ఫ్లాష్ బ్యాక్ @ 50

జై జవాన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేశభక్తిని ప్రబోధించే చిత్రాన్ని రూపొందించాలని అన్నపూర్ణా సంస్థ నిర్మాత భావించారు. తమ అభిప్రాయాన్ని రచయిత డివి నరసరాజుతో ప్రస్థావించారు. దానికి ఆమోదం తెలిపిన నరసరాజు, చైనా వార్‌తో ప్రారంభించి పాకిస్తాన్ వార్‌తో ముగిస్తూ చక్కని ఫ్యామిలీ సెంటిమెంట్ జోడించి కథ రూపొందించి చిత్రంగా నిర్మించమని సూచించారు. అంతేకాక, ‘ఆత్మగౌరవం’ చిత్రానికి కథను సమకూర్చిన నవలా రచయిత్రి యద్దనపూడి సులోచనకే కథా బాధ్యత అప్పగించమని సలహానిచ్చారు. ఆ ప్రకారం యద్దనపూడి సులోచన కథ సిద్ధంచేయగా, డివి నరసరాజు సంభాషణలు సమకూర్చారు.
జై జవాన్ చిత్రానికి డి.యోగానంద్ దర్శకత్వ బాధ్యతలు నిర్వర్తించారు. అప్పటికి హిందీ చిత్రం నిర్మాణ దర్శకత్వ బాధ్యతల్లో ఆదుర్తి సుబ్బారావు బిజీగా ఉండటంతో, డి యోగానంద్‌కు అవకాశమిచ్చారు. అన్నపూర్ణా సంస్థలో పనిచేసిన 5వ దర్శకుడు డి యోగానంద్. 1970 ఫిబ్రవరిలో విడుదలైన చిత్రం 50 ఏళ్లు పూర్తి చేసుకుంది.
*
కథ: యద్దనపూడి సులోచనారాణి
మాటలు: డివి నరసరాజు
సంగీతం: ఎస్ రాజేశ్వరరావు
కెమెరా: పిఎస్ శెల్వరాజ్
ఎడిటింగ్: ఎంఎస్ మణి
కళ: జివి సుబ్బారావు
నృత్యం: తంగప్పన్
స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: డి యోగానంద్
నిర్మాత: డి మధుసూధనరావు
సహ నిర్మాతలు: జి ప్రసాద్, పి గంగాధరరావు
*
భారత్- చైనాలమధ్య యుద్ధంతో సినిమా మొదలవుతుంది. దేశభక్తుడు, స్వాతంత్య్ర సమరయోధుడు మాధవరావు (గుమ్మడి) కుమారుడు ఇండియన్ ఆర్మీ కెప్టెన్ రవీంద్రనాథ్ (అక్కినేని), కుమార్తె భారతి (చంద్రకళ). మాధవరావు సోదరి సుందరమ్మ (సూర్యకాంతం), ఆమె భర్త నరసింహం (నాగభూషణం), మేనకోడలు కస్తూరి (మంజుల). కుస్తూరి బావను ప్రేమించి, పెళ్లి చేసుకోవాలని అనుకుంటుంది. యుద్ధంలో గాయపడి ప్రాణాపాయ స్థితిలోవున్న రవీంద్రను నర్సు సుశీల (్భరతి) రక్షిస్తుంది. వారిరువురూ ప్రేమించుకుంటారు. రవి స్నేహితుడు డాక్టర్ రఘు (కృష్ణంరాజు) మాధవరావు కుటుంబానికి అండగావుంటాడు. అతనికి కాళ్లులేవని తెలిసినా భారతి అతడిని ఇష్టపడుతుంది. ఇంటికి వచ్చిన రవి -రఘు, భారతికి వివాహం జరిపిస్తాడు. తాను సుశీలను వివాహం చేసుకుంటానని తండ్రికి తెలియచేసి, అంగీకారంతో పెళ్లి ఏర్పాట్లు చేసుకుంటున్న సమయంలో, కారు ఆక్సిడెంట్ సంభవించి సుశీల మరణిస్తుంది. మనోవేదనతో పర్యటనకు వెళ్లిన రవికి సుజాత (మరో భారతి) కనిపిస్తుంది. ఆమె సుశీల చెల్లెలని, వారిరువురినీ శివయ్య (్భనుప్రకాష్), లక్ష్మి (జి వరలక్ష్మి) దంపతులు పెంచి పెద్ద చేశారని తెలుసుకుంటాడు. అంతేకాదు సుజాతతో వారి కుమారుడు రాముకు చిన్నతనంలో పెళ్లి నిశ్చయమైందని, రాము ఇప్పుడు ఎక్కడున్నాడో తెలియదు కనుక.. సుజాత -రవిలకు పెళ్లి జరిపిస్తామని చెబుతారు. రవి, సుజాతల పెళ్లి సమయంలో -పాకిస్తాన్‌తో యుద్ధం కారణంగా సైనికులను ప్రభుత్వం వెనక్కి రమ్మని పిలుపునిస్తుంది. ఆ విధంగా తిరిగి యుద్ధానికి వెళ్లిన రవి విజయవంతంగా పోరాటం జరపటం, నమ్మకస్తుడిగా నటిస్తూ దేశ ద్రోహానికి పాల్పడే వ్యక్తి మేనమామ నరసింహం తలపెట్టిన రైలుమార్గాలు, వంతెనల విధ్వంసం కుట్రలను భగ్నం చేస్తాడు. నరసింహం కొడుకు పద్మనాభం భార్య లిల్లీ (లిల్లీ) ఒక సిఐడి ఆఫీసర్. ఆమె కూడా మామ కుట్రను పోలీసులకు సాక్ష్యాలతో అందచేయటం, నరసింహం అరెస్ట్ కావటం జరుగుతుంది. భారత్- పాక్ యుద్ధ విరమణ అనంతరం.. రవి ప్రధానమంత్రి చేతులమీదుగా బహుమతి స్వీకరించి, తన ఊరిలో సుజాతను వివాహం చేసుకోగా.. రామూ, రఘు ఒకరేనని తెలియటంవంటి విశేషాలతో చిత్రం శుభంగా ముగుస్తుంది.
‘దొంగరాముడు’ చిత్రం ద్వారా అన్నపూర్ణ సంస్థకు మాటల రచయితగా పరిచయమై, పదునైన సంభాషణలతో ఆ చిత్ర విజయంలో తనవంతు సహకారం అందించిన డివి నరసరాజు జై జవాన్ చిత్రానికి తనదైన శైలిలో చక్కని సంభాషణలు సమకూర్చారు. అక్కినేని, సుశీల (్భరతి), సుజాత (్భరతి)తో తన ఆత్మీయతను వెల్లడిచేసే సన్నివేశాల్లో, అలాగే రఘును ఇష్టపడి పెళ్లి చేసుకుంటున్న భారతి.. మేనత్త మాటలు విని తన పెళ్లికి ఏ ఆర్భాటాలూ వద్దనే సన్నివేశంలో, దేశ రక్షణకంటె వివాహం ముఖ్యంకాదని రవి యుద్ధ్భూమికి వెళ్లటం, తాను మనసుపడిన బావను వేరొకరు వివాహం చేసుకుంటున్నారని తెలిసి కస్తూరి వేదన, అలకతో ఇంటినుంచి పారిపోయినా తిరిగి తల్లిదండ్రుల వద్దకు ఎందుకు రాలేకపోయాడో రఘు వివరణ వంటి సన్నివేశాల్లో వీరి రచనా చాతుర్యం బహుముఖీనమై ఆకట్టుకుంది. సమర్థతగల దర్శకులు యోగానంద్ కథానుగుణంగా సన్నివేశాలను తీర్చిదిద్దగా, ఉత్తమ పౌరునిగా, వీరోచిత కెప్టెన్‌గా, ప్రేమికునిగా, విఫల ప్రేమికునిగా పాత్రోచితమైన నటనలో అక్కినేని నాగేశ్వరరావు, అతనికి సమఉజ్జీగా భారతి తమ నటనతో హావభావాలతో మెప్పించారు.
