కరీంనగర్

గ్రామాలలో అన్ని విధాల అభివృద్ధి చేస్తా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కమలాపూర్, ఫిబ్రవరి 14: హుజూరాబాద్ నియోజకవర్గంలోని అన్ని గ్రామాలను అన్ని విధాలా అభివృద్ధి చేస్తానని రాష్ట్ర ఆర్థిక, పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. ఆదివారం మండలంలోని పలు గ్రామాలలో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, కార్యాలయాలకు ప్రారంభోత్సవాలను మంత్రి చేతుల మీదుగా ప్రారంభించారు. అనంతరం మండలంలోని పంగిడిపెల్లిలో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి ఈటల మాట్లాడుతూ 57 ఏళ్ల నుండి పార్టీల పరంగా కొట్టుకున్నామని, ఇప్పుడు వాటిని విడిచి అభివృద్ధికి అందరు పాటుపడాలన్నారు. వచ్చే ఉగాది నుండి వ్యవసాయానికి తొమ్మిది గంటల కరెంట్‌ను అందిస్తామని, అదే వచ్చే మూడేళ్లలో వ్యవసాయ పంటలకు 24 గంటల కరెంట్‌ను అందేలా కృషి చేస్తామన్నారు. అనంతరం గ్రామంలోని అంగన్‌వాడీ నూతన భవనాన్ని ప్రారంభించి, సిసి, బిటి రోడ్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం మండల కేంద్రంలోని వ్యవసాయ అధికారి కార్యాలయం, గ్రంథాలయం, ఎస్సీ హాస్టల్ వసతి గృహాలను ప్రారంభించారు. అలాగే మండలంలోని ఉప్పల్, కన్నూరు, కానిపర్తి, శంబునిపల్లి, గూడూరు, మర్రిపెల్లిగూడెం గ్రామాలలోని పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసి మిషన్ కాకతీయ పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యుత్ ఎస్‌ఇ రంగారావు, కమలాపూర్ ఎంపిపి ల్యాండిగ లక్ష్మణ్‌రావు, జడ్పీటిసి నవీన్ కుమార్, పలువురు జిల్లా, మండల అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

రాజన్న ఆలయంలో భక్తజన సందోహం
* సుదూర ప్రాంతాలను తరలివస్తున్న భక్తులు
వేములవాడ, ఫిబ్రవరి 14: రాజరాజేశ్వరస్వామి ఆలయంలో భక్తజనంతో కిక్కిరిసింది. సమ్మక్కసారక్క జాతర సమీపిస్తున్న కొద్ది రాజన్న దర్శనానికి భక్తులు తండోపతండాలుగా వస్తున్నారు.ఆదివారం స్వామివారిని దర్శించుకోడానికి వచ్చే భక్తులతో ఆలయం కిటకిటలాడింది. 30వేల మంది భక్తలు స్వామివారి సేవలతో తరించారు. ఉదయం ధర్మగుండంలో పవిత్రస్నానాలు ఆచరించిన భక్తులు స్వామివారి ధర్మదర్శనం,కోడెల క్యూలైన్లలలో బారులు తీరారు.కోడె మొక్కులు చెల్లించుకున్న భక్తులు అంతరాలయంలోని స్వామివార్లను,అమ్మవారిని దర్శించుకున్నారు.అక్కడి నుంచి నేరుగా బాలత్రిపుర సుందరిదేవి అమ్మవారికి వద్ద దంపతులు కుంకుమపూజలను చేయించుకున్నారు.స్వామివారి ధర్మదర్శనానికి మూడుగంటలకు పైగా సమయం పట్టింది. సోమవారం ఉదయం వరకూ భక్తుల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉండటంతో ధర్మదర్శనంలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా ఆలయ అధికారులు తగిన ఏర్పాట్లను చేస్తున్నారు.

