క్రైమ్ కథ

సీతాకోకచిలుక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డిస్ట్రిక్ట్ బస్‌లోంచి దిగిన పాతికేళ్ల బిల్లీ నేష్ సిగరెట్ వెలిగించి, తన సామానుతో సమీపంలోని గదులు అద్దెకి ఇచ్చే బోర్డింగ్ హౌస్‌కి చేరుకుంది. వారానికి ఆరు డాలర్ల చొప్పున ఓ గది అద్దెకి తీసుకుంది. ఆ గది శుభ్రంగా లేదు.
అందులో చాలాకాలంగా అద్దెకి ఉంటున్న అరవై ఏళ్ల ఛార్లీ ఆ సాయంత్రం ఆమె తలుపు తట్టాడు.
‘నేను మీ ఎదురుగదిలోనే ఉంటాను. కింద టైలర్ షాప్‌ని నడుపుతున్నాను. మీకేమైనా సహాయం కావాలంటే మొహమాట పడకుండా అడగండి. చేస్తాను’ ఆమె అందానికి ముగ్ధుడై ఆయన చెప్పాడు.
మర్నాడు ఉదయం బిల్లీ ఎదురు గది తలుపు తట్టి, తలుపు తెరిచిన ఛార్లీని అడిగింది.
‘మీ దగ్గర నాలుగు క్వార్టర్స్ ఉంటే ఇస్తారా? ఫోన్ చేయాలి’
డాలర్ బిళ్ల తీసుకుని ఆమెకి చిల్లర ఇచ్చాడు. పక్కనే ఉన్న పబ్లిక్ ఫోన్ నించి ఆమె ఫోన్ చేసి పేపర్లో పడిన వెయిట్రెస్ ఉద్యోగం గురించి అడిగింది. ఇంటర్వ్యూకి రమ్మని చెప్పడంతో బిల్లీ సరాసరి ఆ రెస్ట్‌రెంట్‌కి చేరుకుంది. దాన్ని కట్లర్, అతని భార్య డోరా కలిసి నడుపుతున్నారు.
‘ఇది వరకు ఎక్కడ పని చేసారు?’ లాంటి ప్రశ్నలు వేశాక మద్యం తాగుతున్న డోరా చెప్పింది.
‘ఓ రాత్రికి ఆరు డాలర్లు ఇస్తాం. కస్టమర్స్‌తో ప్రేమగా ప్రవర్తించాలి. కాని మరీ ప్రేమగా కాదు’
బిల్లీ ఆ రాత్రే ఉద్యోగంలో చేరింది. తన బట్టలు అన్నిటినీ చూసుకుని, వాటిలో ఏదీ ఉద్యోగానికి పనికిరాదని గ్రహించి ఛార్లీ తలుపు కొట్టి చెప్పింది.
‘నాకు ఉద్యోగం వచ్చింది. రేపు రాత్రి మనిద్దరం మాత్రమే ఏదైనా రెస్ట్‌రెంట్‌లో సెలబ్రేట్ చేసుకుందాం. నాకు మీరు తప్ప ఈ ఊళ్లో ఇంకెవరూ ఫ్రెండ్స్ లేరు’
‘చాలా సంతోషం’
‘్ఛర్లీ! నాకో ఇరవై డాలర్లు అప్పివ్వగలరా? వచ్చే వారం జీతం రాగానే చెల్లిస్తాను’
‘మన డిన్నర్ కోసం నేను ఎదురుచూస్తూంటాను’ ఛార్లీ ఆమె కోరిన డబ్బిచ్చి చెప్పాడు.
సాయంత్రం బార్లో కౌంటర్ వెనక ముప్పై ఏళ్ల కట్లర్ కనిపించాడు. వంటవాడు గస్ తనని పరిచయం చేసుకున్నాడు.
