ఫ్లాష్ బ్యాక్ @ 50

అగ్గివీరుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రముఖ జానపద దర్శకులు బి విఠలాచార్య కుమారుడు బీవీ శ్రీనివాస్. తండ్రివద్ద పలు జానపద, సాంఘిక చిత్రాలకు సహాయకునిగా వ్యవహరించి మెళకువలు గ్రహించిన నేర్పరి. స్వీయ దర్శకత్వంలో ‘అగ్గిదొర’, ‘నినే్న పెళ్లాడుతా’ చిత్రాల ఒరవడితో.. 1969లో శ్రీ విఠల్ కంబైన్స్ పతాకంపై బి విఠలాచార్య నిర్మాణ పర్యవేక్షణలో యన్టీ రామారావు, రాజశ్రీల కాంబినేషన్‌లో రూపొందించిన జానపద చిత్రం -అగ్గివీరుడు. అక్టోబర్ 15, 1969న విడుదలైన చిత్రం 50 ఏళ్లు పూర్తి చేసుకుంది.

రచన: జికె మూర్తి
కళ: నాగరాజన్
ఎడిటింగ్: గోవిందస్వామి
నృత్యం: చిన్ని- సంపత్
సంగీతం: విజయా కృష్ణమూర్తి
కెమెరా: హెచ్‌ఎస్ వేణు
స్టంట్స్: శివయ్య
కో డైరెక్టర్: వైకుంఠం రామశర్మ
కథ, స్క్రీన్‌ప్లే, నిర్మాత,
దర్శకత్వం: బీవీ శ్రీనివాస్.
నిర్మాణ నిర్వహణ: బి విఠలాచార్య

రాజ్యవర్ధనుని (మిక్కిలినేని) దంపతుల కుమారుడు యశోవర్ధనుడు (యన్టీ రామారావు). రాజ్యవర్ధనుని మిత్రుడు ధర్మతేజ పాలుడు (ముక్కామల) కుమార్తె పద్మావతి (రాజశ్రీ). మిత్రులిద్దరూ యశోవర్ధనుడు, పద్మావతికి వివాహం చేయాలని అనుకుంటారు. విషయం తెలిశాక కలుసుకున్న పద్మావతి, యశోవర్ధనులు పరస్పరం అనురాగబద్దులౌతారు. తల్లితండ్రులు వారికి వివాహం నిశ్చయిస్తారు. పద్మావతిపై ఆశలు పెంచుకున్న మాంత్రికుడు రుద్రాక్షుడు (త్యాగరాజు), ఆమెను అపహరించి తన గుహకు తీసుకొస్తాడు. వివాహం చేసుకోమని కోరిన మాంత్రికుని మాట నిరాకరించటంతో, ఆమెనొక రాతిలో బంధించి.. తపోదీక్షలో కూర్చుంటాడు. రుద్రాక్షుని కారణంగా రాజ్యవర్ధనుడు కంటిచూపు కోల్పోతాడు. పద్మావతిని రక్షించాలని, తండ్రికి చూపు తెప్పించాలన్న నిర్ణయంతో యశోవర్ధనుడు బయలుదేరతాడు. ఆ ప్రయాణంలో ఓ అస్తిపంజరం విగ్రహాన్ని ధ్వంసం చేస్తాడు. మరోచోట ప్రసూన అనే భూతం (విజయలలిత) బారినపడిన శశాంక వర్మ (రామకృష్ణ), అతని తల్లితండ్రులకు విముక్తి కలిగిస్తాడు. తనవలన మరణం సంభవించిన ఓ బాలుని రక్షిస్తాడు. రుద్రాక్షుని కోరికపై మాణిక్యవీణను, తండ్రికోసం మరకత మణిని సాధించి.. చివరకు దుష్ట మాంత్రికుడు రుద్రాక్షుని అంతం చేస్తాడు. దీంతో తల్లిదండ్రులతోపాటు అందరి శాపాలు తొలగిపోతాయి. పద్మావతిని వివాహమాడి ఆనందంగా జీవించటంతో చిత్రం శుభ్రంగా ముగుస్తుంది.
