గుంటూరు

సాగుపత్రాలలో జాప్యంచేస్తే సహించం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, ఏప్రిల్ 21: మిర్చి రైతులకు సాగు ధ్రువీకరణ పత్రాల్లో అధికారులు అలసత్వం వహిస్తే సహించేదిలేదని కలెక్టర్ కాంతీలాల్ దండే హెచ్చరించారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో వ్యవసాయ, ఉద్యానవన అధికారులతో సమావేశమయ్యారు. ప్రతి మండలంలోని ఉద్యాన వన అధికారులు రెవిన్యూ వీఆర్వోలతో సమన్వయం చేసుకుని రైతులకు ధ్రువీకరణ పత్రాలు మంజూరు చేయాలన్నారు. ఉద్యానవనశాఖ అధికారులు ప్రధాన బాధ్యతగా తీసుకుని యుద్ధప్రాతిపదికన సర్ట్ఫికెట్లు పంపిణీ చేయాలని ఆదేశించారు. రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం రాయితీని ప్రకటించిందని, రైతులకిచ్చే సబ్సిడీలో ఎలాంటి అవకతవకలు జరిగినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే వ్యాపారులపై కూడా చర్యలు తీసుకుంటామన్నారు. ఆథార్ కార్డు ఆధారంగా ఈ క్రాప్ బుకింగ్ ద్వారా సాగు విస్తీర్ణాన్ని, విక్రయ వివరాలను సిద్ధం చేసుకుని పారదర్శకంగా ప్రభుత్వ మద్దతుధర చెల్లించాలని సూచించారు. అవసరమైతే మరిన్ని సాగు నమోదు కేంద్రాలు ఏర్పాటుచేసుకుని సమయం వృధా చేయకుండా రైతులకు ధృవీకరణ పత్రాలు అందించాలన్నారు. పెదకూరపాడు ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ మాట్లాడుతూ రైతుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, గిట్టుబాటు ధరతో పాటు పంటల బీమా పథకాన్ని వర్తింప చేసేందుకు ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసిందన్నారు. వాణిజ్య పంటలతో పాటు వ్యవసాయోత్పత్తులకు తమహయాంలోనే గిట్టుబాటుధర ఉంటుందన్నారు. యార్డు చైర్మన్ మన్నవ సుబ్బారావు మాట్లాడుతూ ప్రభుత్వం రాయితీ ప్రకటించి రెండు రోజులు గడిచినప్పటికీ ఉద్యానవన, వ్యవసాయాధికారుల మధ్య సమన్వయ లోపం కారణంగా సబ్సిడీ పంపిణీలో జాప్యం జరుగుతోందని కలెక్టర్ దృష్టికి తెచ్చారు. సాగు ధృవీకరణ పత్రాలు సంబంధిత వ్యవసాయాధికారి మంజూరు చేయాలనే ప్రభుత్వ నిబంధన ఉన్నప్పటికీ కొందరు తమ పరిధిలోదికాదని ఉద్యానవనశాఖకు చెందుతుందని రైతుల్ని ఇబ్బందులకు గురిచేస్తున్నారని వివరించారు. దీనిపై కలెక్టర్ స్పందిస్తూ శాఖల మధ్య సమన్వయం అవసరమన్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఉపేక్షించేదిలేదన్నారు. సమావేశంలో ఉద్యానవనశాఖ అధికారి జయచంద్రారెడ్డి, జిల్లా వ్యవసాయ సంయుక్త సంచాలకులు విడివి కృపాదాసు, మార్కెట్ యార్డు కార్యదర్శి దివాకర్, సుబ్రహ్మణ్యం తదితర అధికారులు పాల్గొన్నారు.

