారు. మాధవుడని పేరు పెడతారు.
భార్యను వెతుకుతూ వచ్చిన మహరాజు గాయపడి భల్లూక సాయంతో సేదదీరి అడవిలో జీవిస్తుంటాడు. నరేంద్రవర్మ కుమార్తె మాలతి (కృష్ణకుమారి)ని మాధవుడు ఓ ఆపదనుంచి కాపాడటంతో వారిరువురి నడుమ అనురాగం అంకురిస్తుంది. మేఘనాథుడు (రాజనాల) సర్వతాంత్రిక విద్యలు నేర్చి, తనకు విద్యనేర్పిన గురువునే బంధిస్తాడు. ఇంకా సర్వజ్ఞత సిద్ధించటంకోసం మణిశిలా దేశం ప్రవేశించి, నరేంద్రవర్మ అభిమానం పొంది రాజమందిరం చేరతాడు. అతన్ని ఎదిరించ మాధవుడు భంగపడి ఓ ఏడాది గడువులో అతన్ని ఓడిస్తానని శపథం చేస్తాడు.
మాయవతి అనే కన్యను వశపరచుకొన్న మేఘనాధుడు, ఆమెను పాముగా మార్చి రాజ్యంలోని ముఖ్యులను పాము కాటుతో అంతం చేయిస్తూ ఆ నేరం రాకుమారి మాలతిపై మోపి, ఆమెను రాజ్యంనుంచి వెళ్లగొట్టిస్తాడు. మాధవుడు, తన సోదరుడు త్రిలోకం (బాలకృష్ణ) సాయంతో మేఘనాధుని గుహకు చేరి, గురువు ద్వారా విద్యలను గ్రహించి దేవిని ఉపాసిస్తాడు. నరేంద్రవర్మను బలివ్వటానికి అక్కడకు తీసుకొచ్చిన మేఘనాథుని మాధవుడు ఎదిరించి అతన్ని అంతం చేస్తాడు. కనకదుర్గాదేవి అనుగ్రహంతో అంతా కలుసుకోవటంతో చిత్రం శుభంగా ముగుస్తుంది.
ఈ చిత్రంలో పురోహితునిగా వడ్లమాని విశ్వనాథం, సేనాపతి మార్తాండవర్మగా సత్యనారాయణ, త్రిలోకం జంటగా మీనాకుమారి, ఇంకా స్వర్ణలత, మాధురి నటించారు.
దర్శకులు విఠలాచార్య సన్నివేశాలను అర్ధవంతంగా తీర్చిదిద్దారు. తొలుత కనకదుర్గాదేవి, గుడి, విజయవాడ పరిసరాలు, కృష్ణానదిని చూపుతూ ‘జయ నమో కనకదుర్గ’ గీతంతో చిత్రం టైటిల్స్ ప్రారంభించారు. కనకదుర్గను పూజారి పూజించటం, చెలికత్తెలు నృత్యం చేస్తుంటే.. ‘జీవనమే పావనం/ ఈ భువి సంతత సంతోష సంధాయనిగాను’ అంటూ మహారాణి వీణాగానం చేస్తుంది. మధ్యలో మహారాజు మరో వీణపై ‘ప్రణయము మనలోన ప్రణవము కాగా’ (గానం: ఘంటసాల, శూలమంగళం రాజ్యలక్ష్మి) అంటూ సాగటం, తరువాత పూజకు రానందుకు ఆదిశక్తికి కోపం వస్తుందని మహరాణి అన్న మాటకు.. ఈ సృష్టిలో వున్నది ఒక్కటే శక్తి. ప్రేమ అనురాగం. అని మహారాజు అనగానే కనకదుర్గాదేవి విగ్రహంలో మార్పు సూచించటం.. కథలోకి ఆడియన్స్‌ని ఇన్వాల్వ్ చేయటంలో దర్శకుడి ప్రతిభ కనిపిస్తుంది. దేవి ఆగ్రహం ఫలితంగా.. రాజదంపతులు వారి కుమారుని ఎడబాటు, ఆ తరువాత మాధవుడు భల్లూకం పట్టునుంచి రాకుమారిని రక్షించి ఆమె ప్రేమను పొందటం, మంత్రసిద్ధులు పొందానన్న అహంతో మేఘనాధుడు ఓ స్ర్తిని చెరబట్ట యత్నించి అడ్డువచ్చిన గురువునే బంధించి, తనకింకా సర్వజ్ఞత రాలేదని తెలిసి దానికోసం మాయవతితో మణిశిలాదేశం చేరటం, మాయ పాముగా మారి వరుసగా కాటు వేయటంలాంటి సన్నివేశాలు ఆడియన్స్‌ని కదలకుండా కూర్చోబెడతాయి. మహారాజును ఆకట్టుకోమని మాయావతికి ఆదేశం ఇచ్చిన మేఘనాధుని, ఆ పథకం ఫలించిందని మాయ మేఘనాధుని ముందు ‘జయం మనదే, జయం మనదే’ (గానం: పి సుశీల) అంటూ చేసే ఓ నృత్య గీతం, మంత్ర విద్యలకై సోదరుడు త్రిలోకంతో బయలుదేరిన