భక్తి కథలు

హరివంశం 123

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాని ఈ జన సమృద్ధికి చాలిన చోటు మీరు చూపిన ప్రాంతంలో లేదు. ఈ వైశాల్యం సరిపోదు. జలధి ఇంకా కాస్తచోటు మనకు సమకూరిస్తే ఆఘమేఘాలమీద మీరు కోరినట్లు చేయగలను, అది ఎంత పని?! అని విన్నవించుకున్నాడు. వెంటనే శ్రీకృష్ణుడు సాగరుణ్ణి అర్థించాడు మాకు ఇంకా స్థలం కావాలని.
జగన్నాథుడి ప్రార్థన జలధి అతిక్రమించగలదా? నాలుగు వైపులా పనె్నండు యోజనాలు తన సలిలాలు ఉపసంహరించుకున్నాడు సముద్రుడు. దీన్ని చూసి విశ్వకర్మ ఎంతో ఆశ్చర్యం పొందాడు. ఆనందంతో కృష్ణదేవుణ్ణి ప్రశంసించాడు. ఇక తన శిల్ప చాతుర్యమంతా చూపి ఒక పరమ సుందర విభవాభిరామమైన నగరాన్ని అక్కడ వెలయించాడు.
రాజమార్గాలు, విఫణి వీధులు, కృతక పర్వతాలు, విహార సరస్సులు, ఉద్యానవనాలు, మేడలు, మిద్దెలు, కోటలు, ప్రాకారాలు, తోరణాలు, చైత్య స్తంభాలు, గుడి గోపురాలు ఆయన తనకు నిర్దేశించినట్లు, చిత్ర పట రేఖాంకితంగా నగర స్వరూపాన్ని ప్రతిపాదించినట్లు విశ్వకర్మ ఆ అందాల పట్టణాన్ని అక్కడ నిర్మింపజేశాడు. అదివరకే దానికి ద్వారక అని పేరు పెట్టాడు కృష్ణుడు. ఇక్కడ ఆయనకు ఒక గొప్ప రాజప్రాసాదాన్ని కూడా నిర్మించాడు విశ్వకర్మ. యాదవ ప్రముఖులందరికీ సుందర మందిరాలు నిర్మింపజేశాడు.
తళతళలాడే నక్షత్రాలతో కూడిన ఆకాశ వీధిలాగా, వసంతకాలంతో శోభించిన గొప్ప ఉద్యానవనంలాగా, వర్షాకాలపు నదులు నిండి కల కల గల గలలతో అందగించినట్టు ఆ ద్వారక బహు సుందరంగా విరాజిల్లింది. ఆ నగరాన్ని చూసుకుంటూ ఆనందించిన కృష్ణుడు ఒక రోజు తండ్రి భవనంలో ఉన్నపుడు ఆయనకు ఒక ఆలోచన వచ్చింది. చాలా గొప్ప నగరం నాది. అంతా బాగుంది. అయితే ఇక్కడ పేదవారు, నిర్థనులు ఎవ్వరూ ఉండకూడదు. దీనుడు, కృశుడు, దరిద్రుడు, సౌఖ్య విహీనుడు ఒక్కరు కూడా ఉండకూడదు. దరిద్రుడు మృతుడితో సమానుడంటుంది లోకం. అటువంటి బీదవాడు నా పట్టణంలో ఒక్కరూ ఉండటానికి వీలు లేదు అనుకొని ధనాధి దేవత అయిన శంఖ నిధిని స్మరించాడు. ఈ నిధి దేవత సాకారంగా ఆయన మ్రోలని నిలిచి దోసిలొగ్గి ‘ఏమిటి ఆజ్ఞ!’ అని అడిగింది.
అప్పుడు కృష్ణుడు ద్వారకలో ఉండే జనులందరూ సకల సంపన్నులుగా ఉండేట్లు చూడవలసిందగా కోరాడు. యాచకుడు అంటూ ఒక్కడు కూడా కనపడకూడదు అని ఆదేశించాడు. ఎక్కడైతే ‘నాకు యాచన తప్ప వేరే గతి లేదు. ఈ లేమి భరించలేను. కనికరించండి అని ప్రజలలో ఎక్కడైనా విన్పించిందా అంటే, అంతకంటే అవమానం ఏముంటుంది రాజుకు? కాబట్టి నా ప్రజలలో పేదరికం అనే మాట ఉండనే కూడదు’ అని ఆజ్ఞాపించాడు కృష్ణుడు. ‘మహాప్రసాదం’ అని శంఖ నిధి ఆయనకి మొక్కి తనదైన ధనదుడి లోకం వెళ్లింది. అక్కడి అష్టనిధులకు అధిదేవత శంఖనిధి. కుబేరుడి అంగీకారంతో ఆ శంఖ నిధి తన తోడి నిధులతో వచ్చి ద్వారకలో ప్రతి ఇంటా ఐశ్వర్యం సృష్టించింది. కృష్ణుడు శ్రీనాధుడు. శ్రీయాధిపతి. ఐశ్వర్య సమగ్రుడు. ఆయన పట్టణంలో సిరుల కొదువ ఏముంటుంది? ద్వారక సకల సంపదలతో శోభిస్తూ ఉండగా ఆయన సంతుష్టి చెందాడు.
ఇంకొకసారి ఆయనకు ఇంకొక గొప్ప ఆలోచన వచ్చింది. అపుడు కూడా తండ్రి ఇంట్లోనే ఉన్నాడాయన. ఆలోచన రాగానే వెంటనే ఆయన వాయుదేవుణ్ణి పిలిపించుకున్నాడు తన సమక్షానికి. వాయుదేవుడు వచ్చి ఆయనకు ప్రణమిల్లాడు.

ఇంకాఉంది