‘ఇక్కడికి వచ్చే కస్టమర్స్ చుట్టుపక్కలవాళ్లే. వారి పేర్లు, వారు తాగేది గుర్తుంచుకోవాలి. అప్పుడే వ్యాపారం బావుంటుంది. నా దగ్గర కొని వాళ్లకి అమ్మాలి. వాళ్ల నించి డబ్బు తీసుకునే బాధ్యత నీదే’ కట్లర్ చెప్పాడు.
‘నా దగ్గర అందుకు డబ్బు లేదు’
‘ఈ రాత్రి వెళ్తూ ఈ ఇరవై ఇచ్చి వెళ్లాలి’ కట్లర్ బిల్లీకి ఇరవై డాలర్లు ఇచ్చి రసీదు మీద సంతకం తీసుకుని చెప్పాడు.
ఆరుంపావు నించి కస్టమర్స్ రావడం ఆరంభమైంది. ఆమె పని తీరుని గమనించిన కట్లర్ తృప్తి చెందాడు. డోరా తన భర్తకి తెలియకుండా తాగడం బిల్లీ గమనించింది. డబ్బిచ్చినప్పుడల్లా బిల్లీ తన చేతిని కావాలని స్పృశించడం కట్లర్ గమనించాడు. బార్ మూసేసే సమయానికి డోరాకి బాగా మత్తు వచ్చింది. ఆ విషయంలో భార్యాభర్తలు పోట్లాడుకోవడం బిల్లీ విన్నది.
‘ఈ బార్లో సగం భాగం నాది. డ్రింక్ ఎందుకు ఇవ్వవు?’ డోరా భర్త మీద అరిచింది.
‘సరే. నీ ఇష్టం వచ్చినంత తాగు, మీ నాన్నలా చావు’
‘మా నాన్న పేరెత్తకు. బార్ టెండర్‌గా ఆయన నీకు ఉద్యోగం ఇవ్వకపోతే మన పెళ్లే జరిగేది కాదు’
ఇంటికి వచ్చాక ఛార్లీ బిల్లీ గదిలోకి వస్తూంటే, అతన్ని రానివ్వకుండా ఆమె చెప్పింది.
‘నేను అలసిపోయాను’
* * *
మర్నాడు బిల్లీ బార్‌కి వెళ్లేసరికి కట్లర్ తప్ప డోరా లేదు.
‘ఐయాంసారీ. క్రితం రాత్రి గొడవకి’ కట్లర్ చెప్పాడు.
ఆమె అతన్ని గాఢంగా చుంబించింది. వారి మధ్య మాటలు లేవు. ఆ రాత్రి కట్లర్ పని చేస్తున్న ఆమెనే గమనించసాగాడు. ఆ రాత్రి డోరా తప్పతాగి మళ్లీ గొడవ చేసింది. ఆమెని మోసుకుని ఇంటికి తీసుకెళ్లాడు. మర్నాడు బిల్లీ పావుగంట ముందే బార్‌కి వెళ్లింది. గ్లాసులు తుడుస్తున్న కట్లర్‌ని కౌగిలించుకుని చెప్పింది.
‘మీరు ఆ తాగుబోతుతో ప్రతీ రాత్రి గడపడం నేను చూడలేక పోతున్నాను. మనం వెళ్లిపోదాం’
‘ఎక్కడికి?’ కట్లర్ ప్రశ్నించాడు.
‘ఎక్కడికైనా. మెక్సికోకి’
‘ఈ బార్ సంగతేంటి?’ అడిగాడు.
‘దీన్ని అమ్మేయండి. ఆ డబ్బుతో మెక్సికోకి వెళ్దాం’ ఉత్సాహంగా చెప్పింది.
‘నీకు పిచ్చెక్కిందా? డోరా సంగతేమిటి? ఈ బార్‌లో సగభాగం ఆమెది. తాగనప్పుడు డోరా చాలా మంచిది. నాకు ఆమె అంటే ద్వేషం లేదు. పైగా నాకు ఈ బారంటే ఇష్టం’
‘తన సగాన్ని ఏదో ఓ రోజు తాగేస్తుంది’ కోపంగా చెప్పింది.
