ఫ్లాష్ బ్యాక్ @ 50

మాతృదేవత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొమ్మారెడ్డి సావిత్రి కృష్ణా జిల్లా చిర్రావూరి గ్రామంలో 1937 డిసెంబర్ 6న జన్మించారు. నటిగా అంతులేని విజయాలు సాధించారు. ‘మహానటి’గా పేరుపొందారు. కథానాయికలలో ఉన్నత స్థానాన్ని కైవసం చేసుకున్నారు. తెలుగు, తమిళ, హిందీ చిత్రాల్లో -సాంఘిక, జానపద, పౌరాణిక ఏ అంశాని చెందిన సినిమాలోనైనా వైవిధ్యభరితమైన, ఆమెకే సొంతమైన ప్రత్యేక నటనతో ఆకట్టుకున్నారు. గడించిన సినీ పరిజ్ఞానంతో మరికొందరు సినీరంగానికి చెందిన మహిళామణులను కలుపుకొని స్వీయ దర్శకత్వంలో మాతా పిక్చర్స్ పతాకంపై 1968లో ‘చిన్నారి పాపలు’ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ద్వితీయ ఉత్తమ చిత్రంగా నంది అవార్డు లభించింది. తరువాత చిరంజీవి (1969), మాతృదేవత (1969), వింత సంసారం (1970), మూగమనసులు చిత్రాన్ని తమిళంలో శివాజీ గణేశన్ హీరోగా స్వీయ దర్శకత్వంలో రూపొందించారు. ఈ చిత్రాలన్నిటికీ పలువురు నిర్మాతలుగా వ్యవహరించారు. మాతా పిక్చర్స్ చిత్రాలను సావిత్రే సొంతంగా నిర్మించటం విశేషం. ‘మాతృదేవత’ చిత్రాన్ని సావిత్రి దర్శకత్వంలో పూర్ణా పిక్చర్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్‌పై నిర్మాతలు అట్లూరి పూర్ణచంద్రరావు, యం చంద్రశేఖర్ రూపొందించారు. 1969 నవంబర్ 7న విడుదలైన ఈ సినిమా 50 వసంతాలు పూర్తి చేసుకుంది.

స్క్రీన్‌ప్లే: ప్రత్యేగాత్మ
మాటలు: మద్దిపట్ల సూరి
నృత్యం: టిసి తంగరాజ్
సంగీం: కెవి మహదేవన్
స్టంట్స్: స్వామినాధన్
కళ: బిఎన్ కృష్ణ
ఎడిటింగ్: ఎంఎస్ మూర్తి
ఫొటోగ్రఫి: శేఖర్- సింగ్
దర్శకత్వం: సావిత్రి
నిర్మాతలు: ఏ పూర్ణచంద్రరావు, యం చంద్రశేఖర్.

మిల్లులో పనిచేస్తున్న శ్రీనివాసరావు (యన్‌టి రామారావు) తల్లి శాంతమ్మ (హేమలత), భార్య లక్ష్మి, కుమార్తె లత (బేణి రాణి)లతో ఆనందంగా జీవిస్తుంటాడు. నిజాయితీ, మంచితనం వలన మేనేజర్‌గా పదోన్నతి పొందుతాడు. అతనిపై ద్వైషం పెంచుకున్న శివయ్య (జగ్గారావు) తన భార్య గౌరీ (సురభి బాల సరస్వతి)తో కలిసి పన్నిన కుట్రలో గౌరి మరణిస్తుంది. గౌరిని హత్య చేశానన్న భయంతో శ్రీనివాసరావు వూరువదిలి పారిపోతూ, దారిలో కలిసిన ఓ చీకటి వ్యాపారాల వ్యక్తి, హంతకుడైన మోహన్‌రావు (ప్రభాకర్‌రెడ్డి)తో హైదరాబాద్ చేరుకుంటాడు. కుటుంబం, ఆ ఊరి జనం శ్రీనివాసరావు ప్రమాదంలో మరణించాడని భావించటంతో.. వితంతువైన లక్ష్మి (సావిత్రి) కుటుంబంతో సహా హైదరాబాద్ వెళ్లి ధర్మయ్య (నాగభూషణం) అనే కానిస్టేబుల్ సాయంతో శారీరక కష్టంతో జీవిస్తుంటారు. పదేళ్లు గడిచిన తరువాత లత (చంద్రకళ), ధర్మయ్య కుమారుడు రాజా (శోభన్‌బాబు) ఒకరినొకరు ఇష్టపడటం, రాజాకు ఇన్స్‌పెక్టర్‌గా ప్రమోషన్ రావటం జరుగుతుంది. తల్లి, బామ్మల కష్టంలో పాలు పంచుకోవాలనే ఆశయంతో లత ఏ పనీ దొరక్క మోహన్‌రావు క్లబ్‌లో నృత్య ప్రదర్శన ఇస్తుంది. ఆమెను అనుభవించాలని ప్రయత్నించిన మోహనరావును శ్రీనివాసరావు అడ్డుకొని ఆమెను ఇంటివద్ద దించే క్రమంలో తన భార్య, తల్లిని కలుసుకుంటాడు. తానెవరో తెలిస్తే జైలుకెళ్లాల్సి ఉంటుందని, ఉరి శిక్ష పడుతుందని చెప్పి