సంపాదకీయం

స్నేహ గోదావరి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నోరు మంచిదైతే ఊరు మంచిదౌతుంది-అన్నది తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నోట వెలువడిన వ్యవహార వాస్తవం. ఈ వాస్తవాన్ని మహారాష్ట్ర నుంచి భగీరథ స్ఫూర్తితో తిరిగి వచ్చిన చంద్రశేఖర్ రావు రాష్ట్ర రాజధానిలో మంగళవారం సాయంత్రం మరోసారి నిరూపించారు. మహారాష్ట్ర ప్రభుత్వంతో తెలంగాణ ప్రభుత్వం మంగళవారం ఉదయం కదుర్చుకున్న నదీజలాల పంపిణీ ఒప్పందం చంద్రశేఖర్ రావు భాగ్యనగర ప్రకటనకు నేపథ్యం. చంద్రశేఖర్ రావు వినిపించిన ఈ వ్యావహారిక వాస్తవ విజయానికి సరికొత్త రూపం ఉభయ రాష్ట్రాల మధ్య కుదిరిన ఒప్పందం. దశాబ్దుల తరబడి ఉప్పు సముద్రం పాలైపోతున్న దాదాపు నాలుగువేల శతకోటి ఘనపుటడుగుల నీటిని తెలంగాణ దప్పిక తీర్చడానికి, ఆకలి తీర్చడానికై వినియోగించడానికి ఈ ఒప్పందం వల్ల వీలు కలుగుతోంది. ఏళ్ల తరబడి దశాబ్దుల తరబడి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు, మహారాష్టక్రు మధ్య వివాద జలాగ్ని గుండంగా మారిన గోదావరి చరిత్రలో ఇది మధురమైన మలుపు..గోదావరి నదీమతల్లి మహారాష్ట్ర తెలంగాణ రాష్ట్రాల మధ్య సయోధ్యకు, చెలిమికీ శాశ్వత ప్రతీకగా మారడం ఈ మలుపు. చరిత్రను ఈ మలుపు తిప్పిన ఘనత చంద్రశేఖర్ రావుది. గోదావరి నదిపై నిర్మించ గల ఐదు జలాశయాల నిర్మాణ రీతి, పరిమాణం వంటి ప్రధానమైన అంశాల పట్ల మహారాష్ట్ర ప్రభుత్వం గతంలో చెప్పిన అభ్యంతరాలను చంద్రశేఖర్ రావు తొలగించగలగడం ఈ మలుపునకు కారణం. మహారాష్టక్రు అంగీకారమైన రీతిలో ఆనకట్టల జలాశయాల స్వరూప స్వభావాలలో మార్పులు చేయగలగడం తెలంగాణ ప్రభుత్వం సాధించిన విజయం. ఈ విజయం మహారాష్టక్రు సైతం అపజయం కాలేదు. ఉభయ రాష్ట్రాల ప్రజల ఉమ్మడి హిత సాధనకు మంగళవారం నాటి ఒప్పందం శ్రీకారం. దశాబ్దుల తరబడి దేశమంతటా ఇరుగుపొరుగు రాష్ట్రాల నదీ జలాల వివాదాలు ఉద్ధృతమవుతున్న సమయంలో మహారాష్టత్రో తెలంగాణకు కుదిరిన ఒప్పందం వ్యవసాయరంగ ప్రగతి ప్రస్థానానికి స్నేహజల వారధి. ఈ సయోధ్య స్ఫూర్తితో వివిధ రాష్ట్రాల ప్రభుత్వాలు ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో నదీ జల వివాదాలను పరిష్కరించుకోవాలన్నది తెలంగాణ ప్రభుత్వం చాటిన ఆదర్శం. కేంద్ర నదీ జలాల వ్యవహారాల మండలి కాని, సర్వోన్నత న్యాయస్థానంలో సుదీర్ఘకాలం పాటు కొనసాగిన జల వివాద ప్రహసనాలు కాని సాధించలేని అద్భుతాన్ని చంద్రశేఖర్ రావు, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్ణవిస్‌తో కలిసి మహారాష్ట్ర రాజధానిలోని సహ్యాద్రి భవన్‌లో సమావిష్కరించగలిగారు.
