గుంటూరు

జూట్‌మిల్లును పునఃప్రారంభించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, మే 15: తన నియోజకవర్గ పరిధిలోని భజరంగ్ జూట్‌మిల్లు మూతపడి రెండేళ్లు గడుస్తుందని, దీంతో కార్మికులు అనేక ఇబ్బందులు గురవుతున్న నేపథ్యంలో తక్షణం మిల్లును పునఃప్రారంభించి, కార్మికుల జీవితాలను నిలబెట్టాలని కార్మికశాఖ మంత్రి పితాని సత్యనారాయణకు పశ్చిమ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాలరెడ్డి విజ్ఞప్తిచేశారు. సోమవారం వెలగపూడిలోకి కార్మికశాఖ మంత్రి కార్యాలయంలో ఆ శాఖ అధికారులు, జూట్‌మిల్లు కార్మిక సంఘాల నాయకులతో కలిసి మంత్రి పితాని, ఎమ్మెల్యే మోదుగుల తదితరులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేణుగోపాలరెడ్డి మాట్లాడుతూ కాలం గడుస్తున్నప్పటికీ మిల్లును తెరిపించలేక పోతున్నామని, దీంతో ప్రజల్లో ప్రభుత్వం పట్ల వ్యతిరేకభావం ఏర్పడుతుందన్నారు. వీలైనంత త్వరగా యాజమాన్యంతో సంప్రదించి మిల్లును పునఃప్రారంభించి, కార్మికులను ఆదుకోవాలని కోరారు. మిల్లు మూతపడటంతో వందలాది మంది కార్మికులు రోడ్డున పడ్డారని ఆందోళన వ్యక్తంచేశారు. గతంలో అనేక మార్లు సమావేశాలకే పరిమితమైన ఈ అంశానికి పరిష్కారం చూపాలని మంత్రిని కోరారు. దీనిపై మంత్రి సత్యనారాయణ స్పందిస్తూ మిల్లు విషయమై ఈనెల 25వ తేదీన మరలా సమావేశం ఏర్పాటుచేసి, సరైన నిర్ణయం తీసుకునేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం
పొన్నూరు, మే 15: పొన్నూరు పట్టణంలో సోమవారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో సయ్యద్ బాజి (40) అనే వ్యక్తి దుర్మరణం పాలయ్యాడు. పోలీసుల కథనం ప్రకారం... పొన్నూరు పట్టణానికి చెందిన సయ్యద్ బాజి విజయవాడలోని ఓ ట్రాన్స్‌పోర్ట్ కంపెనీలో సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్నాడు. అతడు డ్యూటీకి హాజరయ్యేందుకు సోమవారం మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో స్థానిక షరాబ్‌బజారు సెంటర్‌లో ఆర్టీసీ బస్సు ఎక్కుతుండగా డ్రైవర్ షడన్‌గా బస్సును నడపడంతో జారిపడిన బాజి బస్సు వెనుక చక్రాల కిందపడి మృతిచెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మృతుని భార్య మోమిన ఫిర్యాదు మేరకు పొన్నూరు అర్బన్ పోలీసులు కేసు నమోదు చేశారు. అర్బన్ ఎస్‌ఐ నారాయణ కేసు దర్యాప్తు చేస్తున్నారు.
చేబ్రోలులో....
