ఫోకస్

విదేశీ విద్య.. మిథ్యేనా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విదేశీ కొలువు... లక్షల్లో వేతనాలు... సగటు భారతీయ విద్యార్థి ఆలోచిస్తున్నది ఇదే. బిటెక్ లేదా ఎంబిబిఎస్ లేదా సైన్స్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తిచేసినవారు పిజి చదువులు విదేశాల్లో చేసేందుకు ఉత్సాహం చూపుతున్నారు. ఈ కారణంగానే విదేశాలకు వెళుతున్న భారతీయ యువత సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఎక్కువ మంది ఉత్తర అమెరికా, యూరప్ దేశాలకే వెళ్తున్నారు. ఐఐఎం బెంగళూరు నిర్వహించిన ఒక అధ్యయనం ప్రకారం అమెరికా, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, జర్మనీ, ఫ్రాన్స్‌లకు ఎక్కువ మంది విద్యార్థులు వెళ్తున్నారు. స్వీడన్, డెన్మార్క్, ఇటలీ, ఐర్లాండ్ వంటి దేశాలకు ఆ తర్వాత ప్రాధాన్యం ఇస్తున్నారు. విద్యార్థులు తక్కువ ఖర్చుతో ఉన్నత విద్య ఎక్కడ దొరుకుతుందో చూసుకోవడంతోపాటు పార్ట్‌టైమ్ ఉద్యోగాలు చేసేందుకు ఎక్కడ అవకాశాలున్నాయో కూడా గమనిస్తున్నట్టు స్పష్టం అవుతోంది. ఉన్నత చదువులకోసం విదేశాలకు వెళ్లాలంటే కొన్ని పరీక్షలు రాయాల్సి ఉంటుంది. మనం వెళ్తున్న దేశం లేదా యూనివర్శిటీ ఆధారంగా ఈ పరీక్షలు మారుతుంటాయి. ఎక్కువ మంది విద్యార్థులు అమెరికా వైపు మొగ్గుచూపడం వల్ల వారు జిఆర్‌ఈ, ఐటిఎల్‌టిఎస్, ఎస్‌ఎటి, టోఫెల్ వంటివి రాయాల్సి ఉంటుంది. నాణ్యమైన విద్య, స్కాలర్‌షిప్‌లకు అవకాశం, చదువు పూర్తయిన తర్వాత ఉద్యోగ అవకాశాలు గమనించడం సహజం. అలాగే ప్రొఫైల్ చూసి యూనివర్శిటీని ఎంచుకోవాల్సి ఉంటుంది. విద్యార్థి డిగ్రీస్థాయిలో సాధించిన మార్కులు, ప్రగతి, పేపర్ ప్రజెంటేషన్, పని అనుభవం ఇవన్నీ ఉంటే మంచి ర్యాంకింగ్ ఉన్న యూనివర్శిటీలో దరఖాస్తు చేసుకోవచ్చు. ఇవన్నీ లేనపుడు మంచి ర్యాంకింగ్ ఉన్న విశ్వవిద్యాలయాల్లో సీట్లు రావడం కష్టం. దాంతో తన మార్కులకు తగ్గట్టు ఏదో ఒక యూనివర్శిటీని ఎంచుకోవాల్సి వస్తుంది. భారతీయ విద్యార్థుల కష్టాలకు కారణమవుతున్న అంశం ఇదే. విద్యార్థికి మంచి ప్రగతి నివేదికలు లేకపోవడం, అక్కడ యూనివర్శిటీకి మంచి పేరు లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బందుల్లో పడుతున్నారు.
