ఫ్లాష్ బ్యాక్ @ 50

ఏకవీర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశ్వనాథ సత్యనారాయణ సెప్టెంబర్ 10, 1895లో కృష్ణాజిల్లా నందమూరులో జన్మించారు. కవిగా సుప్రసిద్ధులైన వీరు 1916లో విశే్వశ్వర శతకంతో రచనా ప్రస్థానం ప్రారంభించారు. 25 పైచిలుకు కావ్యాలు, 6 శతకాలు, పలు గేయ కావ్యాలు, నాటకాలు 50కి పైగా నవలలు, 10కి పైగా సంస్కృత నాటకాలు, పలు సాహిత్య ప్రక్రియలైన విమర్శనా గ్రంథాలు, వ్యాసాలు, ఉపన్యాసాలతో తెలుగు భాషకు వందల సంఖ్యలో రచనలు అందించారు. వీరి రచనల్లో శ్రీమద్రామాయణ కల్పవృక్షానికి జ్ఞానపీఠ అవార్డు లభించింది. కవి సామ్రాట్, కళాప్రపూర్ణ పద్మభూషణ వంటి బిరుదులెన్నో లభించాయి. తమిళనాడులోని మధుర ప్రాంతం నేపథ్యంగా వీరువ్రాసిన ‘ఏకవీర’ నవలను కొందరు కవులు మళయాళంలోకి, తమిళంలోకి అనువదించారు. ఆ ఏకవీర నవలను తెలుగులో నిర్మాత డియల్ నారాయణ పద్మ ఫిలిమ్స్ బ్యానర్‌పై చిత్రంగా నిర్మించారు. 1969 నవంబర్ 7న విడుదలైన ఈ సినిమా 50ఏళ్లు పూర్తి చేసుకుంది.
కథ: విశ్వనాథ సత్యనారాయణ, చలన చిత్రానువాదము: చంగయ్య, మాటలు: సి నారాయణరెడ్డి, పాటలు: దేవులపల్లి కృష్ణశాస్ర్తీ, సి నారాయణరెడ్డి, కత్తియుద్ధాలు: స్వామినాథన్, ఛాయాగ్రహణం: జె సత్యనారాయణ, కళ: గోడ్ గాండర్, వాలి, ఎడిటింగ్: పివి నారాయణ, నృత్యం: వెంపటి సత్యం, సంగీతం: కెవి మహదేవన్, దర్శకత్వం: సిఎస్ రావు, నిర్మాతలు: డియల్ నారాయణ, బిఏ సీతారాం.
మధుర ప్రాంతానికి చెందిన మిత్రులు రాజవంశానికి చెందిన కుట్టాన్ సేతుపతి (యన్టీ రామారావు), సేనాపతి వర్గానికి చెందిన వ్యక్తి వీరభూపతి (కాంతారావు) విద్యాభ్యాసం, సైనిక విన్యాసాలు అనంతరం స్వగ్రామాలకు వెళ్తారు. తమ ఊరిలోని సామాన్య కుటుంబానికి చెందిన మీనాక్షి (జమున) పరిచయమై ప్రేమగా పరిణమించటంతో ఆమెను వివాహం చేసుకుంటానని సేతుపతి వాగ్దానం చేస్తాడు. అలాగే వీరభూపతి తండ్రి పంపిన రాజకార్యంపై అంబా సముద్రం వెళ్ళి అక్కడ రాకుమారి ఏకవీర (కెఆర్ విజయ)ను కలుసుకోవటం, వారిరువురూ ప్రేమించుకోవటం జరుగుతుంది. విధి విలాసం వలన వీరిరువురూ తమ తల్లిదండ్రుల ఇష్టానుసారం సేతుపతి ఏకవీరను, వీరభూపతి మీనాక్షిని వివాహం చేసుకుంటారు. సేతుపతి మీనాక్షిని మరువలేక, ఏకవీరను సుఖపెట్టలేక సతమతం అవుతుంటాడు. అదేవిధంగా మీనాక్షి, వీరభూపతుల సంసారం సాగుతుంటుంది. మిత్రులు ఇరువురూ తమ విఫల ప్రేమల గూర్చి చర్చించటంలో మీనాక్షి