ఫోకస్

అరచేతిలో స్వర్గం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహిళా సాధికారిత, అభివృద్ధి. ఇవన్నీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెబుతున్న అందమైన అబద్ధాలు మాత్రమే. ఆకాశంలో సగమైన మహిళాలోకానికి అరచేతిలో స్వర్గం చూపిస్తూ ప్రభుత్వాలు పబ్బం గడుపుకొంటున్నాయి. మహిళలు సాధికారిత సాధించి, అభివృద్ధి పథంలో నడవాలంటే చట్టసభల్లో వారికి సముచిత స్థానం ఉండాలి. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లు దశాబ్దాలుగా పార్లమెంట్‌లో మూలుగుతోంది. పార్లమెంటుకు 180 మంది మహిళలు ఎన్నికైతే వారి అభ్యున్నతికి ఎటువంటి చట్టాలు తీసుకురావాలి, మహిళల రక్షణకు ఏమేం చర్యలు చేపట్టాలి వంటి అంశాలపై గళమెత్తేందుకు వీలవుతుంది. మహిళలపై అత్యాచారాలను అణచివేయాలన్న లక్ష్యంతో 2012లో నిర్భయ చట్టాన్ని రూపొందించారు. చట్టం ఏర్పాటుచేసిన తొలి నాళ్లలో రూ.100 కోట్ల నిధులు అప్పటి కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. నాటినుంచి నేటి వరకూ నిర్భయ చట్టంలో బాధితులను ఆదుకునేందుకు కనీసం ఒక్క రూపాయి కూడా కేటాయించలేదంటే మహిళల పట్ల ఈ ప్రభుత్వాలకు ఉన్న చిత్తశుద్ధి విశదమవుతోంది. ప్రధాని మోదీ గొప్పగా ప్రకటించుకున్న ‘బేటీ బచావ్’, ‘బేటీ పడావ్’ వంటి పథకానికి నిధులు లేని పరిస్థితులున్నాయి. ఇక రాష్ట్రాల్లోనూ మహిళా సాధికారిత, అభివృద్ధిలో చెప్పుకునే పురోగతి ఏమీ లేదు. మహిళలకు పెద్దపీట వేస్తున్నామంటూ గొప్పలు చెప్పుకుంటున్న తెలుగుదేశం ప్రభుత్వం అధికారం చేపట్టిన తరువాత నేషనల్ క్రైం బ్యూరో రికార్డుల ప్రకారం మహిళలపై దాడులు, అత్యాచారాలు, హత్యల్లో రాష్ట్రం రికార్డులు సృష్టిస్తోంది. అమ్మాయిల కిడ్నాప్‌లలో అగ్రస్థానం, అమ్మాయిల అక్రమ రవాణాలో రెండో స్థానం, అత్యాచారాల్లో 12వ స్థానం సాధించి రాష్ట్రం తన ఘనతను చాటుకుంటోంది. గృహహింస, వరకట్న కేసుల్లో నిందితులు తప్పించుకునేలా చట్టాలను సవరిస్తున్నారు. అత్యాచారం, హత్య తదితర కేసుల్లో కూడా మహిళలకు న్యాయం జరిగేలా చట్టాలను పటిష్ట పరిచే చర్యలు శూన్యం. స్ర్తిని ఆటవస్తువుగా, వ్యాపార వస్తువుగా చూసే సంప్రదాయానికి రాష్ట్ర ప్రభుత్వం కొత్త నిర్వచనం చెబుతోంది. అందాల పోటీల నిర్వహణ, నైట్‌క్లబ్‌లు లేకపోవడంవల్ల రాష్ట్రానికి అంతర్జాతీయ స్థాయి కంపెనీలు రావట్లేదంటూ ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు ప్రకటించడం చూస్తే భారతీయ మహిళల సంప్రదాయాలకు మనం ఇస్తున్న విలువ ఏమిటో అర్థం అవుతుంది. ఇక శారీరక శ్రమను నమ్ముకుని జీవించే మహిళకు కనీసం రక్షణ లేని పరిస్థితులు నెలకొన్నాయి. అంగన్‌వాడీ, ఆశావర్కర్లకు కనీస వేతనాల్లేవు. శ్రమ దోపిడీకి పూర్తి నిర్వచనంగా మహిళను పేర్కొనే పరిస్థితి ఉంది. ప్రైవేటు సంస్థలు, వ్యక్తులకు ఎర్రతివాచీ పరిచే ప్రభుత్వాలు మహిళల రక్షణ, భద్రతకు కఠిన చట్టాలు తీసుకురావాలి, ఉన్న చట్టాలకు మరింత పదును పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
- బలివాడ ప్రభావతి ఐద్వా ఏపీ అధ్యక్షురాలు