ఫ్లాష్ బ్యాక్ @ 50

బుద్ధిమంతుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రముఖ రచయిత ముళ్లపూడి వెంకటరమణ, రేఖా చిత్రకారులు బాపు (సత్తిరాజు లక్ష్మీనారాయణ) కలిసి చిత్ర నిర్మాణానికి సంకల్పించి 1967లో ‘సాక్షి’ని నందనా ఫిలింస్ బ్యానర్‌పై రూపొందించారు. ఆ చిత్రం సక్సెస్ సాధించింది. ఆత్మీయులైన అక్కినేని నాగేశ్వరరావు ఆ చిత్రంలో నటించనందుకు కొద్దిగా నొచ్చుకొన్నారు. మరో పిక్చర్‌కు కథ రెడీ చేసుకోండి, నేను నటిస్తాను అని హామీ ఇచ్చారు. కానీ అక్కినేనికి డేట్స్ సర్దుబాటు కాకపోవటంతో, బాపు-రమణలు గణేష్ బ్యానర్‌పై ఫుల్‌లెంగ్త్ కామెడీగా ‘బంగారుపిచుక’ను చంద్రమోహన్, విజయనిర్మల కాంబినేషన్‌లో రూపొందించారు. చిత్రం సక్సెస్ సాధించకపోగా నిర్మాతలకు నష్టాలను చవిచూపింది. అదే సమయంలో అక్కినేని కాల్షీట్లు ఇస్తాను, కథను పట్టుకురండి అని బాపు-రమణలకు కబురంపారు. ఆవిధంగా ‘బుద్ధిమంతుడు’ చిత్రానికి బీజం పడింది. ‘గియోవానిగురైషి’ అనే ఇటాలియన్ రచయిత రాసిన ‘డాన్ కామినో’ కథల్లోంచి.. ఈ చిత్రానికి ఆస్తిక, నాస్తిక సంఘర్షణపైన అల్లిన కథ గురించి అక్కినేనికి ముళ్లపూడి చెప్పారు. అన్న పరమభక్తుడు, తమ్ముడు కులాసా పురుషుడు, నిజాయితీకలవాడని చెప్పటంతో.. రెండు పాత్రలు తానే పోషిస్తానని నాగేశ్వరరావు చెప్పటం జరిగింది.
ఈ సినిమా బడ్జెట్ 6 లక్షల అనుకున్నారు. ‘సాక్షి’ సినిమాకు బెంగుళూరు డిస్ట్రిబ్యూటరైన భక్తవత్సలం.. ఏఎన్నార్‌తో సినిమా అనగానే ‘లక్ష’ తనవంతుగా వీరికి అందచేశారు. మరో భాగస్తుని రూ. 50వేలకు చేర్చుకుంటే, 4.5 లక్షలు డిస్ట్రిబ్యూటర్లు ఇవ్వొచ్చని అక్కినేని సలహా ఇచ్చారు. దాని ప్రకారం బాపూ-రమణలు తమ సాక్షికి కొంత ఫైనాన్స్ చేసిన ఎన్‌ఎస్ మూర్తి (నిడమర్తి సత్యమూర్తి)ని సంప్రదించటం, వారు అంగీకరించటం జరిగింది. అలా ఎన్‌ఎస్ మూర్తి నిర్మాతగా, బాపు-రమణలు చిత్రకల్పనా బ్యానర్‌పై ‘బుద్ధిమంతుడు’ చిత్రం రూపొందించారు. ఇక డిస్ట్రిబ్యూటర్ల పెట్టుబడికోసం నవయుగ సంస్థను బాపూ-రమణ అప్రోచ్ అయి అక్కినేని కథ అంగీకరించారని, తమ బడ్జెట్ వివరాలు చెప్పి వారి సాయం కోరారు. దీనికి నవయుగ, శ్రీ ఫిలింస్ సుముఖంగా లేకపోవటం, వారి ప్రతిపాదన తిరస్కరించటం జరిగింది. హీరో అక్కినేని మాట్లాడినా ఫలితం లేకపోవటంతో పంతం పెరిగింది. ఆ రోజుల్లో కొత్తగాపెట్టిన లక్ష్మీ ఫిలింస్ అధినేత కెఎల్‌ఎన్ ప్రసాద్‌తో మాట్లాడి చిత్రం ఫైనాన్స్‌కు ఒప్పించారు. ఒకవేళ నష్టంవస్తే పూచి తనదని హామీ ఇచ్చారు. ఇది వారి వ్యక్తిత్వానికి ఒక మచ్చుతునక. అక్కినేని జన్మదినమైన సెప్టెంబర్ 20న 1969లో బుద్ధిమంతుడు చిత్రం విడుదలై, యాభైఏళ్లు పూర్తి చేసుకుంది.
