తొవ్వ ముచ్చట్లు - జయ ధీర్

గోండ్వానాలో అద్భుత కోన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అక్షరాలా నిన్న గాక మొన్న-
కేంద్రంతో సంబంధం లేకుండానే ఐదు చోట్ల ప్రాజెక్టులు కట్టడానికి, మహారాష్ట్ర, తెలంగాణ, రాష్ట్రాల మధ్య అవగాహన పెరగడానికి ఒప్పందం జరిగింది. ఇరు రాష్ట్రాల మధ్య పరస్పర సహకారం ఉండాలని ఇద్దరు సిఎంలు సంతకాల చేశారు. సంతోషం.
గుజరాత్ ఉమ్మడి రాష్ట్రం నుండి ఆనాడు మహారాష్ట్ర విడిపోయి ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడింది. ఈనాడు ఆంధ్రప్రదేశ్ నుండి విడిపోయి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడింది. ఈ రెండు రాష్ట్రాల మధ్య సయోధ్య మంచిదే.
ఇంతకీ- వర్షాలు పడాలెన్నడు, ప్రాజెక్టులు పూర్తవ్వాలెన్నడు. కాలువలు పారేదెన్నడు, పంటలు పండేదెన్నడు? చేపా చేపా ఎందుకు ఎండలేదంటే..చేంతాడు కథ ఉంది. అది సుఖాంతం కావడం కాలంమీద ఆధారపడి ఉంటుంది. మనుషులు నిమిత్తమాత్రులు ఈలోగా చిన్న రైతులు ఆత్మహత్యలు చేసుకోకుండా బతకాలి. అప్పుల బారిన పడిన రైతు, మెడపై వడ్డీల ఉరితాడు బిగుసుకోవద్దు. అప్పిచ్చిన ‘వైద్యులు’ కాల్ నాగులై ఆస్తుల్ని జప్తు చేసుకోవద్దు. బ్యాంకులు రైతు భూములను వేలం వేయవద్దు. పెట్టుబడిదారులు రైతుల్ని నయానా, భయానా మోసగించి పంటపొలాలు కొనవద్దు. అప్పటిదాకా రైతు కన్ను మూయవద్దని కోరుకుందాం. అన్నీ కలసివచ్చి నీరందేనాటికి రైతు మరింత పెట్టుబడి పెట్టి వ్యవసాయం చేయగలుగుతాడా అన్నది ప్రశ్న. కాలువలు పారతాయని తెలిసి చౌకగా డబ్బున్న వర్గాలు ఆభూముల్ని కొనకుండా ఉంటాయా?
సరే! ప్రయత్నం ఏదైనా మంచిదే. అక్కడి చంద్రుడు గోదావరి నీళ్లకే సూటి పెట్టాడు. ఇక్కడి చంద్రుడు గోదావరి ప్రాజెక్టు నిర్మాణాలకే లక్ష్యం కేంద్రీకరించాడు. అంతాకలిసి, అన్నీ వెరసి లక్షల కోట్ల రూపాలయ పెట్టుబడి. ఇంత సొమ్ము ప్రజలు కట్టిన పన్నులే కదా. జలయజ్ఞం పేరుతో నష్టమైన సొమ్మెంతో రేపైనా లెక్క తీసి బయటపెట్టేవారు ఉన్నారా?
ఎందుకోగాని సీఎంలందరికీ నీళ్లే కనిపిస్తాయి. ఖజానాని నీళ్లలా పారించడానికే చూస్తారు. నీటి నిర్మాణాలు ఎన్నడూ పూర్తిగా ప్రజల కన్నీళ్లు తుడవలేవు. ముందు అవి కొందరి జేబుల్లో ప్రవహిస్తాయి. అపై బ్యాంకుల్లో నల్ల ఆనకట్టలుగా మొలుస్తాయి.
ఈ ఆనకట్టలన్నీ రాష్ట్రాల సరిహద్దుల మధ్య పేలే అణ్వాయుధాలవుతాయి. రేపట్టి సరిహద్దుల చిచ్చుకి పురిటిగుడ్డలవుతాయి. పోలవరమైనా, ప్రాణహిత, కాళేశ్వరమైనా, తుమ్మిడిహట్టి అయినా సరిహద్దు వివాదాలకి కేంద్రాలే.
