ఫ్లాష్ బ్యాక్ @ 50

శ్రీకృష్ణమాయ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బందరులో బాలమిత్ర మండలిలో నటిగా కన్నాంబ, ప్రయోక్తగా కడారు నాగభూషణం పనిచేశారు. వారిరువురూ పరిణయం చేసుకొని శ్రీ రాజరాజేశ్వరి నాట్యమండలి ద్వారా పలు నాటకాలు ప్రదర్శించి, ఆపైన శ్రీ రాజరాజేశ్వరి ఫిలిం కంపెనీ నెలకొల్పారు. మద్రాసులో చిత్ర నిర్మాణం చేపట్టారు. పలు విజయవంతమైన చిత్రాలను తమిళ, తెలుగు భాషల్లో రూపొందించారు. ఒకేసారి తెలుగు, తమిళ భాషల్లో చిత్రం నిర్మించే విధానానికి ఆద్యులు వీరే. తల్లిప్రేమ (1941)లో మొదలుపెట్టి, సతీసుమతి (1942), హరిశ్చంద్ర (తమిళం), తులసీ జలంధర (తమిళం 1942) మొదలైన పలు చిత్రాలను రూపొందించిన వీరు తమ అల్లుడు సి.ఎస్.రావు దర్శకత్వంలో 1958లో రూపొందించిన చిత్రం ‘‘శ్రీకృష్ణమాయ’’. వారణాసి సీతారామశాస్ర్తీగారి ‘నారద సంసారం’ నాటకం ఆధారంగా రూపొందించబడిన చిత్రం. 12-06-1958 విడుదలయింది.
ఆజన్మ బ్రహ్మచారియైన నారద మహర్షి, సంసారిగా మారితే ఎలా ఉంటుందన్న ఊహతో 1946లో జగన్మోహిని పిక్చర్స్‌వారు నిర్మించిన చిత్రం ‘నారద-నారద’. ఈ చిత్రంలో నాయకా, నాయికలుగా సూరిబాబు, లక్ష్మీరాజ్యం నటించారు. నిర్మాత- రాజాగణపతిదేవ్, దర్శకత్వం పి.పుల్లయ్యదేవ్ (నిర్మాత) ఇద్దరూ వహించారు. ఈ చిత్రం ద్వారా ఒక మూగ పాత్ర ధరించిన నటీమణి సూర్యాకాంతం చిత్రసీమకు పరిచయమయ్యారు. సుసర్ల దక్షిణామూర్తి తొలిసారిగా సంగీత దర్శకత్వం వహించిన చిత్రం కూడా ఇదే.
సి.పుల్లయ్య కుమారులైన సి.శ్రీనివాసరావు (సి.ఎస్.రావు) 1963లో ‘పొన్ని’అనే తమిళ చిత్రానికి దర్శకత్వం వహించారు. రాజరాజేశ్వరివారి శ్రీకృష్ణతులాబారం (1955) తెలుగు చిత్రానికి తొలిసారిగా దర్శకత్వం వహించారు. తెలుగు, తమిళ, కన్నడ భాషలలో పలు చిత్రాలకు దర్శకత్వం వహించినవీరు స్వతహాగా నటులు కూడా కావటం, వీరి దర్శకత్వంలోనే రాజరాజేశ్వరివారు ‘శ్రీకృష్ణమాయ’ (1957) రూపొందించటం విశేషం.
ఈ చిత్రానికి కథ శ్రీ వారణాసి సీతారామశాస్ర్తీ, మాటలు-రావూరు వేంకట సత్యన్నారాయణరావు, పాటలు: కీ.శే.వారణాసి సీతారామశాస్ర్తీ, పద్యాలు- రావూరు, బి.వి.యన్.ఆచార్య, సంగీతం- టి.వి. రాజు, ఛాయాగ్రహణం- కమల్‌ఘోష్, నృత్యం- వెంపటి సత్యం, కూర్పు- ఎన్.కె.గోపాల్, దర్శకత్వం- సి.ఎస్.రావు.
శాంతి మంత్రం ఋషులు పఠిస్తుండగా ఇంద్రసభ ప్రారంభం అవుతుంది. ఇంద్రుడు (రాజనాల) దేవ పారిజాత వృక్షాన్ని, శ్రీకృష్ణ తులాభారం ద్వారా తమకు దక్కించినందుకు నారద మహర్షి (అక్కినేని)కి కృతజ్ఞతలు తెలియచేయగా నారదుడు, ఆ పొగడ్తలకు గర్వోన్నతుడై త్రిమూర్తులను హేళనచేస్తాడు. తాను మాయాతీతుడని ప్రకటిస్తాడు.
