వరంగల్

గ్రేటర్ ఎన్నికల్లో చేతులెత్తేసిన విపక్షాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, ఫిబ్రవరి 26: గ్రేటర్ వరంగల్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు విపక్షాలు చేతెలెత్తేశాయని డిప్యూటీ సిఎం కడియం శ్రీహరి, మంత్రులు హరీష్‌రావు, ఈటెల రాజేందర్‌లు అన్నారు. శుక్రవారం వరంగల్ నగరం హన్మకొండలోని మాజీ మంత్రి కెప్టెన్ లక్ష్మీకాంతారావు నివాసంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వారు మాట్లాడారు. గ్రేటర్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు టిడిపి,కాంగ్రెస్‌లు భయపడిపోతున్నాయని, అనేక వార్డులలో వారికి అభ్యర్థులే కరువయ్యారన్నారు. వరుస విజయాలతో తమ పార్టీ దూసుకపోతుంటే ప్రతిపక్షాలు పోటీ చేసేందుకు చేతులెత్తేస్తున్నాయన్నారు. తెలంగాణ అభివృద్ధి ముఖ్యమంత్రి కెసిఆర్‌తోనే సాధ్యమని ప్రజలు నమ్ముతున్నారని వారు అన్నారు. గ్రేటర్ వరంగల్ ఎన్నికల్లో తమ పార్టీ 46 మంది ఉద్యమకారులకే టికెట్లు ఇచ్చిందని వారు తెలిపారు. నైన్‌మెన్ కమిటీ నిర్ణయం మేరకే అభ్యర్థులను ప్రకటించామని వారు అన్నారు. గ్రేటర్‌లో పోటీకి తమ పార్టీ నుండి అనేక మంది ఆశావాహులు ఉన్నప్పటికి అందరికి అవకాశం రాదని, ఒక్కో డివిజన్‌లో డజను మందికి పైగా నామినేషన్లు వేసినప్పటికి తమ కోరిక మేరకు టికెట్ రాని వారంతా ఉపసంహరించుకున్నారని వారందరికి పార్టీ సరైన సమయంలో అవకాశం కల్పిస్తుందని తెలిపారు. వరంగల్ నగరం త్వరలోనే ఐటి హబ్‌గా మారబోతుందని, అందుకు ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారన్నారు.

వర్షాకాలంలో విస్తృతంగా
మొక్కలు నాటాలి
బాలసముద్రం, ఫిబ్రవరి 26: రానున్న వర్షాకాలంలో జిల్లా వ్యాప్తంగా నిర్దేశించిన ప్రదేశాలలో విస్తృతంగా మొక్కలు నాటాలని జిల్లా కలెక్టర్ వాకాటి కరుణ అన్నారు. శుక్రవారం తమ క్యాంపు కార్యాలయంలో తెలంగాణకు హరితహారం కార్యక్రమాన్ని కలెక్టర్ సంబంధిత అధికారులతో సమీక్షించారు. గత సంవత్సరం నాటిన మొక్కల సంరక్షణకు ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. మొక్కల పెంపకం చేపడుతున్న రైతులకు గ్రామీణ ఉపాధి హామీ ద్వారా కొంత ప్రోత్సాహక నగదు చెల్లిస్తున్నందున గత సంవత్సరం కన్నా రెట్టింపు స్థాయిలో హరితహారం కార్యక్రమాన్ని సమర్ధవంతంగా నిర్వహించాలన్నారు. అదే విధంగా రాబోయే వర్షాకాలంలో వివిధ ప్రభుత్వ శాఖలు తమ పరిధిలో ఎంత శాతం మొక్కలను నాటతారో ఒక నివేదికను రూపొందించి కలెక్టర్ అటవీ శాఖ అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో డిఎఫ్‌ఓలు వెంక టేశ్వర్‌రావు, భీమానాయక్, జిల్లా పంచాయతీ అధికారి లక్ష్మణ్, అటవి శాఖ అధికారులు పాల్గొన్నారు.

