చిత్తూరు

హంద్రీ-నీవా నిర్మాణానికి రూ.438 కోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెద్దపంజాణి, జనవరి 24: జిల్లాలోని పెద్దపంజాణి మండలంలో హంద్రీ-నీవా మలివిడతగా పుంగనూరు నుంచి కుప్పం వరకు కాల్వ తవ్వకాల పనులను ఆదివారం రాష్ట్ర అటవీశాఖమంత్రి బొజ్జల గోపాలక్రిష్ణారెడ్డి భూమిపూజలు చేసి ప్రారంభించారు. కుప్పం వరకు నీరందించేందుకు కాల్వ తవ్వకాలకై 1500 ఎకరాల భూసేకరణ చేసినట్లు జిల్లా కలెక్టర్ సిద్ధార్థజైన్ వెల్లడించారు. అనంతరం మండలంలోని అప్పినపల్లె సమీపంలోని కాల్వ లింకేజి పనులను జెసిబి యంత్రాల ద్వారా ప్రారంభించారు. అనంతరం మంత్రి బొజ్జల మాట్లాడుతూ పుంగనూరు నుంచి కుప్పం వరకు 140 కిలోమీటర్ల మేర 1500 ఎకరాల భూమిలో రూ.438కోట్ల వ్యయంతో నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు. పనులను వేగవంతం చేస్తూ ఈ ఏడాది చివరిలోగా కుప్పంకు నీరందించాలని జిల్లా అధికారులను మంత్రి ఆదేశించారు. హంద్రీ-నీవా కాల్వకోసం భూములు ఇచ్చిన రైతులకు, బాధితులను అన్నివిధాలా ఆదుకుంటూ వారికి మార్కెట్‌విలువ కంటే రెండింతలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మదనపల్లె, పుంగనూరు, పలమనేరు, కుప్పం నియోజకవర్గంలోని అన్ని చెరువులకు అనుసంధానం చేస్తూ కాల్వ పనులు చేపడుతున్నట్లు మంత్రి వెల్లడించారు. అంచెలంచెలుగా జిల్లాలోని అన్ని చెరువులను అనుసంధానం చేసే క్రమంలో చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. నాటి ఎన్టీఆర్ రైతుల సంక్షేమం కోసం హంద్రీ-నీవా ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారని, గత పదేళ్ల కాంగ్రెస్ ప్రభుత్వంలో దుర్వినియోగం చేశారని ఎద్దేవా చేస్తూ.. అధికారంలోకి వచ్చిన సిఎం చంద్రబాబు జిల్లాలో సాగు, తాగునీటికై ప్రత్యేక చర్యలు చేపట్టి జలదీక్షకు పూనుకున్నారని మంత్రి బొజ్జల గుర్తుచేశారు. అనుకున్న సమయానికి ప్రాజెక్టులు పూర్తిచేసేందుకు సిఎం చంద్రబాబు కృతనిశ్చయంతో ఉన్నారని, ఇందుకు కాల్వ తవ్వకాలకు రైతులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఇస్తున్నారని గుర్తుచేశారు. రైతుపక్షపాతిగా సిఎం చంద్రబాబు తనదైన శైలిలో ముద్ర వేసుకుంటున్నారన్నారు. గత 10, 15ఏళ్ల పాటు వర్షాభావంతో జిల్లా అంతటా కరవుఛాయలు అలుముకోవడం, సిఎం చంద్రబాబు స్వర్ణాంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి శంకుస్థాపన చేసిన సమయంలో