ద్వారకలో సత్యభామతో చదరంగమాడుతున్న శ్రీకృష్ణుడు (ఈలపాట రఘురామయ్య) నారదునికి జ్ఞానం కలిగించాలని, ఋషి దంపతులుగా ఓ ఆశ్రమం చేరి, అతనిలోని జ్ఞానాన్ని గ్రహించి, నారదుని ఓ నదిలో మునగమంటాడు. ఒడ్డున వున్న శ్రీకృష్ణుడు నారద వీణ మహతిని ఓ స్ర్తి మాయ్ (జమున) అనే కోయ యువతిగా మార్చగా ఆమెతో, నది నుండి బయటకువచ్చిన నారదుడు ప్రేమ, పెళ్ళి, సంసారం సాగించటం, బహుసంతానంతో, లేమితో పలు అవస్థలకు లోనుకావటం, నారదుడన్న భావన, సంసారం తాపత్రయాలు భరించి, చివరకు శ్రీకృష్ణునిచే తిరిగి జ్ఞానాన్ని పొంది, పశ్చాత్తాపంతో వానిని శరణువేడడంతో చిత్రం ముగుస్తుంది.
సృష్టిలోని సకల చరాచర జీవులు, ఆ జగన్మాత మహత్తర శక్తికి లోనయి నడువవలసిందేనని, తామే సర్వశక్తివంతులని విర్రవీగితే గర్వభంగం తప్పదన్న నీతితో రూపొందిన చిత్రం ‘శ్రీకృష్ణమాయ’.
ఈ చిత్రంలో మాయ తల్లిదండ్రులు రుద్రన్న దొర, దుర్గమ్మలుగా (ఏ.వి.సుబ్బారావు, ఛాయాదేవి) సత్యభామగా సూర్యకళ, వసంతుడుగా, బావమరిదిగా చదలవాడ, నళినిగా, సూర్యాకాంతం, బ్రహ్మదేవుడు సరస్వతిలుగా (కె.వి.ఎస్.శర్మ, మాలతి) పేరయ్యగా డా.శివరామకృష్ణయ్య, ఇంకా రీటా(మోహినిగా) జూ.లక్ష్మీరాజ్యం, అమ్మాజి ఇతర పాత్రలు పోషించారు.
అలరించే సన్నివేశాలు: నారదుడు, ద్వారక శ్రీకృష్ణుని వద్దకు వెళ్ళగా, అతనిలోని జ్ఞానజ్యోతి శ్రీకృష్ణునిలో చేరటం, నారదునికి, ప్రేమ, పెళ్ళి ఆశలు కల్పించటం, శ్రీకృష్ణుడు లేని ఇంట యువతిని స్వీకరించమనగా, నారదుడు వెళ్ళిన ప్రతిచోటా శ్రీకృష్ణుడు కన్పించటం, నారదునిలో విసుగు, కోపం, తమాషాగా చిత్రీకరించటం, ‘అనేక ద్వారాలున్నాయి. కనుకనే దీన్ని ద్వారక అనటం’, నారదుని నదిలో మునగమని కృష్ణుడు అతని మహతి, చిడతలు, పూలహారం తీసుకోవటం ‘నాది అన్నది నాదగ్గర వుండనీయవుకదా’అని నారదుడనటం, నది నుండి వెలువడి, మహతి మాయ అనే యువతిగా మారగా ఆమెను ప్రేమించటం, పెళ్ళికుమారుని పట్ల మాయ కోరికలు ‘అందంగా వుండాలి, చక్కగా పాడాలి’, నన్ను వూర్లన్నీ తిప్పి వింతలు చూపాలి’ సహజంగా ఆడ పిల్లలకుండే ఆకాంక్షలను వెల్లడించటం, ‘‘పెళ్ళికి సిద్ధపడి, తిరిగివద్దని నారదుడు తిరస్కరించటం, సంసారి అయ్యాక భార్యకు విశ్రాంతినిచ్చి బాబును ఊయలలో వూపటం, అక్కడ ఓ చక్కని జోల పాట ‘నిదురించవయ్యా నా చిన్ని తనయా’లో తన గురించి, తన తండ్రి బ్రహ్మ, మహావిష్ణువులను తెలుపుతూ ‘నీ తండ్రి దేవర్షి’ ‘‘నీ తాతధాత’’, ముత్తాత శౌరిముక్తి ప్రదాత’’అని కీర్తించటం (గానం-ఘంటసాల) వరుసగా ఏడుగురు పిల్లలు పుట్టడం వారికి తెలుగువత్సరాల పేర్లుపెట్టి పిలవటం, ప్రమోదూతతో మొదలై, ఆకలికి పిల్లలు చేపలుపట్టడం, కోడిని ఆహారం చేసుకోబోగా, వారించటం, పిల్లల ఆరోగ్యంకోసం, మేక బలిదానాన్ని ఆపటం, జ్ఞానజ్యోతి లేకున్నా, నారదునిలో సంస్కారం, ఆచార, నియమాల పట్ల శ్రద్ధ, సంసారం పట్ల అనురక్తి, విరక్తి, కష్టించి సేద్యంచేయటం, అది ఫలించక, రాజానుగ్రహంకోసం వెంపర్లాట, ‘‘కుచేలోపాఖ్యానం హరికథ’’ ఆకట్టుకునేలా చిత్రీకరించగా, వాటికి రావూరిగారి సంభాషణలు ఎంతో ఇంపుగా అమరటం చిత్రం జనరంజకంగా రూపొందింది.
