ఫ్లాష్ బ్యాక్ @ 50

కర్పూర హారతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

1967లో తమిళ నిర్మాత విటి అరసు షష్ఠీ ఫిలిమ్స్ బ్యానర్‌పై రూపొందించిన తమిళ చిత్రం -కర్పూరం. ఎవిఎం రాజన్, పుష్పవల్లి జంటగా నటిస్తే, డిటి రామచంద్రన్, మనోరమ, నాగేష్‌లు ముఖ్యపాత్రలు పోషించారు. దర్శకులు సిఎన్ షణ్ముగం తెరకెక్కించిన చిత్రానికి ఉత్తమ తమిళ చిత్రంగా ఫిల్మ్ ఫేర్ అవార్డు దక్కింది. ఆ చిత్రం ఆధారంగా తెలుగులో శ్రీకాంత్ ప్రొడక్షన్స్ 1969లో కృష్ణ, వాణిశ్రీ కాంబినేషన్‌లో నిర్మించిన చిత్రం -కర్పూర హారతి. 1969 నవంబర్ 28న విడుదలైన ఈ సినిమా 50 ఏళ్లు పూర్తి చేసుకుంది.
మాటలు: పినిశెట్టి శ్రీరామమూర్తి
కళ: అన్నామలై
ఎడిటింగ్: వి చక్రపాణి
సంగీతం: టీవీ రాజు
నృత్యం: పసుమర్తి కృష్ణమూర్తి
డైరెక్టర్ ఆఫ్ ఫొటోగ్రఫీ: విజయన్
అసోసియేట్ దర్శకులు: కెఎస్ ప్రకాశరావు
స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: వి రామచంద్రరావు
నిర్మాతలు: ఎస్‌ఎల్ నహతా, ఎన్ సౌండప్పన్.

టాక్సీ డ్రైవర్ రంగన్న (కృష్ణ) అతని భార్య సీత (వాణిశ్రీ) అన్యోన్య దంపతులు. సీత తమ్ముడు వాసు (చంద్రమోహన్). రంగన్న చెల్లెలు రాణి (లక్ష్మి). వారింట్లోనే వారివద్దే పెరిగి యుక్తవయస్కులు అయ్యారు. ఆ ఊళ్లోని నగల వ్యాపారి, ధనవంతుడు, మంచివాడు, సోమసుందరం (రేలంగి). అతని భార్య శాంత (హేమలత). వారి ఏకైక కుమారుడు రఘు (రామకృష్ణ). హైదరాబాద్‌లో వైద్యుడిగా ప్రాక్టీసు చేస్తుంటాడు. సోమసుందరం బావమరిది వెంకట్ (పద్మనాభం), అతని స్నేహితుడు సుబ్బారాయుడు (అల్లు రామలింగయ్య), అతని కుమార్తె పంకజం (గీతాంజలి). ఒకసారి రంగన్న తన టాక్సీలో సోమసుందరం మర్చిపోయిన 10వేలు డబ్బుతోవున్న పర్సు తెచ్చిస్తాడు. దాంతో సోమసుందరం రంగన్న నిజాయితీని మెచ్చుకోవటమేకాక, అతని చెల్లెలు రాణికి తన కుమారుడు రఘుతో పెళ్లి జరిపించాలని నిశ్చయిస్తాడు. పెళ్లి నిశ్చయం రోజున రాణి అస్వస్థతకు గురవుతుంది. ఆమెను పరీక్షించిన రఘు, రాణి గర్భవతి అని తేల్చి చెబుతాడు. దాంతో పెళ్లి రద్దవుతుంది. రంగన్న కుటుంబంలో కల్లోలం ఏర్పడుతుంది. రాణి పరిస్థితికి వాసు కారణమని తెలిసిన రంగన్న అతన్ని దండించబోతాడు. తప్పించుకునే ప్రయత్నంలో వాసు, ధర్మరావు అనే వ్యక్తి కారు కిందపడతాడు. వాసు మరణించాడని నిశ్చయించుకున్న రంగన్న, రాణి నుదుటి బొట్టు చెరిపేస్తాడు. రాణి ఇల్లొదిలి ఆత్మహత్య ప్రయత్నం చేస్తుంది. రఘు ఆమెను రక్షించి తన ఆస్పత్రిలో ట్రీట్‌మెంట్ ఇస్తాడు. గర్భవతియైన సీత ఓ బిడ్డను ప్రసవించి, దిగులుతో కన్నుమూస్తుంది. కారు క్రిందపడి గాయపడిన వాసును ధర్మారావు