హేండ్ బేగ్‌ని పట్టుకుని వెళ్తున్న ఆమె చేతిని పట్టుకుని ఆపి అడిగాడు.
‘ఎక్కడికి?’
‘పని ఉంది. నీకు బార్ అంటే ఇష్టం అన్నావుగా. నువ్వే ఇక్కడి పని చెయ్. వచ్చే వారం నించి కొత్త వెయిట్రస్‌ని పెట్టుకో. నేను ఉద్యోగం వదిలేస్తున్నాను’
ఆమె తన గదికి చేరుకున్న కొద్దిసేపటికి ఛార్లీ తలుపు తట్టాడు.
‘గుడీవినింగ్ బిల్లీ. నీ కోసమే ఎదురుచూస్తున్నాను. బయటికి వెళ్దామనేగా ముందు వచ్చేసావు?’ డ్రెస్ చేసుకున్న ఛార్లీ లోపలికి వచ్చి అడిగాడు.
‘నా రాకపోకల టైంటేబుల్‌ని వల్లె వేయకుండా బయటికి నడు’ కోపంగా చెప్పింది.
‘నీకెందుకంత కోపం?’ తెల్లబోయాడు.
‘నా భుజాల దాకా వచ్చే నీతో నేను బయటికి వస్తానని ఎలా అనుకున్నావు? అంతా నన్ను చూసి నవ్వేలా చేయక. బయటికి నడు’ నెట్టేసింది.
* * *
మర్నాడు ఉదయం బిల్లీ తలుపు మీద ఎవరో కొట్టడంతో వెళ్లి తలుపు తీసింది. ఎదురుగా కట్లర్.
‘ఏం కావాలి?’ కటువుగా అడిగింది.
‘ఓ వ్యాపారి రెండు నెలల క్రితం నా బార్‌ని కొంటానని వస్తే, అమ్మనని చెప్పాను. ఇప్పుడు అమ్ముతానని చెప్దామని అనుకుంటున్నాను. నీ గురించి ఆలోచిస్తూంటే రాత్రి నిద్ర పట్టలేదు. నువ్వంటే నాకు ఎందుకంత పిచ్చో నాకే తెలియడం లేదు’
బిల్లీ అతన్ని ప్రేమగా కౌగలించుకుంది.
‘కాగితాల్లో డోరా పేరుంది’
‘ఇంకో పెద్ద బార్ కొంటున్నామని, దీన్ని అమ్ముదామని చెప్పచ్చుగా?’ బిల్లీ సూచించింది.
‘తన తండ్రి స్థాపించిన బార్‌ని అమ్మడం డోరాకి ఇష్టం లేదు. నా పరిస్థితి అర్థం చేసుకో’
‘నీకు ధైర్యం ఉంటే అందుకు ఇంకో మార్గం ఉంది. ఆమె సంతకం కూడా నువ్వే చెయ్యి. అది బయట పడేసరికి మనం మెక్సికోలో ఉంటాం’
‘మెక్సికో నించి వెనక్కి రప్పిస్తారు. నాకు కొంత సమయం ఇవ్వు. వెళ్లిపోకు. ఆలోచిస్తాను’ కట్లర్ చెప్పాడు.
అతను ఆ గదిలోకి రావడం, వెళ్లడం ఎదురు గదిలోంచి ఛార్లీ చూశాడు.
* * *
‘దేనికి?’ వంటవాడు గస్ డోరా తనకి ఇచ్చిన డబ్బుని చూసి అడిగాడు.
‘జీతం’
‘మర్చిపోయారా? నిన్న రాత్రే ఇచ్చారు కదా? కావాలంటే ఓచర్ బుక్‌లో నా సంతకం చూడండి’ గస్ చెప్పాడు.
‘ఇట్లా చాలాసార్లు జరిగిందా?’ బిల్లీ గొంతు తగ్గించి కట్లర్‌ని అడిగింది.
