ఫ్లాష్ బ్యాక్ @ 50

ధర్మపత్ని

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు తాలూకా మాదేపల్లి గ్రామవాసి ఎం జయరామిరెడ్డి. వీరు హ్యూమన్ హెయిర్ వ్యాపారం చేసేవారు. సినిమాలపట్ల మక్కువతో మిత్రులు జెబికె చౌదరి (దర్శకుడు తేజ తండ్రి)తో కలిసి రెడ్డి అండ్ కంపెనీ బ్యానర్‌పై చిత్ర నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఈ పతాకంపై తొలిసారి వీరు రూపొందించిన చిత్రం -్ధర్మపత్ని. జయరామిరెడ్డి అల్లుడు ప్రముఖ దర్శకుడు సాగర్. దర్శకరత్న దాసరి నారాయణరావు వద్ద కథా రచన విభాగంలో పాల్గొన్న రచయితల్లో ఒకరైన ఆర్‌కె ధర్మరాజ్ వ్రాసిన కథతో ధర్మపత్ని చిత్రం రూపొందింది. అక్టోబర్ 9, 1969న విడుదలైన ఈ సినిమా 50ఏళ్లు పూర్తి చేసుకుంది. జగ్గయ్య, దేవిక, హరనాథ్, మంజుల ముఖ్య పాత్రలు పోషించారు.

కథ: ఆర్‌కె ధర్మరాజ్
మాటలు: పినిశెట్టి
నృత్యం: జెమినిరాజు
సంగీతం: ఎస్ రాజేశ్వరరావు
ఎడిటింగ్: సిహెచ్ వెంకటేశ్వర్లు
కెమెరా: లక్షణ్‌గోరే
కళ: సూరన్న
నిర్మాత: ఎం జయరామిరెడ్డి
దర్శకత్వం: బిఏ సుబ్బారావు.

