ఫోకస్

ఏం జరుగుతోంది?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేశ ప్రజల గురించి ఆలోచించండి... చట్ట సభలు జరుగుతున్న తీరు పట్ల ప్రజలు ఆవేదనకు గురవుతున్నారు... ప్రజలకు తప్పుడు సంకేతాలను చట్టసభల ద్వారా పంపుతున్నాం... ఈ ప్రవర్తన ఎంతమాత్రం మంచిది కాదు... లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ తాజాగా జరుగుతున్న పార్లమెంటు శీతాకాల సమావేశాల సందర్భంగా సభ్యులనుద్దేశించి చేసిన వ్యాఖ్యలివి. లోక్‌సభ, రాజ్యసభలకే ఈ పరిస్థితి పరిమితం కాలేదు. రాష్ట్రాల్లోని శాసనసభలు, శాసనమండలి సభల్లో సైతం పరిస్థితి ‘లక్ష్మణరేఖ’ను దాటుతోంది. ఒకప్పుడు వౌననిరసన అతిపెద్ద అంశంగా పరిగణించగా, నేడు మైకులు విరగ్గొట్టి మిగిలిన సభ్యులపైకి విసిరే పరిస్థితి వచ్చింది. ప్రజాసమస్యలపై తమ వైఖరి ఏమిటనే ఆలోచన వదిలి ఏ సమస్యపైనైనా రాజకీయాలే ప్రధానం అనే రీతిలోకి మారిపోయింది. దాంతో అధికార పక్షం, విపక్షం చెరోమార్గాన్ని తీసుకుంటున్నాయి. అధికార పక్షం ఏం చేసినా వ్యతిరేకించడం విపక్షం పనిగా తయారైపోయింది. విపక్షం ఏం చెప్పినా వినాల్సిన పనే్లదన్నట్టు అధికారపక్షాలు వ్యవహరిస్తున్నాయి. తమకున్న బలాబలాలను ప్రదర్శించుకుంటూ బాహాబాహీకి దిగడంతో అతిముఖ్యమైన చట్టాలు, చట్టసవరణలు సభ వరకు సైతం రాకుండా పోతున్నాయి. దశాబ్దం క్రితం ప్రతిపాదించిన ముసాయిదాలు సైతం సభ ఆమోదం పొందలేకపోతున్నాయి. ఈ నష్టం ఎవరికి? ఎందుకు జరుగుతోంది? ఎంతకాలం ఇలా జరుగుతుంది? అనే ప్రశ్నలు ప్రతి ఒక్కరూ వేసుకుంటున్నారు. సభ ప్రారంభమైనా సభ్యులు తమ నివాసాల వద్దనే ఉండే పరిస్థితి. అదేమిటి అని అడిగితే ఎలాగూ ఐదు నిమిషాల్లో వాయిదాపడుతుంది కదా... తిరిగి సమావేశమైన తర్వాత వెళ్లొచ్చు... అనే నిర్లిప్తత ఎందుకు వచ్చింది. అలా అని ఎన్నికలపై నిరాసక్తతా అంటే అదీ లేదు... ఎన్నికలపై ఆసక్తిగానే ఉన్నారు. కోట్లు వ్యయం చేసి పోటీ పడీ మరీ గెలిచి చట్టసభలకు చేరుకుంటున్నారు.
విద్య, రాజకీయ మేథ, క్రమశిక్షణ, ప్రజానురాగం, దేశభక్తి లేని వ్యక్తులు ఎక్కువ శాతం రావడం వల్ల చట్టసభలు నాలుగు రోడ్ల కూడలిగా మారిపోతున్నాయి. ఫలితంగా ప్రజా సమస్యలను కాదని, తాము చెప్పినట్టే సభ నడవాలని ఒకరు, తమ విషయ ప్రతిపాదనలే చర్చించాలని మరొకరు, తాము చెప్పినట్టే మంత్రివర్గం స్పందించాలని ఇంకొకరు, తమ తీర్మానాలే సభ ఆమోదించాలంటూ వేరొకరు ఇలా పట్టుబట్టి వేదికను చుట్టుముట్టి ప్రసంగాలను అడ్డుకుంటున్నారు. స్పీకర్ మాటలను వినేది లేదు, ఆయన ఆదేశాలను ఖాతరు చేసేది లేదు, సభను ఎట్టిపరిస్థితుల్లో జరగనిచ్చేది లేదు అంటూ భీష్మించుకుని కూర్చుంటున్నారు. సభ జరగకపోవడం వల్ల జరిగేదేమిటి... కోట్లాది రూపాయల ప్రజాధనం వృథా అవుతోంది. ప్రజా ప్రతినిధులు తమపై తమకు గౌరవ భావం లేనప్పుడు అరాచకత్వానికి ఎర్రతివాచీ పరిచినట్టే. నేటి విచ్చలవిడి అవినీతి, అక్రమాలు, ప్రలోభాలు, అంతులేని