ఠాణాలో వివాహిత ఆత్మహత్యయత్నం
* చికిత్స పొందుతూ ఆసుపత్రిలో మృతి
* పోలీసుల వైఖరితోనే ఆత్మహత్య: బంధువుల ఆరోపణ

ఎల్లారెడ్డిపేట/సిరిసిల్ల, ఫిబ్రవరి 14: కట్టుకున్న భర్త కాదుపొమ్మన్నాడు.. అక్కున చేర్చుకోవాల్సిన అమ్మ అండగా నిలబడలేదు.. న్యాయం చేయాలని వేడుకున్న ఖాకీలు కాఠిన్యం ప్రదర్శించారు.. రెండు నెలలుగా ఠాణాల చుట్టూ తిరిగినా కనికరించలేరు. ఆదుకోవాల్సిన వారంతా ఛీదరించుకోవడంతో మనస్థాపం చెందిన వివాహిత పొట్లపల్లి హారిక(22) ఆదివారం సిరిసిల్ల గ్రామీణ పోలీస్ స్టేషన్‌లో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించింది. అపస్మరక స్థితిలో పడిపోయిన ఆమెను పోలీసు వాహనంలో ఎల్లారెడ్డిపేటలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మృతి చెందింది. పోలీసులు వ్యవహరించిన తీరుపై బంధువులు మండి పడ్డారు. మృతదేహంతో ఆందోళనకు దిగడానికి సిద్ధమయ్యారు. సిరిసిల్ల గ్రామీణ సిఐ రంగయ్యగౌడ్ నేతృత్వంలోని ఎల్లారెడ్డిపేట, ఇల్లంతకుంట ఎస్‌ఐలు ఉపేందర్, ఎల్లాగౌడ్ ఆధ్వర్యనా పోలీసులు ఆసుపత్రి ఎదుట మోహరించారు. ఈ సంఘటన ఆదివారం స్థానికంగా ఉద్రిక్తతకు దారి తీసింది. మృతురాలి బంధువుల కథనం మేరకు.. ముస్తాబాద్ మండలం గూడెంలోని పొట్లపల్లి తార-కిష్టయ్య దంపతుల కూతురు హారిక. ఆమె తండ్రి కిష్టయ్య పదేళ్ల కిందట చనిపోయాడు. అప్పటి నుంచి సిరిసిల్ల మండలం చీర్లవంచలోని అమ్మమ్మ బండ వెంకటమ్మ చేదోడువాదోడుగా ఉంటోంది. యేడాది క్రితం హారికకు మహారాష్టల్రోని నాందేడ్ జిల్లా ధర్మాబాద్‌లోని సుదర్శన్‌తో వివాహామైంది. ఎనిమిది నెలలు సజావుగా కొనసాగిన వారి కాపురంలో గొడవలు చోటు చేసుకున్నాయి. అత్తింటి వారి వేధింపులను తల్లికి వివరించిన మిన్నకుండిపోయింది. దాంతో హారిక అమ్మమ్మ ఇంటికి చేరింది. పలుమార్లు పంచాయితీ నిర్వహించి అత్తగారింటికి పంపారు. సుదర్శన్‌లో ఎలాంటి మార్పు రాలేదు. ఈ క్రమంలో హారికను రెండు నెలల కిందట తీవ్రంగా కొట్టి ఇంటి నుంచి వెళ్లగొట్టాడు. తనకు న్యాయం చేయాలని కోరుతూ హారిక ముస్తాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. సిరిసిల్ల గ్రామీణ స్టేషన్ పరిధిలోకి రావడంతో సిఐ రంగయ్యగౌడ్ ఇరువర్గాలతో చర్చించారు. పెద్ద మనుషులతో పంచాయితీ నిర్వహించి వివాహా సమయంలో ఇచ్చిన పది తులాల బంగారం, రూ.లక్ష నగదు, ఇతర సామాగ్రిని అప్పగించాలని నిర్ణయించారు. నెల గడుస్తున్నా ఎలాంటి చర్య లేకపోవడంతో హారిక అమ్మమ్మతో కలిసి సిరిసిల్ల గ్రామీణ పోలీస్ స్టేషన్‌కు వచ్చింది. పంచాయితీ చెప్పిన స్పందన లేదని తనకు న్యాయం చేయాలంటూ హారిక సిఐ రంగయ్యగౌడ్‌తో ప్రాధేయపడింది. అక్కడి సిబ్బంది ఆమె పట్ల దురుసుగా ప్రవర్తించడంతో మనస్థాపం చెంది వెంట తెచ్చుకున్న పురుగుల మందు తాగింది. గమనించిన పోలీసులు హుటాహుటిన తమ వాహనంలో ఎల్లారెడ్డిపేటలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆమె చనిపోయిందని వైద్యులు నిర్థారించారు. సిఐ రంగయ్యగౌడ్ ఆసుపత్రికి చేరుకున్నారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో స్థానిక ఠాణాలో మకాం వేశారు. సుమారు మూడు గంటల పాటు పోలీసులు హైడ్రామా సాగించారు. మృతదేహాన్ని పోలీసులు సిరిసిల్లకు తీసుకెళ్లారు. కుటుంబీకులను పోలీసుల వాహనంలోనే తరలించారు. కాగా, పోలీసుల వల్లే తన మనుమరాలు హారిక పురుగుల మందు తాగి చనిపోయిందని ఆమె అమ్మమ్మ వెంకటమ్మ ఆరోపించింది. అయతే హారిక ఆత్మహత్యకు తమకు ఎలాంటి సంబంధం లేదని సిఐ రంగయ్యగౌడ్ స్పష్టం చేశారు.

