ఫ్లాష్ బ్యాక్ @ 50

కృష్ణలీలలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారతం, రామాయణం, భాగవతం భారతీయులకు ప్రత్యేకమైన పురాణ గ్రంథాలు. వీటిలో భాగవతం, శ్రీకృష్ణుని మహిమలు, లీలలు, భగవత్ భక్తుల కథలతో నిండిఉంటుంది. శ్రీకృష్ణుని పేరు వినగానే, ఆ స్వామి లీలలు, చిద్విలాసాలు మనసును రంజింపచేస్తాయి. ఆ శ్రీ కృష్ణలీలలు ఆ స్వామి కథలకు సంబంధించిన అంశాలతో పలు చిత్రాలు రూపొందించాయి. కృష్ణుని లీలలకు చెందిన సంఘటనలలో తెలుగులో 3 చిత్రాలు, 2 డబ్బింగ్ చిత్రాలు రూపొందాయి.
1935లో వేల్ పిక్చర్స్ బ్యానర్‌పై పివి దాసు నిర్మించిన చిత్రం ‘కృష్ణలీలలు’. మద్రాస్‌లోని వేల్ పిక్చర్స్ స్టూడియోలో ఈ చిత్ర నిర్మాణం సాగింది. ఈ చిత్రానికి చిత్రపు నరసింహారావు దర్శకత్వం వహించారు. కంసునిగా వేమూరి గగ్గయ్య, వసుదేవునిగా పారుపల్లి సుబ్బారావు, అక్రూరునిగా పారుపల్లి సత్యనారాయణ, నందుడిగా అరికెపూడి లక్ష్మీపెరుమాళ్లు, యశోద పాత్రలో రామతిలకం, భూదేవి పాత్రలో రమాదేవి, దేవకీదేవిగా శ్రీరంజని నటించారు. మధుర గాయకునిగా, ప్రముఖ సంగీత దర్శకునిగా పేరుగాంచిన సాలూరి రాజేశ్వరరావు (మాస్టర్ రాజేశ్వరరావు) ఈ చిత్రంలో బాల కృష్ణుడిగా నటించి అలరించారు. వారు బాల్యంనుంచే హరికథలు గానం చేయటం, పాటలు పాడడంలో ఈ చిత్రంలో శ్రీకృష్ణునిగా అవకాశం లభించింది. 1935 జూలై 1న ఈ సినిమా విడుదలైంది.
ఆ తరువాత 1958లో హిందీలో ‘నీల్‌మణి’గా రూపొందిన చిత్రాన్ని తెలుగులో ‘కృష్ణలీలలు’ పేరుతో డబ్బింగ్ చేశారు. ఈ చిత్రంలో నళిని జయవంత్, కులదీప్‌కౌర్, లలితాపవర్, సులోచన నటించారు. ఈ చిత్రానికి దర్శకుడు కుందన్‌కుమార్. నిర్మాతలు కంటిపూడి వెంకటరత్నం, సూరపనేని సత్యనారాయణ. మాటలు పడాల రామారావు అందిస్తే, పాటలు అనిశెట్టి, బైరాగి, వీటూరి సమకూర్చారు. సంగీతం ఎస్‌ఎల్ మర్చంట్, ఎంఎస్ శ్రీరామ్ సమకూరిస్తే, పర్యవేక్షణ రమేష్‌నాయుడు నిర్వహించారు. ఈ చిత్రంలో పాటలను పిబి శ్రీనివాస్, ఘంటసాల, బాబూరావు, సుశీల, కోమల, రాధ, కృష్ణవేణి మొదలగువారు ఆలపించారు.
తరువాత నిర్మాతలు శ్రీ్ధర్‌రావు, లక్ష్మీరాజ్యం తమ రాజ్యం పిక్చర్స్ బ్యానర్‌పై 1959లో నిర్మించిన చిత్రం -కృష్ణలీలలు. ఈ చిత్రానికి దర్శకులు ‘జంపన’ (జంపన చంద్రశేఖర్‌రావు) ఏలూరు కళాశాలలో పనిచేశారు. వీరు నవలల ద్వారా ప్రసిద్ధిచెందారు. వీరి తొలి చిత్రం ‘వాలి సుగ్రీవ’. ఈ చిత్రానికి 5గురు సంగీత దర్శకులుగా వ్యవహరించారు. (గాలిపెంచల నరసింహారావు, వేణు, ఘంటసాల, రాజేశ్వరరావు, పెండ్యాల). వీరు 6 సినిమాలకు దర్శకత్వం వహించారు. రాజ్యం పిక్చర్స్‌వారి ఎస్‌విఆర్ ‘హరిశ్చంద్ర’, మరొక చిత్రం ఎన్‌టిఆర్ భట్టి విక్రమార్క చెప్పుకోదగ్గ చిత్రాలుగా పేరు వహించాయి.
