గుంటూరు

నిరంతర శ్రమతోనే కలలు సాకారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, డిసెంబర్ 3: విద్యార్థులు తమ కలలను సాకారం చేసుకునేందుకు నిరంతరం పట్టుదలతో కృషి చేయాలని బిసిసిఐ సీనియర్ సెలక్షన్ కమిటీ చైర్మన్, హిందూ కళాశాల పూర్వ విద్యార్థి ఎమ్మెస్కే ప్రసాద్ అన్నారు. శనివారం స్థానిక హిందూ కళాశాలలోని ఏకా దండయ్య పంతు లు హాలులో కళాశాల పాలకమండలి ఆధ్వర్యాన నిర్వహించిన ప్రసాద్ సత్కార సభకు పాలకమండలి అధ్యక్షుడు ఎస్‌విఎస్ సోమయాజి అధ్యక్షత వహించారు. ఈసందర్భంగా ఎమ్మెస్కే ప్రసాద్ మాట్లాడుతూ హిందూ కళాశాలలో ఇంటర్, డిగ్రీ విద్యాభ్యాసం చేస్తున్నప్పుడే తన క్రీడాజీవితానికి పునాదులు పడ్డాయన్నారు. మహేంద్రసింగ్ ధోనీ, కోహ్లీలతో తనకున్న సంబంధాలు, ఆట పట్ల నిబద్ధత గురించి వి ద్యార్థులకు వివరించారు. తన జీవితంలోనూ అనేక ఆటుపోట్లు ఎదురైనా ధైర్యంగా ఎదుర్కొన్నానన్నారు. కళాశాలలో గతంలో జరిగిన మధురస్మృతులు గుర్తుకు వస్తున్నాయన్నారు. కళాశాల అధ్యాపకులు, యాజమాన్యం చూపిన ఆదరాభిమానాలు మరువలేనివని ప్రసాద్ వివరించారు. సౌత్ కోస్టల్ జోన్ ఐజి సంజయ్ మాట్లాడుతూ తాను యువకునిగా ఉన్నప్పుడు క్రికెటర్‌ని కావాలనుకున్నానని, అయితే ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో ఐపిఎస్ అధికారినయ్యానన్నారు. ఎమ్మెస్కే నైతిక విలువలను కాపాడుకుంటూ లక్ష్యం కోసం శ్రమిస్తూ గమ్యానికి చేరుకున్నారన్నారు. నిజాయతీ, నిబద్ధతలే లక్ష్యాలకు చేరువ చేస్తాయని తెలిపారు. కళాశాల పాలకమండలి అధ్యక్షుడు ఎస్‌విఎస్ సోమయాజి మాట్లాడుతూ జీవితంలో క్రీడలకు ఎంతో ప్రాముఖ్యత ఉందన్నారు. అయితే ఎమ్మెస్కే జీవితానే్న క్రికెట్‌కు అంకితం చేసి రాణించారన్నారు. సభలో పాలకమండలి కార్యదర్శి ఎంవిఆర్‌కె ముత్యాలు, ఉపాధ్యక్షుడు జి శివరామప్రసాద్, సభ్యులు డాక్టర్ మన్నవ రాధాకృష్ణమూర్తి, ప్రిన్సిపాల్ డాక్టర్ కనకదుర్గ, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ విజయలక్ష్మి, అధ్యాపక సంఘం అధ్యక్ష, కార్యదర్శులు డిఎన్ దీక్షిత్, ఎఎంకె ప్రసాద్, అధ్యాపకులు యల్లాప్రగడ మల్లిఖార్జునరావు, కెవిఎస్ దుర్గాప్రసాద్, ఎ రాజశేఖర్, గౌరీశంకర్, పిడిలు రాజ్యలక్ష్మి, రవికుమార్ పాల్గొన్నారు.

