ఫ్లాష్ బ్యాక్ @ 50

రాజమకుటం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప జిల్లా కొత్తపేటలో 1908 నవంబర్ 16న జన్మించారు బొమ్మిరెడ్డి నరసింహారెడ్డి (బిఎన్ రెడ్డి). నటన, నాటక రంగంపట్ల మక్కువతో మద్రాసు వెళ్లారు. బళ్లారి రాఘవతో ఒక నాటకంలో నటించారు. 1936లో కొందరి స్నేహితులతో కలిసి బిఎన్‌కె ప్రెస్ స్థాపించారు. తరువాత రోహిణి సంస్థ అధినేత హెచ్‌ఎం రెడ్డి వద్ద ‘గృహలక్ష్మి’ చిత్రంతో నిర్మాణ వ్యవహారాల్లో అనుభవం సంపాదించారు. మిత్రులు ఏకె శేఖర్, మూలా నారాయణస్వామి, రామనాథ్ వంటి వారితో కలిసి వాహినీ పిక్చర్ స్థాపించారు. ఆ బ్యానరుపై తొలిగా వందేమాతరం నిర్మించారు. సంగీత, సాహిత్యాలకు తన చిత్రాల్లో ప్రముఖ స్థానం కల్పించి కళాస్రష్టగా, విశిష్ట దర్శక నిర్మాతగా చిత్ర పరిశ్రమలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. ‘దాదా ఫాల్కే’ ‘పద్మభూషణ్’ వంటి అవార్డులు వరించారు. వీరి స్వీయ దర్శక నిర్మాణంలో వాహినీ పతాకంపై రూపొందించిన జానపద చిత్రం -రాజమకుటం. తెలుగు, తమిళ భాషల్లో రూపొందిన చిత్రం 1960 ఫిబ్రవరి 24న తెలుగులో, మరుసటి రోజు తమిళంలో విడుదలై 60ఏళ్లు పూర్తి చేసుకుంది. రాజమకుటం చిత్రానికి కథ, మాటలు డివి నరసరాజు సమకూర్చారు. తమిళ చిత్రానికి మాటలు తమిళ రచయిత బిఎస్ రామయ్య రాశారు. సంగీతం: మాస్టర్ వేణు; కూర్పు: వాసు, మణి; స్క్రీన్ ప్లే: పాలగుమ్మి పద్మరాజు, డివి నరసరాజు, బిఎస్ రామయ్య; కళ: ఏకె శేఖర్, వాలి; నృత్యం: పసుమర్తి కృష్ణమూర్తి, వేదాంతం జగన్నాథ శర్మ; స్టంట్స్: సోము; ఛాయాగ్రహణం: బిఎన్ కొండారెడ్డి; నిర్మాత, దర్శకత్వం: బిఎన్ రెడ్డి
గాంధార రాజ్య మహారాజు, మహారాణి ఓ వేడుకలోవున్న సమయంలో -మహారాజు తమ్ముడు, సేనాధిపతి అయిన ప్రచండుడు (గుమ్మడి) ఓ కత్తి విసిరించి మహారాజును హత్య చేయిస్తాడు. గురుకులంలోవున్న యువరాజు ప్రతాప్ (యన్టీ రామారావు) ఈ సంగతి తెలుసుకుని రాజ్యానికి వస్తుండగా, మార్గమధ్యంలో మరికొందరితో అతన్ని అంతం చేయాలని చూస్తాడు ప్రచండుడు. యువరాజును అంతమొందించి తన కుమారుడు భగరంగడు (పద్మనాభం)కి సింహాసనం అప్పగించాలన్నది ప్రచండుని రాజ్య కుట్ర. అయితే, ఆ దాడినుంచి తప్పించుకొని గాయపడిన ప్రతాప్‌ను.. ప్రమీల (రాజసులోచన) అనే