ఫోకస్

రెండు దేశాలకూ చేటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సరిహద్దుల్లో నిత్యం ఉద్రిక్త వాతావరణం నెలకొనడం భారత్, పాకిస్తాన్ రెండు దేశాలకు మంచిది కాదు. ఒకనాడు కలిసి ఉన్న ప్రాంతాలే విడిపోయి నేడు రెండు దేశాలుగా ఉంటున్నప్పటికీ అందరి మూలాలు ఒక్క దగ్గరే అనే విషయం గుర్తించాలి. పాలకుల తీరుతో ప్రజలు బాధపడాల్సి వస్తోంది. ఉద్రిక్త వాతావరణం కారణంగా రక్షణ బడ్జెట్ ఇరు దేశాల్లో వేల కోట్లను దాటి లక్షల కోట్లకు చేరుకుంటోంది. ఇది ఆహ్వానించదగిన పరిణామం కాదు. ఈ బడ్జెట్‌తో దేశ ప్రజలకోసం ఎన్నో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టవచ్చు. ఉద్రిక్తతల విషయంలో భారతదేశం కొంచెం సంయమనంగానే ఉంటున్నప్పటికీ పాకిస్తాన్ రెచ్చగొట్టే ధోరణిని విడనాడకపోవడం విచారకరం. ఇటీవల అక్కడ జైలులో ఉన్న జాదవ్‌ను అతని తల్లి, భార్య కలిసేందుకు పాకిస్తాన్ అనుమతినివ్వడం సంతోషకరమైనప్పటికీ అక్కడ వారిద్దరి పట్ల ప్రవర్తించిన తీరు దుర్మార్గం. బొట్టు, తాళి, మెట్టెలను తీసివేయించడం ద్వారా మొత్తం భారతదేశ మహిళలందరినీ పాకిస్తాన్ అవమానించినట్లేనని భావించాలి. ప్రపంచ దేశాలు సైతం ఈ సంఘటనను తప్పుబట్టడం గమనార్హం. సరిహద్దుల్లో నిత్యం ఏదో ఒకచోట కాల్పులు జరుగుతుండడం నిత్యకృత్యమైంది. ఇరువైపుల సైనికులు మరణిస్తున్నారు. వారి కుటుంబాలు ఎంత బాధ పడుతున్నాయో అర్థం చేసుకోవాలి. ఇరుదేశాల నేతలు పాలనా దక్షత కలిగిన వారైనప్పటికీ సరిహద్దు వివాదాల్లో సమస్యలను పరిష్కరించుకోలేక పోతున్నారు. అన్నదమ్ముల్లా విడిపోయి బద్ధ శత్రువులుగా మారి కొట్లాడుకుంటుండడం బాధాకరం. ఆక్రమిత కాశ్మీర్ మనదే అయినప్పటికీ ప్రస్తుతం అది పాకిస్తాన్ దురాక్రమణలో ఉంది. దీనికి శాశ్వత పరిష్కారం కనుగొనాల్సిన అవసరం ఉంది. కాశ్మీర్‌లో నిత్యం అల్లర్లు జరుగుతుండడానికి కారణం పాకిస్తాన్‌లోని కొన్ని ఉగ్రవాద సంస్థలేననేది వాస్తవం. అటువంటి సంస్థలపై పాకిస్థాన్ పాలకులు చర్యలు తీసుకోవడం ద్వారా భారత్‌తో సాన్నిహిత్యం పెంచుకోవాలనేది భారతీయుల అభిలాష. దక్షిణాసియా దేశాలన్నీ సోదరభావంతో ఉంటేనే అన్ని దేశాల్లో అభివృద్ధి కనపడుతుంది. భారత్, పాకిస్తాన్ దేశాలకు చెందిన ఎందరో ఉన్నత విద్యావంతులు, మేధావులు ప్రస్తుతం అమెరికాలో ఉన్నారు. అటువంటి వారి సలహాలను కూడా తీసుకుంటూ ఇరుదేశాలు దగ్గరయ్యేందుకు ప్రయత్నించాలి. విడిపోయినప్పటికీ సోదరభావంతో మెలగడం ద్వారా ప్రపంచ దేశాలకు ఆదర్శంగా రెండు దేశాలు నిలవాలి.
- మేకపాటి రాజమోహన్‌రెడ్డి నెల్లూరు ఎంపీ, లోక్‌సభలో వైసీపీ ఫ్లోర్‌లీడర్