రాష్ట్రంలో వర్షాలు సమృద్ధిగా కురవడం రైతులకు కొంతమేరకు ఉపశమనం కలిగించడంతో పాటు వ్యవసాయంకు అనుకూలమైందన్నారు. ఈ ఏడాది చివరిలోగా అనంతపురం నుంచి కుప్పం వరకు నిరంతరాయంగా హంద్రీ-నీవా కాల్వ ద్వారా నీరందించేందుకు ప్రభుత్వం కృషిచేస్తోందన్నారు. వీరి వెంట జిల్లాపరిషత్ ఛైర్మన్ గీర్వాణిచంద్రప్రకాష్, జిల్లాపార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసులు, పలమనేరు ఎమ్మెల్యే అమరనాధరెడ్డి, జిల్లాకలెక్టర్ సిద్ధార్థజైన్, మదనపల్లె సబ్‌కలెక్టర్ కృతికబాత్ర, తహశీల్దారు శ్రీదేవి, పలమనేరు టిడిపి ఇన్‌చార్జ్ సుభాష్‌చంద్రబోస్, పూతలపట్టు టిడిపి ఇన్‌చార్జ్ మాజీ ఎమ్మెల్యే లలితకుమారి, ఎంపిపి మురళీకృష్ణ, జడ్‌పిటిసి సులోచన, అప్పినపల్లె సర్పంచి, రెవెన్యూ అధికారులు, మండల టిడిపి నాయకులు నాగరాజు, కృష్ణారెడ్డి, ముబారక్, వేణుగోపాల్‌నాయుడు, రాయలపేట చంద్ర, తదితరులు పాల్గొన్నారు.
వేదాలు భారతీయ సంపద: టిటిడి చైర్మన్
* * సనాతన ధర్మానికి మూలాలు వేదాలు: ఈఓ
* తిరుమలలో ఘనంగా శ్రీవారి వేద మహోత్సవం

తిరుమల, జనవరి 24 : మన పూర్వీకుల నుండి గురుకుల సంప్రదాయంలో వేద విజ్ఞానం సంక్రమించిందని ఈ విధంగా వేదాలు భారతీయ సంపదని టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షులు డా. చదలవాడ కృష్ణమూర్తి ఉద్ఘాటించారు. తిరుమలలోని అస్థానమండపంలో ఆదివారం సాయంత్రం టిటిడి శ్రీ వేంకటేశ్వర ఉన్నత వేదాధ్యయన సంస్థ ఆధ్వర్యంలో శ్రీవారి వేద మహోత్సవ సమావేశం జరిగింది. ముందుగా టిటిడి శ్రీరంగరామానుజ పెరియ జియర్ స్వామి మంగళశాసనం అందించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన టిటిడి చైర్మన్ మాట్లాడుతూ వేదాలను పఠించే వేదపండితులకు పట్టణాలు, గ్రామాల్లో ఇప్పటికీ మంచి ఆదరణ లభిస్తోందన్నారు. రాబోయే తరాలవారికి వేదవిజ్ఞాన సంపదను అందించాల్సిన బాధ్యత మనందరిపైనా ఉందని చెప్పారు. ప్రపంచంలో ఏదేశంలోనై లేని విధంగా భారతదేశ ప్రజల్లో ప్రశాంతత, ధర్మచింతన, భక్తి ప్రభావం ఉన్నాయన్నారు. ధర్మపరిరక్షణకు టిటిడి ఎన్నో కార్యక్రమాలు చేస్తోందని, ఇందులో భాగంగా సుమారు 1500 మందితో పౌర్ణమి గరుడసేవలో వేదపారాయణం నిర్వహించడం ఆనందకరమని అన్నారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన టిటిడి ఈవో డా.