యువతి కాపాడి తన బండిలో నగరానికి చేరుస్తుంది. తండ్రికి హితులైన వారిని రాజ ద్రోహులుగా నిర్ణయించి.. వారే మహారాజు హత్యకు కారకులని ప్రతాప్‌కు చెబుతాడు ప్రచండుడు. అతని మాటలు నమ్మిన ప్రతాప్ వారందరికీ మరణశిక్ష విధిస్తాడు. అలా మరణించిన వారిలో ప్రమీల అన్న ఉంటాడు. ప్రమీల సహా ఆ వర్గం వారంతా -యువరాజును అంతం చేయాలని శపథం చేస్తారు. మహారాణి (కన్నాంబ) కుమారుడిని తెలివిగా ప్రవర్తించమని చెబుతూ -ప్రచండుడే ఈ కుట్రకు కారణమని, అతనితో జాగరూకతతో మెలగుతూ ప్రజల్లో ఒకడిగా ప్రవర్తించమని చెబుతుంది. తన భవనానికివున్న రహస్య ద్వారం సంగతి ప్రతాప్‌కు చెబుతుంది. దానిద్వారా మారువేషంలో పరదేశిగా, నల్ల త్రాచుగా వేషాలు మారుస్తూ.. ప్రమీల స్నేహం, ప్రేమ, విప్లవ నాయికల నమ్మకం పొందుతాడు. తనను దెబ్బతీయాలని చూసిన శూరసేనుని అంతం చేయించి, చివరకు పినతండ్రి కుట్రను భగ్నంచేసి.. అతనితో తలపడి కత్తియుద్ధంలో అతన్ని అంతం చేయటం, ప్రమీల అపార్థాలు తొలగించి ఆమెను చేపట్టి గాంధార సిహాసనాన్ని అధిష్టించటంతో చిత్రం శుభంగా ముగుస్తుంది. చిత్రంలో వంగర, అల్లు రామలింగయ్య, శివరావ్, బొడ్డపాటి, డా శివరామకృష్ణయ్య మొదలగువారు నటించారు.
మహారాజును అంతం చేసి మరొకరు సింహాసనం అధిష్టించాలని అనుకోవటం పలు జానపద చిత్రాలకు ప్రధాన కథావస్తవు. ఈ అంశం ఆధారంగా ప్రముఖ ఇంగ్లీషు నాటక రచయిత రాసిన ‘హేమ్లెట్’ ఆధారంగా ప్రముఖ తమిళ రచయిత, ముఖ్యమంత్రి బాధ్యతలు నిర్వర్తించిన ఎం కరుణానిధి ఒక కథను రాశారు. దీని ఆధారంగా 1957లో తమిళ చిత్రం ‘పుదుమై పితమ్’ రూపొందింది. టిఆర్ రామన్న, ఎంజిఆర్, బిఎస్ సరోజ, టిఆర్ రాజకుమారి నటించారు. ఆ చిత్రం విజయం సాధించింది. వాహినీ భాగస్తులు బిఎన్ రెడ్డికి -‘బంగారుపాప’ చిత్రం అంతగా ఆర్థిక విజయం సాధించలేదు కనుక ఈసారి ఓ జానపద చిత్రం నిర్మిస్తే బాగుంటుందని సూచన చేశారు. ఆ సూచన మేరకు ‘పుదుమై పితమ్’ చిత్రానికి మరికొన్ని మార్పులుచేసి, పాలగుమ్మి పద్మరాజు, డివి నరసరాజు, బిఎస్ రామయ్య చక్కని స్క్రీన్ ప్లే సిద్ధం చేశారు. తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి చిత్ర నిర్మాణం చేపట్టారు. తమిళ చిత్రంలో చిత్తూరు నాగయ్య, ఎస్‌వి సహస్రనామం, ఎస్‌ఎస్ బాలన్ కూడా నటించారు.
