గుంటూరు

మూడు లక్షల హెక్టార్లు దాటిన సాగు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, ఆగస్టు 17: ఖరీఫ్ ప్రారంభంలో తీవ్ర వర్షాభావం నెలకొన్నప్పటికీ ఆగస్టు ప్రారంభం నుంచి కురుస్తున్న వర్షాల పుణ్యమా అని జిల్లాలో సాగు ఊపందుకుంది. జిల్లాలో ఖరీఫ్‌లో 5,39,604 హెక్టార్ల సాధారణ సాగువిస్తీర్ణం కాగా, ఈ ఏడాది 5,44,395 హెక్టార్లలో పంటలు సాగుచేయాలని వ్యవసాయ శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. అయితే ఖరీఫ్ ప్రారంభమైన జూన్, జూలై నెలల్లో వర్షాభావం నేపథ్యంలో జూన్ నెలలో 18 శాతం తక్కువగానూ, జూలైలో 29 శాతం తక్కువగానూ వర్షపాతం నమోదైంది. దీంతో ఆశించిన మేర పంటల సాగు ముందుకు సాగలేదు. అయితే ఆగస్టు ప్రారంభం నుంచి వర్షాలు అడపా దడపా వర్షాలు పడుతుండటంతో పంటల సాగువైపు అన్నదాతలు దృష్టిపెట్టారు. ఆగస్టులో 87.8 మిల్లీమీటర్ల సరాసరి వర్షపాతం కాగా ఇప్పటికే 145.7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. వర్షాలు దండిగా పడుతుండటంతో జిల్లావ్యాప్తంగా వరి, ప్రత్తి, మిరప వంటి ప్రధాన పంటలను రైతులు సాగు చేస్తున్నారు. శుక్రవారం నాటికి జిల్లావ్యాప్తంగా 3,04,847 హెక్టార్లలో వివిధ పంటలను రైతులు సాగు చేశారు. ఇదే సమయానికి గత ఏడాది 2,87,750 హెక్టార్లలో పంటలు సాగయ్యాయి. ఈ ఏడాది జిల్లావ్యాప్తంగా ఖరీఫ్‌లో 1,83,836 హెక్టార్లలో వరి సాగుచేయాల్సి ఉండగా ఇప్పటివరకు 85,572 హెక్టార్లలో రైతులు వరినాట్లు వేశారు. ఎన్‌ఎస్‌పి కుడికాల్వ పరిధిలో దాదాపు 90 వేల హెక్టార్లలో వరి సాగు చేయాల్సి ఉన్నప్పటికీ నీరు విడుదల కాకపోవడంతో ఆయా ప్రాంతాల్లో ఆరుతడి పంటలకు రైతులు మొగ్గు చూపుతున్నారు. కృష్ణా పశ్చిమడెల్టా ప్రాంతంలో మాత్రం ఖరీఫ్ ప్రారంభం నుంచి పట్టిసీమ నీరు విడుదల చేయడంతో సకాలంలో వరినాట్లు పడుతున్నాయి. కాగా జిల్లాలో అత్యధికంగా సాగుచేసే మరో వాణిజ్య పంట అయిన పత్తిసాగుపైనా రైతులు మక్కువ చూపుతున్నారు. ఇప్పటికే 1,47,419 హెక్టార్లలో పత్తి విత్తనాలు నాటారు. గత ఏడాది ఇదే సమయానికి 1,60,316 హెక్టార్లలో రైతులు పత్తిని సాగుచేశారు. వర్షాభావం కారణంగా పత్తిసాగు కొంతమేర ఆలస్యంగా ప్రారంభమైంది. మరో వాణిజ్యపంట అయిన మిర్చిని సైతం రైతులు అధికంగానే సాగుచేస్తున్నారు. జిల్లాలో సరాసరి 58,319 హెక్టార్లలో మిర్చిని సాగుచేస్తుండగా ఈ ఏడాది ఇప్పటివరకు 17,474 హెక్టార్లలో మిర్చి నారు నాటారు. గత ఏడాది ఇదే సమయానికి కేవలం 11,924 హెక్టార్లలో మాత్రమే సాగైంది. వర్షాభావం కారణంగా కంది, పెసలు, మినుము వంటి పప్పుదినుసుల పంటలు సైతం సాగుచేసేందుకు రైతులు మక్కువ చూపారు. ఈ ఏడాది 23,767 హెక్టార్లలో రైతులు పప్పుదినుసుల పంటలను సాగుచేస్తున్నారు. జొన్న, మొక్కజొన్న, రాగి వంటి అపరాల సాగుపై రైతులు పెద్దగా దృష్టిపెట్టిన దాఖలాలు లేవు. మొత్తమీద రైతులు వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొని సాగుకు శుభారంభం పలికారు.