ఫ్లాష్ బ్యాక్ @ 50

భలే తమ్ముడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అట్లూరి పుండరీకాక్షయ్య కృష్ణా జిల్లా చౌటుప్పలో 1925 ఆగస్టు 19న జన్మించారు. యన్టీ రామారావు కుటుంబంతో స్నేహం, బంధుత్వం కలిగినవారు. నందమూరి సోదరులతో కలిసి నేషనల్ ఆర్ట్ థియేటర్స్ ప్రదర్శించే పలు నాటకాల్లో నటించారు. తరువాత అదే బ్యానర్‌పై రూపొందించిన చిత్ర నిర్మాణంలో నిర్మాణ కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించేవారు. యన్టీఆర్ పట్ల అభిమానంతో 1962లో నర్రా రామబ్రహ్మంతో కలిసి గౌతమీ పిక్చర్స్ బ్యానర్‌పై చారిత్రక చిత్రం ‘మహామంత్రి తిమ్మరసు’ రూపొందించారు. తరువాత 1967లో కె తిరుపతయ్య (నిర్మాత దేవీవరప్రసాద్ తండ్రి) సమర్పణలో తారకరామా పిక్చర్స్ పతాకంపై ‘శ్రీకృష్ణావతారం’ పౌరాణిక చిత్రం నిర్మించారు. అలా 1969లో వీరు రూపొందించిన సాంఘిక చిత్రం -్భలే తమ్ముడు. 1962లో హిందీలో నిర్మాత శక్తిసామంత రూపొందించిన ‘చైనాటౌన్’ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. షమీకపూర్ డ్యూయల్ రోల్ పోషించిన చిత్రంలో షకీలా, హెలెన్, మదన్‌పురి నటించారు. రంజన్‌బోస్ రచనలో, రవి సమకూర్చిన సంగీతంతో, నిర్మాత, దర్శకుడు శక్తిసామంత్ తెరకెక్కించిన చిత్రం 1962 అక్టోబర్ 5న విడుదలై విజయం సాధించింది.
ఆ చిత్రం ఆధారంగా తమిళంలో ‘కుడి ఇరందకోయిల్’గా కె శంకర్ దర్శకత్వం తెరకెక్కింది. ఎంజి రామచంద్రన్ హీరో (డ్యూయల్ రోల్), అతని జంటగా జయలలిత, రాజశ్రీ నటించారు. హీరో తల్లిగా పండరీబాయి, పోలీస్ ఆఫీసర్‌గా మేజర్ సౌందర్‌రాజన్, విలన్‌గా ఎంఎన్ నంబియార్, వికె రామస్వామి, ఎస్‌వి రామదాసు, నెల్లూరి కాంతారావు, ఓ నృత్య గీతంలో ఎల్ విజయలక్ష్మి నటించారు. ఈ చిత్రానికి సంగీతం ఎంఎస్ విశ్వనాథం సమకూర్చారు. చిత్రం తమిళనాట 1968 మార్చి 15న విడుదలై ఘన విజయం సాధించింది. అంతేకాదు, తమిళనాడు స్టేట్ ఫిల్మ్ అవార్డ్ సాధించింది. టిఎం సౌందర్‌రాజన్ బెస్ట్ మేల్ సింగర్‌గా అవార్డు అందుకున్నారు. సినిమాకు భాంగ్ర నృత్యం ప్రత్యేక ఆకర్షణగా నిలిస్తే, హీరోయిన్ అన్నగా హాస్యనటుడు నాగేష్ నటించారు.
తారక రామా పిక్చర్స్ బ్యానర్‌పై తెలుగులో -్భలేతమ్ముడుగా రూపొందిన చిత్రం 1969 సెప్టెంబర్ 18న విడుదలైంది.
మాటలు: మద్దిపట్ల సూరి, పాటలు: సి.నారాయణరెడ్డి, సంగీతం: టివి రాజు, సహాయకులు: విజయా కృష్ణమూర్తి, కళ: మాధవపెద్ది/ గోఖలే, నృత్యాలు: తంగప్పన్/ చోప్రా, ఫొటోగ్రఫీ: ఎస్‌ఎస్ లాల్, కూర్పు: కందస్వామి, పోరాటాలు: సాంబశివరావు, కెమెరా: ఎంజిఆర్ మణి, నిర్మాత: ఎ పుండరీకాక్షయ్య, దర్శకత్వం: బిఏ సుబ్బారావు.
గన్ (రాజనాల) పెద్ద దొంగల నాయకుడు. ఓ దోపిడీ ఘటనలో గన్ అతని అనుచరుడిని ఇన్‌స్పెక్టర్ ప్రసాద్ (మిక్కిలినేని) అరెస్ట్‌చేసి బంధిస్తాడు. దాంతో ఇన్‌స్పెక్టర్ ప్రసాద్‌ని అతని ఇంటివద్ద హత్యచేస్తాడు గన్. ప్రసాద్‌కు కవలపిల్లలు. పెద్దవాడు రాంప్రసాద్, చిన్నవాడు శ్యాంప్రసాద్. రాంప్రసాద్.. గన్ వెంట పడటంతో, అతన్ని తన డెన్‌లోవుంచి పాల్ (యన్టీఆర్)గా పేరు మార్చి ఆరితేరిన దొంగగా తయారు చేస్తాడు. ఇన్‌స్పెక్టర్ చిన్నకొడుకు శ్యాం (యన్టీఆర్) బ్రతుకుతెరువు కోసం క్లబ్‌లో పాటలు పాడుతుంటాడు. రావ్‌సాహెబ్ (రేలంగి) కుమార్తె గీతాదేవి (కెఆర్ విజయ), శ్యామ్ ప్రేమించుకుంటారు. అది ఇష్టపడని రావ్‌సాహెబ్ శ్యాంను పోలీసులకు అప్పగిస్తాడు. అంతకుముందు ఓ దొంగతనంలో గాయపడి పోలీసులకు చిక్కిన పాల్ పోలికలు శ్యాంలో ఉన్న విషయాన్ని గమనిస్తాడు ఇన్‌స్పెక్టర్ (ప్రభాకర్‌రెడ్డి). అతన్ని పాల్ వేషంలో గ్యాంగ్‌లో ప్రవేశించి వారి రహస్యాలు సేకరించి ప్రభుత్వానికి సహకరించమని కోరతాడు. అలా శ్యామ్ స్మగ్లర్ల గ్యాంగ్‌లో చేరి, వారిని నమ్మించి వారి రహస్యాలు పోలీసులకు అందిస్తాడు. పోలీసులనుంచి తప్పించుకున్న రాంప్రసాద్, తమ్ముడని తెలీక అతనితో కలియబడతాడు. తరువాత నిజం తెలుసుకుని అన్నదమ్ములిద్దరూ ఒకటై విజయం సాధిస్తారు. శ్యాంప్రసాద్ పోలీస్ ఆఫీసర్ అయితే, నేరస్తుడిగా అరెస్టై సత్ప్రవర్తనతో విడుదలైన రాంప్రసాద్ ఇద్దరూ తల్లిని కలుసుకుని, ప్రేయసిలతో(పాల్-లీల, శ్యామ్-గీత) జత కలపటంతో చిత్రం శుభంగా ముగుస్తుంది.
రామ్, శ్యామ్‌ల తల్లిగా జూ శ్రీరంజని, గన్ గాంగ్‌లో అనుచరులుగా భీమరాజు, ఆనంద్‌మోహన్, జగ్గారావు, ఇంకా వల్లభనేని శివరాం, రమాప్రభ, శ్యామ్ ప్రియురాలు లీలగా నటి కాంచన సోదరి ‘విజయ గిరిజ’ నటించారు. చిత్ర దర్శకులు, ప్రముఖ నిర్మాత బిఏ సుబ్బారావు అమర్‌మహల్లో దొంగతనం సమయంలో అక్కడ సెక్యూరిటీ గార్డ్‌గా, తమాషా గెటప్‌తో తాగుబోతుగా నటించారు. అలాగే ‘ఎంతవారుగాని’ క్లబ్ సాంగ్, శివరామకృష్ణయ్య ‘తాత మనసూగుందిలే’కి తమాషా స్టెప్సు కంపోజ్ చేశారు.