మాధవుని ఓ భూతం బంధించి, ఆతడిని వశం చేసుకోవటానికి స్ర్తిగామారి చేసే వివిధ భంగిమల నృత్యం, ఆ గుహలో పలు వాయిద్యాల సెట్టింగ్స్‌తో ఆకట్టుకునేలా తీర్చిదిద్దారు. ఆ గీతం -రారా, రారా మారకుమారా’ (గానం- జిక్కి). సగం శరీరంపైన, సగం శరీరం విడివిడిగా పలురకాల విన్యాసాలతో సాగుతుంది. ఎదురుకాళ్లతో పుట్టినవాడైన త్రిలోకం ఆ వాయిద్యాలను తాకగా, అవి గంధర్వ స్ర్తిలని తెలిసికొని వారిద్వారా భూతాన్ని అంతంచేయటంలాంటి సన్నివేశాన్ని హాస్యంతో రంగరించి తమాషాగా తీర్చిదిద్దారు దర్శకుడు. ఆ తరువాత మీనాకుమారితో ప్రేమ, ఆమెకోసం యోధుడితో పోరాటం వెరైటీగా ఉంటుంది. నాగరాజు అంశంతో రాకుమారి మాలతి గర్భం దాల్చిందని, ఆమెను అంతంచేయమని మేఘనాధుడు సూచించటంతో, నరేంద్రవర్మ తన కుమార్తెను ఇంద్రకీలాద్రి పర్వత జలపాతంలో పడవేయమని ఆజ్ఞ, ఆ జలపాతంనుంచి అత్తగారు భల్లూకం కాపాడటం, మేఘనాధుని గుహచేరిన మాధవుడు, సర్వవిద్యలు నేర్పమని గురువుని వేడుకోవటం, దానికి పనె్నండేళ్ల కాలం పడుతుంది కనుక గురువు తన విద్యలనతనికి ధారపోయటంలాంటి సన్నివేశాలు ఆడియన్స్ ఆకట్టుకుంటాయి. విద్యలను ధారబోసే సమయంలో అర్థవంతమైన శ్లోకం -్భక్తి శ్రద్ధలతోడ, భయ వినయమున, గురువులవద్ద శ్రమలకోర్చి నేర్చిన విద్య అంటూ మనోవాక్కాయ కర్మలను, మాటలను.. మనసుచే, మాటచే, చేతచే ధారపోయించారు. ఎంతో ఉద్విగ్నంగా సాగుతుందీ సన్నివేశం. అయితే విద్య లభించకపోవటానికి తల్లిదండ్రులు కారణమని తెసులుకుని వగచిన మాధవుడు, దేవిని ప్రార్థించే శ్లోకం -ఓంకార పంజర శుచిం ఉపనిషదుద్యాన కేళి కలకంఠి.. ఓం నమో కనకదుర్గా అంటూ ఎంతో ఆర్ద్రతతో, వేడికోలు ప్రార్థనతో భావగర్భితంగా అలరించేలా సాగుతుంది. భక్తిగీతాల్లో చిరస్మరణీయ గీతంగా, ఈ చిత్రాన్ని గుర్తుకుతెచ్చే గీతంగా నిలవటం విశేషాంశం). దర్శకుని చిత్రీకరణతో కథలోని మరిన్ని సన్నివేశాలు ఆకట్టుకునేలా సాగుతాయి.
మిగిలిన గీతాలు: మాధవుడు, మాలతిలపై తోటలో చిత్రీకరించిన యుగళ గీతం -అనురాగసీమ మనమేలుదామా (పిబి శ్రీనివాస్, జిక్కి). ఓంకార పంజర సఖీం (మాధవపెద్ది, పిబి శ్రీనివాస్). మీనాకుమారిపై చిత్రీకరించిన గీతం -చుక్కలలోంచి చందురుడు తొంగిచూసాడే (గానం: రమ). బృందగీతంగా భక్తి శ్రద్ధలతో మాధవపెద్ది ఆలపించిన పద్యం -జయ నమో కనకదుర్గా లోకమాత, మిక్కిలినేనిపై పధ్యం -నాతిన్ గానను రాజ్యముగనను (గానం: ఘంటసాల), కృష్ణకుమారి, చెలికత్తెలపై చిత్రీకరించిన గీతం -వసంతుడే రాడాయే వసుంధరే రాగాల’ (గానం: ఏపి కోమలి బృందం).
‘కనకదుర్గ పూజామహిమ’ చిత్రం విజయం సాధించింది. తరువాత వరలక్ష్మీవ్రతం, నవగ్రహ పూజామహిమ వంటి పలు భక్తిరస, జానపద, పౌరాణిక, సాహస చిత్రాలను వైవిధ్యంతో రూపొందించారు. హాలీవుడ్ చిత్ర నిర్మాతలను సైతం ఆశ్చర్యపర్చే పలు ప్రయోగాలతో విఠలాచార్య, దర్శక నిర్మాతగా ‘జానపదబ్రహ్మ’గా ఖ్యాతినార్జించటానికి ఈ చిత్ర విజయం దారితీసిందనుకోవాలి.

-సీవీఆర్ మాణిక్యేశ్వరి