ఫ్లాష్ బ్యాక్ @ 50

భలే రంగడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎన్ నిత్యానంద్ భట్ (ఎన్‌ఎన్ భట్) 1935 అక్టోబర్ 2న నైనిటాల్‌లో పుట్టారు. చదువు పూర్తయ్యాక, ఢిల్లీలో చమ్రియా టాకీ డిస్ట్రిబ్యూటర్ల బ్రాంచిలో కొంతకాలం పనిచేశారు. ఆ సంస్థ అధినేత మోతీలాల్‌కు కార్యదర్శిగా 1954 నుంచి 59 వరకూ వ్యవహరించారు. 1960లో విజయవాడ చమ్రియా టాకీ బ్రాంచి మేనేజర్‌గా ఉద్యోగం నిర్వర్తించి, అక్కడి నుంచి వైదొలగిన తరువాత నిర్మాతగా మారారు.
తన స్నేహితుడు ఎ రామిరెడ్డితో కలిసి విజయభట్ మూవీస్ పతాకంపై 1965లో ఎన్‌టిఆర్, భానుమతి, జమునల కాంబినేషన్‌లో ‘తోడూ- నీడ’ సినిమాను ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వంలో రూపొందించారు. తరువాత ఇదే బ్యానర్‌పై 1967లో ‘సుఖ దుఃఖాలు’ నిర్మించిన తరువాత, 1969లో వీరు రూపొందించిన చిత్రమే -్భలే రంగడు. ఏఎన్నార్, వాణిశ్రీ జంటగా నటించారు. 1969 ఆగస్టు 14న సినిమా విడుదలైంది.

కథ: ముళ్ళపూడి వెంకటరమణ
మాటలు: గొల్లపూడి మారుతీరావు
సంగీతం: కెవి మహదేవన్
నృత్యం: తంగప్ప
ఫొటోగ్రఫీ: కెఎస్ రామకృష్ణ
కళ: జివి సుబ్బారావు
కూర్పు: కృష్ణస్వామి, బాలు,
స్టంట్స్: రాఘవులు అండ్ పార్టీ
దర్శకత్వం: తాతినేని రామారావు
నిర్మాత: ఎన్‌ఎన్ భట్

రాజా రాజశేఖరం (నాగభూషణం) ఆస్తికి ఏకైక వారసురాలు మనుమరాలు అనురాధ (వాణిశ్రీ). అదే ఊళ్లో 30 లక్షల ఆస్తి కలిగిన అమ్మాయి తనను వరిస్తుందనే జాతకం భ్రమలో, గుండె ధైర్యంతో హుషారుగా కాలం గడుపుతుంటాడు స్థిరమైన వృత్తిలేని రంగడు (అక్కినేని). ఒకరోజు అనురాధను సముద్ర ప్రమాదంనుంచి రక్షించి ఆమె అభిమానం పొందుతాడు. రాజశేఖరం ఆస్తి వ్యవహారాలు చూసే దివాన్ (గుమ్మడి) తన కుమారుడు పాపాయి (పద్మనాభం)తో అనురాధ వివాహం జరిపించి ఆస్తి కబళించాలన్న వ్యూహంలో ఉంటాడు. అతని తమ్ముడు శేషు (సత్యనారాయణ), భీమరాజు వంటి అనుచరులతో అక్రమ వ్యాపారాలు, నేరాలు చేస్తుంటాడు. రాధకు, పాపాయికి పెళ్లి చేయటం కోసం -రాజావారి చేతిలో గుండు దెబ్బకు నౌకరు నర్సయ్య (్ధళిపాళ) చచ్చిపోయినట్టు నాటకం ఆడించి, రాజావారికి మతిభ్రమించేలా చేస్తాడు దివాన్. రాధతో తన కొడుక్కి పెళ్లి చేయాలని రావికొండలరావు, ఆండాళ్లు (సూర్యకాంతం), దివాన్.. ఇలా ముగ్గురూ పథకాలు, ప్రయత్నాలు చేస్తుంటారు. రాధ తన అసహాయస్థితిని రంగడికి వివరిస్తుంది. తాతగారి స్నేహితుడి కొడుకుగా రంగడు ఆమె ఇంట ప్రవేశిస్తాడు. రంగడి మేనకోడలు గంగ (విజయలలిత), రంగడు సాయంతో దుర్మార్గుల కుట్రలనుంచి తాతగారిని రక్షించుకుంటుంది రాధ. కుట్రలను బయటపెట్టి దివాన్, శేషులను పోలీసులకు అప్పగించటం, రంగడు-రాధ, గంగ -పాపాయిల పెళ్లి జరగటంతో చిత్రం శుభంగా ముగుస్తుంది.