బంగారం షాపులో ఐటీ తనిఖీలు

తెనాలి, డిసెంబర్ 3: పెద్దనోట్ల రద్దు తరువాత కేంద్ర ప్రభుత్వం బంగారు ఆభరణాల కొనుగోళ్లపై దృష్టి సారించిన నేపథ్యంలో శనివారం తెనాలి పట్టణంలో ఓ బంగారు దుకాణంలో ఇన్‌కమ్ టాక్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. స్థానిక ట్రావెల్స్ బంగ్లా రోడ్‌లోని భవదేవ్ జ్యుయలర్స్‌లో ఐటి అధికారుల ప్రత్యేక బృందం తనిఖీలు జరిపారు. ఈ సందర్భంగా అధికారులు దుకాణంలోని సరుకు నిల్వలు, కొనుగోళ్ల రశీదులు, అకౌంటు పుస్తకాలను పరిశీలించారు. ఇదిలావుండగా పెద్దనోట్లను కేంద్ర ప్రభుత్వం రద్దుచేసిన నాటి నుండి పెద్దమొత్తంలో ఈ షాపులో బంగారు నగల విక్రయాలు జరిగినట్లు, వ్యాపారి బ్యాంకు ఖాతాలో పెద్దమొత్తంలో పాతనోట్లు జమఅయినట్లు తెలియటంతో ఐటి అధికారులు దాడులు నిర్వహించినట్లు పట్టణంలో ప్రచారం జరుగుతోంది. అధికారుల దాడులు రాత్రి 7 గంటల వరకు కొనసాగాయ. విషయం తెలుసుకున్న పలు బంగారు దుకాణాల యజమానులు షాపులు మూసివేశారు.

నగరాభివృద్ధి పనులు వేగవంతం
* సమీక్ష సమావేశంలో మంత్రి నారాయణ ఆదేశం
గుంటూరు (కార్పొరేషన్), డిసెంబర్ 3: గుంటూరు నగరాన్ని అన్నివిధాలా అభివృద్ధి చేసేందుకు తాము కృషి చేస్తున్నామని, నగరంలో జరుగుతున్న అభివృద్ధి పనులను వేగవంతం చేసేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని పురపాలక శాఖ మంత్రి పి నారాయణ ఆదేశించారు. శనివారం రాత్రి నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశ మందిరంలో వివిధ విభాగాధికారులతో నగరంలో జరుగుతున్న అభివృద్ధి పనులపై ఆయన సమీక్ష నిర్వహించారు. తొలుత పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా నగరంలో జరుగుతున్న అభివృద్ధి పనుల స్థితిని, సిడిఎంఎ డాష్‌బోర్డులో పొందుపర్చిన ఫొటోలను, జిపిఎంఎస్ ద్వారా పనుల అంచనాలను మంత్రికి వివరించారు. ఈసందర్భంగా నారాయణ మాట్లాడుతూ సిడిఎంఎ డాష్‌బోర్డులో పనుల స్థితిని ఎప్పటికప్పుడు ఫొటోలతో సహా క్రమపద్ధతిలో అప్‌డేట్ చేయాలని సూచించారు. కొత్తగా అమలులోకి తెచ్చిన జిపిఎంఎస్ సాఫ్ట్‌వేర్ ద్వారా పనుల అంచనాలు, ఎం-బుక్ రికార్డింగ్, తదితర అంశాలను క్షుణ్ణంగా పరిశీలించి అప్‌లోడ్ చేయాలన్నారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ కింద కొత్తగా సుమారు 70 కోట్ల రూపాయల మంజూరుకు చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. ఇందులో రూ.60కోట్లు ఎస్సీ సబ్‌ప్లాన్ కింద, మరో రూ.10కోట్లు ఎస్టీ సబ్‌ప్లాన్ కింద పనులు చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. గతంలో మొత్తం 50కోట్ల రూపాయలను ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ కింద మంజూరు చేశామని, నగరాభివృద్ధి దృష్ట్యా 2017 సంవత్సరానికి సంబంధించి 70కోట్ల రూపాయలను వెచ్చించనున్నామన్నారు. నగరపాలక సంస్థ కమిషనర్ 15 రోజులకు ఒకసారి పనులపై సమీక్ష నిర్వహించి, అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. నగరంలో జరుగుతున్న 772 పనుల్లో 35శాతం వరకు పనుల్లో పురోగతి మెరుగుపడాల్సి ఉందన్నారు. కాంట్రాక్టర్లు అగ్రిమెంట్ నిర్దేశిత గడువులోపు నాణ్యతా ప్రమాణాలతో పనులను పూర్తిచేసేలా చూడాలని ఆదేశించారు. సింగపూర్ స్థాయిలో ఎంత ఖర్చుతో పనులు చేపడుతున్నారో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా నగరాభివృద్ధికి అంత మొత్తాన్ని వెచ్చిస్తుందని, సింగపూర్ స్థాయిలో గుంటూరు నగరాభివృద్ధి సాధించాలని నారాయణ స్పష్టం చేశారు. అన్ని మున్సిపాలిటీల్లోనూ పనుల పురోగతిని ఎప్పటికప్పుడు తాము సమీక్షిస్తామని తెలిపారు. సమావేశంలో కమిషనర్ ఎస్ నాగలక్ష్మి, సూపరింటెండెంట్ ఇంజనీర్ గోపాలకృష్ణరెడ్డి, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు రాంనాయక్, వెంకట్రావ్, లక్ష్మయ్య, అసిస్టెంట్ ఇంజనీర్లు, వివిధ విభాగాధిపతులు పాల్గొన్నారు.

