క్రైమ్ కథ

మనస్సాక్షి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఊరు బయట పిక్నిక్‌కి వచ్చిన డేవిస్, జెనీ దంపతులు మధ్యాహ్నం ఓ చెట్టు కింద నిద్రపోతున్నారు. 60 ఏళ్ల డేవిస్ లేచి గుర్రుపెట్టి నిద్రపోయే తన భార్యని డిస్ట్రబ్ చేయకుండా చెట్ల మధ్య నించి చెరువు గట్టుకి నడిచి వెళ్లాడు. బోట్‌హౌస్ పక్కన ఒడ్డున ఓ చెట్టు కింద కూచుని రేడియో వింటూ, వొంటరిగా బీర్ తాగుతున్న పాతికేళ్ల లోలా కనిపించింది.
‘హలో మిస్టర్ డేవిస్. గుడ్ ఆఫ్టర్‌నూన్. బీర్ కావాలా? నా పక్కన కూర్చుని నాతో మాట్లాడరాదు? మీ మందుల దుకాణంలో తప్ప బయట నేను మీతో ఎప్పుడూ మాట్లాడలేదు’ ఆహ్వానించింది.
డేవిస్ లోలా పక్కన కూర్చున్నాడు. ఆమె బీర్ కేన్ తెరిస్తే ఆమె ఒంటి మీద అది చిందింది. వెంటనే అతను ఆమె భుజం మీద పడ్డ బీర్‌ని తుడవసాగాడు.
‘మిస్టర్ డేవిస్! నీ భార్య జెనీ ఇది చూస్తే ఏమంటుంది?’ లోలా నవ్వుతూ అడిగింది.
‘ఏమీ అనదు’
‘ఏమీ అనదా?’ ఆమె పకపక నవ్వుతూంటే అతను ఆమెని ముద్దు పెట్టుకునే ప్రయత్నం చేశాడు.
‘ఏమిటి? ఏం చేస్తున్నారు..?’ లోలా గట్టిగా అరిచింది.
వెంటనే అతను కుడిచేత్తో ఆమె నోటిని మూసి చెప్పాడు.
‘నువ్వు ఊళ్లో అందర్నీ ముద్దు పెట్టుకుంటావు కదా? నేనూ అదే పని చేద్దాం అనుకుంటున్నాను’
డేవిస్ ఆమె నోటి మీంచి చేతిని తీయగానే ఆమె అరవడంతో ఆమె గొంతుని పట్టుకున్నాడు. కొద్ది నిమిషాల తర్వాత కానీ తను చేసింది అతనికి అర్థం కాలేదు. ఆమె మణికట్టుని పట్టుకుని చూస్తే నాడి ఆగిపోయింది!
‘లోలా’ అన్న అరుపు విని లేచి చటుక్కున ఓ పొద వెనుక దాక్కున్నాడు. ఆ చెరువులో పడవ మీద అటుగా వచ్చిన యువకుడైన జెజె చెప్పాడు.
‘లోలా! నిద్ర పోతున్నావా? లే.. నువ్వు రాకపోతే నేను ఒక్కడ్నే వెళ్లిపోతాను’
లాలో రాకపోవడంతో మళ్లీ చెప్పాడు.
‘సరే. నీ ఇష్టం. వెళ్తున్నా’
జెజె పడవ వెళ్లాక డేవిస్ పిల్లిలా వచ్చి ఇంకా నిద్రలేవని భార్య పక్కన పడుకుని మొహం మీదికి దుప్పటి కప్పుకున్నాడు.
నాలుగైదు నిమిషాల తర్వాత అక్కడికి వచ్చిన షెరీఫ్ వాళ్లని నిద్రలేపాడు.
‘హలో షెరీఫ్ వాల్టర్! ఏమిటిలా వచ్చారు?’ జెనీ లేచి అడిగింది.
‘వాల్టర్! మీకే డ్రింక్ కావాలి? మాతో భోం చేయండి’ డేవిస్ కూడా అప్పుడే నిద్ర లేచినట్లు నటిస్తూ చెప్పాడు.