ఊళ్లో పేరుమోసిన పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఆనంద్ (జగ్గయ్య). అనుకూలవతియైన భార్య శాంతి (దేవిక). తల్లి శాంతమ్మ (పండరీబాయి). ఆనంద్‌కు పెళ్లై ఏడేళ్లయినా పిల్లలులేరని శాంతమ్మ శాంతితో పూజలు, నోములు చేయిస్తుంటుంది. ఆమె తమ్ముడు నాగభూషణం (నాగభూషణం), భార్య దుర్గ (సూర్యాకాంతం). వారి పెద్ద కూతురితో ఆనంద్‌కు పెళ్లి జరగలేదని, ఆమె సంతానవతియని, తమ చిన్న కుమార్తె పద్మ (మంజుల)తో ఆనంద్‌కు పెళ్లి జరిపించాలని ప్రయత్నాలు చేస్తూ.. శాంతిని గొడ్రాలని నిందవేస్తుంటారు. కాలేజీలో చదువుతున్న పద్మ, ఓ పిక్నిక్‌లో పరిచయమైన మధు (హరనాథ్)తో స్నేహం బలపడి ఇరువరూ ప్రేమించుకుంటుంటారు. పద్మ పెదనాన్న కొడుకు మల్లేశం (రాజ్‌బాబు) వారి ప్రేమను ప్రోత్సహిస్తుంటాడు. భుజంగరావు అనే వ్యక్తిసాయంతో దొంగనోట్లు అచ్చువేసిన నాగభూషణం, మిత్రుడు పరంధామయ్య (అల్లు రామలింగయ్య)... ఆ తరువాత వచ్చిన గొడవలో భుజంగరావుని నాగభూషణం హత్య చేస్తాడు. ఆ హత్య అటుగా వచ్చిన మధుపైపడి పోలీసులు అరెస్ట్ చేయటం, ఆనంద్ వాదనతో యావజ్జీవ శిక్ష పడుతుంది. తాను ఇల్లువదిలి వెళ్తే భర్త మరో వివాహం చేసుకుంటాడని భావించి శాంతి ఇల్లువదిలి వెళ్తుంది. అప్పటికామె గర్భవతి. ఈ విషయం తెలియని శాంతి, తన భర్తమీద కోపంతో జైలునుంచి తప్పించుకున్న మధుతోపాటుగా జీవిస్తూ అతని గాయాన్ని మాన్పుతుంది. ఆనంద్, పద్మల పెళ్లి నాగభూషణం నిశ్చయిం చేయటం, దాన్ని ఆపాలని నాగభూషణం చేసిన హత్య తాలూకు ఫొటో ఆనంద్‌కు మల్లేశం అందచేయటం, ఆనంద్‌ను అంతం చేయాలని పెళ్లివద్దకు వచ్చిన మధు విసిరిన కత్తి.. శాంతికి తగిలి గాయపడటం, ఆనంద్‌వలన పోలీసులు వచ్చి నాగభూషణాన్ని, పరంధామయ్యను అరెస్ట్ చేయటం, విచారణ అనంతరం మధు నిర్దోషిగా బయటకువచ్చి పద్మను వివాహం చేసుకోవటం, తమకు పుట్టిన బిడ్డడితో ఆనంద్, శాంతి, శాంతమ్మలు వారిని ఆశీర్వదించటం, నీవు నిజంగా ధర్మపత్నివి అక్క అని మధు, శాంతి ప్రశంసించటంతో చిత్రం శుభంగా ముగుస్తుంది. చిత్రంలో రాజ్‌బాబు జంట చాకలి బుల్లిగా రమాప్రభ, ఆమె తండ్రిగా నల్ల రామ్మూర్తి, ఇంకా జూ భానుమతి, సీనియర్ మంజుల ఇతరులు నటించారు.
నిర్మాత జయరామిరెడ్డికి దర్శకులు బిఏ సుబ్బారావుపట్ల కల అభిమానంతో తమ చిత్రానికి దర్శకత్వ బాధ్యతలు అప్పగించారు. ప్రముఖ నిర్మాత, దర్శకుడైన బిఎ సుబ్బారావు ఈ చిత్రాన్ని తనదైన శైలిలో తీర్చిదిద్దారు. చిత్రం ప్రారంభం నుంచి ఆనంద్, శాంతిల అనురాగం, ప్రేమ, ఆప్యాయతలు కలబోసిన సన్నివేశంతో మొదలై వారి అనుబంధానికి అద్దంపట్టేలా పలు సన్నివేశాలు ఎంతో అర్ధవంతంగా ఆకట్టుకునేలా చిత్రీకరించారు. దుర్గమ్మ, నాగభూషణం -శాంతిని గొడ్రాలిగా చిత్రీకరించి విమర్శించిన సందర్భాల్లో వారిని ఆనంద్ మందలించటం, శాంతిని అనునయించటం, పద్మను పెళ్లి చేసుకొమ్మని తల్లి ఆనంద్‌ను విడిగా కోరటం, శాంతిని అర్ధించటం, అనాధ పిల్లలు చందాకోసం వస్తే ఆ పిల్లలతో కలిసి భార్యతో ఓ సందేశాత్మక గీతం -కాకమ్మ చిలకమ్మ కథలే మాకొద్దు/ మా గాంధీ చెప్పింది మాకెంతో ముద్దు (గానం: పి సుశీల, జయదేవ్ బృందం, రచన: సినారె). ఈ పాటలో గాంధీజీ, నెహ్రూ, నేతాజీ, లాల్‌బహదూర్‌లను చూపటం, జగ్గయ్య, దేవికలు పిల్లలతో కలిసి పాడడం, ఓ పాపను చూసి ముచ్చటపడ్డ భార్యకోసం ఆనంద్ ఆ పాపను శరణాలయం నుంచి తెచ్చి ఇవ్వటం, తల్లి అభ్యంతరం పెట్టడం, పిల్లలు లేరని దుఃఖించవద్దు సంతోషంగా వుండు అని పలుమార్లు భార్యను అనునయించటం.. ఇలా వారి ప్రేమానురాగాన్ని ఎంతో సున్నితంగా, విపులంగా రూపొందించారు దర్శకులు. మధు, పద్మలు ఒకరికోసం ఒకరు తపించటం, ఆనంద్ వాదన వలననే తనకు శిక్ష పడిందని మధు జైలునుంచి తప్పించుకోవటం, భర్తను కాపాడుకోవాలని శాంతి, అతన్ని మార్చాలని ప్రయత్నించటం, ఆనంద్‌పైకి మధు విసిరిన కత్తివలన గాయపడిన శాంతిని చూసి మధు, ఆనంద్ తల్లడిల్లడం, ఉత్తమ లక్షణాలు, భర్తపట్ల అనురాగంకల స్ర్తిమూర్తి వేదన, ప్రేమ, అభిమానం, పిల్లలపట్ల కోరిక, వాత్సల్యం అనే అంశాలను ప్రధానంగా పరిపూర్ణతతో రూపొందించారు. హాస్యంకోసం రమాప్రభ, రాజ్‌బాబుల మధ్య ఓ గీతం -షిపాన్ చీరకట్టి సిగపై పూలుపెట్టి (గానం: పిఠాపురం, ఎల్‌ఆర్ ఈశ్వరి, రచన: కొసరాజు). మధు, పద్మలపై చక్కని తోటలో శిల్పాల మధ్య చిత్రీకరించిన గీతం -నాడు నిన్ను చూశాను చిన్నదానా (గానం: పి సుశీల, ఎస్ బాలు, రచన: ఆరుద్ర). దేవిక పూజగదిలో అమ్మవారిని పూజిస్తూ పాడే గీతం -తల్లివి నీవే నమ్మా మా కల్పవల్లివి నీవే (గానం: పి సుశీల). శాంతి ఇల్లువదిలి వెళ్లాక ఆనంద్ మందుకు బానిసై పాడే విషాద గీతం -ఈ లోకము శాంతిలేని లోకము (గానం: ఘంటసాల, రచన: దాశరథి).. ఎస్ రాజేశ్వరరావు స్వరాల్లో ఆకట్టుకున్నాయి.
జగ్గయ్య, దేవిక తమ పాత్రలను పరిపూర్ణవంతంగా, అర్ధవంతమైన చక్కని నటనతో మెప్పించారు. యువజంటగా హరనాథ్, మంజుల, విలనిజాన్ని నాగభూషణం పాత్రోచితంగా నటించగా, అల్లు రామలింగయ్య తనదైన ప్రత్యేక శైలితో ఒప్పించగా.. రాజ్‌బాబు, రమాప్రభ తమవంతు సహకారంతో నటనలో ఈజ్‌తో అలరించారు.
ఓ చక్కని కుటుంబ కథాచిత్రంగా భార్యాభర్తల అనుబంధానికి, అర్ధవంతమైన రూపమిచ్చిన చిత్రంగా ‘్ధర్మపత్ని’ చిత్రాన్ని పరిగణించవచ్చు.

-సీవీఆర్ మాణిక్యేశ్వరి