వీరభూపతి అర్ధాంగి అని గ్రహిస్తాడు సేతుపతి. ఆ విషయానే్న వీరభూపతికి వివరించి -నాటినుంచి మీనాక్షి తన తోబుట్టువని ప్రకటించి, చీరె సారెతో గౌరవిస్తారు. తాను దూరం చేసుకున్న అర్ధాంగి ఏకవీరను కలుసుకోవాలని బయలుదేరిన సేతుపతి, రాజాజ్ఞతో రామనాధపురం వెళతాడు. ఈ సంగతి తెలిసిన ఏకవీర మరింత కుంగిపోతుంది. మీనాక్షి ఇంటివద్దకు కాలక్షేపం కోసం వెళ్ళిన ఏకవీర.. అక్కడ వీరభూపతిని చూచి చలించిపోతుంది. అదే సమయానికి వచ్చిన సేతుపతి వేదన చెందటం, వీరభూపతి ఏకవీర గూర్చి వివరించి ఆత్మహత్య చేసుకోవటం, మీనాక్షి విషంమింగి మరణించగా, ఏకవీర నదిలో కలిసిపోవటం, సేతుపతి ఆమెను రక్షించాలని నదిలోదూకి మరణించటం, ఆలుమగల చేతులు ఒకదానిపై ఒకటి ఉండటంతో చిత్రం ముగుస్తుంది. ఈ చిత్రంలో సేతుపతి తల్లిదండ్రులుగా మిక్కిలినేని, శాంతకుమారి, ఏకవీర తల్లిదండ్రులుగా ముక్కామల, నిర్మలమ్మ, ఏకవీర చెలికత్తెలుగా మీనాకుమారి, కుట్టిపద్మిని, సేతుపతి అనుచరుడు భట్టుగా రాజ్‌బాబు, మీనాక్షి తల్లిగా జూ.శ్రీరంజని, మహారాజుగా వల్లభనేని శివరాం, యువరాజుగా సత్యనారాయణ, వీరభూపతి తండ్రిగా ధూళిపాళ నటించారు. కళాత్మక విలువలతో కూడి సంగీతభరితంగా చిత్రాన్ని రూపొందించారు.
తొలుత మీనాక్షిని చెలులు ఆటపట్టిస్తూ సాగే గీతం -కనిపెట్టగలవా మగువా (గానం: పి సుశీల బృందం, రచన: దేవులపల్లి). యువరాజు కోసం మీనాక్షి ఎదురుచూస్తూ పూమాలిక అల్లుతూ విరిసిన ఉద్యానవనాల మధ్య మధురంగా సాగించే గీతం -తోటలో నా రాజు తొంగి చూసిన (గానం: పి సుశీల, ఘంటసాల). యువరాజు చాటుగా పొదలమాటు నుంచి చూస్తున్నట్టుగా ఎంతో సున్నితంగా విశే్లషణాత్మకంగా అలరించేలా రూపొంచారు. అలాగే ఏకవీరను గవాక్షనుంచి చూసిన వీరభూపతి ఆమె భవనం ముందు కొలనులో ఆమెను కలుసుకోవటం, దేవాలయంలో ఆమె చిత్రం గీసి దానిముందు -కలువపూవుల చెంత చేరి పద్యం ఆలపించటం, శ్రీకృష్ణుని ముందు గుడిలో కెఆర్ విజయ నృత్యగీతం -నీ పేరు తలచినా చాలు కృష్ణా. దానికి వీరభూపతి గొంతు కలపటం (గానం, పద్యం ఎస్‌పి బాలు, గీతం పి సుశీల, ఎస్‌పి బాలు, రచన సినారె). వీరభూపతి, సేతుపతితో భార్యను సుఖపెట్టమని చెప్పిన తరువాత మిత్రులిద్దరూ కలిసి వెనె్నల రాత్రి పాడే మరొక రసమయ గీతం -ప్రతీ రాత్రి వసంత రాత్రి. తన భార్య గురించి వీరభూపతి ద్వారా తెలుసుకున్న సేతుపతి మధుర మీనాక్షిని స్తుతిస్తూ పాడే పాట కనుదమ్ములను మూసి (రచన: సినారె, గానం: ఘంటసాల). చీర, పసుపు