‘చైనాటౌన్’ చిత్రంలో పాటలు మహమ్మద్ రఫీ ఆలపించారు. తెలుగులోనూ వారితోనే పాడించాలని నిర్మాత పుండరీకాక్షయ్య సంకల్పించారు. అంతకుముందు నటులు జగ్గయ్య చిత్రం -పదండి ముందుకులో ఒక పాట, నాగయ్య నిర్మించిన భక్తరామదాసు చిత్రంలో కబీర్ కీర్తనలను మహమద్ రఫీ పాడారు. భలే తమ్ముడు చిత్రంలో ఆరు పాటలను మహమద్ రఫీ పాడటం విశేషం. తెలుగు పాటలను ఉర్దూ లిపిలో రాసుకుని, సాధన చేసి పాడటం, ఆ పాటలు ప్రజాదరణ పొందటం ఆనందదాయకమైన విషయం.
హిందీ సినిమాలోని మూడు పాటల ట్యూన్స్ యథాతథంగా పాడినా, మిగిలిన గీతాలను టివి రాజు తన బాణీలో స్వరపరిచి మెప్పించారు. ఈ చిత్రంలోని ఖవ్వాలీ పాటకు హిందీ నటి ‘అరుణా ఇరాని’ని యన్టీఆర్‌తోపాటు ఓ నృత్య గీతంలో నటింపచేయించారు. ఓ హిందీ చిత్రం షూటింగ్‌కోసం మద్రాస్ వచ్చిన ఆమెకు నిర్మాత కబురుచేసి ఈ చిత్రంలోని పాత్ర గురించి వివరించటం, దానికి ఆమె అంగీకరించటం జరిగింది. తెలుగులో ఆమె నటించిన తొలి చిత్రం -్భలే తమ్ముడు.
యన్టీఆర్ రాంప్రసాద్ (పాల్)గా గన్ డెన్‌లోకి వెళ్లినపుడు ఓ ప్రత్యేకతను నటనలో, నడకలో, మాటలో, చేతివేళ్లు వెరైటీగా చూపిస్తూ ఆకట్టుకున్నారు. పోలీస్‌ల బందీగావున్న సమయంలో తల్లిని, పోలీస్ ఇన్‌ఫార్మర్ రమాప్రభను అదిలించటం; అంబులెన్స్ నుంచి తప్పించుకొని డెన్ చేరి.. అక్కడ తమ్ముడని తెలియక శ్యామ్‌తో తలపడటం; లీల, శ్యామ్‌ల ద్వారా గతం గుర్తుకు తెచ్చుకొని గ్యాంగ్‌ను ఎదిరించటం; ఆపైన ఉదాత్తంగా పోలీసులకు లొంగిపోయి శిక్ష స్వీకరించటంలాంటి సన్నివేశాలను అత్యద్భుతంగా పండించారు. అలాగే శ్యామ్‌ప్రసాద్‌గా గీత (కెఆర్ విజయ)తో, రావ్ సాహెబ్‌తో తమాషాలు, అల్లరి ఆటపట్టించటం; హిందీ క్లబ్ సాంగ్ ‘బార్ బార్ దేఖో హజార్ బార్’ ట్యూన్‌లో ‘ఎంతవారుగాని వేదాంతులైన’ పాటలో తమాషాగా గిటార్‌తో వేసిన చిందులు; రైలులో ‘గోపాల బాలా నినే్నకోరి’ అంటూ సన్యాసి వేషంలో చిత్రంగా పలు విన్యాసాలు తంబూరాతో పలికించటం, దానికి తగ్గట్టు కెఆర్ విజయ, రేలంగిల రియాక్షన్; గుర్రంబండి నడుపుతూ కెఆర్ విజయతో మరో హిట్‌సాంగ్ ‘ఇద్దరి మనసులు ఒకటాయే’.. చార్మినార్, అసెంబ్లీ, ట్యాంక్‌బండ్, జూపార్కు తదితర పరిసరాలను చూపుతూ చిత్రీకరించిన