ప్రైవేట్ డెయిరీలకూ ప్రోత్సాహకమివ్వాలి
* కెఎంపిసిఎల్ చైర్మన్ రాజేశ్వర్‌రావు
కరీంనగర్ టౌన్, ఫిబ్రవరి 14: రాష్ట్రంలో పాడిపరిశ్రమను ప్రోత్సహించే క్రమంలో ప్రభుత్వ డెయిరీలకు అందజేస్తున్న ప్రోత్సహాకాన్ని ప్రైవేట్ డెయిరీలకు కూడా అందజేయాలంటూ కరీంనగర్ మిల్క్ ప్రొడ్యూసర్స్ కంపెనీ లిమిటెడ్ చైర్మన్ సిహెచ్ రాజేశ్వర్‌రావు కోరారు. పాడిపరిశ్రమ అభివృద్దిపై ప్రభుత్వం నియమించిన రాష్ట్ర కేబినెట్ సబ్ కమిటీని ఆదివారం ఆయన కలిసి వినతిపత్రం అందజేశారు. ఈసందర్భంగా రాజేశ్వరరావు మాట్లాడుతూ ప్రైవేట్ డెయిరీలో అగ్రస్థానంలో ఉన్న కెఎంపిసిఎల్‌లోని రైతులకు కూడా లీటర్‌కు రూ.4 చొప్పున ప్రోత్సాహకమందిస్తే, జిల్లాలో పాల దిగుబడిని మరింత పెంచవచ్చన్నారు. ప్రస్తుత వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో జిల్లాలో కరవు విలయతాండవం చేస్తుంటే అత్యధికంగా రైతాంగం పాడి పరిశ్రమవైపు మొగ్గుచూపుతున్నారని పేర్కొన్నారు. దీనిపై రాష్ట్ర మంత్రులు ఈటల రాజేందర్, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, జగదీష్‌రెడ్డి, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వైస్‌చైర్మన్ నిరంజన్‌రెడ్డిలను కలిసి క్షుణ్ణంగా వివరించినట్లు చెప్పారు. 18 ఏళ్ళ క్రితం 12 వేల లీటర్లతో మొదలైన డెయిరీ రైతు యాజమాన్యంతో నేడు 1.90లక్షల లీటర్ల పాలు సేకరిస్తుందని చెప్పారు. డెయిరీ ప్రగతికి, నాణ్యతతో కూడిన పాలు, పాల ఉత్పత్తులు వెలువరిస్తుండటమే నిదర్శనమన్నారు. ప్రభుత్వ ప్రోత్సాహకాన్ని కేవలం నాణ్యమైన పాలకే వర్తింపజేయాలని, రాష్ట్రంలో డెయిరీల అభివృద్దికి పలు సూచనలు చేసినట్లు పేర్కొన్నారు. మంత్రులను కలిసిన వారిలో మదర్ డెయిరీ చైర్మన్ గుత్తా జితేందర్‌రెడ్డి, ఎండి పి శంకర్‌రెడ్డిలతో పాటు పలు డెయిరీల నిర్వాహకులు ఉన్నట్లు ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో స్పష్టంచేశారు.