జలవివాదం సమసిపోయినట్లు కనిపిస్తుంది. కాని అది నివురుగప్పిన నిప్పు. ప్రకృతి తల్లిని శుష్కింపచేసి వానలు వరదలు పారాలంటే సాధ్యమా. వానలు రాకుంటే ఆనకట్టలు, బ్యారేజీలు ఏం చేస్తాయి?
అన్ని రాష్ట్రాలకు నీరు కావలసిందే. ఐతే అందరూ ఆ పారని జీవనదిని పిండుకోవాలని చూస్తున్నారు. అదీ విచిత్రం.
నిజానికి రాష్ట్రాల మధ్య జల వివాదాలకు చెక్ పెట్టాల్సిన తరుణం ఇది.
నీళ్ళెంత ముఖ్యమో ఆ సరిహద్దుల్లో జీవిస్తున్న ప్రజలూ అంతే ముఖ్యం అనుకోవాలి. తలాపున సముద్రం పెట్టుకొని చేప దాహానికేడ్చినట్టు అక్కడి ప్రజలు చెంబెడు నీళ్లకు తల్లడిల్లుతున్నారు. జరి, పిప్రి, సావిలి వంటి అనేక గోండు గూడేల్లో మరో ఐదు నెలలు నీటి చుక్క దొరకదు.
అనుకోకుండా కేసీఆర్ గారు మహారాష్టత్రో ఒప్పందాలు కుదుర్చుకుంటున్న సమయంలో పరిశోధకులం కొందరం ఆదిలాబాదు జిల్లా ఆమూలలలో పర్యటిస్తున్నాం.
గోండి రాత ప్రతులను అనువదించే కార్యక్రమంలో ఈ ‘జంగుబాయి గొంది’ క్షేత్ర ప్రసక్తి వచ్చింది. అందుకే మేం పరిశీలించడానికి అక్కడికి వెళ్లాం. ప్రాచీన కాలం నుండి అక్కడ జంగుబాయి దేవతని కొలుస్తూ వస్తున్నారు. ప్రతి పుష్యమాసం పున్నమినాడు చాలా పెద్ద జాతర జరుగుతుంది. ఆ జాతరకు లక్షలాది మంది గోండులు, గోండేతరులు వస్తారు. తెలంగాణ, మహారాష్టల్ర సరిహద్దు గీతపై ఉన్న జంగుబాయి గొందికి వెళ్లాలంటే మహారాష్ట్ర గ్రామాలు దాటాలి. ఆ తరువాత తిరిగి తెలంగాణలోకి ప్రవేశించి ఒక లోయలోకి వెళ్లాలి. అక్కడ ప్రవహించే నది పక్కన ఉన్న పెద్ద కొండ చరియల మధ్య ఒక సొరంగం ఉంటుంది. అందులోకి పాకుతూ వెళితే అక్కడ ఉంచిన దీపం కనుపిస్తుంది. ఆ దీపం (బిద్వార్) వెలుగే ఆ చీకటి బొయ్యారంలో కాంతిరేఖ. అదే జంగుబాయి గద్దె. అక్కడ ఎలాంటి నిర్మాణాలు లేవు. ప్రకృతిసిద్ధమైన దారి. రాళ్లు రప్పలు. ఎండిన నది, ప్రవాహం గుర్తులు లేని పర్యావరణం.
ఇప్పుడిప్పుడే రేకుల షెడ్డులో పొచమ్మ దేవత (అవ్వల్‌సేన్)కి కప్పు కడుతున్నారు. రెండు చెట్ల కింద కొయ్యతో చేసిన కమ్‌క్కులు (చెక్కలు) నాటి ఉంచారు. వాటికి పసుపు కుంకుమలు అద్ది పెట్టారు. అంతే తప్ప కొన్నివేల ఏళ్ల నుండి అక్కడ ఎలాంటి గుర్తులు లేవు. ఒక్క గోండులకే అమె ఆరాధ్యదేవతగా ఉండింది. కానీ కనబడని ఒక వ్యవస్థ ఉన్నట్లుగా గోండుల మాటల ద్వారా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ ప్రదేశాన్ని వారు ‘కోత పరంధోళి’ అంటారు. ఆ జాతర సమయంలో అక్కడ ఆ దేవత రక్షణ కోసం ఎనిమిది గోత్రాలు పని చేస్తున్నాయి. ఈ విషయాలను ఆ దేవస్థానం అధ్యక్షులు మరప బాజీరావు వివరించారు. దాన్ని బట్టి-‘తమ్రం’ గోత్రం వారు పెద్ద ఇంటివారు. వీరికి ఆ దేవత ముందు గౌడి పూజ చేసే హక్కు ఉన్నది. ‘మరప’ గోత్రం వారు ప్రధాన పూజారులుగా ఉంటారు.