‘చాలాసార్లు. తాగితే డోరాకి గుర్తుండదు’
‘ఐతే ఆమె సంతకం సంపాదించడం తేలిక. ఆమె బాగా తాగినప్పుడు సంతకం తీసుకోవచ్చు’ ఉత్సాహంగా చెప్పింది.
* * *
మర్నాడు మధ్యాహ్నం బార్‌ని కొనే లేరీ వచ్చి బార్‌ని పరిశీలించాడు. అకౌంట్స్ బుక్ చూసి వారానికి నాలుగు వేల డ్రింక్స్ అమ్ముడవుతాయని గ్రహించాడు.
‘క్రితంసారి మీ ఆవిడ అమ్మడానికి ష్టపడటం లేలదని చెప్పావు?’ లేరీ ప్రశ్నించాడు.
‘ఆవిడ మనసు మార్చుకుంది. ముప్పై వేల డాలర్లకి మంచి బేరం అని నీకు తెలుసు’
‘ఇరవై రెండున్నర వేలు మించి ఇవ్వలేను. లేదా ఆఖరి మాట ఇరవై మూడు’
‘ఆఖరి మాట ఇరవై ఐదు చెయ్యి. ఈ బార్ నీది’
‘సరే. నా లాయర్ సేల్ డీడ్ తయారుచేస్తాడు. వచ్చే బుధవారం లేక గురువారంకి అది తయారవుతుంది’ లేరీ కరచాలనం చేస్తూ చెప్పాడు.
‘బుధవారానికి రెడీ చెయ్’ కట్లర్ కోరాడు.
* * *
కట్లర్ ఆ సాయంత్రం బిల్లీ ఇంటికి వచ్చి ఆ విషయం చెప్పాడు.
‘నువ్వు ఓ వారం పని చేసి, తర్వాత మానెయ్. లేదా అనుమానం రావచ్చు. నేను ముందే డబ్బుతో వెళ్లి శాన్ ఆంటోనియోలో నీ కోసం వేచి ఉంటా’
‘కానీ వారం నేను నీకు దూరంగా ఉండడం కష్టం కదా?’ బిల్లీ చెప్పింది.
‘మనం అమెరికా సరిహద్దుని దాటడానికి ఏర్పాట్లు చేయాలి కదా? నాకు భయంగానూ, ఎక్సయిటింగ్‌గానూ ఉంది. రేపు బేంక్‌కి వెళ్లి మా బార్ సేల్ డీడ్ తీసుకుంటాను. నువ్వు బార్‌కి వస్తూ శాన్ ఆంటోనియోకి నా పేర విమానం టిక్కెట్ కొను’ డబ్బిచ్చి చెప్పి వెళ్లిపోయాడు.
* * *
ఆ సాయంత్రం బార్‌కి బిల్లీ వెళ్లేసరికి కట్లర్ తప్ప ఎవరూ లేరు.
‘లాయర్ మన పథకాన్ని చెడగొట్టాడు. సేల్ డీడ్ మీద అతని ఆఫీస్‌లోనే మేమిద్దరం సంతకం చేయాలని పట్టుపట్టాడు. డోరాకి వొంట్లో బాగాలేదంటే, బాగయ్యేదాకా ఆగుదాం అన్నాడు. లేరీకి ఫోన్ చేసి ఒప్పందం రద్దయిందని చెప్తాను. నా దగ్గర కొద్దిగా డబ్బుంది. దాంతో మెక్సికోకి వెళ్దాం’
‘కొంచెం డబ్బా? దాంతో ఎంతకాలం జీవిస్తాం? రేపు మనం మెక్సికోకి వెళ్తున్నాం అని ఆశపడ్డాను’ గొంతు పెంచి కోపంగా చెప్పింది.
‘నేనేం చేయను?’
‘డోరా చచ్చిన బావుండేది’ బిల్లీ కోపంగా చెప్పింది.
‘ఆ మాట అనకు’
‘నేను బయటికి అన్నాను. నీకు మనసులో అది లేదా?’ కోపంగా అరిచింది.