ముగిసిన నామినేషన్ల
ఉపసంహరణ
బల్దియా,్ఫబ్రవరి 26: గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల గట్టంలొ ఒక అంకం ముగిసింది. శుక్రవారం వివిధ పార్టీల నుంచి, స్వతంత్రంగా వేసిన అభ్యర్ధులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. మొత్తం 811 మంది అభ్యర్ధులు నామినేషన్లు వేయగా 397 మంది అభ్యర్ధులు తమ నామినేషన్లను ఉపసంహరించుకోగా, 414 మంది అభ్యర్ధులు బరిలో నిల్చున్నారు. వారిలో టిఆర్‌ఎస్, కాంగ్రెస్, టిడిపి, బిజెపి, వైఎస్‌ఆర్ సిపి, సిపిఐ, సిపిఎం పార్టీల అభ్యర్ధులు, ఇండిపెండెట్లు ఉన్నారు. మొత్తం మీద అధికార టిఆర్‌ఎస్ పార్టీకి రెబెల్స్ బెడద తప్పేటట్లులేదు. కొన్ని డివిజన్లలో ప్రజల్లో పేరు ఉన్న నాయకులు ఎలాగైనా గెలుస్తామన్న ధీమాతో వారు అధినాయకులను దిక్కరించి పోటీలో ఉన్నారు. దీంతో ఎన్నికల పర్యవేక్షణ బాద్యతలను చూస్తున్న డిప్యూటి సిఎం కడియం శ్రీహరి, మంత్రి హరీష్ రావు, మంత్రి ఈటెల రాజేందర్‌కు తల నొప్పిగా మారింది. ఎలాగైనా సరే పార్టీ నిలబెట్టిన అభ్యర్ధులు గెలుపొందేలా వ్యూహరచనలు సిద్దం చేశారు. పార్టీ టికెట్లు పొందిన అభ్యర్ధులు తమకు రెబెల్స్‌గా నామినేషన్లు వేసిన అభ్యర్ధులను నయానా,బయానా బుజ్జగించి నామినేషన్లను ఉపసంహరింపచేశారు. మరికొందరు రెబల్స్ అభ్యర్ధులు తమ ఫోన్లను స్విచ్ ఆఫ్ చేసుకుని అజ్ఞాతంలోకి వెళ్లారు. నామినేషన్ల ఉపసంహరణ సమయం ముగిసాక వారు ప్రత్యక్షమయ్యారు. అనంతరం ఎన్నికల అధికారులు పార్టీ అభ్యర్ధులకు పార్టీ గుర్తులు, ఇండిపెండెంట్లకు గుర్తులు కేటాయించారు.

కేంద్రంతోనే వరంగల్ అభివృద్ధి సాధ్యం
బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు
కిషన్‌రెడ్డి
ఆంధ్రభూమి బ్యూరో
వరంగల్, ఫిబ్రవరి 26: గ్రేటర్ వరంగల్ అభివృద్ధి కేంద్రంతోనే సాధ్యమని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం వరంగల్‌కు వచ్చిన ఆయన ఇక్కడ ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం వరంగల్‌కు అనేక పథకాలను ప్రవేశపెట్టిందని తెలిపారు. హెరిటేజ్, అమృత్ లాంటి అనేక పథకాల ద్వారా వరంగల్ నగరం వేగవంతంగా అభివృద్ధి చెందుతుందని తెలిపారు. యాదగిరిగుట్ట నుండి వరంగల్ వరకు 1905 కోట్లతో నాలుగు లైన్ల జాతీయ రహదారి పనులకు శంకుస్థాపన చేయగా పనులు నడుస్తున్నాయన్నారు. కేంద్ర మంత్రి దత్తాత్రేయ కూడా వరంగల్ జిల్లాలోని రెండు గ్రామాలను దత్తత తీసుకున్నారని ఆయన అన్నారు. గ్రేటర్ ఎన్నికలో టిఆర్‌ఎస్‌కు బుద్ధిచెప్పాల్సిన అవసరం ఉందన్నారు. టిఆర్‌ఎస్ టికెట్ వస్తే గెలుస్తానన్న భావనలో ఉన్న నాయకులకు గ్రేటర్ ఎన్నికలు గుణపాఠం కావాలన్నారు. భారతీయ జనతా పార్టీ గ్రేటర్‌లో ఉన్న 58 డివిజన్‌లలో పోటీ చేస్తుందని అభ్యర్థులు ప్రచారంలో దూసుకెళ్లాలన్నారు. అధికార పార్టీ ఆగడాలకు చెక్ పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. వరంగల్‌లో టెక్స్‌టైల్ పార్కు నిర్మాణం కోసం కేంద్రం సుముఖంగా ఉన్నప్పటికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపించకపోవడం వల్లే ఆలస్యం జరుగుతుందన్నారు. అదే విధంగా డబుల్‌బెడ్‌రూం ఇండ్ల నిర్మాణానికి కేంద్రం నిధులు ఇచ్చినా వరంగల్‌లో ఇంత వరకు ఒక గృహంను కూడా నిర్మించలేదన్నారు. ఎన్నికల ముందు ముఖ్యమంత్రి కెసిఆర్ మోసపూరిత హామీలు ఇవ్వడం ఆయనకు అలవాటేనన్నారు. వరుస విజయాలతో ఉన్నామని విర్రవీగుతున్న టిఆర్‌ఎస్‌కు ఈ ఎన్నికలు ఒక గుణపాఠం కావాలన్నారు.