చిత్ర ప్రారంభంలో దీప నృత్యం వీక్షిస్తున్న మహారాజు హత్యకు గురై, రాజ కిరీటం మెట్లనుంచి దొర్లి కిందపడుతుండగా.. దానిపై టైటిల్స్ వేసి ఒక వొరవడిలో ప్రత్యేకత చూపించారు దర్శకుడు బిఎన్ రెడ్డి. యువరాజు తనపై దాడిచేసిన వారిని ఎదుర్కొని గాయపడి స్పృహ తప్పినపుడు ఓ పల్లె యువతి ప్రమీల అతన్ని సేద దీరుస్తూ -ఏడనున్నాడో ఎక్కడున్నాడో పాటను పెట్టి తన దర్శకత్వ ప్రావీణ్యాన్ని చూపించారు. రాజధానికి చేరిన యువరాజు -మహారాజు హత్యకు కారణమైన కత్తి, తనను అంతం చేసేందుకు ప్రయోగించిన కత్తి ఒకటేనని గ్రహించి.. ప్రచండుని మాటలు నమ్మి రాజద్రోహులుగా నిర్ణయింపబడిన వారిపై విచారణ లేకుండా అంతం చేయటం; తోటలో కంచుకి ద్వారా పిన తండ్రే తన తండ్రి హత్యకు కారకుడని గ్రహించి అతనిపై దాడికి ఆవేశంతో సిద్ధపడటం; తల్లి వారింపు, ప్రజాభిమానం పొందటానికి కోటనుంచి బయటకు వెళ్లే రహస్య మార్గం చూపించటం; ఆ సమయంలో మహారాణి ఇష్టసఖి ప్రక్కనుండటం, అదే చివర్లో మహారాణి క్షేమానికి సాయపడటం; విప్లవకారులు సంఖ్య తక్కువ కావటంవల్ల.. వారు రాజ సైనికులను తెలివిగా బోల్తాకొట్టించి తమవారిని విడుదల చేయించుకోవటం; తెలివిగా ప్రవర్తించాలని భజరంగుడు, ఆచార్య సైన్యంలో పాట పాడుతూ విప్లవకారులను బంధింప ప్రయత్నించటం, వారి భంగపాటు; ప్రమీలను, ఆమె అనుచరులను ప్రతాప్ నల్ల త్రాచు వేషంలో రక్షించటం; ప్రతాప్‌ను సింహాసనమధిష్టింప చేసిన ప్రచండుడు, అతను తాగే పానీయంలో విషం కలపటం, దాన్ని ప్రతాప్ తెలివిగా తప్పించటం; పిచ్చివానిగా పాట, నటన.. పద్మనాభం, గుమ్మడిల రియాక్షన్; చివర నల్ల త్రాచు మరణించాడన్న సమాచారంతో మహారాణి తల్లడిల్లటం, సైనిక వేషంలో ప్రతాప్ ఆమెను ఊరడించి ప్రచండుని చేతికి చిక్కటం; జలదిగ్బంధంలో వున్న ప్రతాప్‌ను తెలివిగా ప్రమీల రక్షించటం; అంతకు ముందొకసారి, క్లైమాక్స్‌లో మరోసారి యన్టీ రామారావు, గుమ్మడితో కత్తియుద్ధ పోరాటాలు.. ఇలా దర్శకులు బిఎన్ రెడ్డి సన్నివేశాలను ఎంతో విపులంగా పట్టుతో అర్ధవంతంగా తీర్చిదిద్దారు. రాజమాతగా కన్నాంబ ఆవేశపూరితమైన, సందర్భోచితమైన సంభాషణలను, యుక్తిని, చివర్లో బాధను అద్భుతంగా నటనలో చూపారు. యన్టీఆర్ ప్రతాపునిగా పాత్రోచితమైన అన్ని అంశాలను నటనతో పరిపుష్టి కలిగిస్తే, ఆయనకు తోడుగా, నాయికగా రాజసులోచన మెప్పించింది. ఇక సాత్విక పాత్రలకు పెట్టిన పేరైన గుమ్మడి ప్రచండుడి పాత్రలో దుష్టునిగా అద్భుతమైన నటన చూపారు. అంతేకాక యన్టీఆర్ గురించి గమ్మడి తన ఆత్మకథలో -రామారావు పోరాటాల్లో నిజమైన కత్తి, డాలు ఉపయోగించేవారు. ఆవేశంతో పోరాడేవారు. నేను ఏమాత్రం ఏమరుపాటుగావున్నా తల ఎగిరిపోయేది. అది తలచుకుంటే ఒళ్లు జలదరిస్తుంది’ అని రాసుకున్నారు.