ఆ రాత్రి బార్లో డోరా మందు అడిగితే కట్లర్ కాదనకుండా ఇచ్చారు. తప్పతాగిన ఆమెని కట్లర్ కారు ఎక్కించి వెనక సీట్లో పడుకోబెట్టాడు. బిల్లీని డ్రాప్ చేస్తానని చెప్పాడు. దారిలో బిల్లీ ఇంటి ముందు కారు ఆపగానే ఆమెతోపాటు కట్లర్ కూడా కారు దిగి ఆమె బోర్డింగ్ హౌస్ తలుపు ముందు నిలబడి చెప్పాడు.
‘నాకో మంచి ఆలోచన తట్టింది. డోరా వింటుందని ఇక్కడికి వచ్చి చెప్తున్నాను. రేపు ఉదయం పదకొండుకి లాయర్ ఆఫీస్‌కి డోరాలా నువ్వురా. లేరీ ఇంతదాకా డోరాని చూడలేదు. ఆమెలా సంతకం చేస్తే చాలు’
‘ఏదైనా పొరపాటు జరిగి బయటపడితే?’ బిల్లీ అడిగింది.
‘ఎందుకు బయటపడుతుంది? ఇంత సాహసం చేస్తామని ఎవరూ ఊహించరు’ కట్లర్ చెప్పాడు.
‘సరే, రేపు ఉదయం పదికి వస్తాను’
పక్క టైలర్ షాపులోంచి ఛార్లీ ఆ సంభాషణని విన్నాడు.
* * *
మర్నాడు ఉదయం బిల్లీ గదికి వచ్చిన కట్లర్ ఆమెకి డోరా పుట్టిన తేదీ, ఊరు, తల్లిదండ్రుల పేర్లు మొదలైనవి చెప్పాడు. ఇద్దరూ కలిసి లాయర్ ఆఫీస్‌కి వెళ్తూంటే, బిల్లీ ఆనందంగా చెప్పింది.
‘ఇంకొద్ది గంటల్లో మనం మెక్సికోకి వెళ్తున్నాం అన్న ఊహే నాకు ఆనందంగా ఉంది. ఈ కూపం నించి బయటపడుతున్నాం’
ఇద్దరూ తమ బట్టలు ఉన్న సూట్‌కేస్‌లతో బయటికి నడిచారు. సరిగ్గా పదకొండుకి ఇద్దరూ లాయర్ పోర్టర్ ఆఫీస్‌కి చేరుకునేసరికి లేరీ వారి కోసం ఎదురు చూస్తున్నాడు.
‘మీకింత అందమైన భార్య ఉందని నాకు తెలీదు’ లేరీ చెప్పాడు.
అతను రాసిన అగ్రిమెంట్‌ని ఇద్దరూ పరిశీలించారు. తర్వాత బార్ ఒరిజినల్ సేల్ డీడ్‌ని లాయర్‌కి ఇచ్చారు. అది చదివి ఆయన తృప్తి చెందాక ఇద్దరూ సేల్ డీడ్ మీద సంతకాలు చేశారు. ఐతే వారు ఎదురుచూసినట్లుగా వెంటనే నగదు ఇవ్వలేదు.
‘ఈ డీడ్‌ని బేంక్ వారు సరే అన్నాక చెక్ ఇస్తాం’ లాయర్ చెప్పాడు.
‘అందుకు ఎన్ని రోజులు పడుతుంది?’ నిర్ఘాంతపోయిన కట్లర్ అడిగాడు.
‘పది రోజులు’
‘కానీ మేము వెంటనే వెకేషన్‌కి వెళ్దామనుకుంటున్నాం’
‘బేంక్ మేనేజర్ నా పర్సనల్ ఫ్రెండ్. మూడు, నాలుగు రోజుల్లో చెక్ వచ్చేలా చేయమని చెప్తాను. వచ్చే సోమవారం నాకు ఫోన్ చేయండి’ లాయర్ చెప్పాడు.
ఇద్దరూ బయటికి వచ్చారు. కార్లో కూర్చున్నాక బిల్లీ కోపంగా అరిచింది.