క్లస్టర్ గ్రామాల్లో మంచినీటి ప్లాంట్లు
సిఎంకు రాయపాటి ప్రతిపాదన

గుంటూరు, ఏప్రిల్ 21: క్లస్టర్ బేస్డ్ వాటర్ ప్లాంట్లకు తగిన నిధులు మంజూరు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు నరసరావుపేట ఎంపి రాయపాటి సాంబశివరావు ప్రతిపాదించారు. శుక్రవారం వెలగపూడి సచివాలయంలో ముఖ్యమంత్రిని రాయపాటి కలుసుకుని పార్లమెంటరీ నియోజకవర్గ అభివృద్ధిపనులపై చర్చించారు. ప్లాంట్ల ఏర్పాటుకు సిఎస్‌ఆర్ నిధుల కేటాయించాలని సూచించారు. చిలకలూరిపేట రూరల్‌లో నీటి ఎద్దడి ఉన్న గ్రామాలకు మంచినీటిని అందించేందుకు పసుమర్రు, కావూరు గ్రామాల మధ్య రూ. 5 కోట్ల అంచనా వ్యయంతో రెండు క్లస్టర్ వాటర్ ప్లాంట్ల ఏర్పాటుకు రూపకల్పన జరిగిందని, వీటి నిర్మాణంతో చిలకలూరిపేట పట్టణంతో పాటు 17 గ్రామాలలో లక్షన్నర మంది జనాభాకు మంచినీరు అందుతుందని వివరించారు. ఈ నిధులను భారత్ పెట్రోలియం కార్పొరేషన్, ఇఫ్కో కంపెనీల నుంచి సిఎస్‌ఆర్ ద్వారా నిధులు మంజూరు కాగలవన్నారు. ఇందుకు చొరవ చూపాలని ముఖ్యమంత్రిని కోరారు. దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు సానుకూలంగా స్పందించారు. గ్రామాల్లో మంచినీటి సమస్యను పరిష్కరించాలనేది ప్రభుత్వ ధ్యేయంగా చెప్పారు.

ప్రజలతో సత్సంబంధాలు కలిగి ఉండాలి
* 30 కుటుంబాలకొక బూత్ కమిటీ ఏర్పాటు చేయాలి
* వీడియో కాన్ఫరెన్స్‌లో సిఎం చంద్రబాబు
గుంటూరు (కొత్తపేట), ఏప్రిల్ 21: పార్టీ నాయకులు ప్రజలతో నిత్యం సత్సంబంధాలు కలిగి ఉండాలని, ప్రభుత్వ కార్యక్రమాలైన చంద్రన్న బీమా, ఎన్‌టి ఆర్ భరోసా, స్కాలర్‌షిప్‌లు అర్హులకు అందేలా కృషిచేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా అధ్యక్షుడు జివి ఆంజనేయులు, ఇతర నేతలతో మాట్లాడారు. సంక్షేమ కార్యక్రమాలపై ఎప్పటికప్పుడు ప్రజాభిప్రాయాన్ని నాయకులు, కార్యకర్తలు తెలుసుకోవాలని, అవినీతి రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలని కృతనిశ్చయంతో ఉన్నట్లు తెలిపారు. పార్టీ ప్రతిష్ఠను పెంచేందుకు 25 నుండి 35 కుటుంబాలకు ఒక బూత్ కమిటీని ఏర్పాటు చేయాలని సూచించారు. మహానాడు జరిగే ముందు నియోజకవర్గ, జిల్లా మహానాడు జరపాలన్నారు. నాయకులు పాతవారు, కొత్తగా వచ్చిన వారితో సమన్వయంతో పనిచేసుకోవాలని సూచించారు. ప్రతి నాయకునికి స్వీయ క్రమశిక్షణ ముఖ్యమన్నారు. ఆంధ్రప్రదేశ్‌ను కరవు రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి నీరు-ప్రగతి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో 21 వార్డులు ఏకగ్రీవంగా తెలుగుదేశం పార్టీ గెలిపిస్తే, 14 చోట్ల పోటీ జరిగిందన్నారు. ప్రజలు తెలుగుదేశంపార్టీ పట్ల సానుకూల దృక్పథంతో ఉన్నారని, దాన్ని నిలబెట్టుకోవాలని, 80 శాతం ప్రజలను తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా మార్చుకోవడానికి నాయకులు కృషిచేయాలని చంద్రబాబు కోరారు. ఈ కాన్ఫరెన్స్‌లో జిల్లా నుండి జివి ఆంజనేయులు, లాల్‌వజీర్, కంచర్ల శివరామయ్య తదితరులు పాల్గొన్నారు. అనంతరం మాచర్ల నియోజకవర్గం కారంపూడి మండలంలో మండల పార్టీలో నెలకొన్న వివాదాల పరిష్కారానికి జివి ఆంజనేయులు మాచర్ల నాయకులతో చర్చించారు. పార్టీ క్రమశిక్షణకు కట్టుబడి పనిచేయాలని, క్రమశిక్షణా రాహిత్యంగా వ్యవహరిస్తే పార్టీ క్షమించదని స్పష్టంచేశారు. 