‘ఇవాళ స్ప్రింగ్‌లోని మొదటి ఆదివారం. మా పిల్లలు చెరువులో బోటింగ్ చేస్తానంటే తీసుకువచ్చాను.. మీరు వెళ్లండి’ షెరీఫ్ తన ఇద్దరు పిల్లలకి చెప్పాడు.
వాళ్లు బోట్‌హౌస్ దగ్గరికి వెళ్తూండటంతో డేవిస్ కలవరపడ్డాడు.
ఇందాకటి కుర్రాళ్లలో ఒకడు పరిగెత్తుకొచ్చి ఆదుర్దాగా చెప్పాడు.
‘డేడీ! రా! ఓ అమ్మాయి మరణించింది’
వెంటనే షెరీఫ్ అక్కడికి బయలుదేరాడు.
* * *
అర్ధరాత్రి డేవిస్ ఇంట్లో ఫోన్ మోగింది. షెరీఫ్ వాల్టర్ నించి.
‘ఎక్కడికి?’ బట్టలు తొడుక్కుంటున్న భర్తని జెనీ అడిగింది.
‘మత్తుమందు తీసుకుని జైలుకి రమ్మని వాల్టర్ ఫోన్ చేశాడు’
డేవిస్ జైలుకి మత్తు మందుతో వెళ్లేసరికే జైలు సెల్‌లోని జెజె దిండుని ఇనుప కటకటాల కేసి కొడుతున్నాడు. సెల్ నిండా దూదిపింజలు.
‘నన్ను బయటికి పంపండి. నేనా హత్య చేయలేదు’ అరుస్తున్నాడు.
డాక్టర్ సిద్ధంగా ఉన్నాడు. డాక్టర్ సిరంజిలోకి ఆ మందుని ఎక్కించాక ఇద్దరు పోలీస్ ఆఫీసర్లు తాళం తెరిచి లోపలికి వెళ్లి, అతన్ని నేల మీద పడేసి పట్టుకున్నాక, డాక్టర్ జెజెకి మత్తు ఇంజెక్షన్ ఇవ్వడం డేవిస్ చూశాడు. అతనికి జెజె మీద సానుభూతి, తన మీద తనకే ద్వేషం కలిగాయి.
‘నేను లోలాని ప్రేమించాను మిస్టర్ డేవిస్. ఎందుకు చంపుతాను?’ అతను ఏడుస్తూ మత్తులోకి జారిపోయాడు.
‘ఇతను తప్పకుండా హంతకుడే. విచారణకి డబ్బు ఖర్చు చేయడం వృధా. సరాసరి ఎలక్ట్రిక్ చెయిర్‌లో కూర్చోపెట్టాలి. అవునా మిస్టర్ డేవిస్?’ వాల్టర్ ప్రశ్నించాడు.
* * *
మర్నాడు ‘డేవిస్ ఫార్మసీ’ నించి డేవిస్ ఫోన్ డయల్ చేశాడు.
‘హలో?’ టీవీ చూస్తున్న షెరీఫ్ వాల్టర్ రిసీవర్ ఎత్తి అడిగాడు.
‘జెజె హంతకుడు కాదు. ఇంకొకరు చంపారు’ డేవిస్ గుసగుసలాడుతూ చెప్పాడు.
‘మీరెవరు?’ వాల్టర్ అడిగాడు.
‘నన్ను నమ్మండి. జేజే అమాయకుడు’
‘అతను చేయకపోతే ఈ హత్యని ఎవరు చేశారు? మీరెవరు? సరిగ్గా మాట్లాడితే మీ కంఠం గుర్తుపడతాను’
‘నేను’ గుసగుసగా చెప్పాడు.
‘ఎవరా నేను?’
తన పేరు చెప్పలేక రిసీవర్ పెట్టేసిన డేవిస్ తన అసహాయ స్థితికి బాధపడుతూ బయటికి చెప్పాడు.
‘జార్జి డేవిస్.. జార్జి డేవిస్’
* * *
మందుల కోసం డేవిస్ షాపునకు వచ్చిన ఒకామె చెప్పింది.
