బిజినెస్

జిఎస్‌టిపై పరిమితి కుదరదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 17: పెండింగ్‌లో ఉన్న రాజ్యాంగ సవరణ బిల్లులో వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి) రేటుపై పరిమితి విధించాలని కాంగ్రెస్ పార్టీ చేస్తున్న డిమాండ్‌ను అంగీకరించడం కష్టసాధ్యమని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ స్పష్టం చేశారు. అయినప్పటికీ ప్రస్తుతం జరుగనున్న రెండో విడత బడ్జెట్ సమావేశాల్లోనే ఈ బిల్లు ఆమోదం పొందుతుందని ఆశిస్తున్నట్లు జైట్లీ తెలిపారు. గురువారం న్యూఢిల్లీలో ఆయన ఇండియా టుడే కాంక్లేవ్‌లో మాట్లాడుతూ, జిఎస్‌టిని అమలులోకి తీసుకొచ్చేందుకు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాలు సహా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అనుకూలంగా ఉన్నాయన్నారు. లోక్‌సభలో మిగిలిన అన్ని పార్టీలు జిఎస్‌టి బిల్లును ఆమోదించినప్పుడు సభ నుంచి వాకౌట్ చేసిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు జిఎస్‌టి రేటుపై రాజ్యాంగబద్ధమైన పరిమితి విధిస్తే తాము కూడా ఈ బిల్లును సమర్థిస్తామని ప్రకటించిందని, అయితే రాజ్యాంగ సవరణ ద్వారా జిఎస్‌టి రేటును నిర్ణయించడం కుదరదు గనుక కాంగ్రెస్ డిమాండ్‌ను ఆమోదించడం కష్టసాధ్యమని జైట్లీ తెలిపారు.
ఇప్పటికే లోక్‌సభ ఆమోదం పొందిన జిఎస్‌టి బిల్లు ప్రస్తుతం రాజ్యసభలో అధికార ఎన్‌డిఎ భాగస్వాములకు తగినంత మెజార్టీ లేకపోవడంతో అక్కడ పెండింగ్‌లో ఉన్న విషయం తెలిసిందే. రాజ్యసభతో పాటు ఆ తర్వాత దేశంలోని 29 రాష్ట్రాల్లో కనీసం సగం రాష్ట్రాలు జిఎస్‌టి బిల్లును ఆమోదిస్తే అక్టోబర్ 1వ తేదీ నాటికి దీనిని అమలులోకి తీసుకొచ్చేందుకు అవకాశం ఉంటుంది. అయతే కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్నట్లుగా వస్తు, సేవల పన్ను రేటుపై రాజ్యాంగబద్ధమైన పరిమితి విధిస్తే, మున్ముందు ఏదైనా అత్యవసర పరిస్థితి ఏర్పడి జిఎస్‌టి రేటును పెంచాలనుకున్న ప్రతిసారి అందుకు రాజ్యాంగాన్ని సవరించాల్సి ఉంటుందని, కనుక వస్తు, సేవల పన్ను రేటును రాజ్యాంగ పరిమితి ద్వారా కాకుండా జిఎస్‌టి కౌన్సిల్ ద్వారా నిర్ణయించడమే ఉత్తమమని అరుణ్ జైట్లీ వివరించారు.
రెండంకెల వృద్ధిరేటు ‘అసాధ్యం’
ఇదిలావుంటే, ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక మందగమన పరిస్థితులు నెలకొన్న ప్రస్తుత తరుణంలో భారత్ రెండంకెల వృద్ధిరేటు సాధించడం ‘చాలా కష్టమైన’ విషయమని జైట్లీ అన్నారు. అయితే దేశంలో ఆర్థిక సంస్కరణలను ముందుకు తీసుకెళ్ల గలిగితే ప్రస్తుతం సాధించిన వృద్ధిరేటును మరింత మెరుగుపరుచుకునేందుకు అవకాశం ఉంటుందని ఆయన తెలిపారు. ‘ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర ఆర్థిక ఒడిదుడుకులు కొనసాగుతున్న ప్రస్తుత తరుణంలో భారత్ రెండంకెల వృద్ధి సాధించడం సాధ్యమేనని నేను చెప్పను. ఇది చాలా కష్టమైన వ్యవహారం. వాస్తవం చెప్పాలంటే రెండంకెల వృద్ధి సాధించడం ఆచరణలో అసాధ్యం’ అని ఆయన స్పష్టం చేశారు.