ఈ చిత్రంలో ఇంకా కెవి చలం, పొట్టిప్రసాద్, అల్లు రామలింగయ్య, రాజేశ్వరి, విజయభాను, శకుంతల, పుష్పకుమారి నటించారు. కృష్ణా జిల్లా కపిలేశ్వరపురంలో 1939లో జన్మించారు తాతినేని రామారావు. మద్రాస్‌లో తమ బంధువు తాతినేని ప్రకాశరావు, ప్రత్యగాత్మలవద్ద సహాయ దర్శకునిగా అనుభవం గడించారు. ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ ‘నవరాత్రి’తో దర్శకునిగా ప్రస్థానం మొదలెట్టారు. 1965నుంచి 2000 వరకూ 65కు పైగా తెలుగు, హిందీ చిత్రాలను రూపొందించి పేరు గడించారు. ఏఎన్నార్ ‘నవరాత్రి’, యన్టీఆర్ ‘యమగోల’, శోభన్‌బాబు ‘జీవన తరంగాలు’ తెలుగులో, అంధాకానూన్ వంటి హిందీ చిత్రాలు మచ్చుకు కొన్ని మాత్రమే.
భలేరంగడు చిత్రం ప్రారంభంలో హీరో ఏఎన్నార్ (రంగడు) పాత్ర ఇంట్రొడక్షన్ గీతం -నిన్న నాదే నేడు నాదే రేపు నాదేలే’తో హీరో లక్షణాలు వెల్లడించటం అప్పట్లో ఓ వెరైటీ. హీరోయిన్ రాధను రక్షించి -కిరాయి తీసుకుంటే కూలీ అవుతుంది అంటూ తిరస్కరించటం, జాతకాలపట్ల నమ్మకంతో రంగడు స్వయంవరం జరిగినట్టు కల, 30 లక్షలకు తక్కువ వారిని తిరస్కరించి, ఎక్కువవున్న రాధను వరించి ఆమెతో ఇంగ్లీషు నృత్యం చేయటం ఫన్నీగా చిత్రీకరించారు. మేనకోడలుతో ‘పగటికలలు కంటున్న మామయ్య’ పాటలో మరోసారి తన వ్యక్తిత్వం వెల్లడిస్తూ దర్శకుడు వెరైటీకి ప్రయత్నించారు. ‘రంగడంటే అల్లాటప్పా రంగడుకాడే, భలే రంగడు వీడే’ అంటూ టైటిల్ జస్ట్ఫికేషన్ ఇచ్చారు. దివాన్ కుట్ర, బంధువుల ఇబ్బందులనుంచి రాధను రక్షించటానికి తాతగారి స్నేహితుడి కొడుకులా (విద్యావంతునిగా కారు డ్రైవింగ్ రాధవద్ద అభ్యసించి) రాధ ఇంట ప్రవేశించి అందర్నీ హడలగొట్టడం, నిజం తెలుసుకున్న దివాన్ (గుమ్మడి) తన అక్కను హంటర్‌తో బాధిస్తుండటం చూసి మేడమీంచి మూడంచెల్లో క్రిందకు దూకి దివాన్‌ను దండించటం, నర్సయ్యను కాపాడి క్లైమాక్స్‌లో అతని వేషంలో విలన్లను కంగారు పెట్టడం, హీరో ఒక్కడే రౌడీలను ఎదుర్కోవటం, మధ్యలో తాతగారి రాధల సెంటిమెంటు