‘జెజె బెయిల్ మీద బయటికి వచ్చినట్లున్నాడు. బెయిల్ మొత్తం పెంచి వాడిని జైల్లోనే కూర్చోబెట్టాల్సింది. జడ్జి తప్పకుండా లోలా హంతకుడికి మరణశిక్ష విధిస్తాడు’
డేవిస్ దినపత్రికలోని అక్షరాలని కట్ చేసి తెల్ల కాగితం మీద అతికించాడు.
‘జెజె లోలాని చంపలేదు. అది ఇంకొకరి పని. నేను అతన్ని చూశాను. మీరు అతన్ని కనుగొంటారు’ ఓ సాక్షి.
దాన్ని మడిచి జడ్జి హిగ్గిన్స్ అడ్రస్ రాసిన కవర్‌లో ఉంచాడు. మందుల షాపులోంచి బయటికి వచ్చి తలుపు తాళం వేస్తూంటే షెరీఫ్ వాల్టర్ పోలీస్ కారు దిగి ఆయనతో చెప్పాడు.
‘ఇంత లేటుగా పని చేస్తున్నారా? లోపల దీపం చూసి దొంగలేమో అనుకుని ఆగాను’
అకస్మాత్తుగా వైర్లెస్‌లో అతనికి వినిపించింది.
‘షెరీఫ్ వాల్టర్! రాష్ట్ర సరిహద్దులు దాటే జెజెని స్టేట్ పోలీసులు ఇప్పుడే అరెస్టు చేశారు’
‘జెజె నేరస్థుడని బెయిల్ జంప్ చేసి నిరూపించాడు’ చెప్పి వాల్టర్ వెళ్లిపోయాడు.
ఇంటికి వచ్చిన డేవిస్ ఫ్రిజ్‌లోంచి లెమనేడ్ తీసి తాగుతూండగా లోపలి నించి అతని భార్య పిలుపు వినిపించింది.
‘ఎవరది? డేవిస్?’
డేవిస్ జవాబు చెప్పలేదు. అక్కడికి వచ్చిన జెనీ ఆయన్ని చూసి చెప్పింది.
‘ఎంత భయపడ్డానో తెలుసా? పలకరేం?’
‘ఎవరు హంతకుడనుకున్నావా?’ డేవిస్ ప్రశ్నించాడు.
‘ఈ రోజుల్లో ఎవర్నీ నమ్మలేం. మీకో శుభవార్త. జడ్జి హిగ్గిన్స్ పోన్ చేసి నిన్ను జెజె కేస్‌లో జూరీకి ఎంపిక చేసానని, రేపు మధ్యాహ్నం పోస్ట్‌లో కోర్ట్ ఆర్డర్ వస్తుందని చెప్పాడు. ఇది ఈ గ్రామంలోని మొదటి హత్యా విచారణ. మిమ్మల్ని పత్రికా విలేకరులు ఇంటర్వ్యూ చేస్తారు. నాకెంతో గర్వంగా ఉంది. మీరు న్యాయం చేయాలి డేవిస్. హంతకుడికి మరణశిక్ష పడేలా చేయాలి’ జెనీ చెప్పింది.
* * *
లోలా మెడ చుట్టూ చేతులు బిగుసుకుపోవడంతో ఊపిరాడక మరణించిందని, థైరాయిడ్ కార్ట్‌లేజ్ కూడా తెగిపోయింది కాబట్టి ఆమె పెనుగులాడి ఉంటుందని కోర్టులో డాక్టర్ చెప్పాడు. జెజె తరఫు లాయర్ తన డాక్టర్‌ని క్రాస్ ఎగ్జామినేషన్ చేయదల్చుకోలేదని చెప్పాడు.
‘జడ్జ్! నేను డాక్టర్ని ఓ ప్రశ్న అడగవచ్చా?’ జ్యూరీ బాక్స్‌లోని డేవిస్ లేచి అడిగాడు.
