రాష్ట్ర వార్తలు

గోదావరికి వరద తాకిడి

  • 17/06/2013

భద్రాచలం, జూన్ 16: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఖమ్మం జిల్లా భద్రాచలం గోదావరికి వరద తాకిడి మొదలైంది. నిన్న మొన్నటి వరకు పిల్ల కాలువను తలపించిన గోదావరి నేడు వరద నీటితో ఉరకలేస్తోంది. భద్రాచలం వద్ద ఆదివారం గోదావరి వరద నీటి మట్టం 23 అడుగులకు చేరుకుంది. కాగా, వరదలు ఏ సమయంలో సంభవించినా ఎదుర్కొనేందుకు తామంతా సిద్ధంగా ఉన్నామని అధికారులు పేర్కొన్నారు. గోదావరి వరదల నేపథ్యంలో ముందస్తుగానే ఆయా శాఖల అధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహించి సూచనలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఆదేశాలు జారీ చేశామని అధికారులు తెలిపారు. ఇప్పటికే జిల్లా, డివిజన్, మండల స్థాయి సమీక్ష సమావేశాలు నిర్వహించి కమిటీలను నియమించామని అన్నారు. గోదావరి నదీ పరీవాహక ప్రాంతాల్లో బఫర్ స్టాకును సిద్ధంగా ఉంచామన్నారు. గోదావరి వరద నీటి మట్టం 43 అడుగులకు చేరితే మొదటి ప్రమాద హెచ్చరిక, 48 అడుగులకు 2వ, 53 అడుగులకు చేరితే మూడో ప్రమాద హెచ్చరికను జారీ చేయనున్నట్లు వెల్లడించారు.
శ్రీశైలంలో విద్యుదుత్పత్తి ప్రారంభం
శ్రీశైలం, జూన్ 16: ఎగువ ప్రాంతం నుండి వెయ్యి క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుండడంతో కుడిగట్టు జలవిద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి ప్రారంభమయింది. శ్రీశైలం డ్యాంలో ప్రస్తుత నీటి మట్టం 815.30 అడుగులు ఉంది. సుంకేసుల డ్యాం ద్వారా గేజింగ్ పాయింట్ నుంచి వరద నీరు జలాశయంలోకి చేరింది. ఆ నీటి మట్టాన్ని అనుసరించి కుడిగట్టు జల విద్యుత్ కేంద్రంలో స్వల్పంగా విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తున్నారు. గడచిన 24 గంటల్లో 1.211 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తూ సగటున 2720 క్యూసెక్కుల నీటిని దిగువనకు విడుదల చేస్తున్నారు. రాష్ట్రంలో తుపాను కారణంగా ఎగువ పరివాహక ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురవడంతో వరద నీరు వచ్చి జలాశయంలో నిల్వ 37.5560 టిఎంసిలకు చేరింది.
స్థిరంగా అల్పపీడన ద్రోణి
విశాఖపట్నం, జూన్ 16: ఛత్తీస్‌గఢ్ నుంచి తమిళనాడు వరకూ దక్షిణ కోస్తా మీదుగా అల్పపీడనద్రోణి కొనసాగుతోందని విశాఖపట్నంలోని వాతావరణ పరిశోధన కేంద్రం అధికారులు ఆదివారం రాత్రి తెలిపారు. ఇది గత 24 గంటల కంటే కాస్త బలపడిందని పేర్కొన్నారు. దీనికారణంగా దక్షిణ కోస్తాలో కొన్ని ప్రాంతాల్లోను, ఉత్తర కోస్తాలో అక్కడక్కడ ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. ఇక పశ్చిమ మధ్యప్రదేశ్‌లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని అయితే దీని ప్రభావం ఆంధ్రపై ఉండదని వెల్లడించారు. అలాగే ఆంధ్ర ప్రాంతంలో నైరుతి రుతుపవనాలు స్థిరంగా కొనసాగుతున్నాయని తెలిపారు.
పంచాయతీ ఎన్నికలకు 15 రోజుల్లో నోటిఫికేషన్
మంత్రి జానారెడ్డి వెల్లడి