సన్నివేశాలను ఆర్ద్రత, పట్టుతో చిత్రీకరించటం, విజయలలిత, పద్మనాభం, కెవి చలం, పొట్టిప్రసాద్, రావికొండలరావు, అల్లు రామలింగయ్యల పాత్ర సన్నివేశాలను యథార్థాన్ని, హాస్యాన్ని మిళితం చేసి రూపొందించి చిత్రాన్ని అర్ధవంతంగా తీర్చిదిద్దారు. పాటల చిత్రీకరణలో ఏఎన్నార్, వాణిశ్రీల యుగళగీతాలు: -హిప్ హిప్ హుర్రే ఓహో భలే (రచన: ఆరుద్ర, గానం: పి.సుశీల, ఘంటసాల) గీతాన్ని ఎంతో హుషారుగా ఆరుబయట గార్డెన్స్‌లో ఎంతో ఆహ్లాదకరంగా చిత్రీకరించారు. హీరో హీరోయిన్లపై మరో చక్కని యుగళ గీతాన్ని సి నారాయణరెడ్డి రచిస్తే, పి సుశీల, ఘంటసాల ఆలపించారు. వాణిశ్రీ, ఏఎన్నార్ విడివిడిగా ఎదురెదురు గదుల్లోవుండి, ఎదురెదురుగా వచ్చినట్టు.. దగ్గరగా ఉన్నట్టు వారి ఊహల్లో ఎంతో ప్లెజెంట్‌గా చిత్రీకరించిన గీతం సినిమాకు హైలెట్‌గా నిలిచింది. ‘్భలే రంగడు’ చిత్రం పేరు చెప్పగానే గుర్తుకొచ్చే ఆ మనోల్లాస గీతం -ఏమిటో ఇది.. ఏమిటో పలుకలేని వౌనగీతి.. తెలియరాని అనుభూతి. ఈ పాటకు అక్కినేని, వాణిశ్రీల అభినయం మరింత ముచ్చటగా సాగి అలరించింది. సముద్రపు ఒడ్డు, పరిసరాల్లోనే చిత్రంలో నాలుగు పాటలు చిత్రీకరించటం, ఆ వరుసలో విజయలలిత, మరో చెలితో నృత్యగీతం -మెరిసే పోయే ఎనె్నలాయే’ (రచన: దాశరథి, గానం: పి సుశీల). ఏఎన్నార్‌పై మరోగీతం -పైసా పైసా పైసా హెలెస్సా (రచన: దేవులపల్లి, గానం: ఘంటసాల). పాటలో వాణిశ్రీ చివరలో కనిపిస్తుంది. పద్మనాభం, విజయలలితపై చిత్రీకరించిన గీతం -అబ్బబ్బబ్బ చలి అహ ఉహు గిలి (రచన: కొసరాజు, గానం: పిఠాపురం, ఎల్‌ఆర్ ఈశ్వరి). కెవి మహదేవన్ స్వరాలతో చిత్ర గీతాలు అలరించేలా రూపొందాయి.
ముళ్లపూడి వెంకటరమణ, గొల్లపూడి మారుతీరావు వంటి ప్రముఖ రచయితలు కథ, సంభాషణలతో (1969లో) ఆత్మీయులు తరువాత మరోసారి అక్కినేని, వాణిశ్రీలు జంటగా నటించిన భలేరంగడు చిత్రం ప్రేక్షకుల మన్ననలు సాధించటం విశేషం. వారు హిట్ పెయిర్‌గా ప్రశంసలు పొందటం మరో విశేషం.

-సీవీఆర్ మాణిక్యేశ్వరి