ఈ చిత్రంలో యన్టీఆర్ మిత్రుడు ఆందోళంగా మోదుకూరి సత్యం, అతని జోడీ హంసగా మీనాకుమారి.. ఇంకా రావికొండలరావు, వడ్లమాని విశ్వనాథం, కెకె శర్మ, రమేష్, సారథి, మాంత్రికుని అనుచరిగా ఝాన్సీ నటించారు. నవాబుఆలీగా సత్యనారాయణ అతిథి పాత్రలో కనిపించారు.
టైటిల్స్‌లోనే చిత్ర కథా సన్నివేశాలు చూపిస్తూ తనదైన సృజనాత్మకతను ప్రదర్శించారు దర్శకులు బీవీ శ్రీనివాస్. తండ్రి బాటను అనుకరిస్తూ.. తనదైన శైలితో సన్నివేశాలను వేగంగా, వైవిథ్యంగా రూపొందించి ప్రేక్షకులను అలరించారు.
తొలుత యశోవర్ధనుడు, పద్మావతి.. పల్లె యువతీ యువకుల వేషాలలో కలుసుకొన్న తమాషాలను దర్శకులు ఆసక్తికరంగా తీర్చిదిద్దారు. అలాగే వారిమధ్య సాగే హుషారైన గీతం -లేడి కన్నులు రమ్మంటే లేత వలపులు ఓరబ్బా సై (గానం: ఘంటసాల, పి సుశీల, రచన: సి నారాయణ రెడ్డి) అద్భుతంగా ఉంటుంది. రుద్రాక్షునితో పెళ్లికి పద్మావతి, ఆమె తల్లితండ్రులను ఒప్పించేందుకు -అనుచరి గమనికచే వారిని చేపలుగా మార్చి వేడి నూనెలో వేయించటం, తిరిగి నీళ్లలో వేయటం (ప్రాణం పోకుండా)..; చెట్లకు అమ్మాయిల తలలువేలాడటం, అవి యన్టీఆర్ ముందు అమ్మాయిలుగా, అబ్బాయిలుగా చేసే నృత్యం; ఓ మహలు గదిలో రాళ్లవాన, నిప్పులవాన కురిసే సన్నివేశం, ప్రత్యేక అస్తిపంజరం విగ్రహంపై భీకర పోరాటం.. దాని చేతులు సమాంతరంగా, ప్రక్కలకు తిరగటం, అది ప్రేలిపోయి భవనం మాయమవటం, దాన్ని అంతంచేసిన వారి చేతిలో ఆ దేశ రాకుమారుడు (ఎనిమిదేళ్లు) మరణిస్తాడన్న జోశ్యం.. ఇలా లింకు సన్నివేశాలతో కథను అద్భుతంగా ముందుకు తీసుకెళ్లారు దర్శకుడు బీవీ శ్రీనివాస్. అలాగే, ఎనిమిదేళ్ల రాకుమారుడిని ప్రత్యేక గుహలో మూడు రోజులు ఉంచటం, అక్కడికి వచ్చిన యశోవర్ధనుని చేతిలో బాలుడు మరణించటం, యవోవర్ధనుడు ఆ బాలుని శవపేటికలో పెట్టి దేవిముందు ఉంచటం, మరకత మణికోసం త్యాగరాజుచే మాయా ప్రయాణం, అక్కడ కత్తులతోను, జడల మాంత్రికునితో సాగించే భీకర పోరాటాలు, సాహసాలు, అక్కడ చూపించే యుక్తి; అలాగే రాతిలోవున్న పద్మావతిని లంబకర్ణుడనే మాంత్రికుడు బయటకు తేవటం; ఆమె తనవారి జాడకోసం అడిగి శాపంపొంది ఎలుకగా మారటం; ఎలుకగా మారి పిల్లిచే చెలగాటం, అల్లరి.. ఆపైన యక్ష దంపతుల శాప విమోచనం; పద్మావతి