‘ఏమిటిది? మనం వెంటనే మెక్సికోకి వెళ్దాం అనుకున్నాను’
‘నేనింతదాకా ఏ ఆస్తినీ అమ్మలేదు. ఇది నాకెలా తెలుస్తుంది?’ అతనూ కోపంగా చెప్పాడు.
‘కానీ నేను ఆ కాగితాల మీద సంతకాలు పెట్టాను. ఇది బయటపడితే?’
‘ఈ మోసంలో నేనూ నీలాగే గొంతు దాకా ఇరుక్కున్నాను. మన కింద టైంబాంబ్ ఉన్నట్లే. మనం పారిపోవడం మంచిది’
‘ఏమిటీ? పాతికవేల డాలర్లు వదులుకునా? ఇప్పటిదాకా ఎవరికీ ఎలాంటి అనుమానం కలగలేదు. ఆ చెక్ వచ్చేదాకా వేచి ఉందాం. మనం దీంట్లోకి దిగాం. దీని అంతు చూడాలి. వెళ్లి విమానం టిక్కెట్లు రద్దు చేసుకుందాం పద’ చెప్పింది.
‘నేను చూసిన ఆడవాళ్లందర్లోకి నీకు గుండె ధైర్యం ఎక్కువ’ కట్లర్ చెప్పాడు.
* * *
ఆ రాత్రి తలుపు చప్పుడవడంతో బిల్లీ తలుపు తీసింది. ఛార్లీ లోపలికి వచ్చాడు.
‘నేను బిజీగా ఉన్నాను. బయటికి నడు’ కోపంగా అరిచింది.
‘నాకేం తెలుసో నీకు చెప్తే, నీ మనసు మార్చుకుంటావు’ ఛార్లీ నవ్వుతూ చెప్పాడు.
‘నీకేం తెలుసు?’
‘మీ బాస్‌కి ఫోన్ చేసి ఈ రాత్రి నువ్వు పని చేయడం లేదని చెప్పు. మనం డిన్నర్‌కి వెళ్లొద్దాం. ఈ రాత్రి నువ్విచ్చిన మాటని నిలబెట్టుకో. లేదా నేను డోరాకి ఓ మాట చెప్పాల్సి వస్తుంది’
‘డోరా! నీకెలా తెలుసు?’
‘నువ్వు డోరాలా ఫోర్జరీ సంతకం చేయడం తెలుసు. కాబట్టి మీ బాస్‌కి ఫోన్ చెయ్’
‘ఇవాళ రాత్రి నేను తప్పనిసరిగా బార్‌కి వెళ్లి పని చేయాలి. తిరిగి వచ్చాక వెళ్దాం’ బిల్లీ నిస్సహాయంగా చెప్పింది.
‘సరే. రాకపోతే నీకే నష్టం. నువ్వంటే నాకిష్టం బిల్లీ. ఇంతదాకా నేను ఎవర్నీ నీలా ఇష్టపడలేదు’ ఛార్లీ ఆమె చేతిని ముద్దు పెట్టుకుంటూ చెప్పాడు.
ఆ రాత్రి బార్‌లోంచి ముందే వెళ్తున్న బిల్లీని చూసి డోరా తన భర్త కట్లర్‌తో చెప్పింది.
‘ఆ అమ్మాయి ఎవరితోనో డేటింగ్‌కి వెళ్తోంది’
బోర్డింగ్ హౌస్‌కి చేరుకున్న బిల్లీ అయిష్టంగానే ఛార్లీ తలుపు మీద తట్టింది. అతను ఆమెని లోపలికి లాగి తలుపు వేసేశాడు.
* * *
మర్నాడు బిల్లీ బార్‌కి వెళ్లేసరికి డోరా లేదు. కొద్దిసేపటికి బార్‌ని కొన్న లేరీ వచ్చాడు. అతన్ని చూసి ట్రేతో డ్రింక్స్ సర్వ్ చేస్తున్న బిల్లీ తొణకలేదు. అతని దగ్గరికి వచ్చి స్కాచ్ గ్లాస్‌ని ఇస్తూ చెప్పింది.