అక్రమ వెంచర్లు
ధ్వంసం
యడ్లపాడు, డిసెంబర్ 3: యడ్లపాడు మండలంలో విచ్చలవిడిగా అక్ర మ లేఅవుట్లతో వెలసిన వెంచర్ల తొలగింపు పనులు కొనసాగుతున్నాయి. సిఆర్‌డిఏ అధికారుల బృందం శనివారం కోట, చంఘీస్‌ఖాన్‌పేట, సొలస గ్రామాల్లో అనుమతులు లేకుండా వేసిన నాలుగు వెంచర్లను ధ్వంసం చేశారు. కోట గ్రామంలో 2, సొలస, చంఘీస్‌ఖాన్‌పేట గ్రామాల్లో ఒక్కొక్కటి చొప్పున వేసిన వెంచర్లకు అనుమతులు లేవని, ఇలాంటివి కొనడం వల్ల కొనుగోలుదారులు అనేక ఇబ్బందులకు గురవుతారని సిఆర్‌డిఏ డెప్యూటీ జోనల్ మేనేజర్ బాలాజీ తెలిపారు. ఈ ప్లాట్లకు వేసిన రాళ్లను తొలగించి రోడ్లను యంత్రాలతో ధ్వంసం చేశారు. కాగా మండలంలో వెంచర్లను ధ్వంసం చేయడం ఇది రెండోసారి. ఎక్కడో ఉన్న సిఆర్‌డిఏ అధికారుల దృష్టికి వచ్చిన అక్రమ వెంచర్ల విషయం యడ్లపాడు మండల రెవెన్యూ అధికారుల దృష్టికి రాకపోవడం వెనుక ఉన్న చిదంబర రహస్యమేమిటని పలువురు గుసగుసలాడుతున్నారు.

గ్రామీణ విద్యార్థులు
ఆంగ్ల భాషపై పట్టు సాధించాలి

చిలకలూరిపేట, డిసెంబర్ 3: గ్రామీణ ప్రాంతాల్లో ఉంటూ కళాశాలకు వచ్చే విద్యార్థులు ఆంగ్ల భాషలో ప్రావీణ్యం సాధించడం ద్వారా సత్ఫలితాలు పొందవచ్చని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ లావు నాగేశ్వరరావు అన్నారు. శనివారం ఆయన పట్టణంలోని విద్యా సంఘం అధ్యక్షుడు తేళ్ల సుబ్బారావు ఇంటికి వచ్చారు. అనంతరం ఆర్‌విఎస్ సివిఎస్ హైస్కూల్‌లో విద్యా సంఘం పాలక మండలి సభ్యులు, విద్యార్థులతో కొద్దిసేపు మాట్లాడారు.
బిఆర్‌ఎన్‌ఎస్‌సివిఎస్ కళాశాలలో విద్యార్థులతో ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈసందర్భంగా జస్టిస్ నాగేశ్వరరావు ప్రసంగిస్తూ ఏ ప్రాంతానికి వెళ్లినా ఆంగ్ల భాష ముఖ్యమని, అలాంటి భాషపై పట్టు సాధించేందుకు విద్యార్థులు కృషి చేయాలన్నారు.
ఉద్యోగ సంఘం అధ్యక్షుడు తేళ్ల సుబ్బారావు, సభ్యులు గంటా జగన్నాథం, బేతంచర్ల రామకోటేశ్వరరావు, కళాశాల ప్రిన్సిపాల్ రమణి, హైస్కూల్ హెచ్‌ఎం ఉప్పలపాటి వెంకటేశ్వరరావు, విద్యార్థులు పాల్గొన్నారు.

స్నేహభావానికి క్రీడాస్ఫూర్తి దోహదం

* ఎమ్మెల్యే కొమ్మాలపాటి
అమరావతి, డిసెంబర్ 3: విద్యార్థినీ, విద్యార్థుల్లో క్రీడాస్ఫూర్తి మెండుగా ఉంటేనే స్నేహభావం పెంపొందుతుందని పెదకూరపాడు ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీ్ధర్ అన్నారు. శనివారం స్థానిక శ్రీ రామకృష్ణ హిందూ హైస్కూల్‌లో ప్రారంభమైన రాష్టస్థ్రాయి టెన్నిస్ వాలీబాల్ పోటీలు ప్రారంభ సభలో ఆయన ముఖ్యఅతిథిగా ప్రసంగించారు. ఈసందర్భంగా జరిగిన సభకు హైస్కూల్ ఉపాధ్యాయురాలు మంజుల అధ్యక్షత వహించారు. క్రీడాస్ఫూర్తితో పోటీల్లో తలపడాలని, గెలుపోటములు సహజమని క్రీడాకారులంతా గుర్తించాలని శ్రీ్ధర్ సూచించారు. హైస్కూల్ కరస్పాండెంట్ మల్లెల శ్రీనాథ్ చౌదరి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతంలో ఉన్న తమ హైస్కూల్ జిల్లాస్థాయి, రాష్టస్థ్రాయి క్రీడల్లో అగ్రభాగాన నిలిచిందన్నారు. సభలో టెన్నిస్ వాలీబాల్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ డేవిడ్, కార్యదర్శి ఎస్ సాంబశివరావు, ఉపాధ్యక్షుడు దేవీప్రసాద్, టిడిపి నాయకులు షేక్ మాబుసుభాని, పెనుముచ్చు రామకృష్ణ, ఎంఇవో తెనాలి ఇందిర ప్రసంగించారు. తొలుత ఎమ్మెల్యే శ్రీదర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. టెన్నిస్ వాలీబాల్ పోటీలను బంతి విసిరి ప్రారంభించారు. సబ్ జూనియర్ బాలుర విభాగంలో పశ్చిమ గోదావరి, గుంటూరు, వైజాగ్ జట్లు వరుస స్థానాల్లో నిలిచాయి. బాలికల్లో పశ్చిమ గోదావరి, గుంటూరు, చిత్తూరు జట్లు గెలుపొందాయి. జూనియర్స్ బాలికల్లో పశ్చిమ గోదావరి, గుంటూరు, బాలురలో గుంటూరు, విజయనగరం మొదటి రెండు స్థానాలను కైవసం చేసుకున్నాయని వ్యాయామ ఉపాధ్యాయులు జయరాం, అనూరాధ తెలిపారు. తొలుత ఎమ్మెల్యే శ్రీ్ధర్ స్వచ్ఛ భారత్‌లో భాగంగా అమరావతిలోని మురికి కాల్వలు, ప్రధాన వీధులను పరిశీలించారు.

