క్రైమ్ కథ

భావగ్రాహి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాయ్ అపార్ట్‌మెంట్ ఎనిమిదో అంతస్థులో ఉంది. ఏడాదికి అద్దె ముప్పై రెండువేల డాలర్లు. కిటికీలోంచి కింద ఆకుపచ్చటి పార్క్, నగరం కనిపిస్తూంటాయి.
‘నా పేరు మీరు ఎవర్నించి తెలుసుకున్నారో దయచేసి చెప్తారా?’ రాయ్ తన దగ్గరికి వచ్చిన సందర్శకురాలిని ప్రశ్నించాడు.
‘నా పేరు జీన్’ చెప్పి ఆమె తన హేండ్‌బేగ్‌లోంచి ఓ కార్డ్ తీసి అతని ఎదురుగా బల్ల మీద ఉంచింది.
రాయ్ దాన్ని చదివి చిరునవ్వు నవ్వాడు.
‘ఈమె చేతిరాత నాకు బాగా తెలుసు. మీకేం సహాయం చేయగలను?’ అడిగాడు.
కుర్చీలో విశ్రాంతిగా వెనక్కి వాలి కూర్చున్న, సన్నగా, అందంగా ఉన్న ఇరవై రెండేళ్ల జేన్ చెప్పింది.
‘రహస్యంగా పరిశోధించే ఓ సంస్థ పంపగా వచ్చాను’
‘మీరు డిటెక్టివా?’
‘మమ్మల్ని ఆ పేరుతో పిలుచుకోం. కాని మేం చేసే పని అదే. మీ నైపుణ్యం మాకు ఉపయోగించచ్చని వచ్చాను. మీరు మీ సేవని మాకు అప్పుడప్పుడు ఇవ్వగలరా? అందుకు మీరు అంగీకరిస్తే పరీక్షగా మీకో చిన్న కేస్‌ని ఇస్తాను’
రాయ్ చిన్నగా తన గడ్డాన్ని నిమురుకుని అడిగాడు.
‘నీ ఫీజ్ ఎంతో ఆమె మీకు చెప్పిందా?’
జీన్ వెంటనే మళ్లీ హేండ్‌బేగ్‌ని తెరిచి అందులోంచి ఓ చెక్‌ని తీసి అతనికి ఇచ్చింది. అతను దాన్ని శ్రద్ధగా చదివి బల్ల మీద ఉంచి చెప్పాడు.
‘పదివేల డాలర్లు. కరెక్టే. చెక్‌ని మీ సంస్థ పేరున కాక వ్యక్తిగత సేవింగ్స్ బేంక్ చెక్ ఇచ్చారేమిటి? మీ సంస్థకి నా నించి ఏం సహాయం కావాలి?’
‘మీరు చేసే పని ఆమె మాకు చెప్పింది. దాన్ని నిర్ధారణ చేసుకోవాలి. మీరా చెక్‌ని కేష్ చేసుకునే ముందు మీ పనితీరుని వివరిస్తారా? దాన్నిబట్టి మీ సేవ తీసుకోవాలా? వద్దా? అన్నది నిర్ణయిస్తాను. ఓసారి మేము అప్పగించే పనిని అంగీకరించాక ఇక మీరు వెనక్కి వెళ్లకూడదన్నది ప్రధాన నియమం’
‘సరే. నన్ను నేను భావగ్రాహి అని చెప్పుకుంటూంటాను. అది నా అనుభవాలని చక్కగా వివరించే పదం. నేను మైండ్ రీడర్ని కాను. భవిష్యత్‌లో జరిగేది తెలుసుకోలేను. నాకు సిక్త్స్‌సెన్స్ లేదు. కాని కొన్ని పరిస్థితుల్లో నేను భావగ్రాహిగా ఇతరుల భావాలని గ్రహిస్తూంటాను. ఇది ఎలా జరుగుతుందన్నది నాకే తెలీదు కాబట్టి వివరించలేను. జరుగుతుందని మాత్రమే చెప్పగలను’
అతను చెప్పేది ఆమె శ్రద్ధగా వినసాగింది.
