భక్తి కథలు

హరివంశం 66

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నీవు ఎవరివో తెలియక నీతో చనువుగా మెలగాలంటే మాకు భయమవుతున్నది. ఎక్కడ ఏం తప్పు జరిగిపోతుందో, అపచారంగా నడుచుకొంటామో అని తికమకపడుతున్నాం. ‘మా యశోద కొడుకు, మా నందుడి ముద్దుల పట్టి, మా సంగిడికాడు, మా ఇళ్ళల్లో అల్లరి చేసినవాడు, మా చిన్నికృష్ణమ్మ అని భ్రమసి ఏం తప్పులు చేస్తామో కదా! అని అలజడి చెందుతున్నాము. నీవు ఎవరివైనా కానీ, నీకు మొక్కి మేము చల్లగా ఉంటాము. బతికిపోతాము. నిన్ను మానుష భావంతో అజ్ఞానంతో చూస్తున్నందుకు మమ్మల్ని కరుణించు. మమ్ముల్ని రక్షించు. కాపాడు. నీ వారము మేము. మా వాడిని నీవు. అంతే మాకు తెసింది అని ఆయనతో అన్నారు వ్రజవాసులు.
అప్పుడు కృష్ణుడు నవ్వుతూ ఈ ప్రశ్నలూ, సందేహాలూ మీకెందుకు? నేను మీ బాంధవుణ్ణి అని నమ్మితే చాలదా? అంతకుమించిన తక్కిన విషయాలు మీకు అనవసరం. మీకు ఆపదలు రాకుండా చూస్తాను.
ఇదంతా నాకు ఒక క్రీడ. ఈ నా క్రీడాలోలతను మీరు కేవలం చూస్తూ ఉండండి. కాలం గడచిన కొద్దీ నేనెవరో మీరు తెలుసుకోగలుగుతారు. అప్పుడు మీకు సంతోషాతిశయం కలుగుతుంది. శుభం కలుగుతుంది అని వాళ్ళకు ప్రేమ పూర్వకంగా బోధించాడు కృష్ణుడు. అపుడు గోపల్లె వారంతా తృప్తితో సంతోషించారు.
కృష్ణుడు క్రమంగా పూర్ణ వ్వనడైనాడు. ఆ బలమూ ఆ తేజస్సు ఆ విక్రమమూ ఆ సొగసులతో సర్వజనాహ్లాదకరుడైనాడు. మధించిన ఆంబోతులు తన మీదకు వచ్చేట్లు రెచ్చగొట్టి వాటిని లీలగా లోబరచుకుంటున్నాడు.
వ్రేపల్లె గోపాలుర మల్లులతో ద్వంద్వయుద్ధం చేసి జయశీలుడవుతున్నాడు. ఆయన తమను మల్లక్రీడకు పిలిస్తే వాళ్ళు వణికిపోతున్నారు. అరణ్యంలో తిరుగుతున్నపుడు పెద్ద పులులు మొదలైన క్రూర మృగాలను కూడా చెవులు పట్టుకొని ఆడించి అశ్రమంగా చంపివేస్తున్నాడు అటవీవాసులకు భయం లేకుండా. పరుగులో కాని, ఒడిసిపట్టడంలోకాని, లొంగదీసుకోవటంలోని, గట్టి పట్టు పట్టటంలో కాని ఆయన చూపే ఒడుపు, సామర్థ్యం, చాతుర్యం చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.
ఆయన పౌరుషం, అందమైన ప్రాయం, మనోజ్ఞమైన రూపరేఖలు, బల విక్రమాలు ఎవరూ అనుకరించలేనివిగా అలరారాయి. ఆయనను చూసి పడుచు గోపికలు ముగ్ధ మనోజ్ఞ ప్రణయ భావ పరవశులవుతున్నారు. ఇంతలో శరద్రాతులు ఆసన్నమైనాయి.
అప్పుడాయన పరమ దివ్య సుందరుడై, సర్వాలంకార భూషితుడై, కేశ కలాపంలో మెరిసిపోతున్న నెమలి పింఛం ధరించి, నవ్య పుష్పమాలాలంకృత వక్షస్థలుడై, నయనకాంతుల నయగారము, దరస్మితాధర సోయగమూ తనకు వింత అందాలు చేకూరుస్తూ ఉండగా వన వీధులలో వేణు నాద సుధాపూరాన్ని సృష్టించాడు. గోవులు మేతలు మరచి ఆ నాద మాధుర్యం గ్రోలుతూ చిక్కిపోతున్నాయి. గోపాలురు ఆ మురళీ నాద సౌందర్యానికి మేనులు మరచి పరవశత్వం అనుభవిస్తున్నారు. కామితదాయకుడు కృష్ణుడని గోప వనితలు ఆయనవైపు పరుగులు తీస్తున్నారు. ఆయన వేణునాదం వాళ్ళను మంత్రముగ్థులను చేస్తున్నది. వాళ్ళు ఇళ్ళు వాకిళ్ళు మరచిపోతున్నారు. ఆయన చిరునవ్వులు చిందిస్తే వాళ్ళు ఆయనను నవ్వు పువ్వులతో అర్చిస్తున్నారు. నయన కుసుమాలతో ఆరాధిస్తున్నారు. కలహాసాలతో అలరిస్తున్నారు. ఆయన ఎక్కడుంటే అక్కడ ఉంటున్నారు. కృష్ణ కృష్ణ అని కలవరిస్తున్నారు. కృష్ణ కృష్ణ అని తలుస్తున్నారు.

ఇంకాఉంది