ఫ్లాష్ బ్యాక్ @ 50

నాటకాల రాయుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చుంట నాగభూషణం నెల్లూరులో కొంతకాలం రైల్వేలో ఉద్యోగం చేశారు. ప్రజానాట్య మండలిలో సభ్యునిగా పలు నాటక ప్రదర్శనలిచ్చారు. సినిమా రంగంలో పల్లెటూరు, అర్ధాంగి, రేచుక్క చిత్రాలలో ప్రాధాన్యతగల పాత్రలు పోషించారు. ‘ఏది నిజం’ చిత్రంలో హీరోగా పాత్ర పోషించి, అత్యంత సహజంగా పల్లెటూరి యువకునిగా మెప్పించారు. ఆ చిత్రానికి రాష్టప్రతి బహుమతి లభించింది. తమిళంలో యంఆర్ రాధ నటించిన ‘రక్తకన్నీరు’ నాటకాన్ని తెలుగులో అనువదించినపుడు, ఎంఆర్ రాధకు నాగభూషణం వాయిస్‌తో డబ్బింగ్ చెప్పారు. అది సక్సెస్ కావటంతో రక్తకన్నీరు నాటకం ఆంధ్ర దేశంలో పలు ప్రదర్శనలు ఇవ్వడం, తద్వారా నాగభూషణం మరింత పాపులరయ్యారు. తరువాత నిర్మాతగా, ప్రముఖ నటునిగా, కామెడీ విలన్‌గా, విలన్‌గా పలు చిత్రాలలో రాణించారు. అలా హరిహరా ఫిలిమ్స్ బేనర్‌పై వీరి సమర్పణలో రూపొందిన చిత్రమే -నాటకాలరాయుడు. 1969 ఆగస్టు 22న విడుదలైంది. ఈ చిత్రానికి నిర్మాత దిడ్డి శ్రీహరిరావు. ఈయన, నటిమణి సావిత్రితో కలిసి ఆమె రూపొందించిన సావిత్రి కంబైన్స్‌వారి వింత సంసారం (జగ్గయ్య, సావిత్రి జంట. సావిత్రి దర్శకత్వం వహించారు) చిత్రానికి సహ నిర్మాతగా వ్యవహరించారు. ఈ చిత్రానికి దాసరి నారాయణరావు సహ దర్శకులు. 1971లో రాజ్‌బాబు నిర్మించిన ‘ఎవరికివారే యమునాతీరే’ (దర్శకుడు దాసరి నారాయణరావు) చిత్రానికీ సహ నిర్మాతగా, ఆపైన ‘స్వర్గం-నరకం’ (1975) చిత్రానికి నిర్మాణ, నిర్వహణ బాధ్యతలు నిర్వర్తించారు.
1951లో రూపొందిన మ్యూజికల్ కామెడీ హిందీ చిత్రం ‘ఆల్‌బేలా’ సినిమా ఆధారంగా నాటకాలరాయుడు నిర్మించబడింది. హిందీ చిత్రంలో భగవాన్ దాదా, గీతాబాలి హీరో హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రానికి సి రామచంద్రన్ సంగీతం సమకూర్చారు. కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం భగవాన్ నిర్వహించిన సినిమా విజయం సాధించింది. సంగీతంపరంగా మరింత హిట్ సాధించగా, ఆ చిత్రం స్ఫూర్తితో ‘నాటకాలరాయుడు’ తీర్చిదిద్దారు.