నిర్మాత మధుసూధనరావు ఖర్చుకు వెనుకాడక మిలటరీ క్యాంప్‌లో సైనికుల శిక్షణ దృశ్యాల చిత్రీకరణలో వాస్తవికత కోసం హైద్రాబాద్‌లోని గండిపేటకు వెళ్లేదారిలో సైనిక శిక్షణ కేంద్రం సహాయాన్ని తీసుకున్నారు. వారు అన్నివిధాల సహకరించటంతోపాటు, కొన్ని సన్నివేశాల్లో అట్మాస్పియర్ షాట్స్ కోసం, జూనియర్ ఆర్టిస్టుల అవసరం లేకుండా తమ సిపాయిలను (సోల్జర్స్)ను పంపించారు. అక్కినేని నాగేశ్వరరావు, భారతిలపై చిత్రీకరించిన, జవాన్, కిసాన్‌ల గొప్పతనాన్ని తెలిపే కొసరాజు రచించిన గీతం -పాలబుగ్గల చిన్నదాన్ని (గానం: పి సుశీల, ఘంటసాల). పాటలో కనిపించే వారంతా నిజమైన సైనికులే. ఇలా వారి సహకారంతో చిత్రాన్ని పూర్తిచేశారు. క్లైమాక్స్‌ల పాకిస్తాన్- భారత్ యుద్ధ దృశ్యాలు చూపించాలి. కాని తాష్కెంట్ ఒప్పందం కుదిరి యుద్ధం ముగిసింది. ఫిలిమ్స్ డివిజన్‌వారు ‘తాష్కెంట్ ఒప్పందం ప్రకారం ఇండో-పాక్ యుద్ధ దృశ్యాలు ఎక్కడా ప్రదర్శించకూడదు. అది నిషిద్ధం’ అనటంతో వాటిని చిత్రంలో చూపటం వీలుకాలేదు. చిత్ర ప్రారంభంలో మంచుకొండల్లో చైనా సరిహద్దు పోరాట దృశ్యాలు ఎంతో సహజంగా చిత్రీకరించినా, క్లైమాక్స్ అంతగా ఆకట్టుకునేలా చిత్రీకరించక పోవటం, చిత్రానికి లోటుగా కనిపిస్తుంది.
చిత్ర గీతాలు:
చిత్ర ప్రారంభంలో దేశ రక్షణ నిధికి విరాళాల కోసం గుమ్మడి ఆధ్వర్యంలో చంద్రకళ, మంజుల బృందంపై చిత్రీకరించిన నృత్య గీతం -స్వతంత్ర భారత యోధుల్లారా సవాలెదుర్కొని కదలండి (గానం: పి.సుశీల బృందం, రచన: శ్రీశ్రీ). భారతి, చంద్రకళ, మంజులపై గీతం -చక్కని వదినెకు సింగారమే (గానం: పి సుశీల, వసంత బృందం, రచన: కొసరాజు). అక్కినేని, భారతిలపై చిత్రీకరించిన మూడు యుగళ గీతాలు -అల్లరి చూపుల అందాల బాల నవ్వులు చిలికి (గానం: ఘంటసాల, పి సుశీల, రచన: దాశరథి). మరో దాశరథి గీతం -అనురాగపు కన్నులలో ననుదాచిన ప్రేయసివే (గానం: ఘంటసాల, పి సుశీల). మరో మధురమైన గీతం, జై జవాన్ చిత్రంలోని గీతాలన్నిటిలో రంజింపచేసే దిశగా సాగిన గీతం -మధురభావాల సుమమాల మనసులో పూచే ఈ వేళ (గానం: పి సుశీల, ఘంటసాల). సినారె రచనలో పరిపుష్టమై నేటికీ గానలహరి కార్యక్రమాల్లో, స్వరలహరులలో శ్రోతలను అలరిస్తు పరవశింప చేస్తోంది. జై జవాన్ చిత్రం ఆర్థికంగా విజయాన్ని సాధించలేకున్నా, ప్రతిష్టాత్మక సంస్థ అన్నపూర్ణ చేసిన మంచి ప్రయత్నానికి ఆనవాలుగా నిలిచిందని భావించాలి.

-సీవీఆర్ మాణిక్యేశ్వరి