గ్రామీణ పేదరిక నిర్మూలనే ధ్యేయం
స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి
రేగొండ, ఫిబ్రవరి 26: గ్రామీణ పేదరిక నిర్మూలనే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తుందని స్పికర్ సిరికొండ మధుసూదనాచారి అన్నారు. మండలంలోని రాయపల్లి గ్రామంలో శుక్రవారం బొడ్రాయి, భూలక్ష్మి ప్రతిష్టాపన మహోత్సవ వేడుకలకు స్పికర్ సిరికొండ మధుసూదనాచారి హాజరైన్నారు. గ్రామ దేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణలో గ్రామ దేవతలకు ప్రజలు పెద్ద పీఠ వేస్తారని అన్నారు. తెలంగాణ సంస్కృతికి గ్రామ దేవతల పండుగలు అద్దం పడుతాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా తెలంగాణ పండుగలకు ప్రత్యేక స్థానం కల్పించి నిధులు కేటాయిస్తు అభివృద్ధి చేస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల్లో పేదరిక నిర్మూలన చేయడానికి సంక్షేమ పథకాలను చేపడుతుందన్నారు. అధికారులు సక్రమంగా పని చేసి ప్రభుత్వం ప్రవేశపెట్టే సంక్షేమ పథకాలు పేదలకు అందేలా చూడాలని అన్నారు. రాష్ట్ర అభివృద్ధిలో కార్యకర్తలు, ప్రజలు భాగస్వామ్యులు కావాలని కోరారు. భూపాలపల్లి నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే అభివృద్ధి చెందిన నియోజకవర్గంగా తీర్చి దిద్దుతానని అన్నారు. గ్రామాల్లో తాగునీటి ఎద్దడి లేకుండా చేస్తానని హామి నిచ్చారు. ప్రతి గ్రామానికి స్వచ్చమైన తాగునీరు అందించడమే లక్ష్యమని అన్నారు. గ్రామగ్రామానికి లింక్ రోడ్లు, సిసి రోడ్లు, మురికి కాలువలు నిర్మించి గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో టిఆర్‌ఎస్ మండల అధ్యక్షులు మోడెం ఉమేష్‌గౌడ్, ఎంపిపి ఈర్ల సదానందం, వైఎస్ ఎంపిపి దాసరి జముననారాయణరెడ్డి, నాయకులు పున్నం రవి, మటికె సంతోష్, కొలుగూరి రాజేశ్వర్‌రావు, తదితరులు పాల్గొన్నారు.

సాంకేతిక అభివృద్ధితోనే ప్రగతి
కెయు రిజిస్ట్రార్
అల్త్ఫా హుస్సేన్
నక్కలగుట్ట, ఫిబ్రవరి 26: దేశ ప్రగతి సాంకేతిక అభివృద్దిపై ఆధారపడి ఉన్నదని కాకతీయ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ ఖాజా అల్త్ఫా హుస్సేన్ అన్నారు. శుక్రవారం కెయు మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన రూబీ ఫీస్ట్ 2016 ప్రారంభ కార్యక్రమం సేనేట్ హాల్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన అల్త్ఫా హుస్సేన్ మాట్లాడుతూ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా సాంకేతిక యుగం ప్రారంభమైనదని అన్నారు. సాంకేతికతను అలవర్చుకోకపోతే సామాన్యుడు కూడా పురోగభివృద్ది సాధించలేని స్థితికి చేరుకున్నామని గుర్తుచేశారు. మహిళా ఇంజనీరింగ్ విద్యార్థులు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో అనేక సాంకేతిక పరమైన విషయాలను తెలుసుకునే అవకాశాలు ఉన్నాయని అన్నారు. భవిష్యత్తులో కెయు ఇంజనీరింగ్ విద్యను పటిష్ట పర్చడానికి కృషి చేస్తామని