అనంతపురం, జూన్ 16 : పంచాయతీ ఎన్నికలకు సంబంధించి 15 రోజుల్లో నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖామంత్రి కె జానారెడ్డి పేర్కొన్నారు. ఆదివారం అనంతపురము జిల్లా కేంద్రంలోని ఎంపి అనంత వెంకటరామిరెడ్డి స్వగృహంలో ఆయన విలేఖరులతోమాట్లాడారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంపిటిసి, జడ్‌పిటిసి ఎన్నికలు పార్టీల గుర్తులపై నిర్వహిస్తామని మిగతావన్నీ పార్టీ రహితంగా జరిపిస్తామని ఆయన తెలిపారు.
స్థానిక ఎన్నికల బాధ్యత ప్రభుత్వానిదే
ఎన్నికల అధికారి భన్వర్‌లాల్
తిరుచానూరు, జూన్ 16: స్థానిక సంస్థల ఎన్నికల బాధ్యత పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వానిదేనని, ఇందులో ఎన్నికల సంఘానికి ఎటువంటి సంబంధం ఉండదని రాష్ట్ర ఎన్నికల ప్రత్యేక అధికారి భన్వర్‌లాల్ స్పష్టం చేశారు. ఆదివారం ఆయన తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. అనంతరం ఆయన ఆలయం వెలుపల విలేఖరులతో మాట్లాడారు. స్థానిక సంస్థల్లో బిసి రిజర్వేషన్లకు సంబంధించి ఎన్నికల సంఘానికి ఎలాంటి సంబంధం లేదని, రాష్ట్ర ప్రభుత్వమే దాన్ని చూసుకుంటుందన్నారు.
కొత్తగా 17 సంక్షేమ పథకాలు
నేతన్నల సంక్షేమానికి రూ. 30 వేల కోట్లు
మదనపల్లె, జూన్ 16: రాష్ట్ర ప్రజలను ఆదుకునేందుకు ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి నేతృత్వంలో ప్రభుత్వం కొత్తగా 17 సంక్షేమ పథకాలు అమలుకు త్వరలో శ్రీకారం చుడుతున్నారని చేనేత శాఖామంత్రి గడ్డం ప్రసాద్‌కుమార్ చెప్పారు. రాష్ట్రంలో చేనేతకార్మికల సంక్షేమానికి రూ.30వేల కోట్లు కేటాయించామన్నారు. ఆదివారం చిత్తూరు జిల్లా మదనపల్లెకు వచ్చిన మంత్రి స్థానిక ఎమ్మెల్యే ఎం షాజహాన్‌బాష సృగృహంలో విలేఖరులతో మాట్లాడారు. గద్వాల్, ధర్మవరం, కంచి తరహాలో మదనపల్లె పట్టుచీరలుగా బ్రాండ్‌నేమ్‌గా తీసుకువచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి ప్రసాద్ వివరించారు. ప్రతి చేనేతకార్మికుడి కుటుంబానికి ఎలాంటి హామీ లేకుండా బ్యాంకు ద్వారా 35వేల రూపాయలు రుణం చెల్లించడానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఆప్కోను అన్నివిధాలా ఆదుకునేందుకు రూ.247కోట్లుతో రాష్ట్రంలోని అన్నిప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు యూనిఫారం దుస్తులు సరఫరా, అన్ని శాఖల అధికారుల సంప్రదాయ దుస్తులు విక్రయాలు చేస్తున్నామన్నారు. చేనేతకార్మికులకు అందించే ప్రతి సంక్షేమ పథకాలు ఇకపై ఆన్‌లైన్ ద్వారా పరిష్కరించేలా ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు మంత్రి వివరించారు. త్వరలో మదనపల్లెలో చేనేత, హ్యాండ్‌లూమ్ పార్క్ ఏర్పాటుకు కృషిచేస్తామని రాష్ట్ర చేనేతశాఖ మంత్రి జి ప్రసాద్‌కుమార్ వెల్లడించారు.

Add new comment

X
Enter your Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telegu | Telugu News Headlines | Andhra Bhoomi username.
Enter the password that accompanies your username.
Loading