స్వార్థకాంక్ష ఇటువంటి పరిస్థితుల్లోనే మోసులెత్తి ఎదిగి వటవృక్షాలయ్యాయి. చట్టసభల్లో కొన్ని రోజుల పాటు కూర్చుని ప్రజాసమస్యలను చర్చించలేని వారు పాలకులు ఎలా అవుతారని ప్రజలు సంశయించే రోజు వచ్చింది. ప్రభుత్వంలో ఉన్నంత మాత్రాన తమ పార్టీ వారికి సుగుణాల మాల వేయాల్సిందేనా అనేది అధికారపక్షం ఆలోచించుకోవాలి. ఆ పార్టీ ఈ పార్టీ అనడానికి లేదు, ఒకపుడు అధికారపక్షం నేడు విపక్షం, నేటి విపక్షం ఒకనాటి అధికారపక్షమే. అధికారంలో ఉన్నవారు విపక్షంలో ఉన్నపుడు కూడా పరిస్థితులు ఇంచుమించు ఇలాగే ఉన్నాయనేది చరిత్ర. ఎవరు ప్రభుత్వంలో ఉన్నా విపక్షం ఇలా కాలధ్వంసం చేయడం, అరువులు, కేకలు, పోడియంవైపు పరుగులు తీయడం, అసభ్య పద వినియోగం, ఏకవచన ప్రయోగాలు, అర్థంలేని వాకౌట్లు, ఆగ్రహావేశాలు సామాన్య ఓటర్లకు రుచించడం లేదు. ప్రభుత్వం మాది కాదుకనుక సర్వం భ్రష్టుపట్టినా మా ప్రమేయం ఏమీ లేదు, ఎంతగా పతనమైతే అంత అపకీర్తి అధికారపక్షానికే కదా అనే వైఖరి విపక్షంలో కనిపిస్తోంది. ధర్మాన్ని రక్షిస్తే అది నిన్ను రక్షిస్తుంది అనే సూక్తి ఎవరికీ పట్టడం లేదు. అధికారంలో ఉన్నవారు కూడా చట్టసభ అంటే అదేదో తమ సొంత వ్యవహారమైనన్నట్టు వ్యవహరించడం కూడా ఈ పరిస్థితికి మరో కారణం. ఎక్కువగా ప్రతిపక్షాల భావాలు, వాదనలు, సవరణలు, ప్రత్యామ్నాయాలు, విమర్శలు, ఆక్షేపణలను అర్థం చేసుకోవాలి, చట్ట సభ అంటే అతిపవిత్రమైన రాజ్యాంగ వ్యవస్థలుగా, అతి గౌరవమైన ప్రాంగణాలుగా అర్థం కావాలి. ఇంగ్లాండ్ చట్టసభ (హౌస్ ఆఫ్ కామన్స్) స్థలాన్ని భూమిపై ఉన్న స్వర్గ్భాగంగా ప్రఖ్యాత ఆంగ్లకవి జాన్ మిల్టన్ అభివర్ణించాడు. స్వర్గ సంప్రదాయాలైన స్వేచ్ఛ, స్వాతంత్య్రం, ప్రజాహృదయానురక్తిని ఈ సభలు కల్పించాలి.
హ్రస్వదృష్టితో, నిరర్థక వీరావేశాలతో, విధ్వంస రచనలతో, కుత్సిత రాజకీయాలతో, సంకుచిత భావ ప్రేలాపనలతో సభలు జరిగితే భవిష్యత్ ప్రశ్నార్థకమవుతుంది. చట్ట సభలు అత్యంత జాగరూకతతో బాధ్యతాయుతంగా తమ పని విధానాన్ని మెరుగుపరుచుకుంటూ సమాజ ప్రగతికి బాటలు వేస్తేనే ప్రజాస్వామ్య వ్యవస్థకు అర్థం-పరమార్థం ఉంటుంది. వైవిధ్యభరితమైన మన దేశంలో నిజమైన ప్రజాస్వామ్య వ్యవస్థ వేళ్లూనుకోవడానికి సుదీర్ఘకాలం పట్టవచ్చు. అలాగే ప్రస్తుత రాజ్యాంగానికి వర్గ స్వభావం ఉంటుంది. తదనుగుణంగా అనేక పరిమితులు ఉన్నాయి. ఇందులో ఇమిడి ఉన్న ప్రజాస్వామిక భావనలను పరిరక్షించుకుంటూ, వాటికి కార్యరూపం సముపార్జించుకుంటూ, మెరుగైన రాజ్యవ్యవస్థకోసం అడుగు ముందుకు వేయాలి, చట్టసభలు పట్టాలు తప్పి నడకసాగిస్తే ప్రజాస్వామ్య వ్యవస్థకే ప్రమాదం. ఆర్థిక నేరస్థులు, వ్యవస్థీకృత నేరాల చరిత్ర ఉన్న వారు చట్టసభల్లోకి ప్రవేశించకుండా సమగ్రమైన, పటిష్ఠమైన ఎన్నికల సంస్కరణలు తక్షణం అవసరం. అప్పుడే చట్టసభల ఔన్నత్యాన్ని పునరుద్ధరించడం సాధ్యమవుతుందనేది ప్రజల భావన. ఈ పరిస్థితులపై మన నేతల మనోభావాలే ఈ వారం ఫోకస్.