గుంటూరు

తీరంలో భూబకాసురులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, డిసెంబర్ 11: తీరంలో అంతులేని భూ బాగోతం జరుగుతోంది. పార్టీలకతీతంగా సముద్రతీర ప్రాంతంలో అసైన్డు భూములను స్వాహా చేస్తున్నారు.. గత దశాబ్దాల కాలంగా ఈ తంతు కొనసాగుతోంది.. గత 2004 ఎన్నికల అనంతరం తెనాలి రెవిన్యూ డివిజన్ అధికారులు కొంతమంది నేతలకు ప్రత్యక్షంగా, పరోక్షంగా నోటీసులు కూడా జారీ చేశారు. నిజాంపట్నం మండలం సముద్రతీర గ్రామాలతో పాటు బాపట్ల, కర్లపాలెం, పిట్టలవానిపాలెం, రేపల్లె ప్రాంతాల్లో పెద్దఎత్తున భూములు పరాధీనం అయ్యాయి.. అధికార టీడీపీతో సహా ప్రస్తుతం వైసీపీలో ఉంటున్న నాయకులు చివరకు సీపీఐ (ఎంఎల్) పార్టీకి చెందిన నేతలు కూడా ఈ భూముల స్కాములో భాగస్వాములుగా ఉన్నారంటే అతిశయోక్తికాదు. నిజాంపట్నం మండలం దిండి, కొత్తపాలెం తదితర ప్రాంతాల్లో అంతులేని భూ కబ్జాకు చెందిన వాస్తవాలనేకం వెలుగు చూస్తున్నాయి.. తిలాపాపం తలా పిడికెడు అనే చందంగా తీరంలో జరుగుతున్న భూ దందాలపై గతంలో ఆంధ్రభూమి ఇందుకు సంబంధించి వార్తాకథనాలు ప్రచురించింది. దీనిపై అప్పట్లో ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి స్పందించిన దాఖలాలు కూడా ఉన్నాయి.. తాజాగా నిజాంపట్నం మండలం దిండి గ్రామంలో భూ కబ్జా వ్యవహారంపై వైసీపీ నేతలు ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ అనుచరులు విచ్చలవిడిగా భూములు కాజేస్తున్నారనే అభియోగాలపై కలెక్టర్ కోన శశిధర్, ఇతర జిల్లా అధికారులకు ఫిర్యాదు చేశారు. పంచాయతీ పరిధిలో కొత్తగా భూములు ఉన్నట్లు రికార్డులు సృష్టించి సర్వేలు నిర్వహించి పట్టాలు పొందటంతో పాటు వాటిపై బ్యాంకుల నుంచి రుణాలు కూడా తీసుకున్నారని వైసీపీ నేత, మాజీమంత్రి మోపిదేవి వెంకటరమణారావు, గుంటూరు తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే మహమ్మద్ ముస్త్ఫా, పార్లమెంటరీ నియోజకవర్గం ఇన్‌చార్జి రావి వెంకటరమణ, వేమూరు ఇన్‌చార్జి మేరుగ నాగార్జున, వైసీపీ రాష్ట్ర కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి తదితర నేతలు కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. సర్వే నెంబరు 874,875లో 450 ఎకరాలు, 1128,1129లో 12 వందల ఎకరాల భూమిని గ్రామానికి సంబంధంలేని వ్యక్తులు అధికారులను లోబరచుకుని పట్టాలు సంపాదించారని, వాటిపై రూ. 6 కోట్ల మేర రుణాలు తీసుకున్నారని ఆరోపించారు. ఆ ప్రాంతంలో చెరువులులేని వాటిపై మత్స్యశాఖ రుణాల కోసం మరికొందరు దరఖాస్తు చేసుకున్నారని మత్స్యశాఖ అధికారులు కనీసం భూముల వెరిఫికేషన్ చేయకుండా గుడ్డిగా రుణాలు మంజూరు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఆధారాలతో సహా ఈ అక్రమాలను నిరూపిస్తామని స్పష్టంచేశారు. రుణాలు మంజూరుచేసిన అధికారులతో పాటు భూములు స్వాహా చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంపై పూర్తిస్థాయిలో విచారణ జరపాలని విజ్ఞప్తి చేశారు. ఇదిలా ఉండగా దిండి గ్రామంలో ఫార్మా కంపెనీ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ప్రయత్నాలు జరుపుతోందని, దీన్ని స్థానిక ప్రజలు ప్రతిఘటిస్తున్నట్లు మోపిదేవి కలెక్టర్ దృష్టికి తెచ్చారు. కాగా పొన్నూరు నియోజకవర్గం పరిధిలోని పెదకాకాని సర్పంచ్ ఎస్టీ మహిళ తులసీబాయిపై అధికార పార్టీ నేతలు వేధింపులకు పాల్పడుతున్నారని, ఆమె చెక్‌పవర్ రద్దుచేయించడంతో పాటు ఇతరత్రా ఇబ్బందులకు గురిచేస్తున్నారని రావి వెంకటరమణ కలెక్టర్‌కు వివరించారు.
నిరూపిస్తే రాజీనామా- ఎమ్మెల్యే అనగాని
ఇదిలా ఉండగా దిండిలో భూముల వ్యవహారంపై ఇప్పటికే విచారణకు తాను అధికారులకు సూచించామని తమ అనుచరులు భూ కబ్జాకు గురైనట్లు నిరూపిస్తే రాజీనామా చేస్తామని రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ స్పష్టంచేశారు. దిండిలో భూ కబ్జా బాగోతంపై ఆయన ఆంధ్రభూమితో మాట్లాడుతూ గ్రామంలో దాయాదుల నుంచి అనుభవంలో ఉన్న వ్యక్తులు వాటిని విక్రయించారని అయితే వైసీపీ కార్యకర్తలే ఇందులో ముందు వరుసలో ఉన్నారనేది గుర్తుంచుకోవాలన్నారు. తన అనుచరులు, కుటుంబ సభ్యుల ప్రమేయం లేదన్నారు. ఇష్టారాజ్యంగా ఇచ్చిన అనుమతులపై తానే సంబంధిత వీఆర్వోను ప్రశ్నించానని చెప్పారు. దీంతో గ్రామ వీఆర్వోపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాగా దిండి గ్రామంలో ఫార్మాసిటీ వైఎస్ హయాంలోనే ప్రతిపాదించారని గుర్తు చేశారు. ఇది వైసీపీ నేతలు వెలుగులోకి తెచ్చిన వ్యవహారంకాదని, గత కొద్ది రోజుల క్రితమే తాను అధికారులతో చర్చించి భూముల వ్యవహారం తేల్చాలని ఆదేశించినట్లు వివరించారు.