రాజసులోచన, యన్టీఆర్‌లపై గీతం -ఏడనున్నాడో ఎక్కడున్నాడో (గానం: పి.లీల). మరోసారి యన్టీఆర్‌పై బిట్ -చూడ చక్కని చుక్కల డేండు (గానం: ఘంటసాల, రచన: కొసరాజు). సైనికుల బృందంపై కొసరాజు రాసిన గీతం -కాంతపై ఆశ కనకమ్ముపై (గానం: మల్లిక్ బృందం). మరో కొసరాజు గీతం -రారండోయి విద్రోహుల్లారా (గానం: మాధవపెద్ది బృందం). పద్మనాభం, వంగర, సైన్యంపై చిత్రీకరణ. కొసరాజు రాసిన మరో బృందగీతం -‘ఏటి ఒడ్డున మా ఊరు’. జిక్కి బృందం గానం చేసిన పాటను రాజసులోచన తదితరులపై చిత్రీకరించారు. ప్రతాప్ పట్ట్భాషేక సమయంలో రాత్రిపూట సాగే నృత్య గీతం -జయ జయ మనోజ్ఞ మంగళమూర్తి (గానం: పి సుశీల). -పరమశివుడు దొంగరా.. తకిట తకధిమి అంటూ సాగే మరో కొసరాజు గీతంలో యన్టీఆర్ మాటలు, ఘంటసాల గానం ఆకట్టుకుంటాయి. రాజసులోచన బృందం జిప్సీల వేషంలో చేసిన నృత్యగీతం -్ఠంగన్ థింగనటిల్లా’ (గానం: జిక్కి, రచన: రజనీకాంతారావు). ఈ చిత్రంలోని మరో రెండు రసరమ్యమైన గీతాలు రాజమకుటం చిత్రాన్ని చిరస్మరణీయం చేశాయి. కలువలు, చంద్రుడిని చూపుతూ, యన్టీఆర్ -రాజసులోచన బంధానికి అర్థం చెబుతూ సాగే గీతం -ఊరేది పేరేది ఓ చందమామా (రచన: రజనీకాంతరావు, గానం: పి లీల, ఘంటసాల). తొలుత మంద్రస్థాయిలో మొదలై, రాగ విన్యాసంతో పైస్థాయికి సాగుతూ ఆకట్టుకుంటుంది. వీరిరువురిపై మరోగీతం.. కిటికిలోంచి చంద్రుని, ప్రక్కన సరోవరం, చక్కని ప్రకృతిని చూపుతుంటే.. యన్టీఆర్‌ను ఒడిలో సేద తీర్చుతూ రాజసులోచన పాడుతున్నట్టు అలరించేలా చిత్రీకరించిన పాట -సడిసేయకే గాలి/ సడిసేయబోకే (గానం: పి లీల, రచన: దేవులపల్లి కృష్ణశాస్ర్తీ). రచనలోని లాలిత్యం, సన్నివేశంలో ఆర్ద్రత, ఆహ్లాదం, పాటను నిత్యనూతనంగా నిలిపి, నేటికీ శ్రోతలను ఈ రెండు గీతాలు సమ్మోహనం చేయటం ఆనందదాయక విషయం.
రాజమకుటం -బిఎన్ రెడ్డి సినీ జీవితంలో తెలుగు, తమిళ భాషల్లో నిర్మించిన ఏకైక చిత్రం. రాజనాల, పద్మనాభం, రాజసులోచన, బిఎన్ రెడ్డి దర్శకత్వంలో తొలిసారిగా నటించిన చిత్రం కూడా ఇదే కావటం విశేషం.

-సీవీఆర్ మాణిక్యేశ్వరి