జాతీయ వార్తలు

జిఎస్టీ.. మరింత ముందుకు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 29: దాదాపు ఏడుగంటలపాటు జరిగిన సుదీర్ఘ చర్చ అనంతరం చారిత్రక జిఎస్‌టి అమలుకు సంబంధించిన నాలుగు కీలక బిల్లులను లోక్‌సభ బుధవారం ఆమోదించింది. కేంద్ర జిఎస్‌టి, సమీకృత జిఎస్‌టి, రాష్ట్రాలకు పరిహార జిఎస్‌టి, కేంద్ర పాలిత ప్రాంతాల జిఎస్‌టి బిల్లులను లోక్‌సభ ఆమోదించింది. అయితే ఈ చర్చ సందర్భంగా ప్రతిపక్ష పార్టీలు చేసిన సవరణలను తిరస్కరించింది. సుదీర్ఘ చర్చ అనంతరం సమాధానమిచ్చిన అరుణ్ జైట్లీ జిఎస్‌టి అమలులోకి వచ్చిన మరుక్షణం నుంచి అన్ని రాష్ట్రాల ప్రవేశ పన్నులు తొలగిపోతాయని తెలిపారు. లోక్‌సభ ఆమోదంతో పరోక్ష పన్నుల విధానం దిశగా మరో బలమైన అడుగు ముందుకు వేసినట్లయింది. జూలై 1నుంచే ఈ విధానాన్ని అమలు చేయాలన్న లక్ష్యం దిశగా కేంద్ర ప్రభుత్వం మరింత చేరువైనట్లయింది. జిఎస్‌టి వల్ల ఒకే రకమైన పరోక్ష పన్నుల విధానం అమలులోకి వస్తుందని, దీనివల్ల అన్ని రకాల వస్తువుల ధరలు మరింతగా తగ్గే అవకాశముంటుందని అరుణ్ జైట్లీ వివరించారు. అయితే జిఎస్‌టి రేట్లన్నవి ఓ వస్తువును సంపన్నుడు వినియోగిస్తున్నాడా లేక సామాన్యుడు వాడుతున్నాడా అనే దానిపైనే ఆధారపడి వుంటాయన్నారు. అలాగే ఈ విధానం వల్ల సజావుగా వ్యాపార వాణిజ్య కార్యకలాపాలను సాగించుకునే అవకాశం ఉంటుందని, ఒకే రకమైన పన్ను రేటు దేశమంతటా అమలవుతుంది కాబట్టి వ్యాపారస్తులకు ఎవరినుంచి ఏ రకమైన వేధింపులు ఉండవని స్పష్టం చేశారు. ‘ప్రస్తుతం పన్నులపైన పన్నులు విధించే విధానం అమలవుతోంది. దీనివల్ల వస్తువుల ధరలు అనూహ్యంగా పెరిగిపోతున్నాయి. వీటన్నింటినీ తొలగిస్తే కచ్చితంగా అన్ని వస్తువుల ధరలు తగ్గుతాయి’ అని జైట్లీ వివరించారు. ఒకే రకమైన పన్నుల విధానం అని చెపుతున్నప్పుడు పలు రకాలుగా జిఎస్‌టి రేట్లను ఎందుకు నిర్ణయించారన్న ప్రశ్నకు ‘హవాయి చెప్పులపైన, బిఎండబ్ల్యు కారుపైన ఒకే రకమైన పన్ను విధించలేం కదా’ అని జవాబిచ్చారు. ప్రస్తుతం ఆహార వస్తువులపై ఎలాంటి పన్ను లేదని, జిఎస్‌టిలో కూడా ఇదే పద్ధతి కొనసాగుతోందన్నారు. మిగతా అన్ని వస్తువులను సమీపంలో ఉండే రేటు పరిధిలోకే తీసుకొస్తామన్నారు.
ఈ చర్చ సందర్భంగా ప్రతిపక్ష పార్టీలు అనేక రకాలుగా అభ్యంతరాలను లేవనెత్తాయి. మనీ బిల్లులుగా వీటిని ప్రవేశపెట్టడాన్ని వ్యతిరేకించాయి. దీనికి జవాబిచ్చిన జైట్లీ 1950 నుంచి కూడా పన్నులకు సంబంధించిన అన్ని శాసనాలను మనీ బిల్లులుగానే పార్లమెంటులో ప్రవేశపెట్టడం జరుగుతోందని తెలిపారు.
తాము అధికారంలో ఉన్నప్పుడు జిఎస్‌టి బిల్లును అప్పటి ప్రతిపక్ష బిజెపి వ్యతిరేకించడం వల్ల భారతదేశం 12లక్షల కోట్ల రూపాయల ఆదాయాన్ని కోల్పోయిందని కాంగ్రెస్ పార్టీ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తింది. నాలుగు జిఎస్‌టి బిల్లులపై లోక్‌సభలో చర్చను ప్రారంభించిన కాంగ్రెస్ నాయకుడు వీరప్ప మొయిలీ ‘ఎన్‌డిఏ ప్రభుత్వం చెబుతున్న ఈ చారిత్రక పన్నుల సంస్కరణల బిల్లు మొత్తం వ్యవస్థను మార్చేసేదేమీ కాదు. ఇదో చిన్న అడుగు మాత్రమే’ అని అన్నారు. ఈ బిల్లులోని అనేక నిబంధనలు సాంకేతికంగా సమస్యలను తెచ్చిపెడతాయన్నారు. అప్పట్లో తాము తలపెట్టిన ఈ బిల్లును బిజెపి ఎందుకు వ్యతిరేకించిందో దానికే తెలియాలన్నారు. జిఎస్‌టి పరిధినుంచి రియల్ ఎస్టేట్ రంగాన్ని పూర్తిగా మినహాయించడాన్ని వ్యతిరేకించారు. అసలు నల్లధనానికి కేంద్ర బిందువుగా వున్న రియల్ ఎస్టేట్ రంగాన్ని జిఎస్‌టినుంచి మినహాయించడం దురదృష్టకరమని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వ ఉద్దేశం మంచిదే అయినా జిఎస్‌టి వల్ల పన్నుల పరంగా గందరగోళ పరిస్థితి తలెత్తుతుందని తెలిపారు.

చిత్రం..... జిఎస్టీ బిల్లుపై లోక్‌సభలో జరిగిన చర్చలో మాట్లాడుతున్న ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