‘నేను క్లైంట్ తాలూకు వస్తువుల స్పర్శతో ఆ పని చేస్తాను. అంటే నేను పరిశోధించాల్సిన మనుషుల ఆలోచనలని వారు వాడిన వస్తువుల స్పర్శ ద్వారా గ్రహిస్తాను. అందుకు వాళ్లు తరచు ధరించే దుస్తులు లేదా కళ్లజోడు. ఓసారి నేను ఒకతను పది నెలలపాటు ఉపయోగించిన కారుని ముట్టుకుని అతని ఆలోచనలని గ్రహించాను. వస్తువుని స్పర్శించాక మూడు నించి ఐదు నిమిషాల్లో నేను ఆ వ్యక్తిగా మారి, అతని ఆలోచనలని గ్రహించగలను. భౌతికంగా నేను ఇక్కడే ఉన్నా నా ఎరుక అతను ఉన్నచోట ఉంటుంది. అంటే ఆ సమయంలో నేను పరిశోధించే ఆ ఇంకో వ్యక్తిని అవుతాను. అప్పుడు నాకు రాయ్ కాని, రాయ్ ఏం చేస్తున్నాడు అన్నది కాని గుర్తుండదు. ఆ ఇంకో వ్యక్తి మెదడులో ఏముంటే అది నా మెదడులోకి వస్తుంది. అతను ఏం ఆలోచిస్తే నేనూ అదే ఆలోచిస్తాను. అతను ఏం చేస్తూంటే అదే చేస్తాను. ఈలోగా మీరు మీ ఎదురుగా ఉన్న నా దేహాన్ని తాకినా, మాట్లాడినా, తీవ్ర బాధని కలిగించినా నాకది తెలియదు. సమయం ముగియగానే ఆ వ్యక్తి క్రమంగా అంతర్థానమై నేను మళ్లీ ‘రాయ్’ని అవుతాను. అప్పుడు నేనెవరో నాకు తెలుస్తుంది. నేను గ్రహించిన భావాలని, ఆలోచనలని మీకు చెప్పగలను. ప్రధానంగా జరిగేది ఇదే’
‘దీని మీద మీకు ఎంత దాకా ఆధిక్యత ఉంది?’
‘దాన్ని నేను మొదలెట్టచ్చు. లేదా మొదలెట్టకపోవచ్చు. నేను నాలోంచి బయటకి వెళ్లాలనుకుంటే తప్ప ఇంతదాకా ఇంకో వ్యక్తిలోకి వెళ్లలేదు. అంతదాకానే నాకు ఆధిక్యత ఉంటుంది. అది ఓసారి మొదలైతే ఇక దానంతట అదే కొనసాగి, దానంతట అదే ఆగిపోతుంది. ఆ మిగతాది నా ఆధీనంలో ఉండదు’
‘మిమ్మల్ని భయపెట్టడం నా ఉద్దేశం కాదు మిస్టర్ రాయ్. కాని మీరు మరో వ్యక్తి మెదడులో శాశ్వతంగా ఉండిపోయి తిరిగి వెనక్కి రాలేకపోతే?’ జీన్ ఆలోచనగా అడిగింది.
రాయ్ నవ్వి చెప్పాడు.
‘అలా జరగదని నేను కచ్చితంగా చెప్పగలను. ఎందుకో నాకు తెలీదు. మరో వ్యక్తి ఆలోచనల్లో నేను ఎక్కువలో ఎక్కువ ఐదు నిమిషాలు మించి ఉండలేను. అరుదుగా మూడు నిమిషాల్లోపు అది ముగుస్తుంది’
‘మరో వ్యక్తిలోకి ప్రవేశించాక అతనేం ఆలోచిస్తున్నాడో మీరూ అదే ఆలోచిస్తారని, అతనికేం తెలుసో మీకూ అదే తెలుసని నేను అర్థం చేసుకోవచ్చా?’
‘అవును. నేను చెప్పింది అదే’
‘అంతవరకేనా? మిమ్మల్ని ఓ వ్యక్తి గురించి పరిశోధించమని కోరినప్పుడు వారి నించి ఓ ప్రత్యేక సమాచారం అవసరం అవుతుంది. ఆ వ్యక్తి ఆలోచనలని మీరు అనుభవించే తక్కువ సమయంలో దాన్ని అతను ఆలోచించకపోతే అప్పుడు మాకా సమాచారం ఇవ్వలేరా?’
‘ప్రతీ వ్యక్తికీ సాధారణంగా వేల కొద్దీ ఆలోచనలు, భావాలు ఉంటాయి. అతను అంతర్థానం అయ్యాక అతని మనసులోని అన్ని ముద్రలు నాలో ఉండిపోతాయి. ఇది పెద్ద సంఖ్యలో ఫొటో ప్రింట్స్ తీయడం లాంటిది. సాధారణంగా నా క్లైంట్స్ కోరే సమాచారం ఆ ముద్రల్లో దొరుకుతూంటుంది.’
‘ఒకవేళ లభించకపోతే?’
‘మరోసారి ఆ వ్యక్తి ఆలోచనల్లోకి వెళ్తాను. ఐతే ఒక్కసారే ఇలా జరిగింది. దానికి మళ్లీ మీరేం చెల్లించక్కర్లేదు’
‘ఆ వ్యక్తికి మీరు తన మెదడులోకి ప్రవేశించాడని తెలుస్తుందా?’
‘తెలీదు. అలాంటి దాఖలాలు ఇంత దాకా లేవు’
జీన్ కొద్ది క్షణాల వౌనం తర్వాత హేండ్‌బేగ్ తెరిచి అందులోంచి చిన్న పెట్టెని తీసి దాని మూత తెరిచి అతని ముందు ఉంచింది. అందులో ఓ ఉంగరం ఉంది.’
‘మా సంస్థకి ఆసక్తిగల వ్యక్తి నాలుగు వారాల క్రితం దాకా ఈ ఉంగరాన్ని ధరించేది. అప్పట్నించి ఇది లాకర్లో ఉంది. నిన్ననే ఆ లాకర్ని తెరిచి ఈ ఉంగరాన్ని ఈ పెట్టెలో ఉంచాం. ఇది మీకు పనికివచ్చే వస్తువేనా?’
దాన్ని తాకి చెప్పాడు.
‘చక్కగా పనికొస్తుంది.’
‘స్పర్శతో మీకా సంగతి తెలుస్తుందా?’
‘పనికి రాదని అనిపిస్తే సమయం వృధా చేయడమే అవుతుంది. ఒకోసారి ప్రతికూలంగా అనిపిస్తుంది. అప్పుడు నేను ముందుకి వెళ్లను’
‘అంటే?’
‘కొన్ని నన్ను వెనక్కి నెడతాయి. దాని గురించి నేను ఎక్కువగా వివరించలేను’
‘అంటే ఆ వస్తువు తాలూకు మనిషి ప్రతికూలమైన మనిషా?’
‘కాదు. అత్యంత ప్రతికూల మనుషుల మెదళ్లల్లోకి నేను ప్రవేశించాను. అది నన్ను ఇబ్బంది పెట్టదు. నేను చెప్పేది ఇంకో దాన్ని గురించి. అది నన్ను భయపెడుతుంది. ఐతే ఈ ఉంగరం నన్ను ఇబ్బంది పెట్టడం లేదు. నేను ఆరంభించచ్చా?’ రాయ్ అడిగాడు.
‘కాని ఈ ఉంగరం తాలూకు మనిషికి సంబంధించిన ఏ వివరం నాకు తెలీదు. ఉంగరాన్ని బట్టి అది ఓ ఆడదానిది అని అనుకుంటున్నాను. అదీ రూఢిగా తెలీదు. కారణం నేను మీకు ఆ వ్యక్తి గురించిన ఆధారాలు నాకు తెలీకుండానే మీకు ఇస్తానని నాకు చెప్పలేదు. ఒకవేళ మీరు మైండ్ రీడరైనా ఈ ఉంగరానికి సంబంధించిన వ్యక్తికి చెందిన ఏ సమాచారం నా మైండ్‌లో లేదు. మీ నైపుణ్యాన్ని మేం పరీక్షించుకోడానికే దీన్ని తెచ్చాను’
‘అర్థమైంది. ఈ వ్యక్తి నించి మీ సంస్థకి ఎలాంటి సమాచారం కావాలి?’
‘ఆమె పేరు. ప్రస్తుతం ఎక్కడ ఉంది చెప్పగలగాలి. ఆ ప్రదేశం మేము కనుక్కునేలా చెప్పగలగాలి. ఆమె నేపథ్యం, ఇప్పుడు ఏం చేస్తోంది? ఆసక్తులు, ఆమె ఎవరితో సన్నిహితంగా ఉంటోంది.. ఇలాంటి వివరాలు మీరు ఎన్ని ఇవ్వగలిగితే అంత మంచిది.’
‘సరే మిస్ జీన్. ఇక నేను నా పని ఆరంభిస్తాను’ చెప్పి అతను ఆ ఉంగరాన్ని తన అరచేతుల మధ్య ఉంచి, లేచి దళసరి తెరచాటుకి వెళ్తూ చెప్పాడు.
‘నేను ఏకాంతంలోనే ఇది చేయగలుగుతాను’
అతను వెళ్లగానే జీన్ హేండ్‌బేగ్‌లో ఆన్‌లో ఉన్న టేప్‌రికార్డర్‌ని ఆఫ్ చేసింది. తర్వాత స్టాప్‌వాచ్‌ని నొక్కింది.
* * *
‘ఈ సమాచారం అతను తెలుసుకోడానికి నాలుగు నిమిషాల ముప్పై రెండు క్షణాలు పట్టింది’ నిక్‌తో చెప్పింది.
రాయ్ అపార్ట్‌మెంట్ నించి బయటకి వచ్చాక జీన్ రికార్డ్ చేసింది టైప్ చేసిన కాగితాలని నిక్ ఆశ్చర్యంగా చదివాడు. అతని మొహంలో అంతకు మించిన నావాలేమీ జీన్‌కి కనపడలేదు. కాగితాలని బల్ల మీద ఉంచి చెప్పాడు.
‘జీన్! అంత తక్కువ సమయంలో ఇంత సమాచారం ఇవ్వగలిగాడంటే నమ్మలేకపోతున్నాను. కెరిల్ ఉంగరాన్ని కొన్ని నిమిషాలు పట్టుకుని ఐదు టైప్డ్ కాగితాల సమాచారాన్ని ఇవ్వడం అద్భుతం’
‘అవును. ఆమె అతనికి సన్నిహితగా తెలుసన్నట్లుగా, చెప్పేది ఏదీ ఊహించి చెప్పినట్లుగా నాకు అనిపించలేదు.
‘మేక్స్! నువ్వేమంటావు?’ నిక్ తన సహచరుడ్ని అడిగాడు.
‘అతని గురించి విచారించాను. మోసగాడు కాదు. కెరిల్ ఉంగరాన్నిబట్టి ఆమె వయసు ముప్పై రెండు అని, ఫిల్ ఛేజ్ భార్య అని, ప్రస్తుతం అతనికి దూరంగా ఉంటోందని, విలియం అనే అతనితో అక్రమ సంబంధం ఉందని, ప్రస్తుతం వారిద్దరూ జెనీవాలోని హోటల్ ఆర్వేలో ఉన్నారని, విలియం అసూయతో కెరిల్‌తో పోట్లాడుతాడని, తన భర్త ఫిల్ తనని కనుక్కోడానికి డిటెక్టివ్‌లని నియమించాడని భయపడుతోందని, వారి కూతురు ఎల్లీ లండన్‌లో కెరిల్ తల్లిదండ్రుల మిత్రుల ఇంట్లో దాచబడిందని చెప్పిందంతా నిజమే. ఆ ఉంగరం తన ఇరవై ఒకటో పుట్టిన రోజుకి తన అమ్మమ్మ నించి బహుమతిగా పొందిందని మాత్రం నాకు తెలీదు. క్రితం నెల ఫిల్ నించి ఆమె పారిపోయేప్పుడు దాన్ని తీసి తన గదిలోని లాకర్లో ఉంచి వెళ్లింది. దాన్ని తీయడం రాయ్ చెప్పినట్లుగా గతంతో సంబంధాలని తెంచుకోడానికి గుర్తు అన్నది సబబుగానే ఉంది. మనం ఫిల్‌కి ఈ వివరాలే ఇచ్చాం’ మేక్స్ చెప్పాడు.
‘ఓ ఉంగరాన్ని ఆశ్రయించి ఇంత ఊహించి మోసం చేయడం అసాధ్యం. రాయ్‌కి ఏదో అపూర్వమైన శక్తి ఉందనే ఒప్పుకోవాలి. కాకపోతే నీకు తెలుసుగా? నేనో పట్టాన ఎవర్నీ నమ్మను. కెరిల్ ఉంగరాన్ని రాయ్‌కి ఇచ్చానన్నది మీకు తప్ప ఇంకెవరికీ తెలీదు. రెండు, మూడు నెలల క్రితం ఓ మిత్రుడు రాయ్ గురించి చెప్పాడు.. ఇప్పుడు మనం ఫ్రేంక్‌ని కనుక్కోవాలి’
కొద్దిసేపు ఆ గదిలో నిశ్శబ్దం.
‘మీరు ఎంత పోగొట్టుకున్నారు?’ జీన్ అడిగింది.