డి సాంబశివరావు మాట్లాడుతూ సనాతన ధర్మం గురించి వేదాల్లోని ఉందని, ధర్మోరక్షితి రక్షితః అన్న విధంగా ధర్మపరిరక్షణకు నడుం బిగించాల్సిన అవసరం ఉందన్నారు. ధర్మప్రచారంలో భాగంగా వేదాల వ్యాప్తి పరిరక్షణకు తిరుపతిలో శ్రీ వేంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం, దేశవ్యాప్తంగా ఏడు వేద పాఠశాలలను నిర్వహిస్తున్నామని, వీటిలో సుమారు వెయ్యి మంది విద్యార్థులు వేదవిద్యను అభ్యసిస్తున్నారని తెలిపారు. వేద పాఠశాలల్లో విధ్యాభ్యాసానికిసంబంధించిన మార్గదర్శకాలను టిటిడి సప్తగిరి మాస పత్రికలో ప్రచురిస్తామన్నారు. దేశవ్యాప్తగా గల 105 వేద పాఠశాలలకు ప్రతి ఏడాదీ ఆర్థికసాయం అందిస్తున్నామన్నారు. టిటిడి పరిధిలోని వివిధ ఆలయాల్లో దాదాపు 1200 మంది వేదపండితులు వేదపారాయణం చేస్తున్నట్టు తెలిపారు. అత్యంత పవిత్రమైన తిరుమలలో అన్ని వేదశాఖలకు సంబంధించి సుమారు 1500 మంది వేద పండితులు వేదపారాయణం చేయడం లోకకల్యాణానికి దోహదం చేస్తుందని ఈవో అభిప్రాయపడ్డారు. టిటిడిలోని కుమార అధ్యాపక పథకంలో చేరగలిగితే అన్ని సౌకర్యాలు కల్పిస్తామని తెలిపారు. వేదాల ప్రాశస్త్యాన్ని ఒక ఉద్యమంలా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని, తద్వారా వేద విజ్ఞానం అందరికీ అందుతుందని అన్నారు. ఈ సమావేశానికి దేశవ్యాప్తంగా విచ్చేసిన వేదపండితులతో సర్వే నిర్వహించి అభిప్రాయాలు, సూచనలు, స్వీకరించామని తద్వారా వేద విద్య వ్యాప్తికి తగిన చర్యలు తీసుకుంటామన్నారు. ఆత్మీయ అతిథిగా విచ్చేసిన టిటిడి తిరుమల జె ఈ వో శ్రీనివాస రాజు మాట్లాడుతూ శ్రీవారి ఆలయం ముందు వేదోచ్ఛారణ చేయడం మహాభాగ్యమన్నారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన వేద పండితులందరికీ అన్ని సౌకర్యాలు కల్పించినట్టు తెలిపారు. టిటిడి వేద పరిరక్షణకు కృషి చేయడంతో పాటు వేద పండతులను ఆదరిస్తోందని చెప్పారు. సాయంత్రం జరిగే గరుడ సేవలో అత్యంత క్రమశిక్షణతో వేదపారాయణం చేసేందుకు చర్యలు తీసుకున్నట్టు తెలిపారు. స్వామి వారు పౌర్ణమి గరుడ సేవలో వాహనం వెనుక శ్రీ తిరుమల నంబి ఆలయం నుంచి వేద పారాయణం ప్రారంభమయిందన్నారు. అలాగే టిటిడి తిరుపతి జె ఈ వో పోల భాస్కర్ మాట్లాడుతూ రాబోవు రోజుల్లో ఏడాది కోసారి వేద మహోత్సవం నిర్వహణకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు తెలిపారు. వివిధ వేదాలు, శాఖల పండితులు ఏ విధంగా తిరుమాడ వీధుల్లో వేదపఠనం చేయాలనే అంశంపై పలు సూచనలు చేశారు. టిటిడి ప్రాజెక్టుల ప్రత్యేకాధికారి ఎన్ ముక్తేశ్వరరావు మాట్లాడుతూ ఈ ఏడాది ఉత్తరాయణంలో మొదటి పౌర్ణమి ఆదివారం కావడం విశేషమన్నారు. వేదాత్ముడైన శ్రీవారి గరుత్మంతునిపై విహరించి ఈ శుభసందర్భందలో ఇంత పెద్ద ఎత్తున వేదోచ్ఛారణ నిర్వహించడం ముదావహమన్నారు. తిరుపతిలోని ఎస్వీ వేద విశ్వ విద్యాలయం ఉపకులపతి ఆచార్య కె ఇ దేనాధన్ మాట్లాడుతూ ఇంతమంది వేద పండితులను ఒకే చోటకు తీసుకురావడం చాలా కష్టము. టిటిడి సునాయాసంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించిందన్నారు. ఇంతటి మంచి కార్యక్రమాన్ని నిర్వహించిన టిటిడి అధికారులను ఆయన అభినందించారు. ఆ తరువాత శ్రీవారి ఆలయ డిప్యూటీవో చిన్నంగారి రమణ, పురాణ ఇతిహాస ప్రాజెక్టు ప్రత్యేకాధికారి డా. సముద్రాల లక్ష్మణయ్య, ప్రముఖ వేద పండితుడు తాతాచార్యులు, ఎస్వీ ఉన్నత వేదాధ్యయన సంస్థ కార్యవర్గ సభ్యులు విష్ణు బొట్ల సుబ్రహ్మణ్య శాస్ర్తీ, ఆర్ వెంకట్రామన్, ఘనాపాటి ప్రసంగించారు. అనంతరం వేద పండితులు వేదోచ్ఛారణ చేసారు. ఈ కార్యక్రమంలో టిటిడి దాస సాహిత్య ప్రాజెక్టు ప్రత్యేకాధికారి ఆనందతీర్థాచార్యులు, ఎస్వీ ఉన్నత వేదాధ్యయన సంస్థ సీ ఈ వో గోవిందరాజన్, ఇతర అధికార ప్రముఖులు పాల్గొన్నారు.

9 నెలల్లో కాపులను బీసీల్లో చేర్చేలా కృషి చేద్దాం
*రాష్ట్ర కాపు కార్పొరేషన్ చైర్మన్ చలమలశెట్టి పిలుపు
ఆంధ్రభూమి బ్యూరో
తిరుపతి, జనవరి 24: కాపులను 9నెలల లోపే బిసిల జాబితాలో చేర్చేందుకు సమష్టిగా కృషి చేసేందుకు దృష్టి సారించాలని రాష్ట్ర కాపుకార్పొరేషన్ చైర్మన్ చలమల శెట్టి రామానుజయ పిలుపునిచ్చారు. బలిజ అభ్యుదయ సేవా సమితి (బాస్) ఉపాధ్యక్షులు వూకా విజయ్ కుమార్ ఆధ్వర్యంలో ఆదివారం తిరుపతి అర్బన్ మాట్ నందు జరిగిన వనభోజన మహోత్సవం కార్యక్రమంలో చైర్మన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కాపులంతా టిడిపి బలపరుస్తున్నారన్నారు. ఎన్నికల ముందు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాపులను బిసిలో చేర్చడానికి హామీ ఇచ్చారన్నారు. అధికారంలోకి వచ్చిన తరువాత అందుకు అనుగుణంగానే ప్రణాళికలు రూపొందిస్తున్నారన్నారు. ఈ క్రమంలో బిసిల జాబితాలో ఉన్న కులాల రిజర్వేషన్లకు ఎలాంటి విఘాతం కలగకుండా బిసిలో చేర్చి కాపులకు ప్రత్యేక రిజర్వేషన్ సౌకర్యం కల్పించేందుకు సిఎం కృషి చేస్తున్నారన్నారు. ఇలాంటి సమయంలో కాపులంతా ఐక్యతతో వీలైనంత త్వరలో కాపులను బిసిలో చేర్చే అంశంపై కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. వివిధ చేతి వృత్తులపై ఆధారపడుతున్న కాపు కులస్థులందరికీ ఈ కార్పొరేషన్ ద్వారా తన వంతు కృషి చేస్తానన్నారు. కాపునాడు కార్పొరేషన్ ద్వారా అర్హులైన వారికి ఆన్‌లైన్ పద్ధతిలో 50 వేల రూపాయల నుండి కోటి రూపాయల వరకు ఆర్థిక సహాయం అందజేయడానికి కూడా కృషి చేయనున్నట్లు తెలిపారు. అనేక పరిశ్రమలు రాష్ట్రానికి వస్తున్నాయని కాపు యువతకు ఈ పరిశ్రమల్లో ఉపాధి అవకాశాలు మెండుగా లభిస్తాయన్నారు. అనంతరం తిరుపతి ఎమ్మెల్యే సుగుణమ్మ, టిటిడి బోర్డు చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి మాట్లాడుతూ కాపు కులాలను ఆర్థికంగా అభివృద్ధి చేయడానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నేతృత్వంలో ప్రత్యేక ప్రణాళికలు అమలు చేస్తున్నారన్నారు. అలాగే కాపు, బలిజ, ఒంటరి తెగల కులాలను ఆర్థికంగా అభివృద్ధి చేయడానికి ఈ కాపు కార్పొరేషన్ ద్వారా ప్రతి ఏటా 100 కోట్ల రూపాయలు ఖర్చు చేయడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. బిసిల అభ్యున్నతి, సంక్షేమాన్ని సి ఎం పరుగులు పెట్టిస్తున్నారన్నారు. ఇందుకు ప్రతి కాపు కులస్థులు ఆయనకు రుణపడి ఉండాలన్నారు. ఇప్పటికే కాపు కులస్థులకు అనేక ఉన్నత పదవులను అందజేశారన్నారు. కాపులకు బిసి రిజర్వేషన్ చేయడానికి కర్ణాటక రాష్ట్ర హైకోర్టు రిటైర్డ్ జడ్జి మంజూనాథ్‌తో కమిటీ కూడా ఏర్పాటు చేసినట్లు ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. 9 నెలల్లో కాపులను బిసిల్లో చేర్చడం తథ్యమన్నారు. ఈ కార్యక్రమంలో కాపు నాయకులు ఎమ్మెల్సీ బత్యాల చెంగల్రాయులు, చదలవాడ సుచరిత, టిటిడి శ్రీవారి ఆలయ డిప్యూటీవో చిన్నంగారి రమణ, రిటైర్డ్ డిజిపి భాస్కర్ రావు, రిటైర్డ్ ప్రిన్సిపల్ సెక్రటరీ కే వి రావ్, శ్రీశైలం అన్నదాన ట్రస్టు చైర్మన్ ఎం హెచ్ రావ్, బాస్ అధ్యక్షుడు ఎస్ ఎల్ వి నారాయణ, కార్యదర్శి సురేష్, ఆకుల సతీష్, పొన్నాల చంద్ర, వివిమహల్ పురందర్, బచ్చల కరుణాకర్, పోకల అశోక్ కుమార్, సింగం శెట్టి సుబ్బరామయ్య, కోల ఆనంద్, సంజయ్, శివా రాయల్, జంగాలపల్లి శ్రీనివాసులు, మాజీ ఎమ్మెల్యే ఏ ఎస్ మనోహర్, సింధూరి పార్క్ అధినేత వెంకయ్య, తదితరులు పాల్గొన్నారు. కాగా చిత్తూరు, కడప, నెల్లూరు, అనంతపురం జిల్లాలనుండి సుమారు 12 వేల మంది కాపు కులస్థులు వనభోజన మహోత్సవమునకు తరలివచ్చారు. ఒక విధంగా చెప్పాలంటే అర్బన్ హాట్ కాపు కులస్థులతో కళకళలాడింది.
గుప్త నిధుల కోసం తవ్వకాలు
రామకుప్పం, జనవరి 24: మండలంలో గుప్త నిధుల కోసం తవ్వకాలు కొనసాగుతున్నాయి. ముందస్తుగా పసిగట్టిన ప్రాంతాల్లో దుండగులు రాత్రి వేళల్లో క్షుద్రపూజలు నిర్వహించి తవ్వకాలు జరుపుతున్నారు. మండల పరిధిలోని బందార్లపల్లి పంచాయతీ కంచదాసనపల్లి గ్రామానికి చెందిన ఆనంద్‌కుమార్ అనే రైతు పొలంలో పూర్వీకులు రాతి బండలతో ఏర్పాటు చేసిన పురాతన గజ్జలమ్మ ఆలయంలో పూర్వీకులు ఏర్పాటు చేసిన రాతి బొమ్మరాల్లు, నాగులపుట్ట ఉండేది. చుట్టుపక్కల గ్రామస్తులు తరచూ పూజలు నిర్వహించేవారు. నాలుగు రోజుల క్రితం గుర్తు తెలియని దుండగులు రాత్రిపూట ఆలయం చుట్టూ దారం కట్టి ప్రత్యేక పూజలు నిర్వహించి ఉన్నారు. ఆలయం పైనున్న రాతి బండలను తొలగించి ఐదు అడుగుల లోతుమేర తవ్వకాలు జరిపారు.

వైభవంగా పౌర్ణమి గరుడ సేవ
తిరుమల, జనవరి 24 : తిరుమలలో ఆదివారం రాత్రి 7 గంటలకు పౌర్ణమి గరుడసేవ వైభవంగా ప్రారంభమైంది. వేదాత్ముడైన స్వామి వారు గరుత్మంతునిపై విహరిస్తూ స్వామి వారు భక్తులను అనుగ్రహించారు. ప్రతి నెలా పౌర్ణమి సందర్భంగా గరుడసేవ నిర్వహిస్తున్న విషయం విధితమే. ఈ గరుడ సేవ సందర్భంగా ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఒడిశా, అసోం, గోవా తదితర రాష్ట్రాల నుంచి విచ్చేసిన దాదాపు 1500 మంది వేద పండితులు పవిత్ర తిరుమాడ వీధుల్లో వేదపారాయణం చేశారు. స్వామి వారి గరుడ వాహనం వెనక వందలాది వేద పండితులు మొదటగా తిరుమల నంబి ఆలయం వద్ద నుండి రుగ్వేదంతో వేదపారాయణం ప్రారంభించారు. అనంతరం శుక్లయజుర్వేదం, కృష్ణయజుర్వేదం, సామవేదం, అధర్వణవేదంలోని మంత్రాలను పఠిస్తూ మాడ వీధుల గుండా వాహనంతోపాటు వాహన మండపానికి చేరుకున్నారు.
ఈ సందర్భంగా టిటిడి చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి, ఈవో సాంబశివరావు శ్రీ నరసింహ శతకం, భాగవతా కథాసుధ, శ్రీచక్ర విశేష పూజ మరియు బ్రహ్మ విద్య అనే పుస్తకాలను గరుడ వాహన సేవ ముందు ఆవిష్కరించారు. మునుపెన్నడూ లేని విధంగా ఈ గరుడ సేవలో వందలాది పండితుల వేదఘోషలో తిరుమల గిరులు ధ్వనించాయి. విచ్చేసిన వేలది మంది భక్తులు భక్తిశ్రద్ధలతో వేదఘోష మధ్య స్వామివారిని దర్శించుకుని పులకించారు.

1.10 కోట్లతో తహశీల్దార్ కార్యాలయం
* భూమిపూజ చేసిన మంత్రి బొజ్జల

శ్రీకాళహస్తి, జనవరి 24: రూ.1.10 కోట్లతో నిర్మించే శ్రీకాళహస్తి తహశీల్దార్ కార్యాలయానికి స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర అటవీశాఖ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి ఆదివారం భూమిపూజ చేశారు. మొదట ప్రభుత్వం రూ.60 లక్షలు మాత్రమే మంజూరు చేసింది. మొదటి అంతస్తు నిర్మాణానికి మరో రూ.50 లక్షలు ఖర్చు చేయనున్నారు. కొత్తపేటలోని పాత రెవెన్యూ కార్యాలయం స్థలంలో ఈ కార్యాలయాన్ని నిర్మించనున్నారు. ఈ కార్యక్రమంలో మునిసిపల్ చైర్మన్ పేట రాధారెడ్డి, మాజీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి, శ్రీ కాళహస్తి దేవస్థానం ట్రస్టు బోర్డు చైర్మన్ గురవయ్యనాయుడు, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చంచయ్యనాయుడు, మునిసిపల్ కమిషనర్ శ్రీరామశర్మ, తహశీల్దార్ చంద్రమోహన్, విఆర్వోల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు భక్తవత్సల నాయుడు తదితరులు పాల్గొన్నారు. బ్రిటీష్ హయాంలో నిర్మించిన తహశీల్దార్ కార్యాలయం పూర్తిగా శిథిలావస్థకు చేరుకోడంతో మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి ప్రభుత్వం ద్వారా రూ.60 లక్షలు మంజూరు చేశారు. త్వరగానిర్మాణం పూర్తిచేయాలని మంత్రి ఆర్ అండ్ బి అధికారులను ఆదేశించారు.

