ఫోకస్

విలువలకు తిలోదకాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చట్టసభల్లో విలువలకు తిలోదకాలిస్తున్నారు. అధికార పక్షాలు అధికార మదంతో వ్యవహారిస్తున్నాయి. ప్రతిపక్షాలంటే గౌరవం లేదు. వారి సలహాలు, సూచనలు తీసుకోవడం లేదు. మేము చెప్పిందే వినాలని, లేకపోతే వారం, పది రోజుల పాటు లేదా సమావేశాలు ముగిసేంత వరకూ సభ నుంచి విపక్షాలను సస్పెండ్ చేయడం జరుగుతున్నది. నేను 1985లో ఎమ్మెల్యేగా అడుగు పెట్టాను. నాడు ఎన్.టి.రామారావు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ప్రతిపక్షాలను ఎంతో గౌరవించేవారు. ప్రతిపక్షాల సలహాలు, సూచనలు తీసుకున్నారు. రాజకీయాల్లో విలువలు ఉండేవి. అసెంబ్లీలో చర్చ ఎంతో హుందాగా జరిగేది. సభలో సభ్యులు ఎంతో ఆసక్తిగా చర్చలో పాల్గొనేవారు. ఇప్పుడు పరిస్థితులు మారాయి. సభ్యులకు ఓపిక నశించింది. ప్రతిపక్షాలంటే చిన్నచూపు ఏర్పడింది. వారూ మనలాగే ప్రజల నుంచి ఎన్నికై చట్టసభకు వచ్చారన్న భావన ఉండడం లేదు. మేము చెప్పింది వింటే వినండి, ఉంటే ఉండండి లేదంటే వెళ్ళండి అనే రకంగా మాట్లాడుతున్నారు. ప్రశ్నోత్తరాల సమయం నుంచి మొదలుకుని పద్దుల ఆమోదం, ద్రవ్య వినిమయ బిల్లు ఆమోదం వరకు అజెండా గురించి తెలుసుకుందామన్న ఆలోచన కొత్తగా సభకు ఎన్నికైన సభ్యులకు ఉండడం లేదు. ప్రొరోగ్ వంటి అంశాల గురించి చాలా మందికి అసలే తెలియదు. ఎంత సేపూ వాదులాడుకోవడడం, పరస్పరం నిందించుకోవడం, మీడియాలో కనిపించడం అనేవి ప్రధాన అజెండాగా పెట్టుకున్నారు. కొన్ని సందర్భాల్లో యుద్ధ వాతావరణం తలెత్తుతున్నది. నువ్వెంత అంటే నువ్వెంత అనే సవాళ్ళు విసురుకునేంత వరకూ పరిస్థితులు వెళ్ళాయి. సభాధ్యక్ష స్థానంలో ఉన్న గౌరవప్రదమైన స్పీకర్‌కూ పక్షపాతంగా వ్యవహారిస్తున్నట్లు ఆపాదిస్తున్నారు. ప్రజా సమస్యలపై చర్చించి వాటికి పరిష్కార మార్గాలు చూపించాలన్న తపన పాలక, ప్రతిపక్షాల వైపు పోయింది. ప్రతిపక్షాలు కూడా మేమేమీ తక్కువ కాదన్నట్లు రెచ్చిపోతున్నాయి. సభలో విజృంభించకపోతే ప్రజల్లో చులకన అవుతామని, లేదా మన ఎమ్మెల్యే బాగా పోరాటం చేయడం లేదన్న భావన ఎక్కడ ఏర్పడుతుందోనన్న అనుమానమో తెలియదు కానీ ప్రభుత్వం ఏది చెబితే, దానికి వ్యతిరేకించడమే పనిగా పెట్టుకుంటున్నాయి. ఇది మంచి సంప్రదాయం కాదు. పార్టీల వ్యవహార శైలిలో మార్పు రావాలి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్పూర్తితో పని చేయాలి. చట్ట సభకు ఎన్నికైన ప్రజా ప్రతినిధి సభా సంప్రదాయాలకు బద్ధుడై నడుచుకోవాలి. అంతేకాదు ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తూ ప్రభుత్వానికి సహకరించాలి. ముఖ్యంగా రాజకీయ పార్టీలు కూడా ఎన్నికల సమయంలో అభ్యర్థుల ఎంపిక విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ప్రజా సమస్యలపై అవగాహన కలిగి ఉండి, అంకితమైన భావంతో పని చేసే వారికి టిక్కెట్లు ఇవ్వాలి. అంతేకాని ఎన్నికల ముందు బాగా డబ్బు ఖర్చు చేయగలిగే వ్యక్తిని అభ్యర్థిగా ఎంపిక చేసి బరిలోకి దించడం వల్ల ఎన్నికైన తర్వాత ఇటువంటి సమస్యలు ఎదురవుతున్నాయి. కాబట్టి రాజకీయాల్లో నైతిక విలువలు, చట్ట సభల్లో గౌరవ మర్యాదలు, సంప్రదాయాలను కాపాడేందుకు అన్ని పార్టీలూ సహకరించాలి.

- నాగం జనార్దన్ రెడ్డి మాజీ మంత్రి, బచావో తెలంగాణ మిషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు,