క్రైమ్ కథ

పిచ్చివాడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆ లోయలోంచి హైవేని నిర్మించడానికి రెండేళ్లు పట్టింది. నిర్మాణంలో ఏటా ఒకరు మరణించారు. మొదటి సంవత్సరం రోడ్డు నిర్మాణ కూలీ మీద బరువైన క్రేన్ పడి మరణించాడు. తర్వాతి సంవత్సరం గత ఏభై ఏళ్లుగా తను ఉన్న ఇంట్లోంచి బయటకి వెళ్లడానికి దాని యజమాని నిరాకరించాడు. ఆ ఇంటి మీదుగా రోడ్డు వెళ్లాల్సి ఉండటంతో నిర్మాణం ఆగిపోయింది. తనని ఖాళీ చేయించడానికి వచ్చిన పోలీసుల మీద అతను కిటికీలోంచి రైఫిల్‌ని పేల్చాడు. వారి ఎదురు దాడిలో మరణించాడు.
* * *
దాదాపుగా పూరె్తైన ఆ రోడ్ మీద ఓ సంధ్యా సమయంలో కారులో వెళ్లే జోకి ఆ రోడ్ చరిత్ర గుర్తొచ్చింది. పాత రోడ్‌లో రైలు గేట్, ట్రాఫిక్ లైట్లు, మరమ్మతులు లాంటి అడ్డంకులు ఉండేవి. కాని ఈ కొత్త రోడ్‌లో లేకపోవడంతో అతను తను పని చేసే చిన్న ఫేక్టరీ నించి ఇంటికి వేగంగా చేరుకో గలుగుతున్నాడు. జో తన కష్టాల గురించి ఆలోచించాడు. ఉదయం ఫేక్టరీకి బయలుదేరినప్పుడు చిన్న కొడుక్కి ఒంట్లో బాగాలేదు. అతని రెండో కష్టం భార్య ఎల్లా. ఉదయం నిద్ర లేపితే లేవదు. పిల్లవాడు ఏడుస్తున్నా సరే. ఆమె ఒకోసారి బయటకి వెళ్ళొస్తూంటుంది. ఎక్కడికంటే చెప్పదు. ఇంటి పనుల్లో బద్దకం వల్ల ఇంట్లో ఎక్కువ పనులని జోనే చేయాల్సి వస్తోంది.
అతని మూడో కష్టం తమ్ముడు కీత్. కీత్‌కి, ఎల్లాకి ఎంత మాత్రం పడదు. ఎప్పుడూ దెబ్బలాడుకుంటూంటారు. కీత్‌కి ఉద్యోగం లేదు. ఇష్టం వచ్చినప్పుడు ఇంటికి వస్తూంటాడని, ఊరికే తమ ఇంట్లో తింటున్నాడని ఎల్లాకి బాధ. ‘ఇవాళ మీ తమ్ముడు ననే్నం అన్నాడో తెలుసా?’’ అంటూ జో ఇంటికి రాగానే ఆరంభిస్తుంది.
రోడ్ పక్కన ఆపిన ఓ కార్లోని డ్రైవర్ స్టీరింగ్ మీదకి వాలిపోయి ఉండటం చూసి జో కారాపి దిగి అతని దగ్గరికి వెళ్లాడు. నలిగిపోయిన పని దుస్తుల్లో ఉన్న అతను బలహీనంగా చెప్పాడు.
‘ఎవరైనా ఎందుకా పని చేస్తారు? నేను కారాపి నంబర్ ఒన్‌కి దిగితే తుపాకీ గుండొచ్చి కారుకి ఇక్కడ తగిలింది. ఈ సొట్టని చూశారా? నేను తలుపు తెరవగానే ఆ గుండు కింద పడటం చూసా. కాని వెతికితే కనపడలేదు. మీ దగ్గర టార్చ్‌లైట్ ఉందా?’
‘లేదు. అది తుపాకీ గుండు వల్ల కలిగిన సొట్ట కాకపోవచ్చు. మీ టైర్ కింద పడ్డ ఏ గులకరాయో ఎగిరొచ్చి తాకుండచ్చు’ జో సూచించాడు.
‘గులకరాయా? కాదు. హైవే మీదకి గులకరాళ్లు ఎక్కడ నించి వస్తాయి? నేను వెళ్లి పోలీసులకి రిపోర్ట్ చేస్తాను’ తేరుకున్న అతను చెప్పాడు.
జో తన కారుని కొండ పాదం దగ్గర ఆపి మెట్లెక్కి, సన్నటి దారిలో తన ఇంటికి చేరుకున్నాడు. కీత్ లివింగ్ రూంలో నేల మీద బోర్లా పడుకుని టీవీ చూస్తున్నాడు. ఎల్లా వంట గదిలో ఏదో వండుతోంది. చిన్న కొడుకు గడప మీద కూర్చుని దగ్గుతున్నాడు.
‘నేను వస్తూంటే దారిలో ఓ వింత జరిగింది’ జో చెప్పాడు.
కీత్ పట్టించుకోలేదు. కాని వంట గదిలోంచి ఎల్లా అరిచింది.
‘చూసావా జో? నీ తమ్ముడు ఈ రోజంతా అలా పడుకుని టీవీ చూస్తున్నాడు. ఒక్క పనిలో సహాయం చేయడు’
భోజనం అయ్యాక జో త్వరగా నిద్రపోయాడు. మధ్యలో లేచి చూస్తే కీత్ ఇంకా అలాగే పడుకుని టీవీ చూస్తూనే ఉన్నాడు.
* * *
జో జె. ఎఫ్ కార్పొరేషన్‌లో పని చేస్తున్నాడు. ఆ చిన్న కంపెనీ ఫేక్టరీలో డ్రై ఫ్రూట్స్‌ని, డీ-హైడ్రేటెడ్ కూరగాయలని తయారుచేసి ఓ పెద్ద ఫ్రోజెన్ గూడ్స్ తయారీదారులకి సరఫరా చేస్తూంటారు. ఆ ఫేక్టరీలోని నలుగురు ఫోర్‌మెన్‌లలో జో ఒకడు. అతనికి ఇంట్లో కన్నా ఆ పెద్ద షెడ్‌లోని ఫేక్టరీలోనే శాంతిగా ఉంటుంది.
మర్నాడు జో ఫేక్టరీలో పని బట్టల్లోకి మారుతూ ఇంకో ఫోర్‌మేన్‌తో గత సాయంత్రం తను తిరిగి వెళ్లేప్పుడు జరిగిన సంఘటనని చెప్పాడు. మర్నాడు లంచ్‌కి వెళ్లినప్పుడు వెయిట్రెస్‌లతో కూడా అది చెప్పాడు.
‘మీరు గులకరాయి అంటున్నారు. అతను తుపాకీ గుండు తన కారుకి తాకిందని పోలీసులకి ఫిర్యాదు చేసినట్లు పేపర్లో వచ్చింది. పోలీసులు కూడా దాన్ని గుండనే నిర్ధారించారు. ఇలా జరగడం ఇది రెండోసారి. ఇదివరలో ఓసారి ఓ కారు అద్దంలోకి తుపాకీ గుండు దిగి రంధ్రం చేసింది’ ఆమె చెప్పింది.
మర్నాడు మూడు కార్లకి గుళ్లు తగిలాయని వెయిట్రెస్ చెప్పింది. దాంతో పోలీసులు ఆ కొండల్లో తిరుగుతూ కింద రోడ్ మీద వెళ్లే కార్ల మీదకి తుపాకీని పేల్చే వారి కోసం వెదికారు. మైళ్ల కొద్దీ రోడ్. పక్కనే మైళ్ల కొద్దీ కొండలు. పోలీసులు తక్కువ మంది కాబట్టి కనుక్కోలేక పోయారు.
మరో నాలుగు రోజులు ఎవరి కార్లకీ గుళ్లు తగల్లేదు. అకస్మాత్తుగా ఎవరో ఆరు గుళ్లని నాలుగు వేరువేరు కార్ల మీదకి పేల్చారు.
‘ఈ పని ఎవరు చేస్తున్నారు? ఎందుకు?’ జో అడిగాడు.
‘ఎవరో పిచ్చివాళ్లు. కొండల్లో ఇలాంటి వాళ్లు చాలామంది ఉన్నారు’ ఎల్లా చెప్పింది.
‘నన్ను డిస్టర్బ్ చేయకు’ సిగరెట్ తాగే కీత్ ఆ ప్రశ్నకి చిరాగ్గా సమాధానం చెప్పాడు.
‘అతను నీతో అలా మాట్లాడితే ఊర్కుంటావే?’ ఎల్లా అరిచింది.
మర్నాడు జో తన తమ్ముడికి కూడా ఉద్యోగం ఇవ్వమని తన ఫేక్టరీ యజమాని జె.ఎఫ్‌ని మరోసారి అడిగితే ఆయన చెప్పాడు.
‘మీ తమ్ముడు బద్ధకస్థుడు. నేల మీద ఉమ్ముతాడు. దుమ్ము పడ్డ నా కారుని తుడవమంటే తుడవలేదు. అతను నా దగ్గరే కాదు. ఎవరి దగ్గరా ఉద్యోగానికి పనికిరాడు’
ఆ రాత్రి ఏడ్చే చిన్నకొడుకుని చూసి ఎల్లాతో చెప్పాడు.
‘ఏడ్చే బదులు వాడు నవ్వుతూంటే బావుంటుంది. కాస్త వాడిని పట్టించుకో’
‘వాడికి పిచ్చేమో?’ కీత్ చెప్పాడు.
జో దాన్ని విననట్లే నటించాడు.
‘నా కొడుకు కాదు. తుపాకీ పేల్చేవాడే పిచ్చివాడు’ ఎల్లా అరిచింది.
మర్నాడు దినపత్రికల్లో హెడ్‌లైన్స్‌లో మరోసారి గుళ్లు తగిలిన కార్ల గురించి రాశారు. ఈసారి సమీపంలోని సిటీ దినపత్రికల్లో కూడా ఆ వార్త వచ్చింది. ఆ రోజు లంచ్‌కి రెస్ట్‌రెంట్‌కి వెళ్లిన జోకి యూనిఫారంలో ఉన్న ఇద్దరు పోలీసులు కనిపించారు. జో వాళ్లని తుపాకీని పేల్చే ఆ అజ్ఞాత వ్యక్తి గురించి అడిగాడు.
‘పేపర్లలో రాసినట్లు వాడు పిచ్చివాడై ఉండచ్చు. అతని గుళ్లు అదృష్టవశాత్తు ఇంత దాకా ఎవరికీ తగల్లేదు. నా ఉద్దేశం అతనికి ఏదో కసి ఉంది. అది పిచ్చిగా మారి ఉంటుంది’ ఓ పోలీస్ ఆఫీసర్ చెప్పాడు.
‘వాడీ పని ఎందుకు చేస్తున్నాడో ఓ ఉత్తరం రాస్తే వాడి గురించిన కొన్ని ఆధారాలు దొరుకుతాయి. అప్పుడు వాడిని పట్టుకునే పరిశోధన తేలికవుతుంది’ రెండో పోలీస్ ఆఫీసర్ చెప్పాడు.
‘లండన్‌లో జాక్ ది రిప్పర్ స్కాట్‌లేండ్ యార్డ్‌కి చాలా ఉత్తరాలు రాశాడు. ఐనా వాళ్లు అతన్ని పట్టుకోలేక పోయారు’ వెయిట్రెస్ చెప్పింది.
మొదటి పోలీస్ తల అడ్డంగా ఊపి చెప్పాడు.
‘అది చాలా కాలం క్రితం. మొదటి ప్రపంచ యుద్ధానికి మునుపు. ఈ రోజుల్లో అది సాధ్యం’
‘కసితో కాదు. ఎవరో టీనేజర్ సరదా కోసం లేదా థ్రిల్ కోసం ఈ పని చేస్తూండి ఉండాలి. అలాంటి టీనేజ్ కుర్రాళ్లు చుట్టుపక్కల చాలామంది ఉన్నారు. వాళ్లని సరిగ్గా పెంచని తల్లిదండ్రులది తప్పు’ రెండో పోలీస్ చెప్పాడు.
ఆ రోజు జె.ఎఫ్ పని వాళ్లతో మాటల్లో చెప్పాడు.
‘ఆ తుపాకీ వీరుడు ఎవరో నాకు తెలుసు. కొత్త హైవే నిర్మించినప్పుడు తన ఇంటిని పోగొట్టుకున్న వ్యకె్తై ఉండాలి. చాలా మంది ఇళ్ల యజమానులు ఈ హైవేని ద్వేషించారు. దాంతో ఆ రోడ్‌ని ఉపయోగించే కార్ల మీద ద్వేషంతో ఈ పని చేస్తున్నారు’
‘కాని వాళ్లకి నష్టపరిహారం చెల్లించారుగా?’ జో అడిగాడు.
‘ప్రతీ ఇల్లు ఎంత ఖరీదు చేస్తుందో యజమానులు కాక ప్రభుత్వం నిర్ణయించి అంతే చెల్లించింది. ఇంట్లో కొత్త గదులు కట్టుండచ్చు. అప్పుడే రంగు వేసి ఉండచ్చు. కంచె ఉండి ఉండచ్చు. అవన్నీ లెక్కలోకి తీసుకోకపోతే కడుపు మండదా?’
‘పోలీసులకి మీ వాదన చెప్పారా?’ జో అడిగాడు.
‘చెప్పాలంటావా?’ ఆయన సాలోచనగా అడిగాడు.
‘మీరు చెప్పింది నిజమైతే వాళ్లకి పరిశోధనకి కొన్ని ఆధారాలు ఇచ్చిన వారవుతారు. ఏది ఏమైనా ఈ రోడ్ వల్ల నేను ఇంటి నించి త్వరగా ఫేక్టరీకి చేరుకో గలుగుతున్నాను. తిరిగి ఇంటికి కూడా త్వరగా వెళ్తున్నాను’ జో సంతృప్తిగా చెప్పాడు.
* * *
మర్నాడు జో ఫేక్టరీకి వెళ్లేసరికి బయట రెండు పోలీస్ వేన్స్ కనిపించాయి.
‘దొంగతనం. దొంగలు ఆఫీస్‌లోక జొరబడి కేష్ బాక్స్‌ని పగలకొట్టి నగదు, రెండు కంప్యూటర్లు, రేడియో, ఏడింగ్ మెషీన్లని ఎత్తుకెళ్లారు’ తోటి ఫోర్‌మేన్ బాబ్ చెప్పాడు.
‘ఇది ఎవరి పనో నాకు తెలుసు. ఆ తుపాకీ వీరుడే’ జె.ఎఫ్ చెప్పాడు.
లంచ్‌లో వెయిట్రెస్ ఆ దొంగతనం గురించి జోని అడిగింది.
‘ఎవరు చేసారో ఇంకా తెలీదు’
‘రే అయుండచ్చు’ ఆమె సూచించింది.
‘మా ఎకౌంటెంట్ రేనా?’
‘అవును. అతనికి డబ్బవసరం ఉంది. ఫేక్టరీలోని డ్రై ఫ్రూట్స్‌ని కూడా దొంగిలించి ఈపాటికి అమ్మేసి ఉండి ఉంటాడు. కాని మామూలు దొంగని పోలీసులు అనుకోవాలని మిగిలినవి దొంగిలించి ఉంటాడు’
‘అందుకేనేమో అది ఎవరి పనో తనకి తెలుసని జె.ఎఫ్ చెప్పినా దొంగ పేరుని మాత్రం పోలీసులకి చెప్పలేదు’ జో ఆలోచనగా చెప్పాడు.
పోలీసులు ఫేక్టరీ ఉద్యోగస్థులు అందరి ఇళ్లనీ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎవరింట్లోనూ దొంగిలించిన సామాను దొరకలేదు.
ఆ రాత్రి జో ఫేక్టరీ నించి ఇంటికి వెళ్తూంటే టార్చ్‌లైట్ వెలుగు కనిపించి కారాపాడు.
‘కదులు. పోనీ’ టార్చ్‌లైట్ పట్టుకున్న యూనిఫాంలోని పోలీస్ ఆఫీసర్ చెప్పాడు.
రోడ్ పక్కన ఆగి ఉన్న కారుని చూసి జో చెప్పాడు.
‘అది మా బాస్ కారు’
‘పేరు?’
‘జె.ఎఫ్ డ్రై ఫ్రూట్స్ కార్పొరేట్ యజమాని జె.ఎఫ్. ఆయనకి ఏమైనా ఐందా?’
‘ఐంది. చచ్చిపోయాడు. మూడు గుళ్లు కారుకి, ఓ గుండు అతనికి తాకాయి. నువ్వా ఫేక్టరీలో పని చేస్తావా? నీ పేరేమిటి?’
నిర్ఘాంతపోయిన జో వెంటనే మాట్లాడలేక పోయాడు. తేరుకున్నాక చెప్పాడు.
‘నిత్యం నేను ఈ రోడ్ మీదే ఫేక్టరీకి, ఇంటికీ వెళ్తూంటాను. మీరేం చేస్తున్నారు? రేపు నన్ను కూడా ఓ గుండు తాకచ్చు’
కారు దిగి జో వెళ్లి చూస్తే రక్తసిక్తమైన జె.ఎఫ్. తల పక్క సీట్లోకి వాలిపోయి కనిపించింది. ఓ పోలీస్ అధికారితో జో చెప్పాడు.
‘నాకు అర్థమైంది. ఎవరో ఈయన్ని చంపాలనుకున్నారు. ఐతే అనుమానం తన మీదకి రాకూడదని ఎవరికీ తగలకుండా కార్ల మీద ఇంతకాలం గుళ్లు పేలుస్తున్నారు. దాంతో అంతా అది పిచ్చివాడి పని అనుకున్నాం. ఓ గుండు ఈయనకి తాకితే అది ఆ పిచ్చివాడి పనే అనుకుంటాం. ఈయన్ని చంపడానికి కారణం గల ఎవరి మీదకీ అనుమానం పోదు’
పోలీసులు సమాధానం చెప్పలేదు.
‘మీరు అనుకున్నట్లుగా ఈ గుండు పొరపాటున ఈయన్ని తాకలేదు. ఇది ఓ గొప్ప పథకం’ జో మళ్లీ చెప్పాడు.
కారు హెడ్‌లైట్ల వెలుగులో పోలీసులు ఇద్దరూ నవ్వుకోవడం కనిపించింది.
‘జె.ఎఫ్‌కి పెళ్లైంది. కాని ఇంతదాకా పిల్లలు లేరు. భార్య విడాకులు కోరితే ఇవ్వనన్నాడు. లేదా ఈయనకో రహస్య ప్రియురాలు ఉండచ్చు. ఇది ఆమె భర్త పనై ఉండచ్చు. మీరు లోతుగా విచారిస్తే ఆయన్ని ఎవరు ఎందుకు చంపారో కనుక్కోగలరు’
ఓ ఆఫీసర్ అతని కారు మీద తట్టి చెప్పాడు.
‘కదులు. ట్రాఫిక్ జాం అవకూడదు’
జో ఇంటికి వెళ్తూంటే అతనిలో పోలీసుల అసమర్థత మీద కోపం, జె.ఎఫ్ మరణం వల్ల బాధ కలిగాయి. ఇంటికి చేరుకున్నాక ఎప్పటిలా పర్వత పాదం దగ్గర కారుని ఆపి దిగి ఇంట్లోకి నడిచాడు.
ఎల్లా, కీత్ ఎప్పటిలానే ఇంట్లో ఉన్నారు. కాని వారిద్దరిలో ఎవరు తనని చూసి ఎక్కువగా ఆశ్చర్యపోయారో జోకి అర్థం కాలేదు.
‘మీరు బతికే ఉన్నారా?’ ఎల్లా దుఃఖంగా అడిగింది.
‘అవును. రేడియోలో విన్నావా? మా ఫేక్టరీ యజమాని జె.ఎఫ్. తప్ప ఉద్యోగస్థులు కారు’
ఎల్లా తనని ప్రేమిస్తోందని జో సంతోషించాడు. ఐతే అతనికి కలిగిన ఆలోచన తక్షణం రద్దైంది. ఎందుకంటే ఎల్లా ఎన్నడూ తన మీద ప్రేమని చూపించలేదు.
డైనింగ్ టేబిల్ మీది రైఫిల్‌ని చూసి అరిచాడు.
‘దీన్ని ఇక్కడ ఎందుకు ఉంచారు? పిల్లవాడు తీసుకుంటే ప్రమాదం కాదా?’
వెంటనే ఎల్లా కోపంగా అరిచింది.
‘కీత్! ఈయన పోయాడని చెప్పావు? నువ్వు కాల్చింది ఈయన్ని కాదు’
జో విభ్రాంతిగా ముందు తన భార్యని, తర్వాత తన తమ్ముడ్నీ చూశాడు. ఆమె ఏం చెప్పిందో తక్షణం అర్థమైంది. కొంతకాలంగా తన ఇంట్లో తను లేనప్పుడు ఏం జరుగుతోందో కూడా అర్థమైంది. అర్థమయ్యాక అతను స్థిరంగా నిలబడలేదు. మెరుపులా కీత్, ఎల్లాల కన్నా వేగంగా రైఫిల్ దగ్గరికి వెళ్లి దాన్ని అందుకున్నాడు.
‘ఈ రోజు మీ ఇద్దరికీ బాలేదు’ రైఫిల్‌ని వారికి గురిపెట్టి చెప్పి ఎడం చేత్తో రిసీవర్‌ని అందుకున్నాడు.

(ఓరం డేవిడ్‌సన్ కథకి స్వేచ్ఛానువాదం)

మల్లాది వెంకట కృష్ణమూర్తి