గుంటూరు

ప్రత్యేక హోదా రాష్ట్రానికి సంజీవనే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు (కొత్తపేట), సెప్టెంబర్ 6: లోటు బడ్జెట్‌లో ఉన్న రాష్ట్రానికి ప్రత్యేకహోదా నిజంగా సంజీవని లాంటిదేనని ది గుంటూరు చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు ఆతుకూరి ఆంజనేయులు పేర్కొన్నారు. మంగళవారం ఛాంబర్ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రానికి ప్రత్యేకహోదా వస్తే పరిశ్రమలకు రాయితీలు వస్తాయని, పరిశ్రమల కోసం విదేశీ పర్యటనలు చేయాల్సిన అవసరం ఉండదన్నారు. నూతన పరిశ్రమలు ఏర్పాటైతే నిరుద్యోగ సమస్య దాదాపుగా తీరుతుందన్నారు. రాష్ట్ర విభజన సమయంలో ఎపికి ఐదేళ్లు కాదు పదేళ్లపాటు ప్రత్యేక హోదా కల్పించాలని మాట్లాడిన వెంకయ్య నాయుడు అధికారంలోకి వచ్చాక హోదా విషయానే్న విస్మరించారని దుయ్యబట్టారు. తెలుగుదేశం ప్రభుత్వం, బిజెపి ఎన్నికల ముందు ప్రత్యేకహోదాతో పాటు రాయితీలను కల్పిస్తామని చెప్పి ప్రజలను మోసం చేశాయన్నారు. రాజధాని నిర్మాణంలో 33 వేల ఎకరాల భూములను గుంటూరు జిల్లాలోనే తీసుకుని కార్యాలయాలను విజయవాడకు తరలిస్తున్నారని, దీనివలన జిల్లా అభివృద్ధి కుంటుపడే ప్రమాదం ఉందన్నారు. భవిష్యత్ తరాలు దెబ్బతినకుండా ఉండాలంటే గుంటూరు జిల్లాలోనే ప్రధాన పరిపాలనా కార్యాలయాలతో పాటు అభివృద్ధి పనులకు ప్రాధాన్యత కల్పించాలని ఆంజనేయులు డిమాండ్ చేశారు. టిడిపి బిజెపితో పొత్తుకోసం వెంపర్లాడకుండా ప్రజాసంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని హోదా, రాయితీలను తెచ్చేందుకు వామపక్షాలతో కలిసి ఉద్యమించాలన్నారు. విలేఖర్ల సమావేశంలో ఛాంబర్ కార్యదర్శి రంగా బాలకృష్ణ, గొల్లపూడి రాంబాబు, ఉపాధ్యక్షుడు షరాబు కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.

ఎయిమ్స్ ప్రాంగణాన్ని
పరిశీలించిన కేంద్ర బృందం
మంగళగిరి, సెప్టెంబర్ 6: పట్టణ శివారులోని పూర్వపు టీబీ శానిటోరియం ఆస్పత్రి ప్రాంగణంలో నిర్మించ తలపెట్టిన అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్) ప్రాంగణాన్ని సోమవారం కేంద్రబృందం సభ్యులు డాక్టర్ నితిన్ నాగర్‌కర్ (డైరెక్టర్ ఎయిమ్స్), సుదీప్ శ్రీవాస్తవ ( పిఎన్‌ఎస్‌ఎస్‌వై డివిజన్), డికె శర్మ (డైరెక్టర్ న్యూఢిల్లీ ఎయిమ్స్), కె శర్మ (కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ కన్సల్టెంట్ ఇంజినీర్), రాజీవ్ కనోజియా (సీనియర్ ఆర్కిటెక్) సందర్శించారు. నిర్మాణంలో ఉన్న ప్రహరీ గోడను కేంద్ర బృందం సభ్యులు నిశితంగా పరిశీలించారు.
190 ఎకరాల ఎయిమ్స్ ప్రాంగణాన్ని కేంద్ర బృందం నలువైపులా పరిశీలించింది. అటవీ, విద్యుత్, రెవిన్యూ, ఆరోగ్యశాఖ అధికారులతో కేంద్రబృందం సమావేశమై ఎయిమ్స్ నిర్మాణ పనులు ప్రారంభానికి అవసరమైన సదుపాయాల కల్పనపై చర్చించారు. ఈ సందర్భంగా కేంద్రబృందం సభ్యులు విలేఖర్లతో మాట్లాడుతూ 2019 నాటికి ఎయిమ్స్ నిర్మాణం పూర్తి చేయాలనే లక్ష్యంగా ఉందని, వచ్చేనెల డిజైన్లు పూర్తి కాగానే గ్లోబర్ టెండర్లు పిలవడం జరుగుతుందని, నవంబర్ మాసానికల్లా టెండర్లు ఫైనలైజ్ చేసి నిర్మాణ పనులు ప్రారంభిస్తారని చెప్పారు. స్థానికంగా ఉన్న వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో చర్చించడానికి తమ బృందం పర్యటిస్తోందన్నారు. ఎయిమ్స్ నిర్మాణానికి అవసరమైన వసతి సదుపాయాల కల్పనకు తీసుకోవాల్సిన చర్యలను చర్చించామన్నారు. సోమ, మంగళ వారాల్లో తమ బృందం విజయవాడ, గుంటూరుల్లో పర్యటిస్తుందని, త్వరలోనే ఎయిమ్స్‌పై నివేదికను అందజేస్తామని కేంద్రబృందం సభ్యులు తెలిపారు.
డిఎఫ్‌ఓ మోహనరావు, విద్యుత్ శాఖ ఎస్‌ఈ జయభారతరావు, ఏడీఈ రాజేష్‌ఖన్నా, డిఎం అండ్ హెచ్‌ఓ పద్మజారాణి, గుంటూరు ఆర్‌డిఓ శ్రీనివాసరావు, తహశీల్దార్ విజయలక్ష్మి, డిఎంఈ సుబ్బారావు, సిద్ధార్ధ కళాశాల ప్రిన్సిపాల్ తదితరులు కేంద్రంబృందం వెంట ఉన్నారు. గతేడాది డిసెంబర్ 19న ఎయిమ్స్ నిర్మాణానికి కేంద్రమంత్రి జెపి నడ్డా , ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శంకుస్థాపన గావించిన సంగతి తెలిసిందే. గడిచిన 9 నెలలుగా ప్రహరీ గోడ నిర్మాణమే పూర్తికాలేదు. సుమారు 1618 కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం ఎయిమ్స్ నిర్మాణానికి మంజూరు చేసింది. విద్యుత్, నీటి సరఫరా వంటి వౌలిక వసతులను ప్రాథమిక దశలో కల్పించేందుకు రాష్ట్రప్రభుత్వం ముందుకు వచ్చింది.