భార్యను, తల్లిని ఒప్పించి లత బాబాయిగా ఆ ఇంటికి చేరతాడు. వారి మంచి చెడ్డలు చూసుకుంటున్న క్రమంలో లక్ష్మి గర్భవతి అవుతుంది. భర్తలేని లక్ష్మి గర్భవతి అయ్యిందని ఇరుగు పొరుగులు సూటిపోటి మాటలతో నిందించటంతో శ్రీనివాసరావు అందరికీ నిజం చెబుతాడు. విషయం తెలుసుకున్న ఇన్‌స్పెక్టర్ రాజా, శ్రీనివాసరావును అరెస్టు చేయగా.. అతను నిర్దోషి అని తండ్రి ధర్మయ్య చెబుతాడు. గౌరి మరణించలేదని ఆమెను అక్కడకు తీసుకొచ్చి చూపించటం, అంతా వారిని క్షమాపణ కోరటం, రాజా, లత వివాహంతో చిత్రం శుభంగా ముగుస్తుంది.
ఈ చిత్రంలో ఇతర పాత్రలను రాజ్‌బాబు, సాక్షి రంగారావు, రేలంగి, సురేఖ, మంజుల, దేవకి పోషించారు. సినిమా ప్రారంభం నుంచి ఓ మధ్యతరగతి కుటుంబంలోని అలవాట్లు, ఆప్యాయతలు, భార్యాభర్తల అనురాగాన్ని చిన్న చిన్న సన్నివేశాలుగా చూపించటం బావుంటుంది. అలరించే గీతం -మనసే కోవెలగా మమతలు మల్లెలుగా (గానం: పి సుశీల, రచన: దాశరధి)లో మరోసారి సున్నితమైన అంశాలను సవివరంగా చూపిస్తారు. మిల్లులో సూపర్‌వైజర్‌గా డ్యూటీ చేస్తూనే.. ఓ మిషన్ చక్రం లోపంవల్ల మిల్లు మూసేయాల్సి రావటంతో తన మేధస్సును ఉపయోగించి శ్రీనివాసరావు ఆ చక్రం తయారు చేసి బిగించటం హీరోయిజానికి సంకేతమైన సన్నివేశంలో చూపిస్తారు. శ్రీనివాస రావు మేథస్సును చూసి మేనేజర్‌గా ప్రమోషన్ ఇవ్వటం, అందుకు వర్కర్ శివయ్య అసూయపడి వాసుపై దాడి చేయటం, రైలు పట్టాలవద్ద పోరాట సన్నివేశాలు అద్భుతంగా చిత్రీకరించారు. రైలు క్రిందపడి ఎవరు మరణించారో పోలీసులు ఆనవాలు పట్టలేక శ్రీనివాస్ కోటు, వస్తువులనుబట్టి అతనే మరణించినట్టు నిర్థారిస్తారు. అయితే ప్రమాదం నుంచి బతికి బయటపడిన శ్రీనివాసరావు గౌరి ఇంటికి వెళ్లకం, శివయ్య, గౌరి తనను చంప ప్రయత్నించారని తెలిసి గౌరి నోరు నొక్కటం, ఆమె మరణించిందేమోనని భయపడి కుటుంబానికి దూరంకావటంలాంటి సన్నివేశాలతో కథాంశాన్ని రక్తికట్టించారు. మోహన్ రామ్మోహన్‌గా చలమాణి కావటం, ఇక పట్నంలో ఎంతో స్వాభిమానంతో గౌరవంగా బ్రతుకుతున్న లక్ష్మి కుటుంబానికి శేషావతారం (రేలంగి) వల్ల ఇబ్బందులు, చివర ఆమె గర్భవతి అని డాక్టరు నిర్థారించగా.. లక్ష్మి ఎంతో నిబ్బరంగా బాధతో అక్కడనించి వెళ్లిపోవటంలాంటి సన్నివేశాలు కథపై ఆసక్తిని పెంచుతాయి. లత తన తల్లితో, తరువాత దీనికి కారణం తండ్రి అని తెలీక శ్రీనివాసరావుతో వాదన, శేషావతారం రెచ్చగొట్టడంతో జనం లక్ష్మిపై నిందలు వేయటం, వారింటిపై రాళ్లు విసరటంవంటి సన్నివేశాలు ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచేలా చిత్రీకరించారు. ఆ సమయంలో శ్రీనివాసరావు నిజం చెప్పడానికి సిద్ధపడగా లక్ష్మి వారించటం, నా ప్రాణం పోయినా ఫర్వాలేదుగాని.. నా భార్య శీలవతి అని రుజువైతే చాలని భర్తగా తన ధర్మం చూపటం, ధర్మయ్య వచ్చి కుమారునితో వాదించి నిజం తెలియజేయటం- ఇలా సున్నితమైన అంశాలతో నిండుదనం, అర్థవంతంగా సన్నివేశాలను తీర్చిదిద్ది దర్శకత్వంలో తన సామర్థ్యాన్ని సావిత్రి మరోసారి ఈ చిత్రం ద్వారా నిరూపించుకున్నారు. తల్లి, భార్య, కూతురు, వారివారి మనోభావాలు ఎందరో మహిళలకు ఆదర్శవంతంగా నిలిచేలా రూపొందించి మహిళాలోకం మన్ననలు అందుకున్నారు.