మాటలు: గొల్లపూడి మారుతీరావు
సంగీతం: జికె వెంకటేష్
నృత్యాలు: తంగప్పన్, శేషు, రాజు
కళ: తోట
కూర్పు: టివి బాలు
ఛాయాగ్రహణం: కమల్‌ఘోష్,
కర్రసాము, ముష్టియుద్ధాలు: రాఘవులు అండ్ పార్టీ
చిత్రానువాదం, దర్శకత్వం: ఎ సంజీవి
నిర్మాత: దిడ్డి శ్రీహరిరావు

రిటైర్డ్ తెలుగు ఉపాధ్యాయుడు ఆదిశేషయ్య (నాగయ్య) పెద్ద కుమారుడు రామారావు (సత్యనారాయణ), చిన్న కొడుకు బుచ్చిబాబు (నాగభూషణం), కుమార్తె లక్ష్మి (అనిత), భార్య పార్వతి (హేమలత), పెద్దకోడలు సీత. చెల్లెలు లక్ష్మికి పెళ్లి కుదురుతుంది. బుచ్చిబాబుకు నాటకాలపట్ల అభిమానం. దానివల్ల ఆఫీసులో మయసభ సన్నివేశం ప్రదర్శించి, మేనేజరు ఆగ్రహానికి గురై ఉద్యోగం పోగొట్టుకుంటాడు. మరో ఉద్యోగం సంపాదించాలని పట్నంవెళ్లి రంగమార్తాండ్ ఛాలెంజ్ నాటక కంపెనీ ఓనర్ (గోవిందం)చే తిరస్కారం పొందుతాడు. తరువాత ప్రముఖ నటీమణి గీతాదేవి (కాంచన) ఇంట పనివానిగా చేరతాడు. అతని ప్రతిభను గుర్తించిన గీతాదేవి ప్రోత్సాహంతో, ఆమె సరసన హీరోగా నటిస్తాడు. తన ప్రతిభతో నటుడిగా పేరు పొందుతాడు. తమ ఊరికి బుచ్చిబాబు పంపిన డబ్బు సీత అన్న మోహన్ (త్యాగరాజు) చేతికి చిక్కటంతో సరైన వైద్యం లభించక పార్వతమ్మ మరణిస్తుంది. పెద్దకొడుకు భారం తగ్గించాలని ఆదిశేషయ్య, కూతురు లక్ష్మితో ఇల్లువదిలి వెళ్తారు. గీతాదేవి ప్రేమను పొందిన బుచ్చిబాబు, తన పెళ్లి విషయం తల్లిదండ్రులకు తెలిపి ఆశీస్సులు పొందాలని ఊరికి వస్తాడు. అక్కడ జరిగిన విషయాలు గ్రహించి తనవారిని కలుసుకొని, చెల్లెలు లక్ష్మికి, గోవిందకు వివాహం నిశ్చయం, దాంతోపాటు గీతాదేవిని, బుచ్చిబాబు వివాహంతో చిత్రం శుభంగా ముగుస్తుంది. ఈ చిత్రంలో ప్రేమకుమార్‌గా ప్రభాకర్‌రెడ్డి, గోవిందగా (పద్మనాభం), సీతారాం, చలపతిరావు, విజయభాను, కాకరాల, ముక్కురాజు నటించారు.
చిత్ర దర్శకులు అక్కినేని సంజీవి, హిందీ చిత్రం ‘ఆల్‌బేలా’ కథని మన తెలుగుదనానికి తగ్గట్టు తీర్చిదిద్దారు. టైటిల్‌లోనే హీరో లక్షణం తెలియచేయటం, అలాగే చిత్రం టైటిల్స్‌లో హీరో పాత్రల భంగిమలను ఒకవైపు వైవిధ్యంగా చూపటం, చిత్ర ప్రారంభంలో ప్రేమ్‌కుమార్ సైనికులతో ఒంటరిగా కత్తిపోరాటం జానపద చిత్రరీతిలో చిత్రీకరించటం, నిద్రిస్తున్న రాకుమారి కాంచనను చూసి పద్యాలు ‘పట్టుపానుపున వెనె్నల పరచినట్టు’... దానికి ఆమె జవాబు ‘వింటిని నీ హృదోక్తులను’ (గానం: పిఠాపురం, పి సుశీల- రచన: వడ్డాది), ఆ నాటకం చూసిన బుచ్చిబాబు స్పందన, ప్రేమకుమార్ సలహా పాటించి తండ్రిచే చీవాట్లు.. ఇలా ఎంతో సహజంగా చిత్రీకరించారు. అన్నాచెల్లెళ్ల అనురాగం తెలిపేలా ‘పచ్చడి మెతుకులైనా నీ చేత పంచభక్ష పరమాన్నాలు’ అని అన్న చెప్పటం, అన్నను నిద్రపుచ్చుతూ పాడే జోలపాట నేటికీ చిరస్మరణీయంగా నిలుస్తాయి. రచనలో, స్వరాలలో, చిత్రీకరణలో అద్భుతంగా ఉంటుందా పాట. హిందీ చిత్ర గీతం ‘్ధరేసే ఆజా నిందియా, అజా’ (గానం: లతామంగేష్కర్), తెలుగులో ‘నీలాల కన్నుల్లో మెల్లమెల్లగా నిదుర రావమ్మా రావే’ (గానం: పి సుశీల, రచన: ఆత్రేయ) ఆకట్టుకునేలా