వడ్డీ వ్యాపారి వేధింపులు తాళలేక
మహిళ ఆత్మహత్య
తిరుపతి, జనవరి 24: వడ్డీ వ్యాపారుల వేధింపులు తాళలేక బావిలో దూకి మహిళ ఆత్మహత్య చేసుకున్న సంఘటన నగిరిలో జరిగింది. బంధువుల కథనం మేరకు కొత్త పేటకు చెందిన కృష్ణణ్, వేండా(35) దంపతులు కూలిపనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఇంటి అవసరాల కోసం కృష్ణణ్ ఓ వ్యక్తి వద్ద స్పీడు వడ్డీకి కొంత మొత్తం అప్పుగా తీసుకున్నాడు. వడ్డీ కట్టకపోవడంతో రెండునెలల క్రితం అప్పు ఇచ్చిన వ్యక్తి గొడవ పడ్డాడు. దీంతో కృష్ణన్ ఇంటి నుంచి వెళ్లిపోయాడు. అతని భార్య వేండా తమిళనాడు ఆరె కె పేటలోని తన అమ్మగారింటికి వెళ్లి బంధువుల వద్ద రూ.2 లక్షలు తీసుకువచ్చి కొత్తపేటలో తీసుకున్న అప్పును తీర్చింది. అది వడ్డీకే సరిపోయిందని, అసలు ఇవ్వాలని నాలుగు రోజుల క్రితం అప్పిచ్చిన వ్యక్తి, అతని అనుచరులు ఆమెను దుర్భాషలాడారు. ఆ అవమానం భరించలేక ఆమె రెండు రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయింది. శనివారం చింతల పట్టెడ సమీపంలోని వ్యవసాయ భావిలో ఆమె మృతదేహం బయటపడింది. మృతురాలికి తమిళ్ సెల్వి అనే సంవత్సరాలు గల కుమార్తె, గుణప్రియ అనే 10 సంవత్సరాల కుమార్తె, శేఖర్ అనే ఏడు సంవత్సరాల పిల్లలు ఉన్నారు. వడ్డీ వ్యాపారుల వేధింపుల వల్లే వేండా చనిపోయిందని బంధువులు పోలీసులకు ఫిర్యాదుచేశారు. ఆత్మహత్య కేసు నమోదు చేస్తామని పోలీసులు చెప్పారు. సోమవారం ధర్నా చేయనున్నట్లు బంధువులు తెలపారు.