కుంకుమలలో వీరభూపతి ఇంటికి వెళ్లి మీనాక్షికి తన ప్రేమ గురించి తెలియచేసి, నేటినుంచి ఆమె తన సోదరి అని ప్రకటించటం, అది జరిగాక మీనాక్షి భర్తను అనురాగంతో చేరబోగా ‘నా మిత్రుని మదిలో వెలసిన పుష్పానివి, నిన్ను పూజించగలను కాని తాకి అపవిత్రం చేయలేనని’ వీరభూపతి తిరస్కరించటం, ఏకవీర కలుసుకోబోయిన సేతుపతి దూరంగా వెళ్లటం, అక్కడ ఆమెను తలచుకుంటూ ‘ఒక దీపం వెలిగింది’ అని హుషారుగా యన్టీఆర్, భర్త దూరమయిన తాపంలో విరక్తితో కెఆర్ విజయ ‘ఒక దీపం మలిగింది/ చీకటితో చేతులు కలిపి (గానం: ఘంటసాల, పి సుశీల, రచన: సినారె) పాట అద్భుతంగా సాగుతుంది. అంతకుముందు సేతుపతి, ఏకవీర, మీనాక్షి, వీరభూపతిలపై చిత్రీకరించిన గీతం అత్యద్భుతం. సేతుపతిపై ‘ఎంత దూరము అది ఎంత దూరము’ అని మొదలవుతుంది.
తండ్రి (సి పుల్లయ్య)కి తగ్గ తనయుడిగా జానపద, సాంఘిక, పౌరాణిక, చారిత్రక చిత్రాలను రూపొందించటంలో దిట్టగా, ఒక్కోసారి తనదైన శైలిలో ప్రతిభావంతంగా సన్నివేశాలను తీర్చిదిద్దటంలో నేర్పరియైన ప్రముఖ దర్శకుడు సిఎస్ రావు పాటలను, సన్నివేశాలను కథతో మేళవించి ఆహ్లాదకరంగా చిత్రాన్ని తీర్చిదిద్దారు. స్నేహానికి, హృదయ సంస్కారానికి, సంప్రదాయానికి, మనసుకు కోరికలకు మధ్య నలిగిన రెండు జంటల కథను ఎంతో నేర్పుతో తెరకెక్కించాడు దర్శకుడు. చారిత్రక అంశమైన ఆంగ్లేయులు రామనాధపురం కోటను ముట్టడించటం, సేతుపతి వారిని ఎదిరించిన పరాక్రమం, అదేవిధంగా భర్తకోసం ఎదురుచూస్తున్న ఏకవీర, మీనాక్షి ఇంటిముందట భామాకలాప నృత్యం (రాజసులోచన) శ్రీకృష్ణునిపై సత్యభామ వ్రాయులేఖ, ఆమె విరహం ఓ చక్కని కూచిపూడి నృత్యంలో చూపడం, నేతాళలేనే చరణాలకు కెఆర్ విజయలో స్పందన, ఇంటిలోకి వచ్చాక ఎదుట ఉన్నది ఎవరో గ్రహించనంతగా వీరభూపతి కౌగిలిలో ఒదగడం, దాన్ని సేతుపతి చూశారని చెప్పటానికి వారి చేతి కంకణం మీనాక్షి భర్తకు చూపటం, మీకివ్వలేని విషాన్ని నేను సేవించాను అని ఉంగరంలోని వజ్రాన్ని తీసుకోవటం, ఏకవీరను, సేతుపతి వెంటాడుతూ ‘ఇందు నీ తప్పేంలేదు’ అని అనునయ వాక్యాలు పలకటం, దానికామె ‘ఎంత క్షమ, ఎంత దయ’ అంటూ దూరంగా వెళతూ నదిలో కలిసిపోవటం.. ఇలా పరిపూర్ణత సన్నివేశాల చిత్రీకరణ చూపటం, దానికి తగిన విధంగా తొలిసారి ఈ చిత్రానికి పరిపుష్టితో కూడిన సంభాషణలు సి నారాయణరెడ్డి వ్రాయటం.. దేవులపల్లి, సినారె అందించిన గీతాలకు స్వరబ్రహ్మ కెవి మహదేవన్ స్వరాలు చక్కగా జతకూడాయి.