ఆదరిస్తాడు. ఆయన తదనంతరం వారి ఆస్తికి సొంతదారుడై, ఆయన ఆశయాలను వాసు అమలు చేస్తుంటాడు. ఒంటరిగా పసివాడితో కష్టపడుతున్న రంగన్న, మరో వూళ్లో రామూ అనే స్నేహితుడి ఇంట ఆశ్రయం పొందుతాడు. అతని కారణంగా తెలీకుండానే వాసు కంపెనీలో డ్రైవర్‌గా పనికి చేరతాడు. రామూ చెల్లెలు, రాధ (వాణిశ్రీ) రంగన్న బిడ్డను ప్రేమగా పెంచుతుంటుంది. ఓ అక్రమ రవాణా కేసు విషయంగా జరిగిన పోలీసుల జోక్యంతో రంగన్న, వాసూ ఒకరికొకరు ఎదురుపడి నిజాలు తెలుసుకుంటారు. ఆ సమయానికి అక్కడకు వచ్చిన రఘు, రాణిని వాసుకు అప్పగిస్తాడు. రాధ, బాబును పెంచుకోవడానికి తనకిమ్మని రాధ రంగన్నను కోరటం, అపుడు బాబుతోపాటు రాధను భార్యగా స్వీకరించమని రఘును కోరటం, దానికి అందరూ అంగీకరించటం, వారితోపాటు వెంకట్, పంకజం, రాణి, వాసులు దండలు మార్చుకోవటంతో చిత్రం శుభంగా ముగుస్తుంది. సినిమాలో ఇంకా భూసారపు, కోళ్ల సత్యం, జగ్గారావు, సురేఖ తదితరులు నటించారు.
తల్లిదండ్రులుగాని, అన్నావదినెలుగాని వయసొచ్చిన పిల్లలు కలిగిన కుటుంబంలో నివసించేటప్పుడు ఎంతో మెళకువతో ప్రవర్తించాలని, తమ ప్రణయం, సరసం వారు గమనించే అవకాశం ఉంటుందని, గ్రహింపు లేకపోతే జరిగే విపరీత పరిణామాలు తప్పవనే సమస్యను ఆధారంగా చేసుకొని రూపొందించిన చిత్రమిది.
-‘మరపురాని కథ’ చిత్రం ద్వారా ‘వాణిశ్రీ’ని దర్శకుడు వి రామచంద్రరావు పరిచయం చేశారు. ‘అసాధ్యుడు’ చిత్రంలో కృష్ణతో అల్లూరి సీతారామరాజు నాటకాన్ని రూపొందించి, ఆ తరువాతి కాలంలో ‘అల్లూరి సీతారామరాజు’, ‘దేవుడుచేసిన మనుషులు’ వంటి హిట్ చిత్రాలనూ రూపొందించిన మేధావి ఆయన. ఈ సమస్యాత్మక చిత్రాన్ని తనదైన పంథాలో అద్భుతంగా తీర్చిదిద్దారు. భార్యాభర్తల సరసాల గురించి సీత తన భర్తను హెచ్చరించటం, రంగన్న తేలికగా తీసుకోవడం, ‘మరోసారి చిత్రం చివర తన స్నేహితుడు రాముతో ఇంకా నీవు పెళ్లి చేసుకోలేదు ఎందుకు అన్నపుడు.. ‘వయసొచ్చిన చెల్లెలుండగా అన్న పెళ్లి చేసుకుంటే కత్తి ఆమె చేతికిచ్చినట్టే అనటం’, అదేవిధంగా అన్నావదినెల సాన్నిహిత్యం చూసిన విషయాలు ఒంటరిగా ఉన్న రాణి గుర్తుకు తెచ్చుకుని పరవశించిపోవటం, ఒకసారి వాసు కూడా అక్కాబావల సరస సంభాషణలు వినటంవంటి సన్నివేశాలను దర్శకుడు జాగ్రత్తగా రూపొందించారు. సోమసుందరం అబ్బాయితో పెళ్లి గురించి సీతకు చెప్పినపుడు ఆమె -కన్య కర్పూరం లాంటిది. గృహిణి హారతి లాంటిది. దేవుని ముందు వెలిగి హారతిగా మారినపుడే కర్పూరానికి విలువ. భర్త అడుగుజాడల్లో నడుస్తూ వెలుగులు చిమ్మిననాడే గృహిణి పవిత్రమైన కర్పూర హారతి అవుతుంది’ అన్న సారాంశం వచ్చేలా సన్నివేశాన్ని తీర్చిదిద్దడం దర్శకుని ప్రతిభకు తార్కాణం.