‘అడగచ్చు. డాక్టర్ కాదు. సాక్షి’
‘సాక్షి చెప్పినట్లు హతురాలిని హింసాత్మకంగా చంపితే, హంతకుడి ఒంటి మీద గోరుగాట్లు ఉండి తీరాలి కదా? అవి ఉన్నాయా? జ్యూరర్‌గా న్యాయం చేయడానికి ఇది తెలుసుకోవాలని అనుకుంటున్నాను. లోలాకి పొడవైన గోళ్లున్నాయని అందరికీ తెలుసు’
విచారణకి హాజరైన చాలామంది నవ్వారు.
‘అనుమానితుడి ఎడమ ముంజేతి పైన, కుడిచేతి పైన వేలి గోళ్లతో ఏర్పడ్డ రక్కులు కనిపించాయి’ డాక్టర్ చెప్పాడు.
‘జడ్జ్! నేను జెజెని ఓ ప్రశ్న అడగచ్చా?’ డేవిస్ మళ్లీ అడిగాడు.
‘అడగచ్చు. జెజె కాదు. ముద్దాయి’
‘ముద్దాయి నించి అవి ఎలా ఏర్పడ్డాయో వివరణ కోరుతున్నాను’
‘లోలా నన్ను గోరుతో గీరింది. కానీ అది ఆ ఉదయం, మేం మా ఇంట్లో పోట్లాడుకున్నప్పుడు. డాక్టర్‌కి ఈ విషయం చెప్పా కూడా. అక్కడే కాదు. నా ఒంటి మీద చాలాచోట్ల రక్కింది’
మళ్లీ అంతా నవ్వారు. తర్వాత ఓ సాక్షి బోనెక్కి చెప్పాడు.
‘నేను ఆ చెరువులో చేపలు పడుతూంటే, పడవ మీద వెళ్లే జెజె నా వంక క్రూరంగా చూశాడు. అప్పుడు అక్కడ శవం ఉందని నాకు తెలీదు. దాని సమీపంలో పడవని ఆపాడు. పడవ దిగి ఒడ్డుకి వెళ్లాడు. జరిగిందంతా నేను చూసాను. ఆమె పాదం కూడా నాకు కనిపించింది’
వెంటనే డేవిస్ చేతిని మళ్లీ ఎత్తాడు. లేచి నిలబడి చెప్పాడు.
‘జడ్జ్! అతను చెప్పింది నాకు అర్థం కాలేదు. శవం ఎక్కడుందో, అతను ఎక్కడ కూర్చున్నాడో ఓసారి నేను చూడాలని అనుకుంటున్నాను’
‘నేను కూడా’ ఓ జ్యూరీ సభ్యురాలు లేచి చెప్పింది.
‘సరే. రేపు ఉదయం హత్య జరిగిన ప్రాంతానికి జ్యూరీ సభ్యులని తీసుకెళ్దాం’
తర్వాతి సాక్షి చెప్పింది.
‘నేను హేపీ హోమ్ అనే హోటల్‌ని నడుపుతున్నాను. జెజె అక్కడ బస చేసిన లోలా గదికి తరచూ వచ్చేవాడు. వాళ్లిద్దరూ గట్టిగా పోట్లాడుకోవడం వినిపించేది. హత్య జరిగిన ఆదివారం లోలా చెరువుకి ఈతకి వెళ్దామంది. నాకు ఈ చప్పుడు వినిపించింది’ చేతిలో చేతిని కొట్టి చెప్పింది.
‘తర్వాత వాళ్లిద్దరూ కలిసి వెళ్లారు’
‘వెళ్లాక ఆమె మళ్లీ ప్రాణాలతో తిరిగి రాలేదు’ పబ్లిక్ ప్రాసిక్యూటర్ చెప్పాడు.
డేవిస్ లేచి ఆమెని అడిగాడు.
‘ఎల్సీ! తర్వాత వాళ్లిద్దరూ కలిసి వెళ్లడం నువ్వు చూశావా?’
