బిజినెస్

గోదావరి డెల్టాలో రబీకి నీరేది?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అకాల వర్షాలతో అంచనాలు తారుమారు
దెబ్బతిన్న ఖరీఫ్‌తో ఇంకా మొదలుకాని రబీ
బక్కచిక్కిన గోదావరి నదీ ప్రవాహం
ఒడిశా నుండి నీటి విడుదలకు లభించని హమీ?

రాజమండ్రి, డిసెంబర్ 7: ఉభయ గోదావరి జిల్లాల్లోని రబీ పంటకు ఏదో విధంగా సాగునీటిని సరఫరా చేసి, మొత్తం ఆయకట్టును పండించాలన్న రాష్ట్ర ప్రభుత్వ అంచనాలు తారుమారయ్యేలా ఉన్నాయి. గోదావరిలో నీటి లభ్యత తక్కువ ఉందని, రబీకి పూర్తిగా అనుమతినివ్వటం సాధ్యం కాదని జలవనరులశాఖ అధికారులు చెప్పినప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని మొత్తం ఆయకట్టుకు అనుమతినివ్వాలని నిర్ణయించిన సంగతి విదితమే. ఒడిశా ప్రభుత్వంతో చర్చించి అదనంగా నీటిని తీసుకురాగలమన్న ధీమాతో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం.. గోదావరి డెల్టా రైతులకు రబీ భరోసా ఇచ్చింది. కానీ డిసెంబర్ మొదటి వారంలోనే గోదావరి తీరు చూస్తుంటే తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. నదీ జలాలు బక్కచిక్కిపోయాయ. మరోపక్క ఒడిశా నుండి ఎలాంటి హామీ లభించిన దాఖలాలు లేవు. ఇలాంటి పరిస్థితుల్లో గోదావరి డెల్టాలో రబీ సాగుకు పూర్తి స్థాయిలో సాగునీటిని ఎలా సరఫరాచేయగలరన్న ఆందోళన రైతుల్లో రోజురోజుకూ పెరుగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం భరోసాతో తీరా రబీ సాగు చేపట్టిన తరువాత నీటి కొరత ఏర్పడితే తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందన్న ఆందోళనను గోదావరి డెల్టా రైతులు వ్యక్తం చేస్తున్నారు. అకాల వర్షాల కారణంగా ఖరీఫ్ పంట అనుకున్న సమయానికి చేతికి అందకపోవటం, ఇప్పటికీ ఖరీఫ్ పనుల్లోనే రైతులు తలమునకలై ఉండటంతో రబీ సాగు అన్ని విధాలా సిద్ధమైనాగానీ పనులు చేపట్టలేని పరిస్థితి గోదావరి డెల్టాలో నెలకొంది. నిజానికి గోదావరిలో మిగులు జలాలు ఉండగానే రబీ సాగును మొదలుపెట్టి కొంత వరకు కొనసాగించాలని రైతులు భావించినాగానీ, ప్రకృతి సహకరించకపోవటంతో ఇప్పటికీ రబీ పనులు మొదలు కాలేదు. మరోపక్క కాటన్ బ్యారేజి నుండి మిగులు జలాలు విడుదల ఆగిపోయింది. మిగులు జలాలు విడుదల ఆగకుండానే రబీ సాగును మొదలు పెట్టించాలని జలవనరుల శాఖ అధికారులు, నీటిసంఘాల అధ్యక్షులు ప్రణాళికను రూపొందించినప్పటికీ, ప్రకృతి సహకరించకపోవటంతో పరిస్థితులు తారుమారయ్యాయి. ఈ లోపున గోదావరి ప్రధాన ప్రవాహం తగ్గుముఖం పట్టింది. సోమవారం నాటి గణాంకాలను బట్టి చూస్తే సర్ ఆర్ధర్ కాటన్ బ్యారేజి వద్ద నమోదయిన ఇన్ ఫ్లో 6,722 టిఎంసిలు. అవుట్ ఫ్లో మాత్రం 6,800 క్యూసెక్కులు. ఇన్ ఫ్లో లోని 6,722 క్యూసెక్కుల్లో సీలేరు జలాలు 3,108 క్యూసెక్కులు. తూర్పు డెల్టాకు 1,500, సెంట్రల్ డెల్టాకు 800, పశ్చిమ డెల్టాకు 4,500 క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. ప్రస్తుతానికి ఖరీఫ్ పనుల్లోనే రైతులు క్షణం తీరికలేకుండా ఉండటం వల్ల మూడు డెల్టాలకు కలిపి 6,800 క్యూసెక్కులను మాత్రమే సరఫరా చేస్తున్నారు. రబీ పనులు మొదలయితే కనీసం 8 వేల క్యూసెక్కులు అవసరమవుతాయి. అలాంటపుడు ఇన్ ఫ్లో కన్నా అవుట్ ఫ్లో బాగా పెరుగుతాయి. మొదట్లోనే ఇంత డిమాండ్ ఉంటే, పగటి ఉష్ణోగ్రతలు పెరిగిన తరువాత వచ్చే ఏడాది మార్చి నెలాఖరు నాటికి పంట చేతికొచ్చే సమయానికి సాగునీటి కొరత వచ్చే ప్రమాదం ఏర్పడుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. పరిస్థితిని ముందుగానే గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి నుండే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని, లేదంటే గోదావరి డెల్టా రైతులు తీవ్రంగా నష్టపోతారని సాగునీటి రంగ నిపుణులూ హెచ్చరిస్తున్నారు.