భక్తి కథలు

హరివంశం 191

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇక త్రిపురారి కూడా మననేమీ చేయలేడు అని విదితమవుతున్నది మనకు అని బలరాముణ్ణీ, ప్రద్యుమ్నుణ్ణీ ఉత్సాహపరిచాడు కృష్ణుడు. గరుత్మంతుడు మరింత ఉత్తేజితుడై సూర్యుడే మినువీధినుంచి కిందికి దిగి వస్తున్నాడా? అన్నంత ఉజ్వల కాంతి పరివేషంతో ముందుకు సాగుతుండగా దృఢ సంకల్పంతో పరమ శివాజ్ఞను వర్తులైన ప్రచండాగ్నులు కొన్ని గరుడారూఢుణ్ణి నిలువరించడానికి ఎదురువచ్చాయి.
ఈ అగ్నులు వహ్నిలోచనుడి అనుచరగణంలోనివారు. వీళ్ళను బ్రహ్మదేవుడు సృష్టించాడు. వీళ్ళ పేర్లు కుల్మాషుడు, కుసుముడు, దహనుడు, శోషణుడు, తపనుడు, ఈ ఐదుగురు ఒక జట్టువారు. మరొక జట్టు వారైన ఐదుగురున్నారు అగ్నులు. వాళ్ల పేర్లు పితరుడు, పతంగుడు, స్వర్ణుడు, ఔర్యుడు, భ్రాజుడు. ఈ రెండు బృందాలవారు బృందారక దివిజ వందితుడికి ఎదురు వచ్చారు. ‘ఈ వచ్చేవాడు గరుడుడు, కాని ఇతడి స్కంధం (మూపు)మీద త్రేతాగ్నులులాగా ప్రకాశిస్తున్నారే, వీరెవరో కదా! అని విస్మయావిష్ట మనస్కులైనారు ఆ రెండు బృందాలుగా వస్తున్న అగ్నులు. మరి వీళ్ళను మనం ఎదుర్కొని ముందుకు కదలనీయకూడదు అని పంతం పూనారు ఆ దశవహ్నులు. వాళ్ళప్పుడు ఛ్చటాచ్ఛటాధ్వనులు పటురవపూరితంగా సింహనాదాలుగా వెలువరించి శోణనగర ప్రాసాద గవాక్షాల ద్వారా బాణుడికి తెలిసేట్లు చేశారు. అపుడు బాణుడు సకల సేనా పరివార సమేతుడై సర్వసన్నద్ధ యుద్ధ ప్రయత్నుడైనాడు. రుద్రాగ్నులను తోడు చేసుకొని ఆహవ భూమిలో ప్రవేశించాడు. ఆయన రథానికి రెండు వైపులా జ్యోతిష్టోముడు, విభావసుడు అనే మహాగ్నులు అర్చిష్మంతంగా బాణుణ్ణి అనుసరించారు. స్రువాయుధమనే మహా శస్త్రాన్ని బాణుడు ధరించి రథంలో బయలుదేరాడు. అంగిరసుడు అనే అగ్ని దేవతాకమైన ముని కూడా స్వాహా, వషట్కార అగ్ని రూపమైన ఆయుధాలతో రథస్థుడై బాణుడికి సహాయంగా వచ్చాడు. ఈ అగ్నులన్నీ కృష్ణుణ్ణి ఓటమిపాలు చేస్తామని బిభీషికలు పలుకుతూ బాణుడికి ఉత్సాహోద్రేకాలు కలుగజేశారు. శ్రీకృష్ణుడికి ఈ అగ్నుల ఆర్భాటం చూసి నవ్వు వచ్చింది. మీకన్నా అగ్నిజ్వాలలు వెలార్చే తీవ్ర చక్రాయుధం నాకున్నది, మీ పస ఇప్పుడే తేలిపోతుంది అని ఆకృశానురూపాలను హెచ్చరించాడు కృష్ణుడు. ఆంగిరసమునీ! నీకెందుకయ్యా ఈ కయ్యం! తపోశ్రేష్టులు యజ్ఞాలు చేసి హుతములు సమర్పించగానే నేను అధిక తేజోమంతుణ్ణి అని నీకు కావరం ఎక్కువైనట్లున్నది అనగానే అంగిరసుడు ఆగ్రహజ్వాలాకంపమానుడై కృష్ణుడిపైకి ఒక శూలం అభిమంత్రించి ప్రయోగించాడు. ఆ శూలాన్ని ఒక అర్థచంద్రాకార బాణం ప్రయోగించి తుత్తునియలు చేశాడు కృష్ణుడు. ఇంకొక బాణం అంగిరసుడిపై ప్రయోగించాడు.
దానితో అంగిరసుడు మూర్ఛితుడైనాడు. అంగిరసుడి రథ సారథి ఆయనను రక్షించుకోవటానికి రథం తోలుకొని కనపడకుండా పరుగులు తీయించాడు రథశ్వాలను. దీనిని చూసి తక్కిన అగ్నులు భయపడి పోయి తలొక దిక్కుకు పరిగెత్తిపోయినారు. అపుడు శ్రీకృష్ణుడు శోణపురి కోట ద్వారంవరకు నిర్నిరోధంగా చేరుకున్నాడు. అప్పుడు నారదుడు హడావిడిగా అక్కడకు వచ్చి ‘శ్రీకృష్ణా శోణపురిలో రుద్రుడూ, రుద్రాణీ, రుద్ర తనయుడూ ఈ బాణదనుజుణ్ణి కాపాడటానికి నిరంతరం జాగ్రత్త వహిస్తుంటారు. ముందు లెస్సగా ఆ విషయం విచారించుకో’ అని హెచ్చరించాడు. దీనికి కృష్ణుడు అలతి నవ్వుతో మేము మా పని సాధించుకోవటానికి వచ్చాము. భర్గుడు మమ్ముల్ని ఆటంకపరచటానికి పూనుకుంటే అది మాకు మరింత యశోదాయకమే కదా! అని వ్యంగ్యోక్తులతో సమాధానించాడు.

ఇంకా ఉంది