‘కొదప’ గోత్రం వారు కారోబారీలుగా ఉంటారు. అంటే గ్రామ పంచాయతి పెద్దలుగా వ్యవహరిస్తారు. ‘వేట్టి’ గోత్రం వారు పటేళ్ల లాగా వ్యవహరిస్తారు. ‘సల్లాం’ గోత్రం వారు దేవతకి చిట్టచివరి పూజ నిర్వహిస్తారు. ‘శుద్ధి’ కార్యక్రమం కూడా చేస్తారు. ‘సేరేకుమ్‌రా’ గోత్రం వారు కూడా కొన్ని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. ‘రాయ్‌సిడం’ గోత్రం గోండులు దేవతకి జనె్న విడిచిన పశువులను మేపుతూ వాటి సంఖ్యను పెంచాలి. ఇది వారి విధి. ‘మందాడ’ గోత్రం వారు దేవస్థానానికి వెళ్లిన నాలుగు శాఖల వారికి కండువాలు, శాలువాలు, బహూకరించాలి. ఈ ఎనిమిది ముఖ్యమైన గోత్రాల వారు కాక ‘కాక్‌లే’ గోత్రం వారు కూడా ఉన్నారు. వీరిని ‘పాండ్వెన్ సగ’ అంటారు. వీరు కూడా తమకు ఇవ్వబడిన విధులను నిర్వహిస్తారు.
‘కోట పరంధోళి’ని నలబై ఐదు శివార్లు దాటిన వారు అని అంటారు. దీనినే ‘సవ్వా చాలీస్ కస్బా’ అని అంటారు. మామూలు రోజుల్లో అక్కడకు ఎవరూ రారు. ఈ మధ్య రెండు మూడు ఏళ్ల నుండి కొంతమంది పర్యాటకులు అప్పుడప్పుడు క్షేత్రాన్ని చూడడానికి వస్తున్నారు.
చాలా క్షేత్రాలు, కొండలు, బోడుల మీద ఉంటాయి. ఆలయాలు, ఎతె్తైన కొండల మధ్య కడతారు. దైవాలు కూడా పర్వతాలపైనే వెలుస్తారు. ఎత్తుకి, మహత్యానికి సంబంధం ఉంటుంది. యాదగిరి కాని, తిరుమల గాని కొండ ప్రాంతాలే. ఆ కొండలపై కొలవైన దేవుళ్లు ఎక్కువగా పురుష దైవాలే అయ్యుంటారు.
విచిత్రం ఏమంటే స్ర్తి దేవతలకి సంబంధించిన క్షేత్రాలు భూమిపైనే ఉంటాయి. మైసమ్మ, ముత్యాలమ్మ వంటి వారు గ్రామదేవతలు. వీరు ఒక్కో సందర్భంలో మాత్రమే పూజలు అందుకుంటారు. నిత్యపూజలు వారికి గిట్టవు. అవసరార్ధం ప్రజలచే పూజలందుకుని శాంతిస్తారు. శాంతించని దేవుళ్లు ప్రతినిత్యం పూజలకోసం, వడ్డికాసులకోసం, కొత్తకొత్త హంగు ఆర్భాటాలకోసం అర్రులు చాసినట్లుగా కనిపిస్తారు.