కేరళ పాలనను అధ్యయనం చేశాం
* అక్కడి విధంగా అమలుకు కృషి
* జడ్పీ చైర్‌పర్సన్ తుల ఉమ

ఆంధ్రభూమి బ్యూరో
కరీంనగర్, ఫిబ్రవరి 14: స్థానిక సంస్థల పనితీరుపై అధ్యయనం చేసేందుకు కేరళ రాష్ట్రంలో వారం రోజుల పాటు జడ్పీటిసి బృందంతో పర్యటించి అక్కడి పాలనను అధ్యయనం చేయడం జరిగిందని జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ తుల ఉమ తెలిపారు. తనతో పాటు జడ్పీ వైస్ చైర్మన్, 42 మంది జడ్పీటిసి సభ్యులతో కేరళ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పర్యటించడం జరిగిందని చెప్పారు. ఆదివారం జడ్పీ సమావేశమందిరంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ కేరళాలో వాతావరణం పచ్చగా ఉందని, ప్రజలు వందశాతం పన్నులు చెల్లిస్తారని, ప్రభుత్వ ప్రతి పనిని ప్రజలు వినియోగించుకుంటారని, అలాగే ప్రభుత్వం కూడా జవాబుదారీతనంగా ఉంటుందని వివరించారు. అక్కడి యువతలో విద్యనైపుణ్యాలు పుష్కలంగా ఉన్నాయని, అక్కడ ఏ వస్తువు కొన్నా రశీదు తప్పనిసరిగా తీసుకుంటారని తెలిపారు. మద్యం దుకాణాలు చాలా తక్కువగా ఉన్నాయని, మద్యం అమ్మకాలు పూర్తిగా ప్రభుత్వం ద్వారానే కొనసాగుతాయని చెప్పారు. లా అండ్ ఆర్డర్ అమలులో రాజకీయ నాయకుల ప్రమేయం ఉండదని తెలిపారు. ప్రైవేటు పాఠశాల మాదిరిగానే ప్రభుత్వ పాఠశాలలు పెద్ద పెద్ద భవనాలు కలిగి ఉన్నాయని చెప్పారు. సంక్షేమ పథకాలకు సంబంధించి లబ్ధిదారుల ఎంపికలో ఫైరవీలకు ఆస్కారం లేదని తెలిపారు. రాజ్యాంగంలో పేర్కొన్న 29 అంశాలు పూర్తిగా బదలాయించడంతో స్థానిక ప్రభుత్వాల పాలన కళ్లముందు కనిపిస్తూ ఉంటుందని, మా దగ్గర జిల్లా పరిషత్‌లకు స్టాండింగ్ కమిటీలు ఉన్నట్లుగా కేరళాలో గ్రామ, మండల పరిషత్‌లకు స్టాండింగ్ కమిటీలు ఉంటాయని తెలిపారు. గ్రామ పంచాయతీల సేవలు సిటిజన్ చార్ట్ ప్రకారం జరుగుతాయని చెప్పారు. మొత్తంగా అక్కడ పాలన బాగుందని, అక్కడి విధంగా ఇక్కడ అమలు చేసేవిధంగా కృషి చేస్తామని ఉమ స్పష్టం చేశారు. ఈ సమావేశంలో జడ్పీ వైస్ చైర్మన్ రాజిరెడ్డితో పాటు పలువురు జడ్పీటిసిలు పాల్గొన్నారు.