ఈ ఒప్పందం నిజానికి వివిధ ఒప్పందాల సమాహారం. ఈ సమాహారం తెలుగుల పొలానికి తెలంగాణ ప్రభుత్వం సమర్పించగలిగిన సుధాజలసుమహారం. రాజ్‌పేట, పెన్‌పహాడ్, మేడిగడ్డ, చనాఖా-కొరాట, తుమ్మిడి హట్టి, కాళేశ్వరం, చేవేళ్ల-ప్రాణహిత వంటి పేర్లు వ్యవసాయ జలాల ప్రదాతలు మరు భూములను సైతం అమర సీమలుగా మార్చనున్నాయి. కోమల శ్యామల సౌందర్య శోభల వ్యవసాయ క్షేత్రాలను విస్తరింప జేయనున్నాయి. ఇరవై నెలల కాల వ్యవధిలో తెలంగాణ ప్రభుత్వం సాధించిన ఘనవిజయమిది. కయ్యం వల్ల కాక నెయ్యం వల్లనే ఇరుగుపొరుగు ప్రాంతాల భారతీయుల సమష్టి హితం సాధ్యమన్నది ఈ ఒప్పందం నేర్పుతున్న పాఠం. ఈ పాఠానికి రూపకర్త చంద్రశేఖర్ రావు. ఈ పథకాల వల్ల ఎన్ని శతకోటి ఘనపుటడుగుల గోదావరి, గోదావరి ఉపనదుల జలాలు తెలంగాణకు దక్కుతున్నాయి? ఎన్ని లక్షల హెక్టార్ల భూమి అదనంగా పండించనున్నాయి? ఎన్ని లక్షల టన్నుల ఆహారం ఉత్పత్తి కానుంది? ఎన్ని లక్షల మంది అన్నదాతలకు జీవన ఉపాధి పరిధి విస్తరించనుంది? అన్న ప్రశ్నలు, వాటికి సమాధానాలు వెలువడుతున్నాయి. కానీ వీటన్నింటి కంటె ప్రధానమైన అంశం ఇరు రాష్ట్రాల మధ్య సయోధ్య కుదరడం. కొత్త రాష్ట్రంలో ఏర్పడిన కొత్త ప్రభుత్వానికి ఏడాది తొమ్మిది నెలల వయస్సు. మహారాష్టల్రోని కొత్త ప్రభుత్వం వయస్సు ఇంకా తక్కువ. కానీ పాలనా బాధ్యతలను స్వీకరించిన తరువాత ఈ కొద్ది వ్యవధిలోనే జల సయోధ్య కుదరడం ఉభయ రాష్ట్రాల ఉమ్మడి స్నేహ నిష్ఠకు నిదర్శనం. ప్రజాహిత సాధన పట్ల కల చిత్తశుద్ధికి చిహ్నం. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఆహ్వానించడం తెలంగాణ ముఖ్యమంత్రి స్నేహ యాత్ర జరపడం...ఇరుగు పొరుగు ప్రాంతాల సమాన భావాలకు సాక్ష్యం. ఇరుకు పొరుగుతనం లోని ప్రాదేశిక స్థితి మారదు. ప్రజల ప్రభుత్వాల ప్రవృత్తి మాత్రమే మార్పునకు గురయ్యే అవకాశముంది. ఇప్పుడు సంభవించిన మార్పు గోదావరీ స్వచ్ఛ జలాలలోని మాధుర్యం వంటిది జాతీయ సమైక్యతకు మరో వారథి.
పెన్‌గంగ నదిపై నిర్మించనున్న మూడు ఆనకట్టలు ఉభయ రాష్ట్రాల మధ్య ప్రాదేశిక వారథులు కానున్నాయి. ఈ జలాశయాల నీటిని ఉభయ రాష్ట్రాలలోని మూడు లక్షల ఎకరాలను పండించడానికి వినియోగించనున్నారట. చేవెళ్ల-ప్రాణహిత జల వారథి పథకంలో భాగంగా ఆదిలాబాద్ జిల్లాలోని తుమ్మడి హట్టి వద్ద నిర్మించే జలాశయం ద్వారా రెండున్నర లక్షల ఎకరాలకు సేద్యపు నీరు లభించనుంది. కాళేశ్వరం పథకంలో భాగం గా మేడిగడ్డ వద్ద నిర్మితమయ్యే ఆనకట్ట ద్వారా అదనంగా నూట ఇరవై శతకోటి ఘనపుటడుగుల నీరు తెలంగాణ పొలాలకు లభించనుంది. ప్రాణహిత, ఇంద్రావతి ఉపనదులు గోదావరిలో సంగమించిన తర్వాత ఉద్ధృతంగా ఉరకలెత్తే గోదావరి వరదనీరు సముద్రం పాలు కాకుండా నిరోధించడానికి ఈ సయోధ్య ఉపకరించగలదు. ఈ నీరు దాదాపు ఇరవైనాలుగు లక్షల ఎకరాలలో రెండు పంటలు పండటానికి తెలంగాణ భారత దేశపు మరో ధాన్యాగారం కావడానికి దోహదం చేస్తుంది. కరీంనగర్, వరంగల్ జిల్లాలు ఈ ఒప్పందాల వల్ల తక్షణ ప్రయోజనం పొందనున్నాయట. కానీ దశలవారీగా హైదరాబాద్ తప్ప తొమ్మిది జిల్లాల్లోను సేద్యపు నీటి వ్యవస్థ మెరుగు పడటానికి, అదనంగా లక్షలాది ఎకరాల భూమిని సాగు చేయడానికి వీలు కలుగుతుందని మహారాష్ట్ర యాత్రను పూర్తి చేసి రాజధానికి వచ్చిన చంద్రశేఖర్ రావు తనకు ఘనస్వాగతం చెప్పిన జన సమూహానికి వెల్లడించిన సమాచారం. ఆయన ఆకాంక్షించినట్టు కోటి ఎకరాల అదనపు మాగాణి దేశానికి మరో హరిత వరం..ప్రగతి వనం!
తొమ్మిది జిల్లాలకు సేద్యపు నీరు లభిస్తుంది. అయితే హైదరాబాద్ జిల్లాను కూడ పథకం అలరించనుంది. హైదరాబాద్ జిల్లాకు కావలసింది సేద్యపు నీరు కాదు..మంచినీరు మాత్రమే. ఈ పాన జలం, స్నానజలం సమకూర్చడానికి వీలుగా హైదరాబాద్ శివారులోని శామీర్ పేట వద్ద నీటి నియంత్రణ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నారట. తద్వారా ఇరవై శతకోటి ఘనపుటడుగుల గోదావరి నీరు జంట నగరాలలోని నల్లాలలోకి ప్రవహించనుంది. ఇంటింటికీ నల్లానీరు సరఫరా చేయగల భగీరథ పథకానికి చెరువులను నింపగల కాకతీయ జల ఉద్యమానికి గోదావరి నీరు లభించగలదు. తెలుగువారి మధ్య మరాఠీ ప్రజల మధ్య బాబ్లీ సృష్టించిన వైరుధ్యం ఇక గతం..్భవిష్యత్తు స్నేహమయం!