కథ, మాటలు: ముళ్ళపూడి వెంకటరమణ, సినిమాటోగ్రఫీ: ఎస్ వెంకటరత్నం, ఎడిటింగ్: ఎ సంజీవి, కళ: జివి సుబ్బారావు, సంగీతం: కెవి మహదేవన్, నృత్యం: తంగప్ప, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: బాపు, నిర్మాత: ఎన్‌ఎస్ మూర్తి
వెల్చేరు, రాంచీ దేవస్థానాలున్న గ్రామాల్లో చిత్రం షూటింగ్ జరుపుకుంది. గ్రామంలో వేణుగోపాలస్వామి దేవాలయ అర్చకులు మాధవాచార్యులు (అక్కినేని). వారి సోదరుడు గోపాలాచార్యులు (గోపి-అక్కినేని). వారి తల్లి శాంతకుమారి. మాధవాచార్యుల పుత్రుడు (బేబీ బ్రహ్మాజి). ఆ ఊరి ప్రెసిడెంటు, గుడి ధర్మకర్త శేషాద్రినాయుడు (నాగభూషణం). మాధవాచార్యులకి శ్రీకృష్ణుడు (శోభన్‌బాబు) ప్రతిరోజూ దర్శనమిచ్చి అతని కష్టసుఖాలు విచారిస్తాడని మాధవునికి, ఆ ఊరి ప్రజలకి నమ్మకం. నిజాయితీ, మంచితనం కలిగిన గోపి, స్నేహితులతో కాలం గడుపుతూ ఆ ఊరి ప్రెసిడెంటు చేసే అన్యాయాలను ఎదిరిస్తుంటాడు. శేషాద్రి కుమారుడు కృష్ణ (కృష్ణంరాజు) తండ్రి బాటలో నడుస్తూ, ఆ ఊరి స్కూలు మాస్టారు (్భనుప్రకాష్) కుమార్తె కస్తూరి (సంధ్యారాణి)ని మాయమాటలతో వశం చేసుకుంటాడు. శేషాద్రి చెల్లెలు కావేరమ్మ (రుక్మిణి) కుమార్తె రాధ (విజయనిర్మల) పట్నంలో బిఏ చదివి, ఆ ఊరిలో గోపిని కలుసుకోవటం, ఆమెతో ప్రేమలో పడిన గోపి.. రాధవలన దురలవాట్లను విడిచిపెట్టడం జరుగుతుంది. రాధ, గోపీల పెళ్లికి కావేరమ్మ అంగీకరిస్తుంది. అనుకోకుండా స్నేహితుడి పుట్టిన రోజు పార్టీలో బలవంతంవల్ల మందు పుచ్చుకొన్న గోపిని, రాధ, ఆమె తల్లికి చూపిస్తాడు శేషాద్రి. కూతురి పెళ్లి జరగలేదన్న బెంగతో కావేరమ్మ మరణిస్తుంది. రాధను తన ఇంటికి తీసుకొచ్చిన శేషాద్రి, ఆమెను తన కోడలిగా చేసుకోవాలనుకుంటాడు. దేవుని నగలు దొంగతనం గోపిపై బదలాయిస్తాడు.