‘ఏభై లక్షల డాలర్లు. అది ఎంతో చూచాయగా మాత్రమే చెప్పాను. నన్ను బాధించేది అది కాదు. నన్ను మోసం చేసిన ఫ్రేంక్ ఇంకా బతికే ఉండటం. మాఫియా లీడర్ని మోసం చేసిన వ్యక్తి బతికున్నంత కాలం ఆ లీడర్ అసమర్థుడి కింద లెక్క.’
నిక్ కొద్దిసేపు ఆలోచించాడు. తర్వాత జీన్‌తో చెప్పాడు.
‘ఫ్రేంక్ ఎక్కడ దాక్కున్నాడో మేక్స్ కనుక్కోలేక పోయాడు. నేను అతన్ని మట్టుపెట్టే ఉద్దేశంలో ఉన్నానని తెలియగానే మాయం అయ్యాడు. రాయ్ ఫ్రేంక్ ఆచూకి కనుక్కోగలడేమో ప్రయత్నిద్దాం. రేపు అతని అపాయింట్‌మెంట్ తీసుకో’
‘సరే’ జీన్ చెప్పింది.
‘డిటెక్టివ్ సంస్థ బాస్ కూడా ఈసారి వస్తాడని చెప్పు’
‘నేను కూడా మీ వెంట రావాలా?’ మేక్స్ అడిగాడు.
‘అవును. మనం ముగ్గురం కలిసి వెళ్తున్నాం’ నిక్ చెప్పాడు.
* * *
‘అంటే మిస్ జీన్ మొదటిసారి వచ్చినప్పుడు చెప్పింది నిజం కాదన్నమాట’ రాయ్ చెప్పాడు.
‘కాదు. ఆమె డిటెక్టివ్ సంస్థ నించి రాలేదు. నేను పంపగా వచ్చింది. మిగిలిందంతా నిజమే. మీ వల్ల నాకో సహాయం కావాలి. ఫ్రేంక్ అనే వ్యక్తి ఆచూకీ చెప్పాలి’
‘ఫ్రేంక్?’ రాయ్ ప్రశ్నించాడు.
‘అవును. ఇది పరీక్ష కాదు. నేనా సమాచారాన్ని ఇంకో విధంగా పొందలేక మిమ్మల్ని ఆశ్రయించాను’
రాయ్ తల ఊపి అడిగాడు.
‘అలాగే. ఫ్రేంక్‌కి చెందిన వస్తువు ఏదైనా తెచ్చారా?’
నిక్ సైగ చేయగానే మేక్స్ తన బ్రీఫ్‌కేస్ లోంచి ఓ పెద్ద ప్లాస్టిక్ కవర్ని తీసి బల్ల మీద ఉంచి మళ్లీ యథాస్థానంలో కూర్చున్నాడు. అప్పటికే జీన్ తన హేండ్‌బేగ్‌లోని

టేప్‌రికార్డర్ని ఆన్ చేసింది.
‘ఫ్రేంక్ గురించి మీరేం సమాచారం తెలుసుకోవాలని అనుకుంటున్నారు?’ రాయ్ అడిగాడు.
‘మీకు తెలిసిందంతా చెప్పండి. ముఖ్యంగా ఇప్పుడు అతను ఎక్కడ ఉన్నాడో కావాలి’ నిక్ కోరాడు.
రాయ్ ఆ ప్లాస్టిక్ కవర్ని తెరచి అందులోంచి వెండి బకిల్ గల వెడల్పైన మగాళ్ల తోలు బెల్ట్‌ని తీశాడు. వెంటనే అతని మొహంలో కొద్దిగా గగుర్పాటు. దాన్ని తక్షణం బల్ల మీద ఉంచి నిక్‌తో చెప్పాడు.
‘మిస్టర్ నిక్. కొన్ని వస్తువులు ప్రతికూలంగా ఉంటాయని, వాటిని నేను ఉపయోగించలేనని జీన్ మీకు చెప్పి ఉండచ్చు. ఈ బెల్ట్ అలాంటిది’
‘అంటే? దేనికి ఉపయోగించలేరు?’ నిక్ అడిగాడు.
‘నాకు సరిగ్గా తెలీదు. ఈ బెల్ట్‌కి చెందిన వ్యక్తి మీద నాకు అయిష్ట భావన కలుగుతోంది. ఈ బెల్ట్‌తో నేను పని చేయలేను’
‘అతను అయిష్టకరమైన వ్యక్తి అన్నది నిజమే. కాని మీరు నేను కోరింది చెయ్యాలి’ నిక్ కఠినంగా చెప్పాడు.