శ్రీనివాస్‌రావుగా యన్టీ రామారావు, లక్ష్మిగా సావిత్రి పాత్రకు తగిన పరిపూర్ణత నటనలో చూపి ఆకట్టుకున్నారు. లతగా చంద్రకళ.. పాత్రలోని హుషారు, బాధ, విచారం, భయంవంటి భావాలను సన్నివేశాలకు తగిన విధంగా ఎంతో భావయుక్తంగా ప్రదర్శించారు. ఆమెకు జోడీగా శోభన్‌బాబు చిలిపి సన్నివేశాల్లో, చివర ఇన్‌స్పెక్టర్‌గా తన డ్యూటీ నెరవేర్చడంలో స్థిరమైన నటన, సంభాషణలతో మెప్పించారు. రేలంగి కుమారుడిగా నత్తిమాటలతో రాజ్‌బాబు తమాషా నటనతో, మిగిలిన పాత్రధారులు పాత్రోచిత నటన చూపించటంతో చక్కని కుటుంబ కథా చిత్రంగా మాతృదేవత ప్రశంసలు అందుకుంది.
చిత్ర గీతాలు:
రాజ్‌బాబు, సురేఖలపై చిత్రీకరించిన హాస్యగీతం -నిన్ను చూస్తే మనసు నిలవకున్నది (గానం: పిఠాపురం, స్వర్ణలత; రచన కొసరాజు). శోభన్‌బాబు, చంద్రకళపై యుగళగీతం -పెళ్లి మాట వింటేనే తుళ్లి తుళ్లి’ (గానం: ఘంటసాల, బి వసంత; రచన: సినారె). విజయలలితపై చిత్రీకరించిన క్లబ్ సాంగ్ -మై నేమ్ ఈజ్ రోజీ (గానం: ఎల్‌ఆర్ ఈశ్వరి, రచన: సినారె). ఇక సి నారాయణరెడ్డి రచనతో అర్థవంతంగా చక్కని నృత్యంతో భావంతో సాగిన మూడు గీతాలు -మానవ జాతి మనుగడకే ప్రాణం పోసింది మగువ (గానం: పి సుశీల, బి వసంత). చంద్రకళ, సురేఖలపై శ్రీరామనవమి వేడుకలో పందిరిలో సాగే గీతంగా, తల్లి, బామ్మ, శోభన్‌బాబు తదితరులతో ప్రేక్షకుల మధ్య స్ర్తిజాతి ఔన్నత్యాన్ని తెలియజేస్తూ సాగి, నేటికీ చిరస్మరణయ గీతంగా వనె్నకెక్కింది.
ప్రభాకర్‌రెడ్డి క్లబ్‌లో వేదికపై.. క్లబ్ సభ్యుల ముందు సాగే చంద్రకళ నృత్య గీతం -కన్నియ నుడికించ తగునా (గానం: పి సుశీల, రచన: సినారె). ఎంతో ఆహ్లాదకరమైన నృత్యంతో సాగుతుంది. మూడవ గీతం.. యన్టీ రామారావు హోటల్ రూముముందు పచ్చిక బయలులో పాడే విషాద గీతం -విధి ఒక విషవలయం. పూవు చాటున ముల్లు నాటేదాకా/ కడలి కడుపున బడబానలం రగిలేదాకా/ పచ్చని తరువు సుడిగాలిపాలు/ భార్యను తలచి ఎడబాటు ఎరగని కులసతి ఎంతగ వగచెనో (గానం: ఘంటసాల, రచన: సినారె).. ఎంతో అర్థవంతమైన చిత్రీకరణతో అలరిస్తుంది. పాటలపరంగా, సన్నివేశాలపరంగా ఎంతో ఆసక్తిదాయకంగా రూపొందిన చిత్రం మాతృదేవత.

-సీవీఆర్ మాణికేశ్వరి