ఇందుకు ఆదివాసీ దైవాలు వ్యతిరేకులు. విచిత్రం ఏమంటే, ఆ క్షేత్రం జాతర మరుసటి రోజు విస్మృతికి గురవుతుంది. అక్కడ ఎలాంటి ఆనవాళ్లు ఉండవు. ఎలాంటి కట్టడాలు కనబడవు. కేస్లాపూర్ జాతర గాని, సమ్మక్క సారమ్మ జాతర గాని, ముసలమ్మ జాతర గాని, మళ్లీ వచ్చే సారి అదే రోజు అక్కడే సంబరాలు అంబరాలు అందుకుంటాయి. కోట పరంధోళి ఒక ప్రకృతి వింత. చుట్టూ పారే ప్రాచీన నది. మధ్యలో ద్వీపకల్పం. ఇరవై ముప్పై ఏళ్ల కింద పులులు జీవించే కోన. ఎందరో భక్తులు వాటి బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. అంతటి కీకారణ్యం అది. ఇప్పుడు భక్తులు విడిది చేయడానికి చెట్లని నరికివేశారు. పుట్టలను సాపు చేశారు. సిమెంటు రోడ్డు పడుతున్నది. లోగడ ఎడ్లబండిని పదికిలోమీటర్ల దూరంలో వదిలి వచ్చేవారు. ఇప్పుడు అక్కడకు కార్లు వెళ్లుతున్నాయి.
మే మాసంలో జరిగే బావైపేన్ని ఉత్సవ సమయానికి నది పైనుండి వంతెన నిర్మిస్తున్నారు. కిందికి సాఫీగా వెళ్లడానికి రోడ్డు నిర్మిస్తున్నారు. మేం మాత్రం శక్తిమంతమైన ట్రాక్టర్లపై గతుకుల రోడ్డుపై ప్రయాణించాం. చుట్టూ కొండ కోనలు ఆవరించిన ప్రదేశం. ఎంతో చూడ చక్కగా ఉంది. జంగూబాయికి ఆకారం లేదు. ఆమె ఒక పవిత్ర భావన. ఒక పురాస్మృతి. ఒక దీవెన. ఎలాంటి చెప్పుకోలు మహాత్మ్యం లేదు. కట్టుకథల కల్పనలు లేవు. ఇప్పటివరకు శిష్ట ఛాయలు పడలేదు. స్వార్ధ్భావన ఏ కోశాన కానరాదు. ఎలాంటి టిక్కెట్లు లేవు.
మహారాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం ఆ క్షే త్రం అభివృద్ధి కోసమని తమకు చేతనైనంత సహాయం చేస్తున్నాయి. సమ్మక్క సారమ్మ జాతరని హైజాక్ చేసినట్లుగా జంగుబాయి తల్లిని కూడా చెరబట్టడానికి డేగలు కొన్ని పొంచి ఉన్నాయి. దేవాదయ శాఖ ప్రవేశంతో నూటొక్క అవాంఛనీయ ధోరణులు ప్రవేశించడానికి రంగం సిద్ధమైంది. ప్రకృతి వింత, పవిత్ర పర్యావరణం లోకి కృత్రిమత, వ్యాపార సంస్కృతి, విపణి దగాలు అక్కడ మోహరించడానికి సిద్ధమైనాయి.
ఇప్పుడు జంగుబాయికి ఆదిశక్తి అనో, జంగుశక్తి అనో నామఫలకాలు చెక్కినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. గోండుల పవిత్ర భావన స్థానే శిష్ట వ్యాపార సంస్కృతి ప్రవేశించకముందే ఆ ప్రదేశాన్ని సందర్శించండి.
ఆ క్షేత్రంలోకి ప్రవేశించే ముందు ఒక చిన్న ఊరు వస్తుంది. దాని పేరు ‘మహారాజ్ గూడ’. ఆ ఊరు మధ్యలోంచి రెండు రాష్ట్రాల సరిహద్దు గీత ఉంటుంది. ఒకే ఇంటిలో రెండు రాష్ట్రాల కార్యాలయాలు ఉంటాయి. ఒకే మనిషి రెండు రాష్ట్రాలకు చెందినవాడై ఉంటాడు. రెండు భాషలు ఒకే నాలుకపై నర్తిస్తాయి.
ఆ వివరాలు మరోవారం ముచ్చటించుకుందాం.

-జయధీర్ తిరుమలరావు సెల్ : 9951942242 jayadhirtr@gmail.com