అక్కినేని నాగేశ్వరరావు నారదునిగా, ఆ పాత్రను తనదైన శైలిలో ఎంతో సహజంగా ఆవిష్కరించారు.
శ్రీకృష్ణునిగా రఘురామయ్య ఆ పాత్రకు తగ్గ ఔన్నత్యాన్ని, యోగిగా, మహారాజుగా సందర్భోచితంగా చక్కని చిరునవ్వుతో మెప్పించేలా నటించారు.
ఇక మాయగా ‘జమున’ ఆ పాత్రకుతగ్గ వివిధ షేడ్స్‌ను, కొంత పొగరు, కొంత అమాయకత్వం, దుడుకు, భర్తపట్ల ప్రేమ, అనురాగం, కోపం, విసుగు, అతడు విడిచిపోతుంటే వేదన, తిరిగి గద్దరితనం మళ్ళీ ప్రేమ పుట్టింటివారి పట్ల అభిమానం, పాత్రోచితమైన నటనతో ఆకట్టుకున్నారు.
మిగిలిన పాత్రధారులు తమ పాత్రలను సన్నివేశానుగుణంగా నటించి, ఒప్పించారు.
శ్రీకృష్ణమాయ లోని గీతాలు!
పాటలు- పద్యాలు- రచన కీ.శే.వారణాసి సీతారామశాస్ర్తీ.
‘అక్కినేని, జమునలపై యుగళగీతం’. ‘‘చిలుకా ఏలనే కోపము తెలిపేను మనోభావము’ (గానం-ఘంటసాల, జిక్కి) ‘‘నా వయసు నా సొగసు వనానికే అందం’’ జమున, అక్కినేని వెనుకనుంచి చూడడం(జిక్కి) అక్కినేనిపై గీతం ‘నీలవర్ణ నీ లీలలు తెలియతరమా’ (ఘంటసాల) జమునపై చిత్రీకరించిన గీతం ‘రావో దొరా మరలిరావో’ (జిక్కి), చదలవాడపై గీతం ‘‘వయ్యారి నన్ను జేరి సయ్యాటలాడరావే’’ (పిఠాపురం) నారదునిపై చిత్రీకరించిన పద్యాలు (గానం ఘంటసాల). 1) చానా నీ మోము చక్కని చందమామ, 2) జనన మందిననాడే జనకుడే బ్రహ్మకు 3) నను రారామ్మని చేరబిలిచి 4) తపమో శ్రీహరినామ సంస్మరణమో 5) తంత్రాలను మీటి ఎన్నో తంత్రాలు 6) కుచేలోపాఖ్యను కలడు కుచేలుండను హరికథ (ఘంటసాల, అక్కినేని వ్యాఖ్యానం), 7) ‘నను భవదీయ దాసుని మనంబున నెయ్యపు’ (శ్రీకృష్ణ తులాభారం నాటకంలోని ఈ పద్యం ఈ చిత్రంలోనూ ఆ తరువాత ‘శ్రీకృష్ణార్జున యుద్ధం’( ), శ్రీకృష్ణ తులాభారం ( ) చిత్రంలో చిత్రీకరించటం వాటిని ఘంటసాలే గానం చేయటం విశేషం. రఘురామయ్య ఆలపించిన పద్యాలు ‘‘తరమే జగన్నాధ తమేనైనా భాసురమైన ఈ జగతిపాలన’ ఈ చిత్రంలో తొలుత నారదుడు అక్కినేనిపైనా ఆ తరువాత శ్రీకృష్ణుడు యోగిగా, శ్రీకృష్ణునిగా నారదుని హెచ్చరిస్తూ చిత్రంలో పలుమార్లు విన్పించే గీతం ‘ముక్తిమార్గమునకు కనలేవా జీవా’ (ఘంటసాల అక్కినేనికి, రఘురామయ్య తనకు తానే పాడుకున్న ప్రాచుర్యమైన గీతం.
‘శ్రీకృష్ణమాయ’ చిత్రం మనోరంజకమైన చిత్రంగానూ, భక్తి, రక్తి మార్గాలను ఏకత్రాటిపై నడుపుతూ, చిత్రీకరించటం, ‘అజ్ఞానులను జ్ఞాన మార్గానకి మళ్ళించే సందేశాత్మక చిత్రంగాను, ప్రేక్షకులను ఆకట్టుకుంది. 60 సం.లు పూర్తిచేసుకున్నా, పాటలు, పద్యాలు నేటికీ సహజంగా, యుక్తమైనవిగా తోచటం చెప్పుకోదగ్గ అంశం.

- సి.వి.ఆర్.మాణిక్యేశ్వరి