ఫోకస్

చట్టసభల లక్ష్యం నెరవేరేనా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చట్టసభలు ప్రజాసమస్యలను పరిష్కరించే కేంద్రాలుగాకంటే రాజకీయ పార్టీల బాహాబాహీకి వేదికగా మారాయి. ‘దురదృష్టవశాత్తు కాలంతోపాటు చట్టసభల పనితీరులో విలువలు పతనమవుతున్నాయని, దీనిని నియంత్రించకపోతే భవిష్యత్‌లో సభలు తమ ప్రాధాన్యం కోల్పోయే ప్రమాదం ఉంది’ అని ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఒక సందర్భంలో అభిప్రాయపడ్డారు. ఈ భావన అందరిలోనూ ఉంది. గతంలో అసెంబ్లీని ఉద్దేశించి బర్త్తరఫ్ అనే మాట వాడితే కూడా సభా హక్కుల ఉల్లంఘన కిందకు వచ్చేది, కాని అసెంబ్లీని ఉద్దేశించి తీవ్రమైన వ్యాఖ్యలు చేసే వారిపై చర్యలు తీసుకునే పరిస్థితి లేకుండా పోయింది. చట్టసభలు, న్యాయవ్యవస్థ, పాలనా వ్యవస్థలు పటిష్ఠంగా ఉంటేనే ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుంది. నిబంధనలు పాటించనివారిపై చట్టరీత్యా చర్యలు తీసుకునే అవకాశం చట్టసభల్లో లేకపోవడం కూడా హద్దులు మీరిన వ్యాఖ్యానాలకు కారణమనేది అందరి అభిప్రాయం. విమర్శ రాజద్రోహం కిందకు రాదని, అధికార పక్షాన్ని విపక్షం విమర్శించినంత మాత్రాన అది నేరం కాదనే అర్థం వచ్చేలా ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు రాజకీయ పార్టీలకు పెద్ద ఊతం ఇచ్చింది. బహిరంగంగా అధికారపక్షాన్ని ఇరకాటంలో పెట్టేలా విమర్శించే హక్కు లభించినట్టు విపక్షాలు భావించినా, చట్టసభల్లో పరిస్థితి అందుకు భిన్నంగా కనిపిస్తోంది.
ప్రజల ఆకాంక్షలకు, చట్టసభల పనితీరుకు లంకె కుదరడం లేదన్నది తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న చట్టసభల తీరు స్పష్టం చేస్తోంది. సభ్యులు మరింత హుందాగా ప్రవర్తిస్తే చట్టసభలు మరింత గౌరవాన్ని పొందే వీలున్నా, చట్టాలపై చర్చలు, ప్రజాసమస్యలపై నిలదీయడాలు పక్కన పెట్టి వ్యక్తిగత అంశాలు, పరస్పర నిందారోపణలు, బలాబలాల ప్రదర్శనకు చట్టసభలను వేదికగా మార్చేస్తున్నాయి. చర్చల కన్నా వాయిదాలే ఎక్కువ అని ఇటీవల జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ రుజువు చేసింది. శాసనసభ కంటే ఎక్కువ సమయమే శాసనమండలిలో చర్చ జరిగింది. ఈ పరిస్థితి మారాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు. ప్రచారంకోసం కాకుండా ప్రజలకోసం పనిచేయాలని వివిధ రంగాలకు చెందిన మేధావులు చెబుతున్నారు. మారిన పరిస్థితులకు అనుగుణంగా అసెంబ్లీలో నైతిక నియమావళిని సవరించాలని, పోడియం వద్దకు వస్తే చాలు వారు సస్పెన్షన్‌కు గురయ్యేలా నిబంధనలు ఉండాలని చాలామంది చెబుతున్నా, ప్రజాస్వామ్య దేశంలో ఇలాంటి నిబంధనలు ప్రతిపక్షం నోరునొక్కేస్తుందని అభిప్రాయపడుతున్నారు. వాస్తవానికి చట్టసభల్లో సభ్యుల ప్రవర్తనకు సంబంధించి మార్గదర్శకాలు ఉండనే ఉన్నాయి. సమస్య అంతా వాటిని పాటించకపోవడమేననేది అందరికీ తెలిసిందే. ఈ పరిస్థితుల్లో చట్టసభల్లో విలువలపై వివిధ రంగాలకు చెందిన ప్రముఖుల సూచనలే ఈ వారం ఫోకస్.