వాటికోసం జరిగిన త్రవ్వకంలో గోపీ పూర్వికుల బంగారం బయటపడుతుంది. ఆ మొత్తాన్ని గుడికి ఖర్చుపెట్టాలని శేషాద్రి, బడికి చెందాలని గోపి పోటీ పడతారు. దేవుడు మహిమ చేస్తాడని నమ్మిన అన్న మాధవుడి కోసం -గోపీ ఆలయ శిఖరం ఎక్కి అన్నను రక్షించుకోవటం, శేషాద్రి నిజ స్వరూపం వెల్లడై అతన్ని పోలీసులు అరెస్ట్ చేయటం, మానవ సేవయే మాధవ సేవ అని అన్న మాధవాచార్యులు గ్రహించి రాధ-గోపీల వివాహం, బడికోసం నిధి వెచ్చించ నిశ్చయంలో శుభంగా ముగుస్తుంది. ఈ చిత్రంలో శేషాద్రి భార్యగా సూర్యాకాంతం, అతని అనుచరుడిగా అల్లు రామలింగయ్య, భార్యగా మీనాకుమారి, గోపీ మిత్ర బృందంగా అశోక్‌కుమార్, విజయచందర్, జిత్‌మోహన్‌మిత్ర, డిఇవోగా గుమ్మడి నటించారు.
చిత్రంలో డిఇవో పాత్రకు తొలుత ప్రముఖ నటి భానుమతిని అనుకున్నారు. కాని ఆ పాత్ర నిడివి తక్కువ. అందులో భానుమతిపై పాట చిత్రీకరించే అవకాశం ఉండదని ఆ ప్రయత్నం విరమించుకోవటం జరిగింది. ఈ విషయం తెలిసిన ఆమె నిర్మాతలను, వారి ఉద్దేశ్యాన్ని అభినందించారు సహృదయంతో.
ముళ్లపూడి మాటల చమక్కులతో, బాపు చక్కని దర్శకత్వంలో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దబడింది బద్ధిమంతుడు. గుమ్మడికాయలను ఆడ కూలీతో మోయించి ఆమెతో సరసం ఆడుతున్న శేషాద్రిని గోపి వారించటం, సందర్భం వచ్చినపుడు ‘మధురానగరిలో గుమ్మడమ్మబోదు’ అంటూ ఏడిపించటం, చివరలో పెరడంతా తవ్విపెడుతున్నారన్న శేషాద్రి వెక్కిరింతకు గుమ్మడి పాదులు పెడతానని గోపీ జవాబివ్వటం హస్యంతో సన్నివేశాలు సాగుతాయి. డిఇవో ఇన్‌స్పెక్షన్‌లో చదువురాని మామూలు మాస్టార్ల వేషాల్లో దబాయింపులు, ప్రభుత్వ విధానాలపై సెటైర్‌లతో అల్లరిపిల్ల పెంకితనంగల రాధ ఓ సంస్కారవంతురాలైన యువతిగా వేషాలు మార్చి గోపిని అల్లరిపెట్టడం, ఆమె ప్రేమలో ఓ యుగళగీతం -గుట్టమీద గువ్వు కూసింది’ (రచన: ఆరుద్ర, గానం: ఘంటసాల, పి సుశీల), గోపీ వ్యసనాలకు దూరమవటాన్ని చూపించటం, పడవవాని వేషంలో గోపి తొలుత రాధను అల్లరిపెట్టేటప్పుడు గీతం -హవ్వారే హవ్వా, హైలెస్సో స్సో (గానం: ఘంటసాల, రచన: ఆరుద్ర), పాట చివర అక్కినేనిపై ‘ఈల’ చిత్రీకరణ) అద్భుతంగా ఉంటుంది. తన స్నేహితులకు, వ్యసనాలకు దూరమని చెబుతూ అక్కినేని, స్నేహితులపై చిత్రీకరించిన గీతం -టాటా, వీడుకోలు/ గుడ్‌బై, ఇంక సెలవు (గానం: ఘంటసాల, రచన: ఆరుద్ర), విజయనిర్మల, అక్కినేనిలపై ఆమె ఇంటిముందు తోటలో చిత్రీకరించిన