‘చూశాను. ఆమె నడుం చుట్టూ చేతిని వేశాడు. ఆమె కూడా’
‘ఆమె నడుం చుట్టూ చేతిని వేసిన అతను నీకు హంతకుడిలా కనిపించాడా? అతను ఆమెని చంపుతాడని నీకు అనిపించలేదా?’
‘లేదు’
ఆ రోజుకి విచారణ ముగిసింది.
‘నువ్వు హంతకుడ్ని కాపాడాలని అనుకుంటున్నావు’ జెనీ కోర్టు బయట తన భర్తతో చిరు కోపంగా చెప్పింది.
‘కాదు. అమాయకుడ్ని రక్షించి, హంతకుడికి శిక్ష పడేలా చేయాలని అనుకుంటున్నాను. చివరికి అదే జరుగుతుంది చూడు’ చెప్పాడు.
* * *
మర్నాడు చెరువు దగ్గర సాక్షి కూర్చున్న చోటికి జ్యూరీ సభ్యులు అంతా చేరుకున్నారు. అక్కడ నించి దాదాపు అర మైలు దూరంలో ఏం జరిగిందో ఎంత ముందుకి వంగి చూసినా కనపడదని జ్యూరీ సభ్యులంతా తెలుసుకున్నారు.
‘సాక్షి ప్రమాణం చేసి చెప్పిందంతా అబద్ధం’ ఓ జ్యూరీ సభ్యుడు చెప్పాడు.
తర్వాత కోర్టుకి చేరుకున్నారు.
‘జ్యూరీ సభ్యులకి శిక్ష విషయంలో ఏకాభిప్రాయం కుదిరిందా?’ జడ్జి అడిగాడు.
‘యస్ యువరానర్’ జ్యూరీ ఫోర్‌మేన్ చెప్పాడు.
‘ఏమిటది?’
అంతా ఉత్కంఠగా చూశారు.
‘ముద్దాయి నిర్దోషి అని భావిస్తున్నాం’
జెజె తల్లి ఆనందంతో ఏడుస్తూ నవ్వసాగింది. జెనీ భర్త వంక తీవ్రంగా చూసి లేచి బయటకి నడిచింది.
డేవిస్ బయటికి వచ్చాడు. వెనకే వచ్చిన జెజె అతన్ని చూసి థాంక్స్ చెప్పి, తన తల్లితో ఆనందంగా ముందుకి సాగాడు. కోర్టు బయట వారంతా వెళ్తున్న డేవిస్‌ని చూసి నిరసనగా ‘బూ బూ’ అని అరిచారు. డేవిస్ సరాసరి తన మెడికల్ షాప్‌కి చేరుకున్నాడు.
‘మీరు ఎందుకు జెజె ని రక్షించాలని తాపత్రయపడ్డారు?’ మెడికల్ షాపులో జెనీ ప్రశ్నించింది.
‘నేను ఎవర్నీ రక్షించలేదు. కేవలం న్యాయం జరగాలని ఆశించాను’ డేవిస్ చెప్పాడు.
జెజె తలుపు తెరచుకుని లోపలికి వచ్చాడు.
‘మీకు థాంక్స్ చెప్పడానికి వచ్చాను’ చెప్పాడు.
‘లోపలికి రా’ డేవిస్ అతన్ని వెనక గదిలోకి తీసుకెళ్లాడు.
‘నేను నిర్దోషిని. అయినా నన్ను ప్రజలంతా హంతకుడనే భావిస్తున్నారు. మా అమ్మ బయట బట్టలు ఆరేస్తే ఎవరో వాటి మీద బురద చల్లారు. రాత్రి మా ఇల్లు తగలపెట్టాలని కూడా ఎవరో ప్రయత్నించారు. నన్ను మిల్లులో ఉద్యోగం నించి కూడా తీసేశారు. తర్వాత ఏం జరుగుతుందో తెలీదు’
‘నువ్వు ఈ ఊరు వదిలి వెళ్లిపోవచ్చుగా జెజె?’ డేవిస్ అడిగాడు.