ప్రస్తుతం ఇప్పుడు జరుగుతున్నది ఇదే. అమెరికాలో చదువుకోవాలన్న విద్యార్థుల ఆశలు అడియాసలయ్యాయి. పైచదువులకోసం అమెరికా యూనివర్శిటీలు తెలుగు విద్యార్థులను ఆహ్వానించినా, మార్గమధ్యంలోనే హోంల్యాండ్ సెక్యూరిటీ అధికారులు వీరిని అడ్డుకుని కారాగారంలో బంధించారు. విద్యార్థిలో ఆర్థిక శక్తి లేకపోవడం, విద్యాత్మక సత్తా లేకపోవడం, భాషా నైపుణ్యం కొరవడటం, ముందస్తు ప్రణాళిక లేకపోవడం, తాను వెళ్తున్న దేశం- యూనివర్శిటీ- చదువుపట్ల సమగ్రమైన అధ్యయనం చేయకపోవడం, ఇమిగ్రేషన్ అధికారులు అడిగేందుకు అవకాశం ఉన్న ప్రశ్నలపై ముందస్తు కసరత్తు చేయకపోవడం- వీటన్నింటికీతోడు నాసిరకం యూనివర్శిటీ కావడంతో భారతీయ విద్యార్థుల పరిస్థితి పెనం మీద నుండి పొయ్యలో పడ్డ చందంగా మారిపోతోంది. ఐఐటిలు, ఐఐఎంలు, సెంట్రల్ యూనివర్శిటీల్లో చదివినవారు, జాతీయ సంస్థల్లో చదివినవారు మాత్రమే వెంటనే ఉద్యోగాలు సంపాదించే పరిస్థితి మన దేశంలో ఉంది. దీంతో ఉద్యోగమే పరమావధిగా అమెరికా వెళ్తున్న యువత అక్కడ లక్షలాది రూపాయలు ఫీజులు చెల్లించే ఆర్థిక స్థితిలేక పార్ట్‌టైమ్ ఉద్యోగాలపై ఆధారపడుతున్నారు. వాస్తవానికి అమెరికా వంటి దేశాల్లో ఇమిగ్రేషన్ చట్టాల ప్రకారం ఏ లక్ష్యం మీద వెళ్తున్నారో అదే వ్యాపకంపై విదేశీయులు ఉండాల్సి ఉంటుంది. చదువుకునేందుకు వెళ్లి ఉద్యోగాలు చేయడం లేదా ఉద్యోగంకోసం వెళ్లి చదువుకోవడం, చదువుకుంటూ పార్ట్‌టైమ్ ఉద్యోగాలు చేయడం వంటి వ్యవహారాలను నిషేధించింది. ఈ అంశాలన్నింటిపైనా విద్యార్థులకు అవసరమైన శిక్షణ ఇవ్వాల్సిన సంస్థలు వాటిని పక్కనబెట్టి పాస్‌పోర్టు, వీసా చేతిలోకి వచ్చేంతవరకూ అన్ని పనులూ వారే పూర్తిచేయడంతో వాస్తవ స్థితిగతులు విద్యార్థులకు అర్థం కావడం లేదు. ఈ కారణంగానే మార్గమధ్యంలో ఇరుక్కుని నానాఅగచాట్లు పడుతున్నారు. మంచి చదువుల లక్ష్యంకన్నా, ఉద్యోగం సంపాదించడమే పరమావధిగా భారతీయ తల్లిదండ్రులు అమెరికాను బంగారుబాతులా చూస్తున్నారు. అందుకే అప్పులు చేసి మరీ తమ బిడ్డల్ని అక్కడికి పంపుతున్నారు. ఇటువంటి ఆపేక్ష ఉన్న తల్లిదండ్రులను, విద్యార్థులను గమనిస్తున్న ఏజెన్సీలు సొమ్ము చేసుకునేందుకు, విద్యార్థులను ఆకర్షించేందుకు అనేక జిమ్మిక్కులకు పాల్పడుతున్నాయి. స్వదేశంలో సీటు రాలేదా అయితే మీకు విదేశంలో సీటు గ్యారంటీ అని ప్రచారం చేస్తున్నాయి. విద్యకు ప్రభుత్వ నిధులు కుదించడం, ప్రైవేటు విద్యా సంస్థలను ప్రోత్సహించడంతో స్థానిక విద్యార్థులు వలసపోవల్సిన దయనీయ పరిస్థితి నెలకొంది. సమాజ నిర్మాణంలో యువతను భాగస్వామ్యులను చేయడంలో విద్య కీలకపాత్ర పోషిస్తుంది. అటువంటి విద్యావ్యవస్థను నిర్వీర్యం చేయడం తగని పని. అమెరికా అంటే అన్నీ చట్టబద్ధంగానే ఉంటాయనే భ్రమలు అవసరం లేదని ఇప్పుడీ యూనివర్శిటీల అంశంతో స్పష్టమైంది. అందుకే ఇలాంటి యూనివర్శిటీలను నమ్మి, మన విద్యార్థులను మోసగిస్తున్న సంస్థలపై ఉదాసీన వైఖరి ఎంతమాత్రం సరికాదన్నది అందరి వాదన. ఈ క్రమంలో విదేశీ చదువులు, అమెరికాలో చదువుకునేందుకు వెళ్తున్నవారిని విమానంలోంచి వెనక్కు పంపించిన ఘటనలపై ప్రముఖుల విశే్లషణలే ఈ వారం ఫోకస్.
* * *