పినిశెట్టి శ్రీరామమూర్తి మాటలు సన్నివేశాలకు వనె్నతెచ్చాయి. చిత్రం చివరలో రంగన్నకు రాధకు పెళ్లి అన్నపుడు -సీతను నేను మనస్ఫూర్తిగా ప్రేమించాను. మరొకరిని పెళ్లి చేసుకుంటే ఆమెకు ద్రోహంచేసినట్టే. ఓ పేదింటి అమ్మాయిని కోడడిగా చేసుకోవాలనుకున్న సోమసుందరం.. రాధను కోడలిగా స్వీకరించాలి’ అని కోరిన సందర్భంలో సన్నివేశాల చిక్కదనం తెలుస్తుంది. ‘జీవితంలో ఓడిపోయాను, ఎందుకు జీవించాలి’ అని మదనపడుతున్న రాణకి.. ఎందుకు జీవించాలో విపులంగా చర్చించటంలో పినిశెట్టి మాటల విశిష్టత అర్థమవుతుంది.
మాటల విశిష్టతను తెలియచేస్తుంది. చిత్రంలోని హాస్య సన్నివేశాలు మాత్రం అంతగా ఆకట్టుకోవు. దాన్ని పరిహరించేలా ఉన్నత ఆశయాలు, వ్యక్తులు ఎలా పెంపొందించుకోవాలో రేలంగి పాత్ర ద్వారా సూచించటం, ఆవేశంవల్ల రంగన్న ఎలా నష్టపోయాడో తెలియచెప్పటానికి దర్శకుల ప్రయత్నం, నిర్మాతల అభిరుచిని మెచ్చుకోవాలి.
హీరో రంగన్నగా కృష్ణ, అతని భార్య సీతగా వాణిశ్రీ పాత్రోచితమైన నటన ప్రదర్శించారు. రాణిగా లక్ష్మి వైవిధ్యభరితమైన నటన చూపించింది. ఎక్కువ విషాద సన్నివేశాలు కావటం, వాటికి ఆమె రియాక్షన్ అభినందనీయం.
చిత్ర గీతాలు:
కృష్ణ, వాణిశ్రీ, లక్ష్మిలపై చిత్రీకరించిన గీతం -బులి, బులి రాణమ్మ/ బుజ్జినా చెల్లెమ్మ’ (రచన: కొసరాజు, గానం: ఎస్పీబీ, వసంత, విజయలక్ష్మి). కృష్ణ, వాణిశ్రీలపై గీతం -వస్తుంది వస్తుంది వరాల పాప వస్తుంది (రచన: సినారె, గానం: ఎస్పీబీ, పి సుశీల). కామెడీ పాటగా వచ్చే -పిల్లాడెంకటసామి బలే వకీలయా’ (రచన: హాస్య గీతాల స్పెషలిస్ట్ అప్పలాచార్య, గానం: పిఠాపురం, స్వర్ణలత). చంద్రమోహన్, లక్ష్మీలపై ఊహ గీతం -కలిసిన హృదయాలలోన/ కురిసెను ముత్యాలవాన (రచన: దాశరధి, గానం: పిబి శ్రీనివాస్, విజయలక్ష్మి). కృష్ణపై బాబుతో ఒంటరిగా సాగేటప్పుడు బ్యాక్‌గ్రౌండ్ గీతం -ఎందాక ఈ పయనం/ ఎందాక ఎక్కడ (గానం: ఎస్పీబీ, రచన: సినారె). ఓ సమస్యపై రూపొందించిన సాధారణ చిత్రంగా కర్పూరహారతిని పరిగణించాలి.

-సీవీఆర్ మాణిక్యేశ్వరి