యువజనోత్సవం-16లో
సాంస్కృతిక పోటీల విజేతలు వీరే

నరసరావుపేట, డిసెంబర్ 3: స్థానిక ఎంఎఎం, డాక్టర్ కెఎస్‌పిఆర్ కళాశాలల్లో అంతర్ కళాశాలల క్రీడలు, సాంస్కృతిక పోటీల యువజనోత్సవం-2016 పోటీల్లోని సాంస్కృతిక పోటీల ఫలితాలను కళాశాల చైర్మన్ మేదరమెట్ల రామశేషగిరిరావు వెల్లడిం చారు. శుక్ర, శనివారాల్లో నిర్వహించిన ఈ పోటీల్లోని విజేతలను ప్రకటించారు. ఏకపాత్రాభినయం పోటీల్లో గుంటూరు హిందూ కళాశాల డీఎడ్ విద్యార్థులు ప్రథమ స్థానం, సెయింట్ మార్క్ ఎన్టీఆర్ డిఇడి నరసరావుపేట కళాశాల విద్యార్థి ద్వితీయ స్థానం సాధించినట్లు తెలిపారు. అదే విధంగా మ్యూజికల్ ఇన్‌స్ట్రమెంట్‌లో రావిపాడు శ్రీకృష్ణ చైతన్య డిఇడి కళాశాలకు ప్రథమ, బోయపాలెం ప్రభుత్వ డైట్ కళాశాలకు ద్వితీయ స్థానం లభించింది. జానపద బృంద నృత్యంలో గుంటూరు సెయింట్ జోసెఫ్ డిఇడి కళాశాల ప్రథమ, పల్లెకోన అన్నం డేవిడ్ డిఇడి కళాశాలకు ద్వితీయ స్ధానం లభించింది. మూకాభినయంలో బోయపాలెం ప్రభుత్వ డైట్ కళాశాలకు ప్రథమ, నరసరావుపేట సెయింట్ మార్కు ఎన్టీఆర్ డీఈడీ కళాశాలకు ద్వితీయ స్థానం లభించింది. విచిత్ర వేషధారణ పోటీల్లో నరసరావుపేటకు చెందిన సెయింట్ మార్క్ ఎన్టీఆర్ డీఈడీ కళాశాల ప్రథమ, బోయపాలెం ప్రభుత్వ డైట్ కళాశాలకు ద్వితీయ స్థానం లభించింది. వ్యాస రచన పోటీల్లో నరసరావుపేటకు చెందిన అబ్దుల్ కలాం డీఈడీ కళాశాల ప్రథమ, గుంటూరుకు చెందిన సెయింట్ జోసెఫ్ డీఈడీ కళాశాలకు ద్వితీయ స్ధానం లభించింది. చిత్రలేఖనం పోటీల్లో బాపట్ల సాన్వియా డీఈడీ కళాశాలకు ప్రధమ, నరసరావుపేటకు చెందిన ఎస్‌వీపీఎన్‌సీ డీఈడీ కళాశాలకు ద్వితీయ స్ధానం లభించిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్స్ శ్రీనివాసరావు, రవీంద్ర, మంగేశ్వరి, కళాశాల పాలకవర్గం సభ్యులు నాసరయ్య, నాతాని వెంకటేశ్వర్లు, బొల్లా కోటేశ్వరరావు, రాఘవులు తదితరులు పాల్గొన్నారు.
మహిళలు స్వశక్తితో ఎదగాలి
* మంత్రి పుల్లారావు
చిలకలూరిపేట, డిసెంబర్ 3: మహిళలు స్వశక్తితో ఎదిగిన నాడే దేశాభివృద్ధి జరుగుతుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. పట్టణంలోని పాత మార్కెట్ యార్డులో మహిళా స్వయం సహాయక సంఘాలకు ప్రభుత్వం ద్వారా రెండో విడత మూలధన పెట్టుబడి నిధి పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరైన మాట్లాడారు.
డ్వాక్రా గ్రూపులను రాష్ట్రంలో మరింతగా విస్తరింపజేసి మహిళలు ఆర్థికంగా ఎదిగేలా కృషి చేస్తున్నామన్నారు. రానున్న రోజుల్లో స్వయం సహాయక సంఘాలకు ఎక్కువ పెట్టుబడి నిధులు అందించి మహిళాలోకాన్ని ఆర్థికంగా ప్రోత్సహిస్తామన్నారు. అనంతరం 3.96 కోట్ల రూపాయల నగదును పట్టణంలోని 1389 మహిళా స్వయం సహాయక సంఘాలకు అందజేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ గంజి చెంచుకుమారి, కమిషనర్ కనకారావు, తహశీల్దార్ వెంకయ్య, టిడిపి కౌన్సిలర్లు పాల్గొన్నారు.
వైద్య ప్రముఖులు డా.రాధాకృష్ణమూర్తికి కన్నీటి వీడ్కోలు
రేపల్లె, డిసెంబర్ 3: పట్టణానికి చెందిన ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ వెన్నం రాధాకృష్ణమూర్తి (72) శుక్రవారం రాత్రి కన్నుమూశారు. కొద్దిరోజుల క్రితం తీవ్ర అస్వస్థతకు గురైన ఆయనను కుటుంబ సభ్యులు విజయవాడలోని ఓ ప్రైవేట్ వైద్యశాలకు తరలించారు. అక్కడ వైద్య చికిత్స పొందుతూనే పరిస్థితి మరింత క్షీణించటంతో ఆయన ఐసియులోనే మృతి చెందారు. డాక్టర్ మూర్తికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఆయన భౌతికకాయాన్ని విజయవాడ నుండి శనివారం ఉదయం రేపల్లె పట్టణంలోని స్వగృహానికి తీసుకొచ్చారు. పట్టణ, నియోజకవర్గంలోని ప్రజలు ఆయన కడసారి చూపు కోసం తండోపతండాలుగా తరలివచ్చారు. ఆయన మృతి పేదలకు తీరనిలోటని అభిమానులు నివాళి అర్పించారు. మాజీ ఎమ్మెల్యే దేవినేని మల్లిఖార్జునరావు, జిడిసిసిబి చైర్మన్ ముమ్మనేని వెంకటసుబ్బయ్య, డాక్టర్ రమేష్, అనగాని శివప్రసాద్, తదితరులు ఆయన భౌతికకాయంపై పూలమాలలుంచి శ్రద్ధాంజలి ఘటించారు. డాక్టర్ మూర్తి పట్టణంలోని ఇందిరాదేవి నర్సింగ్ హోంలో గుండె వైద్య నిపుణులుగా పేరొందారు. పేద, మధ్యతరగతి బాధితులకు ఉచిత వైద్యం అందించతో పాటు సలహాలనిచ్చి అనేక మంది ప్రాణాలు కాపాడిన ఘనులని పలువురు గుర్తుచేశారు. రేపల్లె నుంచి ఆయన అంతిమ యాత్ర స్వగ్రామమైన రావిఅనంతవరం చేరింది. కృష్ణానది తీరంలో అంత్యక్రియలు నిర్వహించారు. ఐఎంఏ, ఎంసిఐ వైద్యులు వేజెళ్ళ ప్రకాశరావు, కృష్ణకుమారి, ఏవి సుబ్బారావు, పూర్ణానంద్, రాజేంద్రప్రసాద్, తదితరులు ఎంసిఐ హాలులో డా. మూర్తి చిత్రపటానికి పూలమాలలువేసి నివాళులు అర్పించారు.