కృష్ణలీలలు చిత్రానికి తొలుత దర్శకులుగా సి పుల్లయ్యను నిర్ణయించారు. కారణాంతరాలవల్ల వారు విరమించుకోవటంతో జంపన దర్శకత్వం చేపట్టారు. ఈ చిత్రానికి సంగీతం సుసర్ల దక్షిణామూర్తి నిర్వహించారు.
కంసుడు (ఎస్‌వి రంగారావు) తన ప్రియసోదరి దేవకిదేవి (జూ శ్రీరంజని)ని వసుదేవుడు (గుమ్మడి)కి ఇచ్చి వివాహం జరిపించి, వారి రథానికి తానే సారధ్యం వహించి అత్తవారింటికి తీసుకువెళ్తుండగా, అశరీరవాణి దేవకి, అష్టమగర్భ జనితుని వలన కంసునికి మరణం సంభవిస్తుందని హెచ్చరిస్తుంది. దేవకిని కంసుడు అంతం చేయబోయి, వసుదేవుని వాగ్దానంతో వారిని విడిచిపెడతాడు. తన రాజ్యం చేరిన వసుదేవుడు, కంసునికిచ్చిన మాట ప్రకారం దేవకి గర్భజనితుని కంసునికివ్వగా, అతడు అష్టమగర్భజనితుడు తప్ప వీరు వద్దంటాడు. అయితే, నారదుని సూచనపై ఏడుగురినీ అంతంచేసిన కంసుడు.. దేవ మానవులనూ, తపోధనులను ఘోర శిక్షలకు గురి చేస్తుంటాడు. అష్టమగర్భాన జనించిన హరి యోగమాయచే మార్పుజరిగి నందుని ఇంట పెరగటం, నిజం తెలిసిన కంసుడు అతన్ని అంతంచేయ ప్రయత్నించి విఫలుడుకావటం, రేపల్లెలో శ్రీకృష్ణుని ఆటలూ మాయలూ చివరకు మధుర చేరి మామతో తలపడి శ్రీకృష్ణుడు కంసుని అంతంచేయటం, వసుదేవుడు, దేవకి కారాగార విముక్తి పొంది రాజ్యాధి నేతలవటంతో చిత్రం ముగుస్తుంది. ఈ చిత్రంలో ఇతర పాత్రల్లో నారదునిగా పద్మనాభం, యశోదగా లక్ష్మీరాజ్యం, నందునిగా రేలంగి, రోహిణిగా సంధ్య, అక్రూరునిగా సూరిబాబు, మోహినిగా ఇవి సరోజ, యోగమయగా కాంచన, పూతనగా జయంతి నటించారు. అల్లురామలింగయ్య, సీత ఓ జంటగా, చదలవాడ, సురభి బాలసరస్వతి జంటగా వారి అత్తగా సూర్యాకాంతం (వారిపై చిత్రీకరించిన తమాషా గీతం -ఎంత దానివయ్యావే కోడలా.. అమ్మా నువ్వూరుకో.. నాయాలి నువ్ నోరు ముయ్యి (గానం: సరస్వతి, స్వర్ణలత, పిఠాపురం, రచన: సదాశివబ్రహ్మం), ఇంకా నల్లరామ్మూర్తి, బాలకృష్ణ తదితరులు నటించారు.
కృష్ణలీలలు చిత్రంలో ఆకట్టుకునే అంశాలు ఎన్నో. కంసుడు అశరీరవాణి పల్కులు విని దేవకిని అంతం చేయబోవటం, బావ మాట మన్నించి వారిని వదిలివేయగా వారు రేపల్లె చేరి రోహిణికి ఈ సంగతి తెలియచేయటం, హరి జన్మించగా యమునా నదిని వసుదేవుడు దాటడం ఎంతో వైవిధ్యంగా రూపొందించారు. పూతన, శకటాసురుల సంహారం, దానివెంట నారదుని ఆశీస్సు పద్యం ‘బ్రహ్మరుద్రాదులంటి వారినైనా’ (గానం: ఘంటసాల, రచన: సదాశివబ్రహ్మం), కృష్ణుడు వారి ఇంటిలో బంధించామని గొల్లవారు రావటం, యశోద అంతకుముందు అతన్ని ఊయలలోవుంచి జోలపాట ‘లాలీ తనయా లాలీ’ (రచన: ఆరుద్ర, గానం: పి సుశీల) వినసొంపుగా చక్కని చిత్రీకరణలో సాగుతుంది. ‘మన్నుతినంగనే వెర్రినో’ అని యశోదవద్ద కృష్ణుని మాయ యశోద పద్యం ‘కలయో, వైష్ణవ మాయయో’ (్భగవతంనుండి.. గానం: ఘంటసాల) కృష్ణుని