2019 సంవత్సరంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందని, ప్రజలు పార్టీ పట్ల సానుకూలంగా ఉన్నారని, నాయకులు విభేదాలు వీడి విజయం కోసం కృషి చేయాలని కోరారు.
1500 కోట్లతో

అభివృద్ధి పనులు
ప్రత్తిపాడు, ఏప్రిల్ 21: ప్రత్తిపాడు నియోజకవర్గంలో 1500 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని మాజీ మంత్రి, ఎమ్మెల్యే రావెల కిషోర్‌బాబు అన్నారు. శుక్రవారం ప్రత్తిపాడు మండలంలో జరుగుతున్న అభివృద్ధి పనులపై ప్రజాప్రతినిధులు, అధికారులతో సమీక్షా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా రావెల మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాలు అందించాలన్నదే ప్రభుత్వ సంకల్పమన్నారు. రైతుల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. మిర్చిరైతులకు గిట్టుబాటు ధర లేకపోతే ప్రభుత్వం వారిని ఆదుకునేందుకు అదనంగా క్వింటాకు 1500 రూపాయలను రైతుల ఖాతాలో జమచేసేందుకు చర్యలు చేపట్టిందన్నారు. అర్హులకు నివేశన స్థలాలతో పాటు గృహాలను కూడా మంజూరు చేయడం జరుగుతుందన్నారు. రైతులకు సబ్సిడీపై వ్యవసాయ యాంత్రీకరణ పనిముట్లు అందజేయడం జరుగుతుందన్నారు. సమీక్షా సమావేశంలో గ్రామాల వారీగా జరుగుతున్న అభివృద్ధి పనులపై ఆరా తీశారు. అధికారులు నిబద్ధతతో పనిచేసి ప్రభుత్వ ప్రతిష్ఠను పెంచేవిధంగా పనిచేయాలని కోరారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ డి భాగ్యారావు, తహశీల్దార్ సిహెచ్ పద్మావతి, ఎండిఒ బాలమ్మ, ఎంపిపి సిహెచ్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
నగరంలో కొనసాగుతున్న అక్రమ నిర్మాణాల కూల్చివేత
గుంటూరు, ఏప్రిల్ 21: నగరపాలక సంస్థ కమిషనర్ ఎస్ నాగలక్ష్మి ఆదేశాల మేరకు నగరంలోని అనధికార నిర్మాణాలు, ప్లాన్‌ను ఉల్లంఘించి నిర్మించిన కట్టడాల కూల్చివేత పనులు రెండవ రోజైన శుక్రవారం కూడా కొనసాగాయి. ఇందులో భాగంగా నగరంలోని కొత్తపేటలో గల మెడికల్ కాంప్లెక్స్ రోడ్డు, భాస్కర్‌డీలక్స్ రోడ్డు తదితర ప్రాంతాల్లోని అనధికార నిర్మాణాలపై చర్యలు తీసుకున్నారు. ఈ సందర్భంగా పట్టణ ప్రణాళికాధికారులు మాట్లాడుతూ అనధికార నిర్మాణాలు, ఆన్‌లైన్‌లో పొందిన ప్లాన్‌కు విరుద్ధంగా నిర్మించే భవనాలపై చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ప్లాను పొందిన మేరకు నిర్మాణాలు జరపాలని సూచించారు. అనధికారికంగా చేపట్టే ఎటువంటి నిర్మాణాలను ఉపేక్షించేది లేదని స్పష్టంచేశారు. సిటీప్లానర్ ధనుంజయరెడ్డి, డిసిపి సత్యనారాయణ, ఎసిపి విజయభాస్కర్, టిపిఎస్‌లు లక్ష్మణస్వామి, రఘురామ్, బిల్డింగ్ ఇన్స్‌పెక్టర్ శివప్రసాద్, చైన్‌మెన్‌లు తదితరులు పాల్గొన్నారు.