సభ్యత్వ నమోదు లక్ష్యాలు అధిగమిస్తాం:జివి
గుంటూరు (కొత్తపేట), డిసెంబర్ 3: జిల్లాలో తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదుకు రాష్ట్ర పార్టీ ఇచ్చిన లక్ష్యాలను అధిగమిస్తామని పార్టీ జిల్లా అధ్యక్షుడు జివి ఆంజనేయులు శనివారం విలేఖర్లకు తెలిపారు. జనచైతన్య యాత్ర ల్లో ప్రజల నుండి అనూహ్య స్పందన లభించిందన్నారు. సభ్యత్వ నమోదు కార్యక్రమంలో జిల్లాలో నేటి వరకు 5,67,758 మంది సభ్యులుగా చేరారని, డిసెంబర్ 15 వరకు గడువు ఉన్నందున జిల్లాను మొదటి స్థానంలో నిలిపేందుకు కృషి చేస్తామన్నారు. జిల్లాలోని బాపట్ల నియోజకవర్గం ఓటర్ల ప్రాతిపదికన చేర్చి సభ్యత్వ నమోదులో ముందుందన్నారు. మిగతా మండలాల్లోనూ సభ్యత్వ నమోదు చురుగ్గా సాగుతోందని జివి వివరించారు. నేతలు మన్నవ సుబ్బారావు, దాసరి రాజామాస్టారు, చందు సాంబశివరావు, లాల్‌వజీర్, హర్షవర్ధన్, నల్లపనేని విజయలక్ష్మి పాల్గొన్నారు.

సత్వరం రహదార్ల విస్తరణ పనులు
* జెసి క్రితికా శుక్లా సూచన
ఆంధ్రభూమి బ్యూరో
గుంటూరు, డిసెంబర్ 3: వెలగపూడిలో నూతన సచివాలయం ఏర్పడిన నేపథ్యంలో రహదారుల విస్తరణ పనులను చేపట్టాలని అధికారులను జాయింట్ కలెక్టర్ క్రితికా శుక్లా ఆదేశించారు. శనివారం తాడేపల్లి నుండి తాడికొండ వరకు చేపట్టనున్న రాజధాని అనుసంధాన రహదారుల విస్తరణలో భాగంగా సంబంధిత అధికారులతో కలిసి గ్రామాల్లో పర్యటించారు. తాడేపల్లి, ఉండవల్లి, పెనుమాక, మందడం, వెలగపూడి, రాయపూడి, తుళ్లూరు, తాడికొండ ప్రాంతాల్లో రహదారుల విస్తరణ పనులను ఈ నెల 8న ప్రారంభించాలని ఆదేశించారు. జెసి వెంట ఆర్ అండ్ బి ఎస్‌ఇ రాఘవేంద్రరావు, గుంటూరు ఆర్డీవో శ్రీనివాసరావు, తాడేపల్లి, మంగళగిరి, తుళ్లూరు, తాడికొండ తహశీల్దార్లు కిషోర్, విజయలక్ష్మి, సుధీర్, అనిల్, తదితరులు పాల్గొన్నారు.