ముగిసిన పోలీస్ క్రీడలు
* ఓవరాల్ ఛాంప్‌ను కైవసం చేసుకున్న చిత్తూరు ఆర్మ్‌డ్ రిజర్వ్‌ఫోర్స్
* ఎస్పీ, ఎస్పీల చేతుల మీదుగా విజేతలకు బహుమతుల ప్రదానం
చిత్తూరు, జనవరి 24: గత ఐదు రోజులుగా చిత్తూరులోని పోలీస్ పెరేడ్, మెసానికల్ క్రీడా మైదానాల్లో జరిగిన పోలీస్ అధికారులు, సిబ్బంది క్రీడా పోటీలు ఆదివారం ముగిసాయి. ఈ పోటీల్లో చిత్తూరు, మదనపల్లె, పలమనేరు, పుత్తూరు సబ్‌డివిజన్ పోలీసులు, ఆర్మ్‌డ్ రిజర్వ్‌ఫోర్స్‌తో పాటు, హోంగార్డ్ విభాగం పోలీసులు పలు క్రీడాంశాలపై పోటీపడ్డారు. ఇందులో పలు రంగాల్లో రాణించిన చిత్తూరు ఆర్ముడ్ రిజర్వ్‌ఫోర్స్ 100 మార్కులకు గాను 80 మార్కులు సాధించి ఓవరాల్ ఛాంపియన్‌గా నిలిచింది. ద్వితీయ స్థానంలో మదనపల్లె సబ్‌డివిజన్ పోలీసులు నిలిచారు. గ్రూపు పోటీల విభాగంలో నిర్వహించిన వాలీబాల్ పోటీలో చిత్తూరు సబ్‌డివిజన్ పోలీసులు మొదటి స్థానాన్ని, చిత్తూరు ఆర్మ్‌డ్ రిజర్వ్ ఫోర్స్ జట్టు ద్వితీయ స్థానం కైవసం చేసుకుంది. బాస్కెట్‌బాల్ విభాగంలో మదనపల్లె జట్టు ప్రథమస్థానం, మదనపల్లె జట్టు ద్వితీయస్థానం, హాకీ విభాగంలో మదనపల్లె జట్టు ప్రథమస్థానం, చిత్తూరు ఆర్మ్‌డ్ ఫోర్స్ జట్టు ద్వితీయస్థానం, కబడ్డిలో చిత్తూరు ఆర్మ్‌డ్ ఫోర్స్ జట్టు ప్రథమస్థానం, చిత్తూరు హోమ్‌గార్డ్స్ జట్టు ద్వితీయస్థానం సాధించాయి. టగ్ ఆఫ్ వార్ విభాగంలో పలమనేరు, పుత్తూరు జట్లు ప్రథమ, ద్వితీయ స్థానాలను సాధించి తమ సత్తాను చాటాయి. పరుగుపందెం, జావెలిన్ త్రో, డిస్కస్‌త్రో, షాట్‌ఫుట్ విభాగాల్లోనూ ఆయా సబ్‌డివిజన్ల జట్టు తమ సత్తాను చాటి బహుమతులకు ఎంపికయ్యారు. వీటితో పాటు జర్నలిస్టుల కోసం ప్రత్యేకంగా నిర్వహించిన పరుగుపందెం పోటీలో అశోక్, ఆలీ, వసంత్ అనే జర్నలిస్టులు ఉత్తమ ప్రతిభ చూపి బహుమతులకు ఎంపికయ్యారు. విజేతలకు జిల్లా ఎస్పీ ఘట్టమనేని శ్రీనివాస్, ఏఎస్పీలు అభిషేక్ మహంతి, రత్నలు బహుమతులు, మెమొంటోలను అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఇకపై పోలీసుల క్రీడలపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తామన్నారు. ఇందుకోసం పరిపాలన విభాగంలో ప్రత్యేక అధికారిని నియమించి ఉద్యోగుల క్రీడలను ప్రోత్సహిస్తామన్నారు. గత ఐదు రోజులుగా స్నేహపూర్వక వాతావరణంలో క్రీడలు సాగాయని, ఈ విధానాన్ని ఇకపై కూడా కొనసాగించాలని కోరారు. ఈ కార్యక్రమంలో డిఎస్పీలు లక్ష్మినాయుడు, రామ్‌కుమార్, సుధాకర్‌రెడ్డి, దేవదాసు, శ్రీకాంత్, రామకృష్ణ, పలువురు సిఐలు, ఎస్‌ఐలు, పోలీసుశాఖలో పనిచేసే ఉద్యోగుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.