‘మంచి వెయిట్రస్ ఉంటే చెప్పండి’
‘రేపు మధ్యాహ్నం రెండుకల్లా మీకు నగదుని ఏర్పాటు చేస్తున్నాను. మా లాయర్ బేంక్ మేనేజర్‌తో మాట్లాడాడు’ లేరీ చెప్పాడు.
‘హే బిల్లీ! నాకింకో రౌండ్ తీసుకురా’ ఓ కస్టమర్ అరిచాడు.
‘మీరు కూడా నన్ను బిల్లీ అని పిలవండి. వెయిట్రస్‌గా అది నా ముద్దు పేరు’
‘ఓకే. మీరు కస్టమర్స్‌తో చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు. అది వ్యాపారానికి చాలా మంచిది’ లేరీ నవ్వుతూ చెప్పాడు.
సరిగ్గా ఆ సమయంలో డోరా లోపలికి వచ్చింది. ఆమెని చూసి కట్లర్, బిల్లీలు భయంగా ఒకరి వంక మరొకరు చూసుకున్నారు.
‘డ్యూక్ బాక్స్ సౌండ్ అంత పెద్దగా పెట్టారేంటి?’ కోపంగా అరిచి సౌండ్ తగ్గించింది.
‘ఆమె ఈ బార్ యజమానురాలు అనుకుంటున్నట్లుంది’ లేరీ చెప్పాడు.
‘ప్రతీ కస్టమర్‌కి అలాంటి భావన ఇస్తూంటాం. అందుకే మళ్లీ మళ్లీ వస్తూంటారు’ బిల్లీ చెప్పింది.
‘నేను చెప్తే విన్నావా కట్లర్? అతను బిల్లీ బోయ్‌ఫ్రెండ్’ బిల్లీ పక్కన ఉన్న లేరీని గమనించి డోరా నవ్వుతూ చెప్పింది.
‘రేపు మధ్యాహ్నం బేంక్ దగ్గర కలుద్దాం’ లేరీ బిల్లీతో చెప్పి బయటికి నడిచాడు.
* * *
ఆ రాత్రి బిల్లీ బూట్లు విప్పదీసి నిశ్శబ్దంగా తన గది తలుపు తెరుచుకుని లోపలికి వెళ్లి లైట్ వెలిగించింది. కొద్దిసేపటికి తలుపు చప్పుడు, ‘్ఛర్లీని’ అన్న మాటలు వినిపించాయి. అయిష్టంగా తలుపు తెరిచింది.
‘నేనంటే నీకు భయమా? వద్దు. నువ్వంటే నాకు పిచ్చి’ చెప్తూ ఆమెని ముద్దు పెట్టుకోసాగాడు.
లోపలి నించి మాటలు వినపడటంతో ఆమె తలుపు బయట నిలబడ్డ కట్లర్ తలుపు కొట్టబోయి ఆగిపోయాడు.
‘ఆగు ఛార్లీ! నన్ను ఊపిరి తీసుకోనీ’ అన్న బిల్లీ మాటలు విని తలుపు తెరిచి చూస్తే బిల్లీని ముద్దు పెట్టుకుంటున్న ఛార్లీ కనిపించాడు.
‘నీ అసలు రూపం బయటపడింది’ వాళ్ల వంక అసహ్యంగా చూస్తూ కట్లర్ అరిచాడు.
తక్షణం బిల్లీ లేచి కట్లర్ దగ్గరికి వెళ్లి కౌగిలించుకుంటూ ‘నేను చెప్పేది విను’ అని అర్థించింది. అసహ్యంగా ఆమెని పక్క మీదకి తోశాడు. మళ్లీ లేచి అతని మీదకి వెళ్లాక బిల్లీని మళ్లీ మళ్లీ పక్క మీదకి తోసేశాడు.