తెలిపారు. సవాళ్లను ఎదుర్కొని అధిగమించినపుడే, సమాజంలో ఉన్నత శిఖరాలను చేరుకోగలమని వివరించారు. నేడు ప్రపంచమంతా ఒక కుటుంబంగా మారుతున్న తరుణంలో ప్రపంచస్థాయి అవకాశాలను అందిపుచ్చుకోవడానికి విద్యార్థులు సిద్దపడాలని సూచించారు. సభాధ్యక్షులుగా వ్యవహరించిన ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సుమతి మాట్లాడుతూ విద్యార్థినులు క్రమశిక్షణను అలవరచుకుని, సమయాన్ని వృధా కానివ్వకుండా లక్ష్య సాధనకు ప్రయత్నం చేయాలని తెలిపారు. దూరవిద్యా కేంద్రం డైరెక్టర్ చింతకాయల దినేష్‌కుమార్ మాట్లాడుతూ నేటి తరం విద్యార్థినులు సాదించలేనిది అంటూ ఏమీ లేదని, వారికి కావలసిన జ్ఞానమంతా అందుబాటులో ఉందని గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ, ఎస్టీ సెల్ డైరెక్టర్ డాక్టర్ తిరుమలాదేవి, సుజాతకుమారి, వేణుగోపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మహాశివరాత్రికి ఏర్పాట్లు చేయాలి
డిఆర్‌ఓ శోభ
బాలసముద్రం, ఫిబ్రవరి 26: మార్చి 7న మహాశివరాత్రి మహోత్సవం నిర్వహణకు రుద్రేశ్వరస్వామి (వెయ్యి స్థంభాల) దేవాలయంలో విస్తృత ఏర్పాట్లు చేయాలని జిల్లా రెవెన్యూ అధికారి కె.శోభ అన్నారు. శుక్రవారం తన ఛాంబర్‌లో రుద్రేశ్వరస్వామి దేవాలయం, మెట్టుగుట్ట - మడికొండ, మెట్టు రామలింగేశ్వరస్వామి దేవస్థానంలో మార్చి 7న మహాశివరాత్రి మహోత్సవం సందర్భంగా చేయాల్సిన ఏర్పాట్లపై డిఆర్‌ఓ వివిధ శాఖల అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వెయ్యి స్థంభాల దేవాలయం, చుట్టుపక్కల అర్చిగేటు వద్ద లైటింగ్ డెకరేషన్, రెండు వైపుల రోడ్డుకు కూలైన్లకు లైటింగ్ ఏర్పాటు చేయాలన్నారు. అదే విధంగా దేవాలయంలో బయట అర్చిగేటు వరకు పారిశుద్ధ్యం, నీళ్లట్యాంక్‌ల ద్వారా దేవాలయం లోపల కోనేరు పక్కన 24 గంటల భక్తుల తాగునీటి సౌకర్యం ఏర్పాటు చేయాలని ఆదేశించారు. మెట్టుగుట్ట రామలింగేశ్వరస్వామి దేవస్థానంలో లైటింగ్, సౌండ్ సిస్టం, హైమాక్స్ లైట్లు ఏర్పాటు చేయాలన్నారు. అర్చిగేటు నుండి గుట్టపై వరకు గుట్ట పరిసరాలలో పారిశుద్ధ్య ఏర్పాట్లు తాగునీటి సరఫరా సౌకర్యం ఏర్పాట్లు చేయాలన్నారు.
ఆర్‌అండ్‌బి శాఖ రుద్రేశ్వరస్వామి ఆలయంలో సాంస్కృతిక కార్యక్రమాలకు స్టేజి, బారికేడింగ్, మెట్టుగుట్ట రామలింగేశ్వరస్వామి గుట్ట ఎక్కేచోట రోడ్డుకు ఇరువైపుల గుండాల-కోనేరు వద్ద ప్రమాదాలు జరగకుండా భద్రతకు బారికేడింగ్, తాత్కాళిక క్యూలైన్లు ఏర్పాటు చేయాలన్నారు. గుండాల కోనేరు వద్ద ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున మత్స్య శాఖ రెండు షిప్టులలో గజ ఈతగాళ్లను ఏర్పాటు చేయాలన్నారు. నిరంతర విద్యుత్ సరఫరాకు ఏర్పాటు చేయాలని విద్యుత్ శాఖను ఆదేశించారు. వైద్య ఆరోగ్య శాఖ వారు రెండు చోట్ల తాత్కాళిక వైద్య శిబిరం ఏర్పాటు చేయాలన్నారు. పోలీసు శాఖ వారు క్యూలైన్లు, షాపులు, స్టాల్స్ వద్ద పూర్తిస్థాయి బందోబస్తు ఏర్పాటు చేయాలని ఆమె ఆదేశించారు.