చేబ్రోలు, మే 15: రోడ్డు ప్రమాదంలో వృద్ధుడు అక్కడికక్కడే మృతిచెందిన సంఘటన సోమవారం జరిగింది. చేబ్రోలు గ్రామంలోని జిబిసి రోడ్డుపై చేబ్రోలుకు చెందిన శివయ్య అనే వృద్ధుడు (60) టాటా ఏస్ వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో శివయ్య అక్కడికక్కడే మృతిచెందాడు. సంఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తెనాలి ప్రభుత్వాసుపత్రికి తరలించి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఈసెట్‌లో గురజాల విద్యార్థికి స్టేట్ 8వ ర్యాంక్
గురజాల, మే 15: గురజాల పట్టణానికి చెందిన విద్యార్థి శరమాల్ల నరేంద్ర అనంతపురం జెఎన్‌టియు నిర్వహించిన ఈసెట్ పరీక్షలో 200 మార్కులకు గాను 111 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో 8వ ర్యాంక్ సాధించాడు. నరేంద్ర కాకినాడలోని ఆంధ్ర పాలిటెక్‌నిక్ కళాశాలలో సిఎస్‌ఇ విభాగంలో డిప్లమో పూర్తి చేశాడు. రాష్ట్ర స్థాయి ర్యాంక్ సాధించిన నరేంద్రకు తల్లిదండ్రులతోపాటు అభినందించారు.

దివ్యదర్శన యాత్రకు తరలివెళ్లిన భక్తులు
మంగళగిరి, మే 15: పుణ్యక్షేత్రాలకు వెళ్లే ఆర్ధిక స్థోమత లేని పేదకుటుంబాల భక్తుల కోసం రాష్ట్ర ప్రభుత్వ దేవాదాయ, ధర్మాదాయ శాఖ ప్రవేశపెట్టిన దివ్యదర్శన యాత్రలో భాగంగా సోమవారం మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి ఆలయం నుంచి సుమారు 190 మంది భక్తులు యాత్రకు తరలివెళ్లారు. మంగళగిరి, తాడేపల్లి మండలాలకు చెందిన భక్తులు నాలుగు బస్సుల్లో యాత్రకు తరలివెళ్లారు. శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి ఆలయంలో ప్రదక్షిణలు చేసి స్వామివారిని, రాజ్యలక్ష్మీ అమ్మవారిని భక్తులు దర్శించుకుని పూజలు నిర్వహించారు. ఆలయ ముఖమండపంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ కెబి శ్రీనివాస్ , ఆలయ ఉపప్రధాన అర్చకులు దీవి అనంత పద్మనాభాచార్యులు, ప్రభుత్వం దివ్య దర్శనం యాత్ర ప్రవేశపెట్టిన ఉద్దేశ్యాన్ని వివరించి ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం ఆలయం ఎదుట నిలిపి ఉంచిన యాత్ర బస్సులకు సహాయ కమిషనర్ కెబి శ్రీనివాస్, ఆలయ ఇఓ మండెపూడి పానకాలరావు, జడ్‌పిటిసి సభ్యులు దండమూడి శైలజారాణి, గంజి రాధ జెండాఊపి ప్రయాణం ప్రారంభించారు. వల్లూరమ్మ దేవస్థానం, తిరుమల తిరుపతి దేవస్థానం, తిరుచానూరు పద్మావతీ అమ్మవారి ఆలయం, కడపజిల్లా ఒంటిమిట్టలోని రామాలయం, శ్రీకాళహస్తి, శ్రీశైలం, త్రిపురాంతకం ఆలయాలను దివ్యదర్శన యాత్రకు వెళ్లిన భక్తులు దర్శించుకుంటారని, భక్తులనుంచి ఎటువంటి రుసుము వసూలు చేయకుండా రానూపోనూ ప్రయాణం, మధ్యలో భోజన ఫలహారాల ఖర్చులు ప్రభుత్వమే భరిస్తుందని సహాయ కమిషనర్ కెబి శ్రీనివాస్ తెలిపారు. ట్రస్ట్‌బోర్డు సభ్యులు ఊట్ల శ్రీమన్నారాయణ, మోరంపూడి నాగేశ్వరరావు, ఎబి సాంబశివరావు, పంచుమర్తి ప్రసాద్, వెనిగళ్ల ఉమాకాంతం, దీవి అనంత పద్మనాభాచార్యులు, దేవాదాయశాఖ ఆలయ ఇఓలు, మేనేజర్లు, దంటు ప్రమీలారాణి, కృపాల్‌రెడ్డి, విశ్వనాధ్, నారాయణ, ఇన్‌స్పెక్టర్ శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.