ఈ చిత్రంలో ఓ నృత్య నాటిక గీతం -లేత వయసు కులికిందోయి. ప్రకృతిలోని ఋతువుల మార్పును చూపుతూ చిత్రీకరించిన బృందగీతం (గానం: ఎస్‌పి బాలు బృందం, బి వసంత, రచన: సినారె). -వందనము జననీ భవాని పద్యం దేవులపల్లి రచిస్తే, ఘంటసాల గానం చేశారు. -ఎదురు చూసిన వలపు తోటలు పద్యం సినారె రచిస్తే, పి సుశీల గానం చేశారు. ఏకవీరను తొలిరేయి సాగనంపే పాట -ఔనే చెలియ సరిసరి (గానం: పి సుశీల బృందం, రచన: దేవులపల్లి). ఇవీ ప్రేక్షకులను అలరించాయి. తన భర్త చిత్రపటం చూసి పరవశం, ఆ పరవశంలో కనులు మూసికొనివున్న ఆమెను అనుకోకుండా చూసిన వీరభూపతి ఆనందంలో కౌగలించుకోవటం, అప్పుడు కనులు తెరచిన ఏకవీర మూర్ఛిల్లటం.. ఎంతో భావయుక్తంగా సన్నివేశాన్ని తీర్చిదిద్దారు. కళంకని క్షమిస్తున్నారా? అని ఏకవీర అడగటం, సేతుపతి కాదని చెప్పి ఆమె ఆత్మహత్య నివారించబోవటం, నదిలో కలిసిపోతున్న ఆమెను రక్షించాలని ప్రయత్నించిన సేతుపతి ఆమెతోపాటు విగత జీవుడై వారిరువురి చేతులు ఒకదానిపై ఒకటి పెనవేసుకోపోవటం ఎంతో ఆర్ద్రతతో నిండిన సన్నివేశాలలో చిత్రం ముగింపు పలకటం శ్లాఘనీయం.
ఏకవీర చిత్రాన్ని నిర్మాతలు తొలుత అక్కినేని, యన్టీఆర్ కాంబినేషన్‌లో రూపొందించాలని భావించారు. కారణాంతరాలవల్ల కాంతారావు, యన్టీ రామారావుల కాంబినేషన్‌లో తెరకెక్కింది.
ఆర్థికంగా సక్సెస్, ఫెయిల్యూర్‌లతో సంబంధం లేకుండా, ఓ పవిత్ర ప్రేమకు, దాని కారణంగా ఇరువురి స్నేహితుల జీవితాల్లో సంభవించిన పరిణామాలు, రెండు జంటల మానసిక అశాంతిని విశే్లషిస్తూ అరుదైన పసందైన పాటల జోడింపుతో కూడిన కళాత్మక చిత్రంగా ‘ఏకవీర’ నిలిచింది.

-సీవీఆర్ మాణిక్యేశ్వరి