మూఢ నమ్మకాలను విడనాడాలి
ఆర్డీవో రామక్రిష్ణారెడ్డి
నర్సంపేట, ఫిబ్రవరి 26: మారు మూల గ్రామాల్లో నెలకొన్న మూఢ నమ్మకాలను పారద్రోలేందుకు ప్రతి ఒక్కరూ శక్తి వంచన లేకుండా కృషి చేయాలని నర్సంపేట ఆర్డీవో మూగంటి రామక్రిష్ణారెడ్డి కోరారు. నర్సంపేట ఆర్డీవో కార్యాలయంలోని తన ఛాంబర్‌లో శుక్రవారం శాస్తవ్రేత్తలకు సంబంధించిన ఛాయా చిత్రాలను ఆర్డీవో రామక్రిష్ణారెడ్డి ఆవిష్కరించారు. ఈసందర్భంగా ఆర్డీవో రామక్రిష్ణారెడ్డి మాట్లాడుతూ శాస్తవ్రేత్తలు సైన్స్ ఆవిష్కరణలు చేయడం మూలంగానే నేడు మూఢ నమ్మకాలు పోయాయన్నారు. అయినా ఇంకా అక్కడక్కడా మూఢనమ్మకాలతో దారుణాలు చోటుచేసుకుంటున్నాయని అన్నారు. శాస్త్ర సాంకేతిక రంగాలు ఈనాడు ఎంతో అభివృద్ధి చెందాయని, శాస్ర్తియ ఆవిష్కరణల వైపు దృష్టి సారించాలని కోరారు. ఇదే సమయంలో శాస్ర్తియ వైఖరులను పెంపొందించుకోవాలని సూచించారు. ఈకార్యక్రమంలో సిద్దార్థ డిగ్రీ కళాశాల కరస్పాండెంట్ గోగుల ప్రభాకర్‌రెడ్డి, డాక్టర్ శీలం సత్యనారాయణ, గొంగళ్ల అశోక్, దిడ్డి కుమారస్వామి, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

ఆసుపత్రిని తనిఖీ చేసిన కలెక్టర్
నర్సంపేట, ఫిబ్రవరి 26: నర్సంపేట ఏరియా ఆసుపత్రిని జిల్లా కలెక్టర్ వాకాటి కరుణ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. శుక్రవారం ఉదయం పదకొండు గంటలకు నేరుగా ఏరియా ఆసుపత్రికి కలెక్టర్ వాకాటి కరుణ చేరుకున్నారు. కలెక్టర్ రాకతో ఆసుపత్రిలోని వైద్య, సిబ్బంది ఉరుకులు, పరుగులు తీశారు. కలెక్టర్ కరుణ ఆసుపత్రిలోని ప్రసూతి, పిల్లల వార్డుతో పాటు ఇన్‌పేషంట్ల వార్డులను పరిశీలించారు. బెడ్‌ల మీద చద్దర్లు ఎందుకు లేవని ఆసుపత్రి సూపరిండెంట్ డాక్టర్ ఉదయ్‌సింగ్‌ను ప్రశ్నించారు. ఉతికేందుకు చద్దర్లను తీసుకెళ్లారని చెప్పగా తక్షణమే కొత్త దుప్పట్లు కొనుగోలు చేయాలని ఆదేశించారు. అనంతరం వైద్యులతో సమావేశమయ్యారు. ఆసుపత్రిలో నెలకొన్న సమస్యను అడిగి తెలుసుకున్నారు. అటెండెన్స్ రిజిష్టర్‌ను పరిశీలించారు. నర్సంపేట ఏరియా ఆసుపత్రికి రక్త నిధి కేంద్రంతో పాటు జనరిక్ మందుల షాపును మంజూరు చేయాలని కలెక్టర్‌ను వైద్యులు కోరారు.
ఈసందర్భంగా కలెక్టర్ వాకాటి కరుణ విలేఖరులతో మాట్లాడుతూ ఆసుపత్రి పనితీరు పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. ఆసుపత్రికి కావల్సిన వసతులు, ఇతర సౌకర్యాలు, పోస్టుల భర్తీ గురించి వైద్యులు తనకు నివేదించారని చెప్పారు. పది రోజుల్లో ఆసుపత్రికి కొన్ని వసతులను కల్పించే దిశగా చర్యలు తీసుకోనున్నట్లు వెల్లడించారు. జనరిక్ మందుల షాపును ఏర్పాటు చేసేందుకు వీలుగా ఆసుపత్రి సముదాయంలో కిరాయికి ఇచ్చిన మడిగెలలో ఏదో ఒకటిని ఖాళీ చేయించాల్సిందిగా కలెక్టర్ కరుణ సూపరిండెంట్‌ను ఆదేశించారు. ఈసమావేశంలో ఆర్డీవో మూగంటి రామక్రిష్ణారెడ్డి, వైద్యులు డాక్టర్ జగదీశ్వర్, జాన్సన్, విశ్వనాధ్ నాయక్, సునీత తదితరులు పాల్గొన్నారు.