ఎలుక రూపంనుండి విముక్తికోసం అంబా సరోవరం వెళ్లటానికి ప్రయత్నం; దారిలో నవాబుఆలీ సత్యనారాయణతో పాట -కాకిముక్కుకు దొండపండు దండుగ (గానం: పి సుశీల, రచన: సినారె); అదేవిధంగా విజయలలిత, రామకృష్ణ ముందు ఓ చక్కని భవనంలో సాగే నృత్య గీతం -పిలిచింది అందాల బాల నిను (గానం: పి సుశీల, రచన: సినారె), అలాగే యన్టీ రామారావు ముందు మరో నృత్యగీతం (విజయలలిత, యన్టీఆర్‌ల యుగళగీతం) -ఎవరో నీవెవరో ఎదలో పిలిచి ఎదురుగా నిలిచి (గానం: పి సుశీల, ఘంటసాల, రచన: సినారె).. ఇలా కథను, సన్నివేశాలను, నృత్య గీతాలను అర్ధవంతంగా, వేగంగా తీర్చిదిద్ది బహుప్రయాసలో పలు అంశాలను చిత్రీకరించి, అలరించేలా రూపొందించారు శ్రీనివాస్. దీనికి విఠలాచార్య పర్యవేక్షణ తోడవ్వటం ఆనందదాయకం.
అందుకు తగినట్టు -యన్టీ రామారావు పోరాటాల్లో, నృత్యాల్లో చూపిన సాహసం, చొరవ, అభినయం వారికే చెల్లిన ప్రత్యేకత ఈ చిత్రంలోనూ అదే పంథాలో సాగటం ప్రేక్షకులకు కనువిందు. కొద్దిసేపే అయినా సత్యనారాయణ తన పాత్రను దానికితగ్గ నటనను తమాషాగా చూపటం, హీరోయిన్‌గా రాజశ్రీ తన పాత్ర పరిధిలననుసరించి అనురాగం, ప్రేమ, బాధ, వియోగం, చురుకుతనంతో తెలివిగా వ్యవహరించటం వంటి సన్నివేశాలకు తగ్గ పాత్రోచిత హావభావాలు, నృత్యాలతో అలరించారు. మిగిలిన నటీనటులు.. మాంత్రికునిగా త్యాగరాజు తమ పాత్రలకు పూర్తి న్యాయం చేకూర్చారు. (చక్కని సెట్స్ వేసిన కళా దర్శకుడు నాగరాజన్‌నూ అభినందించాలి).
చిత్రంలోని ఇతర గీతాలు:
రాజశ్రీ.. లంబకర్ణుడనే రాక్షసుని ముందు పాడే నృత్య గీతం -అలాంటి దాన్ని కాదు (గానం: పి సుశీల, రచన: కొసరాజు). యన్టీఆర్ ముందు యువతీ యువకుల నృత్య గీతం -సరిసరి మగసిరి నీ అందము (గానం: పి సుశీల బృందం, రచన: కొసరాజు). చిత్రంలోని మరో మధుర యుగళగీతం (యన్టీఆర్, రాజశ్రీపై చిత్రీకరణ) -రవ్వల నవ్వుల రాజకుమారి/ నా నవయవ్వన నాట్యమయూరి (గానం: పి సుశీల, ఘంటసాల, రచన: సి నారాయణరెడ్డి). విజయ కృష్ణమూర్తి సంగీతంతో పాటలు కొన్ని నేటికీ శ్రోతలను అలరిస్తున్నాయి). అగ్గివీరుడు చిత్రం చక్కని జానపద చిత్రం. పిల్లలు, పెద్దలకు మంచి కాలక్షేప చిత్రంగా అలరించి మెప్పించినదిగా పరిగణించొచ్చు.

-సీవీఆర్ మాణిక్యేశ్వరి