చిత్రీకరించారు. నటనపట్ల అభిమానంతో ఉద్యోగం పోగొట్టుకొని పట్నంచేరి తోటివారి హేళనలు, నిరసనలు.. పనివానిగా గీతాదేవి ఇంట చేరి చివరకు నటుడిగా పరిణితి సాధించేవరకూ పడేపాట్లు.. తమాషాకు వాస్తవికతను కలగలిపి తీర్చిదిద్దారు. ప్రేమకుమార్ పంపిన రౌడీలను ఊరు చివర ఒంటరిగా ఎదుర్కోవటంలో హీరోయిజమ్ చూపటం, సాధారణ మధ్యతరగతి స్థాయి జీవితాల్లో ఒడిదుడుకులను, కూతురినుంచి దానంగా వచ్చిన డబ్బులు తిరస్కరించి ఆత్మాభిమానంతో తండ్రి షాపులముందు బూట్లు తుడవటం వంటి ఆర్ద్రత కలిగించే సన్నివేశాలను పరిణితితో చిత్రీకరించారు. ఇక గీతాల్లో (నటీనటులుగా బుచ్చిబాబు, గీతాదేవి) ‘నలభైకి, డెబ్బైకి తేడా ఎంత’ (గానం: ఘంటసాల, పిబి శ్రీనివాస్, పి సుశీల, వసంత బృందం, రచన: ఆత్రేయ). విద్యార్థులు, ఉపాధ్యాయుల మధ్య సంబంధాలు నలభైలో డెబ్బైలో ఎలా వుంటాయో వివరిస్తూ సాగుతుంది. రెండవది 40లలో నాయకుల వైఖరి త్యాగ నిరతి, 70లో నాయకుల స్వార్థం, రాజకీయాల్లో మార్పులు సూచిస్తూ ఎంతో సమున్నతంగా తీర్చిదిద్ది ఆకట్టుకునేలా చిత్రీకరించారు. అలాగే మరో బృంద గీతం -ఇదేనా నేనెదురుచూసిన ప్రజాస్వామ్యం (గానం: ఘంటసాల, పి సుశీల బృందం, రచన: ఆత్రేయ). దేశంలో జరుగుతున్న రైలు ప్రమాదాలు, విప్లవకారులు సృష్టించే విధ్వంసకాండలు, సమ్మెలు పోరాటాలు, కూలిపనికి ఎదురుతిరగటాలు వంటి సమకాలీన సమస్యలు 50 ఏళ్ల కిందటే వివరంగా చూపి చిత్రీకరించటం, వాటిని రక్షకుడు పలువిధాలుగా శిక్షించటం వంటి సన్నివేశాలను ఆలోచనాత్మకంగా తీర్చిదిద్దారు. ఈ చిత్రంలో ఈ రెండు గీతాలు ప్రత్యేకంగా నిలవటం మంచి విశేషం. ఇక బుచ్చిబాబు గీతాదేవి ఇంటిలో పనివానిగాచేరి వివిధ రకాల అభినయంతో పాడే గీతం -ఓ బుచ్చిబాబు, అరె ఓ పిచ్చిబాబు (గానం: ఎస్పీ బాలు, రచన: ఆత్రేయ). మయసభ సన్నివేశంలో బుచ్చిబాబుపై పద్యం -ద్రౌపదీ పంచభర్తృక (గానం: మాధవపెద్ది, రచన: వడ్డాది). నాగభూషణం బృందంతో పాడే గీతం -రాయుడా, నారాయుడా (గానం: పిఠాపురం బృందం, రచన: ఆత్రేయ). కాంచన, నాగభూషణంలపై వెనె్నలలో చిత్రీకరించిన ఆహ్లాదకర గీతం -వేళ చూడ వెనె్నలాయే లోన చూడ (గానం: పి సుశీల, రచన: ఆత్రేయ). మరో యుగళ గీతం -చిన్నవాడా వనె్నకాడా అనె్నముపునె్నము ఎరగనోడా (గానం: పి సుశీల, ఎస్పీ బాలు, రచన: ఆత్రేయ) చిత్ర గీతాలు అలరించేలా సాగాయి.
‘నాటకాలరాయుడు’ చిత్రంలోని పాత్రధారులు పాత్రోచితమైన నటనతో ఆకట్టుకున్నారు. అన్నా వదినెలుగా సత్యనారాయణ, సీత పాత్రలు మధ్యతరగతి జీవిత ప్రతిబింబాలుగా, చెల్లెలు లక్ష్మిగా అనిత స్వాతికమైన నటన చూపటం, ఇక వింతకాపురం (1968లో) చిత్రంలో తండ్రీ కూతుళ్లుగా మెప్పించిన గ్లామరస్ హీరోయిన్ కాంచన, నాగభూషణంతో జోడిగా నటించటం (హిందీ చిత్రం ఆల్‌బేలాలో భగవాన్‌దాదా గీతాబాలీల జంటకు సరిపోయేలా నాగభూషణం, కాంచన జంటగా నటించటం ఓ సాహసం అయితే, దానికి పరిపూర్ణత తమ నటనతో వారిరువురూ కలిగించటం విశేషాంశంగా పరిగణించాలి) విశేషాంశాలు. జయాపజయాలతో సంబంధం లేకుండా ఆనందించదగ్గ మంచి చిత్రంగా ‘నాటకాలరాయుడు’ నిలిచింది.

-సీవీఆర్ మాణిక్యేశ్వరి