‘వీటన్నిటికీ కారణం అదే. నేను వాళ్లకి ఆ తృప్తిని ఇవ్వను. నేను ఇక్కడే, ఈ ఊళ్లోనే అసలు హంతకుడు దొరికే దాకా ఉంటాను. మిస్టర్ డేవిస్! ఆ హత్య నేను చేయలేదని మీరు ఎందుకు నమ్మారు? అది ఎవరో చేశారో మీకు తెలుసని నాకు అనిపిస్తోంది’
‘లేదు జెజె. తెలీదు’
‘దయచేసి హంతకుడ్ని కనుక్కునేందుకు మీరు నాకు సహాయం చేయండి’ జెజె అర్థించాడు.
బయట నించి పెద్దగా అరుపులు వినిపించాయి. అంతా వెళ్లి చూస్తే, జెజె కారు మీద దూది పింజెలు చల్లి ఉన్నాయి. ‘కిల్లర్ కార్’ అనే బోర్డు దాని మీద కనిపించింది.
* * *
డేవిస్ మనస్సాక్షి అతనిలో తీవ్రంగా పని చేస్తూండడంతో ఇక ఆపుకోలేక మర్నాడు షెరీఫ్ వాల్టర్ దగ్గరికి వెళ్లాడు.
‘ఏమిటంత ఆదుర్దాగా ఉన్నారు?’ వాల్టర్ ప్రశ్నించాడు.
‘లోలాని ఎవరు చంపారో నాకు తెలుసు?’ డేవిస్ చెప్పాడు.
‘మీరు షెర్లాక్ హోమ్స్ కాదు. ఐనా చెప్పండి’
‘నేనే! మీరు స్టేట్‌మెంట్ రాస్తే నేను సంతకం చేస్తాను’
‘జోక్ బావుంది’ వాల్టర్ నవ్వేసాడు.
‘నేను ఆమెని చంపాక భయం వేసి పారిపోయాను. నా చేతులే ఆయుధం’
‘జోక్‌ని పొడిగించకండి. ఇంటికి వెళ్లండి’ వాల్టర్ విసుగ్గా చెప్పాడు.
‘నన్ను నమ్మరా?’
‘తప్పకుండా నమ్ముతాను. పదండి. నేనే మిమ్మల్ని దిగబెడతాను’
* * *
డ్టార్ మందిచ్చి చెప్పాడు.
‘ఇది ఆదుర్దాని, ఆందోళనని తగ్గిస్తుంది. మూడు రోజులు వాడితే చాలు’
డాక్టర్ వెళ్లాక జెనీ చెప్పింది.
‘జ్యూరీ డ్యూటీ వల్ల మీరు డిస్ట్రబ్ అయ్యారు. అంతా మీకు పిచ్చెక్కిందంటారు. మీరు జోక్ చేశానని చెప్పండి’
‘నేను జోక్ చేయడంలేదు’
‘మా అమ్మ ఎప్పుడూ అంటుండేది, వీళ్ల వంశంలో పిచ్చి ఉందని’ నిరసనగా చెప్పింది.
‘దీన్ని నమ్మే ఒకరు నాకు తెలుసు’ డేవిస్ కోపంగా లేచి బయటికి వెళ్తూంటే జెనీ ఆయన్ని ఆపాలని ప్రయత్నించింది. కానీ కుదరలేదు.
తలుపు చప్పుడైతే తాగి ఉన్న జెజె లేచి వెళ్లి తలుపు తీశాడు. నిశ్శబ్దంగా డేవిస్ లోపలికి వచ్చాడు. జెజె ఎడమచేతిలో పిస్తోలు, కుడిచేతిలో సగం ఖాళీ అయి విస్కీ బాటిల్ కనిపించాయి.
‘ఇందాకే కొందరు రాళ్లు వేసి మా ఇంటి కిటికీ తలుపులు పగలకొడుతూంటే బెదిరించాను. ఈ ఊళ్లోని నా ఏకైక మిత్రుడు మీరే. నన్ను నమ్మారు. రక్షించారు. నాకు మీరు స్వేచ్ఛని ఇచ్చారు. ఇప్పుడు ఏం కావాలంటే అది చేసే స్వేచ్ఛ నాకుంది. సరిగ్గా సమయానికి వచ్చారు. నేను అలసిపోయాను.’ జెజె రివాల్వర్‌ని తన కణతకి గురి పెట్టుకున్నాడు.
