గుంటూరు

సవాలక్ష ఆంక్షలకు నిరసనగా కలెక్టరేట్ ఎదుట ఆటో డ్రైవర్ల ధర్నా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు (కొత్తపేట), ఏప్రిల్ 25: విద్యార్హత ఉన్నా, నిరక్షరాస్యులుగా ఉన్నా ప్రభుత్వంపై ఆధారపడకుండా బతుకుబండిని ముందుకు సాగిస్తున్న ఆటోడ్రైవర్లపై ప్రభుత్వం, అధికారులు విధిస్తున్న సవాలక్ష ఆంక్షలతో వారి కుటుంబ ఆర్థిక పరిస్థితి దయనీయంగా మారుతోందని సిఐటియు జిల్లా అధ్యక్షుడు కె నళినీకాంత్ ఆందోళన వ్యక్తంచేశారు. నగరంలోకి ఆటోలను అనుమతించాలి, ఎడా పెడా అపరాధ రుసుం విధించే విధానానికి స్వస్తిపలకాలని డిమాండ్ చేస్తూ సోమవారం వందలాది మంది ఆటోడ్రైవర్లు రోడ్డెక్కారు. మండుటెండలో కలెక్టరేట్ వద్ద తమ ఆందోళన వ్యక్తంచేశారు. ధర్నాకు నాయకత్వం వహించిన నళినీకాంత్ మాట్లాడుతూ గుంటూరులో తిరిగే ఆటోలలో 11 వేల ఆటోలనే నగరంలోకి అనుమతిస్తామని, రూరల్ రిజిస్ట్రేషన్‌తో ఉన్న 25 వేల ఆటోలను అనుమతించేది లేదని అధికారులు చెప్పడం అన్యాయమన్నారు. వీరిలో చాలా మంది గుంటూరులోనే నివాసం ఉంటున్నారని, ఆంక్షల కారణంగా ఆటోడ్రైవర్లు తమ ఇళ్లకు రావాల్సి వచ్చినప్పటికీ అపరాధ రుసుం విధిస్తుండటం సరైన పద్ధతి కాదన్నారు. అసమంజసం, అన్యాయంగా ఉన్న ఈ నిబంధనను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. జిల్లా ఆటోడ్రైవర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి నన్నపనేని శివాజీ మాట్లాడుతూ ఆటో కంపెనీ యజమానులు, ఫైనాన్సర్లు, ఏజెంట్లు కుమ్మక్కై రూరల్ రిజిస్ట్రేషన్ ఆటోలు అమ్మారని, దీనికి ఆర్టీయే అధికారులు కూడా సహకరించారని ఆరోపించారు. ఒక్క పెదకాకాని గ్రామంలోనే 11 వేల ఆటోలు రిజిస్ట్రేషన్ చేయించారని తెలిపారు. గుంటూరు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఈ నిబంధన వల్ల గుంటూరులోకి రావాలంటే రెండు మూడు ఆటోలు మారాల్సి వస్తోందని, ఆసుపత్రులు, కళాశాలలు ఇతర అవసరాలకు వెళ్లాల్సిన వారు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. ప్రధాన కార్యదర్శి షేక్ మస్తాన్‌వలి మాట్లాడుతూ నగరంలో నివాసముండే ఆటోడ్రైవర్లను నగరంలో ఆటోలు తిప్పుకునేందుకు అనుమతించాలనీ, రూరల్ గ్రామ ఆటోడ్రైవర్లను కూడా కొన్ని పరిమితులతో నగరంలోకి అనుమతించాలని డిమాండ్ చేశారు. నగర కోశాధికారి షేక్ ఖాశిం షహీద్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో బాషా, యాకోబు, శివ, సమీవుల్లా, రమేష్, రవివర్మ, మురళి, కొండలు, శంకర్, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. అనంతరం జిల్లా పరిషత్ గ్రీవెన్స్ వరకు ప్రదర్శన నిర్వహించి కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు.
ఎఐటియుసి ఆధ్వర్యంలో ఛలో కలెక్టరేట్...
ఆటోడ్రైవర్ల పట్ల ప్రభుత్వం, పోలీసు, ట్రాఫిక్ అధికారులు అనుసరిస్తున్న పద్ధతిని మార్చుకోవాలని డిమాండ్ చేస్తూ ఎఐటియుసి ఆధ్వర్యంలో సోమవారం ఛలో కలెక్టర్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎఐటియుసి జిల్లా ఉపాధ్యక్షుడు జంగాల అజయ్‌కుమార్ మాట్లాడుతూ అధికారుల అర్థం పర్థంలేని నిబంధనలతో ఆటో కార్మికుల కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి నెలకొందని, వెంటనే నిబంధనలను సడలించి ఆటోరంగ కార్మికులను ఊరట కల్పించాలని కోరారు. లేకుంటే ప్రదర్శనలు, ధర్నాలు, ఆందోళనలతో ప్రభుత్వానికి బుద్ధిచెబుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో కోట మాల్యాద్రి, అమీర్‌వలి, బుజ్జి, కోటేశ్వరరావు, పిచ్చయ్య, రమేష్, పాశం మధు తదితరులు పాల్గొన్నారు.