లీలల్లో గోపికా వస్త్రాపహరణం, గోవులను రాక్షసులు తోలుకుపోగా కృష్ణుని మురళీనాదం అవి వెనక్కిమళ్లటం, కాళిందిలో పడిన గోవులను రక్షించే యత్నంలో మడుగులో దూకిన కృష్ణుడు కాళిందిని అంతం చేయబోవటం అద్భుతంగా చిత్రీకరించారు. -గోపాలకృష్ణమ్మ దక్కాడురా (గానం: మాధవపెద్ది, స్వర్ణలత బృందం, రచన: ఆరుద్ర) పాట ఈ సందర్భంలోనే వస్తుంది. కాళిందునికి, గరుత్మంతుని వలన కీడులేకుండా కృష్ణపాదం గుర్తులుంటాయని చెప్పటం, కృష్ణుని నాట్యానికి ‘తాండవకృష్ణుడు కాళిందిపై’ అని పాట, కృష్ణుని లీలలు తెలిసిన కంసుడు కారాగారంలో వసుదేవునితో దేవకితో వాదన, ఆ సందర్భంలో వసుదేవుడు దేవకిని లెంపకాయకొట్టి ఆ తరువాత దుఃఖాతిశయంతో కృంగి కృశించినానని బాధపడటం, నన్ను క్షమింపుమని కోరే సన్నివేశం.. ఎంతో హృదయ విదారకంగా చిత్రీకరించి ఆకట్టుకున్నారు. కృష్ణుడు కంసుని అంతం చేయటం, అలాగే శ్రీకృష్ణునిలో కొన్ని ట్రిక్ షాట్స్ వైవిధ్యంగా చూపించారు. తొలుత గోవులను పూజిస్తూ యశోదపై చక్కని భక్తిగీతం నేటికీ అలరిస్తుండటం విశేషం. అది -గోమాతా శుభచరిత నిర్మల గుణ భరితా (రచన: కొసరాజు, గానం: పి లీల). సుసర్ల దక్షిణామూర్తి సంగీతంలో మిగిలిన పాటలు, చిత్రంలో శ్రీకృష్ణునిగా నటించిన ఉమ అభినయం ప్రేక్షకుల మెప్పు పొందాయి. చుట్టూ ఎనిమిది మంది కృష్ణులు మధ్యలో ఒక కృష్ణుడు మొత్తం 9 మందితోగల శ్రీకృష్ణుని ట్రిక్‌షాట్ ఈ చిత్రంలో ఓ వెరైటీగా ఆ రోజుల్లో పరిగణించారు. చిత్ర విజయంలో ఇలా చాలా సన్నివేశాలు ప్రధాన పాత్ర వహించాయి. నారదుని ప్రవేశగీతం జయజయ నారాయణ (గానం: ఘంటసాల, రచన: ఆరుద్ర) నేటికీ శ్రోతలనలరిస్తున్నది.
ఆ తరువాత 1971లో బసంత్ పిక్చర్స్ బ్యానర్‌పై హోమీవాడియా, నిర్మాత, దర్శకత్వంలో రూపొందిన అనువాద చిత్రం ‘శ్రీకృష్ణలీల’. సంగీతం బి గోపాల, రచన ఆరుద్ర. రంగులలో నిర్మించిన ఈ డబ్బింగ్ చిత్రానికి పి సుబ్రమణ్యం అనువాద కార్యక్రమాలు పర్యవేక్షించారు. ఈ చిత్రంలో పాటలను ఘంటసాల గానం చేయటం, అవి ప్రేక్షకులను అలరించటం విశేషం). ఆ తరువాత 1975లో వీనస్ మహిజ పిక్చర్స్ పతాకంపై సిఎస్ రావు దర్శకత్వంలో నిర్మాత సిహెచ్ ప్రకాశరావు నిర్మించిన చిత్రం ‘యశోదాకృష్ణ’. ఈ చిత్రంలోనూ కృష్ణుడు లీలలు చూపటం విశేషం. 1959 కృష్ణలీలలు చిత్రంలో కంసుని పాత్ర పోషించిన ఎస్‌వి రంగారావు ఈ చిత్రంలోనూ అదే పాత్ర పోషించటం మరో విశేషం. బాలకృష్ణునిగా శ్రీదేవి నటించింది. 1935 కృష్ణలీలలు చిత్రంలో బాలకృష్ణుడుగా నటించిన ఎస్ రాజేశ్వరరావు ఈ చిత్రానికి సంగీత దర్శకత్వం వహించారు. కృష్ణునిపై చిత్రాలు ఎన్ని రూపొందినా అవి ప్రేక్షకులను రసానుభూతితో అలరించడం, ప్రేక్షకుల మన్ననపొందటం ప్రత్యేక విశేషాంశం.

-సీవీఆర్ మాణిక్యేశ్వరి