నేటి నుండి శ్రీరామ పాదుకా పట్ట్భాషేకం
* హుస్నాబాద్‌కు చేరుకున్న శ్రీశ్రీశ్రీ చిన జీయర్‌స్వామి
* నేడు పట్టణంలో పాదుకల పంపిణీ..వేలాది మందితో శోభాయాత్ర

హుస్నాబాద్, ఫిబ్రవరి 14: శ్రీరామ పాదుకా పట్ట్భాషేకం ఉత్సవాలు సోమవారం నుంచి హుస్నాబాద్ పట్టణంలో ప్రారంభం కానున్నాయి. ఈ పట్ట్భాషేకం ఉత్సవాలు నిర్వహించేందుకు ఆదివారం రాత్రి హుస్నాబాద్ పట్టణానికి శ్రీశ్రీశ్రీ చిన జీయర్‌స్వామి చేరుకున్నారు. సోమవారం నుంచి ప్రారంభమయ్యే ఉత్సవాల్లో మొదటగా పాదుకల పంపిణితో పాటు స్వామి వారి ఉపవచనాలు ఉంటాయని నిర్వాహకులు తెలిపారు. అనంతరం మధ్యాహ్నం పట్టణంలో వేలాదిమంది భక్తులతో భారీ శోభాయాత్ర నిర్వహించనున్నట్లు తెలిపారు. మంగళవారం శ్రీరామ పాదుక పట్ట్భాషేక కార్యక్రమం జరుగుతుందని అన్నారు. కావేరి సీడ్స్ అధినేత గుండవరపు భాస్కర్‌రావు-వనజ దంపతుల ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమాలకు పట్టణంలోని ఆర్‌టిసి బస్ డిపో పక్కన 10 ఎకరాల్లో గ్రౌండును చదును చేసి వేదికను తయారు చేశారు. వేలాది మంది ప్రజలు కూర్చునేందుకు శామియానాలను ఏర్పాటు చేశారు. ఈ ఉత్సవాలకు ముఖ్య అతిథులుగా జిల్లా మంత్రులు, ఎంపి, ఎమ్మేల్యేలు హజరవుతారని తెలిపారు. రెండు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమానికి వచ్చే భక్తులకు నిరంతరం భోజన సౌకర్యలు కల్పించేందుకు చెన్నై నుండి వంటలు వండేందుకు ప్రత్యేకంగా వంటవారిని నియమించారు. ఈ కార్యక్రమాలను పర్యవేక్షించుటు 500 మందిని ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.

వలస జీవుల విలవిల...!
* తలోచోట కట్టుబానిసల్లా దుర్భర జీవితం
* చెప్పిన ఉద్యోగాల్లేవ్.. చేస్తున్న దానికి జీతం లేదు
* నిద్ర కరువై నరకయాతన పడుతున్న జిల్లా వాసులు
ఆంధ్రభూమి బ్యూరో
కరీంనగర్, ఫిబ్రవరి 14: ఉన్న ఊరిలో ఉపాధి కరువై.. కన్నవాళ్ళను, కట్టుకున్నోళ్ళను, పిల్లాపాపలను వదిలి బతుకుదెరువు కోసం విదేశాలకు వెళ్ళిన వలసజీవులు ఏజెంట్ల మోసాలతో విలవిల్లాడుతున్నారు. దూరపుకొండలు నునుపు అనే సామెత మాదిరి గల్ప్‌లో అధిక వేతనాలు పొందవచ్చనే ఆశతో వెళ్తున్న వారిని ఏజెంట్లు, ఆయా కంపనీల యజమానులు సులువుగా మోసం చేస్తూ, వారితో వెట్టిచాకిరీ చేయించుకుంటున్న సంఘటనలు నిత్యం దర్శనమిస్తూనే ఉన్నాయి. అయినా, విదేశీ సంపాదనపై ఆశచావని నిరుద్యోగులు తమ ఆస్తులమ్మి, అప్పులు చేసి పొట్టచేతపట్టుకుని పరాయి దేశాలకు వెళ్తున్న వారిలో అత్యధికులు అతిహీనమైన బతుకులు సాగిస్తున్నారు. అక్కడి యజమానులు పెట్టే బాధలు భరించలేక తమకు ఇక్కడి నుంచి విముక్తి కల్పించాలంటూ తమ కుటుంబసభ్యులకు ఫోన్‌ద్వారా సమాచారమిస్తుండటం గమనార్హం. విశాఖపట్నానికి చెందిన ఒక ప్రైవేట్ ఎంప్లాయిమెంట్ కన్సల్‌టెంట్ సంస్థ గత కొద్దిమాసాల క్రితం జిల్లాలోని పలు ప్రాంతాలకు చెందిన 25మందిని ఇంటర్వ్యూల ద్వారా ఎంపిక చేసింది. వీరిని సౌదీలోని సౌదీ ఆర్మ్‌కో అనే కంపెనీలో ఉద్యోగాల కోసం