అభివృద్ధి ఫలాలు అందరికీ అందాలి
గుంటూరు (కొత్తపేట), ఏప్రిల్ 21: అభివృద్ధి ఫలాలు అందరికీ సమానంగా అందాలని, అటువంటి సమాజం కోసం ఎఐఎస్‌ఎఫ్ పోరాడుతుందని సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్‌కుమార్ పేర్కొన్నారు. అఖిల భారత విద్యార్థి సమాఖ్య జిల్లా స్థాయి విద్యా, వైజ్ఞానిక రాజకీయ శిక్షణ తరగతులు శుక్రవారం స్థానిక మల్లయ్యలింగం భవన్‌లో సమాఖ్య జిల్లా కార్యదర్శి కోలా రామయ్య అధ్యక్షతన ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా అజయ్‌కుమార్ మాట్లాడుతూ అనేక రుగ్మతులతో కొట్టుమిట్టాడుతున్న యువతరాన్ని ఒకగాడిలోకి తీసుకురావడానికి సామాజిక, రాజకీయ అంశాలపై, విద్యపై అవగాహన కలిగి దేశ భవిష్యత్తును యువత తీర్చిదిద్దడం కోసం ఈ శిక్షణా తరగతులు దోహదం చేస్తాయన్నారు. సమాజాన్ని పట్టిపీడిస్తున్న మతోన్మాదం, కులోన్మాదాల నుండి కుల, మత రహిత ఒక భావసమాజంలో యువతను భాగస్వామ్యం చేయడానికి నడుం బిగించాలన్నారు. ఎఐఎస్‌ఎఫ్ నినాదం చదువుతూ పోరాడు - చదువుకై పోరాడు నినాదాన్ని ముందుకు తీసుకెళ్లాలన్నారు. విద్యారంగంలో ప్రమాదకర ధోరణులు వచ్చాయన్నారు. కార్పొరేట్ కబంధ హస్తాల్లో విద్యారంగం చిక్కుకుందన్నారు. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లోని విద్యార్థుల సంఖ్య పెరిగే విధంగా కృషిచేయాలన్నారు. ఎఐఎస్‌ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి మహంకాళి సుబ్బారావు మాట్లాడుతూ పేద విద్యార్థులకు విద్యను దూరం చేస్తున్న పాలకుల విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. శాంతి, అభ్యుదయం, సోషలిజం, ఎఐఎస్‌ఎఫ్ లక్ష్యమన్నారు. తరగతుల్లో ఎఐటియుసి రాష్ట్ర కార్యదర్శి ప్రొఫెసర్ తలసేంద్ర, ప్రొఫెసర్ కె రాజశేఖర్, వెంకటేశ్వర్లు శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నగర కార్యదర్శి కోట మాల్యాద్రి, ఎఐఎస్‌ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి షేక్ కరీమ్, కె ఆనంద్, దగ్గుబాటి కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

పిడుగుపాటుకు వ్యక్తి మృతి
పెదకూరపాడు, ఏప్రిల్ 21: మండలంలో శుక్రవారం సంభవించిన తేలికపాటి అకాలవర్షం పిడుగుపాటుకు హుస్సేన్‌నగరం గ్రామంలో ఒక వ్యక్తి మృతిచెందాడు. కర్నూలు జిల్లా, చినమారేడు గ్రామానికి చెందిన రాజారత్నం (50) వలస కూలీగా హుస్సేన్‌నగరంకు వచ్చాడు. పిడుగుపాటుకు గురై శుక్రవారం మృతిచెందాడు.
రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి
ప్రత్తిపాడు, ఏప్రిల్ 21: రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతిచెందిన సంఘటన శుక్రవారం ఉదయం స్థానిక పోలీసుస్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం... వంగిపురం గ్రామానికి చెందిన గాండ్ల సత్యనారాయణ (48) ప్రత్తిపాడు నుంచి వంగిపురం వస్తూ గ్రామ శివారులో ద్విచక్ర వాహనం అదుపుతప్పి పక్కనే ఉన్న కాల్వలో పడటంతో అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ప్రత్తిపాడు ఎస్‌ఐ శ్రీనివాసరావు తెలిపారు.
వర్షానికి మిర్చిరైతుల ఇక్కట్లు
వట్టిచెరుకూరు, ఏప్రిల్ 21: మండలంలోని మిర్చిరైతులు చివరిదశకు వచ్చినా తమ మిర్చికల్లాల్లో ఆరబోసి ఉండగా, శుక్రవారం సాయంత్రం 4 గంటల నుండి కారుమబ్బులతో ఆకాశం మేఘావృతమై తేలికపాటి వర్షం కురవడంతో టార్ఫాలిన్ పట్టాలతో రైతులు కళ్లాల వెంట పరుగులుతీశారు. చెదురుమదురు జల్లులు కావడంతో ఊపిరి పీల్చుకున్నారు.
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం
మంగళగిరి, ఏప్రిల్ 21: పట్టణ శివారులోని బైపాస్‌రోడ్డులో శుక్రవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో శ్రీనివాస్ (39) అనే వ్యక్తి దుర్మరణం పాలయ్యాడు. మరో వ్యక్తి గాయపడ్డాడు. పోలీసుల కథనం ప్రకారం పట్టణంలోని గండాలయపేటకు చెందిన శ్రీనివాస్ ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా ప్రైవేట్ విద్యాసంస్థకు చెందిన బస్సు ఢీకొంది. ఈ దుర్ఘటనలో శ్రీనివాస్ అక్కడికక్కడే మృతిజెందాడు. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడగా చికిత్స కోసం ఎన్నారై ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పట్టణ పోలీసులు తెలిపారు.

మండలంలో చిరు జల్లులు
* ఊపిరి పీల్సుకున్న ప్రజలు
తాడికొండ, ఏఫ్రిల్ 21: వాతావరణ మార్పుతో గత వారం రోజులుగా వేసవి తాపానికి తట్టుకోలేక తల్లడిల్లిన ప్రజలు ఇళ్ళలోనుండి బయటకు రావడానికి భయపడ్డారు. శుక్రవారం మధ్యాహ్నం నుండి మేఘావృతం కావడం , దానికి తోడు చిరుజల్లులు పడటంతో ప్రజలు ఊపిరి పీల్సుకున్నారు. తాడికొండ, పొనె్నకల్లు, నిడుముక్కల, మోతడక తదితర గ్రామాల్లో ఒక మోస్తరు వర్షంతోపాటు, ఈదురు గాలులకు చెట్లునేలకొరిగి విద్యుత్ లైన్లపై పడిపోవడంతో విద్యుత్ సరఫరా నిలిచి పోయింది.