ఛార్లీ, బయట గుమిగూడిన జనం ఆ దృశ్యాన్ని నిశే్చష్టులై చూస్తూండిపోయారు.
‘నువ్వింత నీచురాలివి అనుకోలేదు’ చెప్పి అతను వెళ్లిపోయాడు.
ఆమె ఛార్లీని ఇష్టం వచ్చినట్లు బాదుతూంటే, మిగిలిన వాళ్లు వచ్చి విడిపించారు. అందర్నీ బయటికి తోసి బిల్లీ ఏడుస్తూండిపోయింది.
* * *
మర్నాడు దంపతులు ఇద్దరూ లాయర్ గదిలో ఉండగా డోరా కట్లర్‌తో చెప్పింది.
‘నీతో పెళ్లయినప్పుడు నీకు కాస్త మెదడుంది అనుకున్నాను. కానీ నేను పొరపడ్డాను’
‘నేను పొరపాటు చేసానని ఒప్పుకున్నాగా. అయాం సారీ.. ఏం చేయను? ఉరి తీసుకోనా?’ కట్లర్ అడిగాడు.
‘అదేమీ చెడ్డ ఆలోచన కాదుగా?’ డోరా కోపంగా అరిచింది.
పక్క గదిలోంచి లేరీ, లాయర్ పోర్టర్ వచ్చారు.
‘నేను నా క్లయింట్‌తో మాట్లాడాను. జరిగిన ఒప్పందం రద్దు చేయడానికి అతను అంగీకరించాడు’ లాయర్ చెప్పాడు.
‘వద్దు. ఈయన్ని వదలకండి’ డోరా నిరసనగా చెప్పింది.
‘నిన్ను మోసం చేయబోయినా నువ్వు అర్థం చేసుకున్నందుకు థాంక్స్ లేరీ’ కట్లర్ లేరీతో కరచాలనం చేసి చెప్పాడు.
‘చెడ్డ ఆడదాన్ని చేతిలో మోసపోవడం మన మగాళ్లంతా చేసేదే. ఎప్పుడైనా నువ్వు నీ బార్‌ని అమ్మాలనుకుంటే నాకు ఫోన్ చెయ్’ లేరీ చెప్పాడు.
‘ఈసారి అతనితో కాదు. నాతో మాట్లాడండి. నేను మా నాన్న చెప్పినట్లు విని ఇతన్ని పెళ్లి చేసుకోకుండా ఉండాల్సింది’ డోరా కోపంగా చెప్పింది.
* * *
బస్టాండ్‌లో షికాగోకి వన్‌వే టిక్కెట్‌కి ఏభై మూడు డాలర్లు అవుతుందని క్లర్క్ చెప్పడంతో బిల్లీ అడిగింది.
‘ఇరవై ఐదు డాలర్లకి ఎక్కడికి వెళ్లచ్చు?’
‘సెయింట్ లూయిస్‌కి ఇరవై నాలుగు డాలర్ల డెబ్బై ఐదు సెంట్లు. కేన్సాస్ సిటీకి ఇరవై మూడున్నర డాలర్లు. ఎక్కడికి కావాలి?’ క్లర్క్ అడిగాడు.
‘మీ ఇష్టం. ఏదైనా ఒకటే’ బిల్లీ చెప్పింది.
‘కేన్సాస్‌కి బస్ సిద్ధంగా ఉంది’
టిక్కెట్ కొని బస్సెక్కిన బిల్లీ ఓ సీట్‌లో నిరుత్సాహంగా కూర్చుంది. బస్ కదిలిన కొద్దిసేపటికి ఓ వ్యక్తి తననే గమనిస్తూండటం చూసింది. కొద్దిసేపు ఆగి మళ్లీ అతని వంక చూసి సన్నగా నవ్వి తన పక్కన కూర్చోమన్నట్లుగా సైగ చేసింది.
*
(క్లారెన్స్ గ్రీన్ అండ్ రస్సెల్ రాస్ కథకి స్వేచ్ఛానువాదం)

మల్లాది వెంకట కృష్ణమూర్తి