పాటలో హుషారుగా నటించటం; చలవరాతి వజ్రాల బొమ్మ దొంగిలించి, కెఆర్ విజయ కారులో పారిపోతూ.. కారు ఆగిపోవడాన్ని ఆమె అనుమానించగా, ఉదయం కారు బాగుచేసి ఆమెకు గంభీరంగా వీడ్కోలు చెప్పటం, దానికి కెఆర్ విజయ రియాక్షన్.. వారిపై మరో ఆహ్లాదకర గీతం ‘నేడే ఈనాడే కరుణించే నన్ను చెలికాడే’, చిరునవ్వులు చిందిస్తూ మనోహరంగా నాయికలో స్పందన; చివర అన్నగారికి గతం గుర్తుపర్చటం; అంతకుముందు తనను అనుమానించిన లీలను ‘వదినా’ అని పిలిచి నిజం చెప్పటం... ఇలా రెండు పాత్రలను వైవిధ్యంగా నిండుతనంతో ఒప్పించి మెప్పించారు. యన్టీఆర్ సరసన ‘శ్రీకృష్ణపాండవీయం’, ‘పరమానందయ్య శిష్యులకథ’ చిత్రంలో అంతకుముందు నటించిన అందాల తార కెఆర్ విజయ ఈ చిత్రంలో శ్యామ్ సరసన పాత్రోచితంగా హావభావాలను ప్రదర్శించి మెప్పించారు.
చిత్రంలోని ఇతర గీతాలు:
లీల, శ్యామ్‌ప్రసాద్‌లపై డెన్‌లో చిత్రీకరించిన గీతం (హిందీ వర్షన్ ‘షమ్మా షమ్మా’ ట్యూన్) -గుమ్మా గుమ్మా గుమ్మెత్తించేస్తుంది. తొలుత పి సుశీల గానానికి లీల నృత్యం, తదుపరి యన్టీఆర్ తమాషా స్టెప్స్ ఆకట్టుకుంటాయి. సినారె రచనలో ‘కాకి కోకిల అవుతుందా.. వెలయాలు ఇల్లాలు అవుతుందా’ ‘బారెడు జుట్టు జానెడాయే’ అంటూ చక్కని సెటైర్‌లతో సాగుతూ, మహమద్ రఫీ గానం తోడుగా రంజింప చేస్తుంది. తొలుత లీల (విజయ రాధిక)పై గీతం -యే మజాదేఖ్‌లో జిందగీ (గానం: పి సుశీల). అరుణాఇరానీ, యన్టీఆర్‌లపై వజ్రాల వ్యాపారి ఇంట్లో సాగే నృత్య గీతం -బంగారు గువ్వను నేను, రంగేళి రవ్వను’ (గానం: పి సుశీల, మహమ్మద్ రఫీ). ఈ పాటలు జనరంజకంగా రూపొంది నేటికీ శ్రోతలను అలరిస్తున్నాయి. ఈ చిత్రం తరువాత మహమ్మద్ రఫీ ‘తల్లా పెళ్లామా’, ‘రామ్ రహీమ్’, ‘ఆరాధన’ (1976), అక్బర్ -సలీం -అనార్కలి (1978), ‘శ్రీ తిరుపతి వెంకటేశ్వర కల్యాణం’ చిత్రాల్లో పాటలు పాడారు.
భలేతమ్ముడు వసూళ్లపరంగా, ప్రేక్షకాదరణపరంగా విజయం సాధించింది. రిపీట్ రన్స్‌లోనూ విరివిగా ప్రదర్శింపబడింది. యన్టీ రామారావు ద్విపాత్రాభినయం, టివి రాజు సంగీతం, సి నారాయణరెడ్డి రచన, మహమ్మద్ రఫీ, సుశీల గానంలో అలరించే పాటలతో చక్కని చిత్రంగా ‘్భలేతమ్ముడు’ నిలవటం విశేషం.

-సీవీఆర్ మాణిక్యేశ్వరి