పంపింది. ఎలక్ట్రిషియన్, సూపర్‌వైజర్, తదితర ఉద్యోగాలు ఇస్తామని చెప్పి, ఒక్కొక్కరి నుంచి రూ.1.20లక్షల నుంచి రూ.1.50లక్షల వరకు వసూలు చేసింది. వీరందరిని గత అక్టోబర్ మాసంలో సౌదీకి తీసుకెళ్ళారు. అక్కడికి వెళ్ళిన అనంతరం బాధితులకు అసలు విషయం తెల్సింది. వారికి కనీస సదుపాయాలు కాదుకదా అసలు ఎలాంటి పనులు కూడా సదరు సంస్థ కల్పించలేదు. చిన్న సప్లైయింగ్ కంపనీలో కొందరికి చిన్నచిన్న దినసరి కూలీ పనులు చూపి, చేతులు దులుపుకున్నట్లు బాధితులు ఫోన్‌లో వారి కుటుంబసభ్యులకు తమగోడు వెళ్ళబోసుకున్నారు. దేశంకాని దేశంలో వారు చెప్పిన పనిచేయటమే తప్ప గత్యంతరం లేదని, ఇంతచేస్తున్నా వేతనమైనా సక్రమంగా ఇవ్వటంలేదని, అహోరాత్రులు పనిచేయిస్తూ తిండి, నిద్ర లేకుండా నరకం చూపుతున్నారని కన్నీటిపర్యంతమవుతున్నారు. తమను సౌదీకి పంపించిన ఏజెంట్‌కు ఎన్నిమార్లు ఫోన్‌చేసినా స్పందించటం లేదని వాపోతున్నారు. తుదకు ధైర్యం చేసి భారత రాయబార కార్యాలయానికి వెళ్తుంటే గమనించి, బెదిరించి తిరిగి క్యాంపులకు తీసుకెళ్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జీవనభృతి కోసం వస్తే తాము జీవితాలనే కోల్పోయే పరిస్థితులు ఎదురవుతున్నాయని, తమను కాపాడాలంటూ వేడుకుంటుండగా, వారి కుటుంబసభ్యులు ఆయా ప్రాంతాల్లోని ప్రజాప్రతినిధుల చుట్టూ రెండు రోజులుగా ప్రదక్షిణలు చేస్తున్నారు. ప్రజాప్రతినిధులు స్పందించి తగిన చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
కాటన్ మరమగ్గాల సమ్మె కొనసాగుతుంది
* ఆసాములను విస్మరించి, ఏక పక్షంగా కార్మికులతో చర్చలు సరికాదు
* సిరిసిల్ల ఆసాముల సంఘ సమావేశం ప్రకటన
సిరిసిల్ల, ఫిబ్రవరి 14: సిరిసిల్ల పట్టణంలో కాటన్ పవర్‌లూం పరిశ్రమల సమ్మె యధావిధిగా కొనసాగుతుందని స్థానిక పవర్‌లూం ఆసాముల సంఘం ప్రకటించింది. ఈమేరకు ఆదివారం స్థానిక వెంకంపేట హన్మాన్ ఆలయం వద్ద జరిగిన ఆసాములు భవిష్యత్ కార్యాచరణపై సమావేశమై ఈ నిర్ణయం ప్రకటించారు. శనివారం కాటన్ మరమగ్గాల కార్మికుల సమ్మెపై కేవలం కార్మికులతో చర్చలు జరిపి, ఆసాములను విస్మరించారని, తమ కూలీ సమస్య తేల్చకుండా మరమగ్గాలపై తాము ఎలా ఉత్పత్తులకు అంగీకరిస్తామని వెల్లడించారు. కాటన్ యజమానులు ఆసాములతో చర్చలు జరుపుతామని జరుపకుండా, ఏక పక్షంగా నిర్ణయం తీసుకుని కార్మికులతో మాత్రమే చర్చలు జరిపి ఆసాములను విస్మరించారని ఆరోపించారు. ఆసాములతో చర్చలు జరిపేంత వరకు, తమ కూలీ అగ్రిమెంటు అయ్యే వరకు యధావిధిగా పవర్‌లూం పరిశ్రమల సమ్మె కొనసాగుతుందని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఈ ఏకపక్ష నిర్ణయంపై సోమవారం సిరిసిల్ల ఆర్డీవోకు వినతి పత్రం ఇస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఆసాముల సంఘ నాయకులు తన్నీరు లక్ష్మిరాజం, బూర రాజేశం, మండవ ప్రకాశ్‌రావు, గూడూరి భాస్కర్, అంబాల అంజనేయులు, ద్యావనపెల్లి నాగరాజు, మేర్గు లక్ష్మణ్, సామల అంజనేయులు, బండారి శంకర్‌లు పాల్గొన్నారు.