అర్ధవంతమైన సినారే గీతం -తోటలోకి రాకురా తుంటరి తుమ్మెదా (గానం: పి సుశీల), హీరో లక్షణాలను వెల్లడి చేస్తూ సాగే గీతం ఆకట్టుకుంటుంది. చిత్రం చివర నిధికోసం అక్కినేని, స్నేహితుల బృందంపై చిత్రీకరించిన గీతం -బడిలో ఏముంది/ దేవుడి గుడిలోనే వుంది (గానం: ఘంటసాల, రచన: కొసరాజు) భక్తి విశేషాలు, మనిషి చంద్రునిపైకి వెళ్లిన విధం పాత్రలో చూపించటం దర్శకుని ఆలోచన, విశే్లషణకు అద్దంపట్టింది. అల్లు రామలింగయ్య మీనాకుమారిలపై హాస్య గీతం -పుట్టకపోతారా పిల్లలు/ అల్లరి పెడతారే (రచన: కొసరాజు, గానం: పిఠాపురం, స్వర్ణలత). మాధవాచార్యునిపై ప్రారంభంలో నడి ఒడ్డునుంచి -నమామి నారాయణ పాద పంకజం’ (సంప్రదాయ శ్లోకం, గానం: ఘంటసాల), గుడిలో పూజిస్తూ శ్లోకం -కస్తూరి తిలకం లలాట’ (ఘంటసాల), గుడికి తనను దూరం చేశాడని విచారిస్తున్న మాధవాచార్యుని వద్దకు శ్రీకృష్ణుడు వచ్చినట్టు భావించే అద్భుతమైన అలరించే భక్తి భావ గీతం -నను పాలింపగ నడచి వచ్చితివా (రచన: దాశరథి, గానం: ఘంటసాల)లో అక్కినేని, శోభన్‌బాబు, శాంతకుమారి చక్కని ఇటి పూదోటలో పాదభావాలకు తగ్గట్టు గోపికలు, రాధమ్మ, సత్యలను చూపటం, గీతానికి పరిపుష్టి కలిగించింది.
ఈ చిత్రంలో గోపి పాత్ర ఎంట్రెన్స్ గీతం -్భమీద సుఖపడితే తప్పులేదు (గానం: ఘంటసాల బృందం, రచన: ఆరుద్ర). ఈ పాట చిత్రీకరణకు 90 అడుగుల పొడవు, 14 అడుగుల వెడల్పున్న పంట్లు (నీళ్ళలో తేలే పెద్ద తెప్పలాంటివి) తెప్పించి వాటిని జండాలతో, తోరణాలతో అలంకరించి, హీరో, అతని స్నేహితులు, పాతికమందికిపైగా డాన్స్ గ్రూప్‌తో ఎంతో రిస్క్ తీసుకుని చిత్రీకరించారు. ఆ గీతం అలరించేలా నిలిచింది.
బుద్దిమంతుడు చిత్రం విజయం సాధించింది. ప్రేక్షకాదరణ పొంది నేటికీ అలరించేలా నిలవటం విశేషం.
బుద్దిమంతుడు చిత్రాన్ని తమిళంలో 1975లో ‘మనితనమ్ దైవ మంగలమ్’ పేరుతో తీశారు. శివాజీ గణేషన్ డ్యూయల్ రోల్, షావుకారు జానకి, ఉషానందిని, వికె రామస్వామి, ఎంఆర్‌ఆర్ వాసు (శేషాద్రిగా), సుకుమారి నటించారు. స్క్రీన్‌ప్లే బాలమురుగన్, నిర్మాతలు చిన్న, అన్నామలై, అరుణాచౌదరి.
ఈ చిత్రాన్ని హిందీలో మిథున్ చక్రవర్తి డ్యూయల్ రోల్ పోషించగా ‘పరమాత్మ’ పేరుతో బాపూ దర్శకత్వంలో రూపొందించారు. 15 ఏప్రిల్ 1994న విడుదలైన ఈ చిత్రంలో జూహిచావ్లా, అమ్రిష్‌పురి, రుద్రనారాయణ, మున్నా నటించారు. సంగీతం బప్పీలహరి సమకూర్చారు.

-సీవీఆర్ మాణిక్యేశ్వరి