‘వద్దు. ఆ పని చేయద్దు’ డేవిస్ కోరాడు.
‘నాకు చాలా దుఃఖంగా ఉంది డేవిస్. ఒక్కోసారి నాకు నేనే ‘హత్య’ చేశాను. అందుకని ప్రజలు నన్ను శిక్షిస్తున్నారు’ అనిపిస్తోంది. బహుశా నేనే చేసి ఉంటాను’ మత్తుగా చెప్పాడు.
‘జెజె! నేను చెప్పేది జాగ్రత్తగా విను. లోలాని నేనే చంపాను’ డేవిస్ చెప్పాడు.
‘మీది ఇంత విశాల హృదయం అనుకోలేదు. దయచేసి నన్ను వొంటరిగా వదలండి. గెటౌట్’ జెజె కోపంగా అరిచాడు.
‘ఒట్టేసి చెప్తున్నాను. లోలాని చంపింది నేనే’
‘నన్ను రక్షించడానికి మీరు అబద్ధం ఆడకండి. మీరు దోమని కూడా చంపలేరు. ఈసారి మీకు ఓ మరణానికి సాక్షి కాకూడదు. దయచేసి బయటికి నడవండి’
డేవిస్ ఓ అడుగు ముందుకి వేసి అతని చేతిని అందుకుని బలవంతంగా కిందికి దింపాడు. ఇద్దరి పెనుగులాటలో డేవిస్ చేతిలోని రివాల్వర్ పేలి జెజె కుప్పకూలాడు. నివ్వెరపోయిన డేవిస్ రివాల్వర్‌ని శవం పక్కన పడేసి వచ్చి బయట తన కారులో కూర్చున్నాడు.
* * *
జెజె ఇంట్లోంచి బయటికి వచ్చిన షెరీఫ్ వాల్టర్ కారులో దిగాలుగా కూర్చున్న డేవిస్ దగ్గరికి నడిచి అడిగాడు.
‘డేవిస్! ఇక్కడేం చేస్తున్నారు?’
‘నేను జెజె దగ్గరికి వచ్చాను’
‘జెజె మరణించాడు. ఆత్మహత్య చేసుకున్నాడు’ వాల్టర్ చెప్పాడు.
‘లేదు. నేనే అతన్ని చంపాను’
‘జెజె మొదట లోలాని చంపాడు. పశ్చాత్తాపంతో చివరికి గుండెలో కాల్చుకుని మరణించాడు’
‘రివాల్వర్ మీద వేలిముద్రలు నావి. తగిన సాక్ష్యంతోనే మాట్లాడుతున్నాను’ డేవిస్ చెప్పాడు.
‘నేను వేలిముద్రల గురించి పట్టించుకోకుండా, దాన్ని నా చేతిలోకి తీసుకున్నాను. నాకు కళ్లున్నాయి. ఆత్మహత్యో, హత్యో తెలుసుకోగలను’
‘వాల్టర్! నేను అతన్ని కాల్చాను. అతన్ని నేనే చంపాను’ డేవిస్ నిస్సహాయంగా చెప్పాడు.
‘ఈ ఊళ్లోని ఎవరూ మీరు చెప్పేది నమ్మరు. మీరు నిర్దోషి అనే చెప్తారు. జ్యూరీ డ్యూటీ తర్వాత మీ మనసు చెదిరింది. మీకు విశ్రాంతి కావాలని డాక్టర్ చెప్పాడు. మిమ్మల్ని ఇంటి దగ్గరికి దిగబెడతాను. రండి’
వాల్టర్ ఏడుస్తున్న డేవిస్‌ని భుజం చుట్టూ చేతులు వేసి తీసుకెళ్లాడు.
*

(ఫ్రాన్సిస్ డిలెలాట్ కథకి స్వేచ్ఛానువాదం)

మల్లాది వెంకట కృష్ణమూర్తి