శాంతి భధ్రతలకు విఘాతం కలిగిస్తే రౌడీ షీట్
* డిఎస్‌పి మధుసూదనరావు
సత్తెనపల్లి, సెప్టెంబర్ 6: వినాయక చవితి ఉత్సవాల్లో మద్యం సేవించి శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై రౌడీ షీటు ఓపెన్ చేస్తామని డిఎస్పీ ఎం మధుసూదనరావు స్పష్టం చేశారు. మంగళవారం స్థానిక రూరల్ పోలీస్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. సత్తెనపల్లి ఏరియా వాళ్లు అమరావతిలోనూ, అచ్చంపేట ఏరియా వాళ్లు క్రోసూరు, కస్తలలోనూ, పిడుగురాళ్ళ ఏరియా వాళ్లు మాచవరం మండలం గోవిందాపురం పుష్కర ఘాట్ల సమీపంలో మాత్రమే విగ్రహాలను నిమజ్జనం చేయాలని అన్నారు. వినాయక నిమజ్జన కార్యక్రమాన్ని నిర్వాహకులు కట్టుదిట్టమైన జాగ్రత్తలతో నిర్వహించుకోవాలని చిన్న విగ్రహాలను పెద్ద విగ్రహాల వద్దకు చేర్చుకొని వారు ఏర్పాటు చేసుకున్న వాహనంపైనే వెళ్ళి నిర్దేశించిన ప్రదేశంలో మాత్రమే నిమజ్జనం చేయాలన్నారు. రాత్రిపూట నిమజ్జనానికి అనుమతించమని స్పష్టం చేశారు. నిమజ్జన కార్యక్రమాల్లో పిల్లలు పాల్గొనకుండా చూసే బాధ్యత తల్లిదండ్రులదేనని అన్నారు. నిమజ్జనానికి విగ్రహాన్ని తీసుకువెళ్లేందుక రికార్డులు సరిగా లేని వాహనాలను అనుమతించ వద్దని సిఐ, ఎస్సైలకు ఆయన ఆదేశాలు జారీచేశారు. సత్తెనపల్లి డివిజన్ పరిధిలో సుమారు 400 విగ్రహాలను ఏర్పాటు చేసుకొనేందుకు అనుమతులను పొందారని వివరించారు. రికార్డు డ్యాన్సులు వేస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ సమావేశంలో సత్తెనపల్లి రూరల్ సి ఐ కోటేశ్వరరావు, సత్తెనపల్లి పట్టణ ఎస్సైలు ప్రకాషరావు, భుజంగరావు, ముప్పాళ్ళ ఎస్సై పిచ్చయ్య, సత్తెనపల్లి రూరల్ ఎసై వెంకట్రావ్, అచ్చంపేల ఎస్సై రాజేశ్వరరావు, క్రోసూరు ఎస్సై బ్రహ్మంలు పాల్గొన్నారు.