ఉగ్రవాదాన్ని సమర్థించడం దేశద్రోహమే
* ఎబివిపి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సంపత్
చొప్పదండి, ఫిబ్రవరి 14: ఉగ్రవాదాన్ని సమర్థిస్తూ ర్యాలీలు తీయడం దేశ ద్రోహమే అవుతుందని ఎబివిపి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఏముండ్ల సంపత్ అన్నారు. ఈ మేరకు ఆదివారం ఎబివిపి చొప్పదండి శాఖ ముఖ్య కార్యకర్తల సమావేశం స్థానిక సామవేద డిగ్రీ కళాశాలలో జరిగింది. ఈ సందర్భంగా సంపత్ మాట్లాడుతూ ఎఐఎస్‌ఎఫ్, ఎస్‌ఎఫ్‌ఐ లాంటి వామపక్ష సంఘాలు ఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీలో, ప్రజాస్వామ్యానికి మూల స్తంభం లాంటి పార్లమెంటుపై దాడి చేసిన ఉగ్రవాది అబ్జల్‌గురు సంస్మరణ సభను నిర్వహించడం, భారత్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేయడం, ఇలాంటి వాటికి రాజ్యాంగబద్ధంగా ఎన్నికకాబడ్డ రాహుల్‌గాంధి, సీతారాం ఏచూరి, డి.రాజాలాంటి ఎంపిలు సమర్థించడం దేశద్రోహమేనని అన్నారు. కుహానాలౌకికవాదులు నేడు దేశద్రోహుల్ని సమర్థిస్తూ ర్యాలీలు నిర్వహిస్తున్న, జెఎన్‌యు వామపక్ష విద్యార్థి నాయకుల్ని సమర్థిస్తూ కార్యక్రమాల్లో పాల్గొనడం కాంగ్రెస్, వామపక్ష పార్టీల దిగజారుడుతనానికి నిదర్శనమన్నారు. దేశ భద్రతను ఫణంగా పెట్టి రాజకీయాలు చేయడం మానుకోవాలని హితవుపలికారు. ఈ సమావేశంలో తాడూరి శివకృష్ణ, రాచకొండ శ్రీను, బత్తిని హరి, బొడిగె యుగంధర్, గంగు సంపత్, అనుకారి సాయికృష్ణ, చానక్య, రహీం, ప్రశాంత్, శ్రావణ్, రాజు, కోటేష్ తదితరులు పాల్గొన్నారు.
రైతులకు నిరంతర విద్యుత్
* హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీష్‌కుమార్
భీమదేవరపల్లి, ఫిబ్రవరి 14: రైతులకు నిరంతర విద్యుత్ అందించడమే ప్రభుత్వ ధ్యేయమని హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితెల సతీష్‌కుమార్ అన్నారు. ఆదివారం మండలంలోని మల్లారం గ్రామంలో కోటి రూపాయల వ్యయంతో 33/11 కె.వి. విద్యుత్ సబ్ స్టేషన్‌కు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సతీష్‌కుమార్ మాట్లాడుతూ టిఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు రైతులకు నిరంతర విద్యుత్ అందిస్తామన్నారు. రానున్న రోజుల్లో 24 గంటల ఉచిత విద్యుత్ అందిస్తామని చెప్పారు. ప్రభుత్వం చేపట్టే అభివృద్ధి పనుల్లో అంతా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎంపిపి సంగ సంపత్ యాదవ్, జడ్పీటిసి రాంచందర్ నాయక్, మల్లారం సర్పంచ్ గిరిమల్ల తిరుపతి, ఎంపిటిసిలు బండి మంజుల, నర్సింహులు, సర్పంచ్‌లు సదానందం, బడుగు రాంచంద్రం, కడారి మంజుల, సిద్ధమల్ల రమేష్, జడ్పీ మాజీ వైస్ చైర్మన్ డాక్టర్ సుధీర్ కుమార్, ముల్కనూరు సమ్మక్క-సారలమ్మ చైర్మన్ మాడుగుల అశోక్ తదితరులు పాల్గొన్నారు.