రాయ్ ఓ గుటక వేసి నిక్ వంక ఇబ్బందిగా చూశాడు.
‘మీకు సహకరించడానికి నేను వెనకాడను. మీరు ఇంకో వ్యక్తి గురించి అడిగితే చెప్తానని హామీ ఇస్తున్నాను. కాని ఈ వ్యక్తి విషయంలో...’
‘నో. నాకు ఫ్రేంక్ సమాచారం ఇప్పుడే కావాలి. ఈ బెల్ట్‌ని మీరు ఉపయోగించలేకపోతే అది మీ సమస్య. దీన్ని సంపాదించడానికి మేము చాలా కష్టపడ్డాం. ఇతను ఎక్కడ ఉన్నాడో మీరు చెప్పాలి.’
నిక్ కంఠం పెంచకపోయినా అతని మాటల్లో హెచ్చరికని రాయ్ పసికట్టాడు. సింహం బోనులోంచి బయటకి వస్తోందని జీన్ అనుకుంది. రాయ్ మొహం మరోసారి పాలిపోయింది.
‘కొన్ని నిమిషాల పనికి నేను మీకు పది వేల డాలర్లు ఇస్తున్నాను. చేదా?’ నిక్ అసహనంగా అరిచాడు.
‘డబ్బు గురించి కాదు. ఇది అంత తేలిక కాదు.. నేను...’ రాయ్ నిస్సహాయంగా తల అడ్డంగా ఊపాడు.
మేక్స్ తన కోటుని కొద్దిగా పక్కకి తొలగించాడు. హోల్‌స్టర్లోని రివాల్వర్ పిడి అతని చంక కింద నించి రాయ్‌కి కనిపించింది.
‘తప్పదు. పని ఆరంభించండి’ నిక్ చెప్పాడు.
రాయ్ అయిష్టంగా లేచి ఆ బెల్ట్‌ని అందుకుంటూ చెప్పాడు.
‘నాకు మరుగు అవసరం. ఈ వ్యక్తిని కాంటాక్ట్ చేయడం కష్టం అనిపిస్తోంది. ఐనా ప్రయత్నిస్తాను’
‘అది మా ముందు చేయలేరా?’ నిక్ అడిగాడు.
‘లేదు. ముగ్గురి సమక్షంలో చేయలేను. ఏకాంతం కావాలి’
‘నేను కోరే సమాచారం మీకు తప్పక తెలియాలి’ నిక్ హెచ్చరికగా చెప్పాడు.
దానికి బదులు చెప్పకుండా రాయ్ ఓసారి జీన్ వంక నిరసనగా చూసి లేచి తెర చాటుకి వెళ్లాడు. అకస్మాత్తుగా ఆ గదిలో నిశ్శబ్దం ఏర్పడింది. కొద్ది క్షణాల్లో ఆ గదిలో గాలి పూర్తిగా స్తంభించిన భావన ఆ ముగ్గురికీ కలిగింది. కొద్దిగా వెలుగు తగ్గినట్లుగా కూడా అనిపించింది.
నిక్ అసహనంగా చేతి గడియారం వంక చూసుకున్నాడు. అదే సమయంలో రాయ్ నెమ్మదిగా తెర వెనక నించి బయటకి వచ్చాడు. అతను ట్రాన్స్‌లో ఉన్నట్లుగా స్వల్పంగా తూలుతూ వారి వైపు అడుగులు వేశాడు. నిక్ అతన్ని చూసి అది నటన అని అనుమానపడ్డాడు. రాయ్ కుర్చీలో కూర్చోకుండా బల్ల దాటి మెరుపులా మేక్స్ దగ్గరికి వెళ్లి అతని హోల్‌స్టర్‌లోని రివాల్వర్‌ని అందుకున్నాడు. దాంతో నిక్ ఛాతీలో మూడుసార్లు కాల్చి, తర్వాత కుప్పకూలి పడిపోయాడు.
నిక్ వెదికే తన ప్రత్యర్థి ఫ్రేంక్ మూడు రోజుల క్రితం మరణించాడని కాని, రాయ్‌ని ఆవహించాడని కాని ఆ గదిలోని ఎవరికీ తెలీదు.
(జేమ్స్ హెచ్ స్మిట్స్ కథకి స్వేచ్ఛానువాదం)

మల్లాది వెంకట కృష్ణమూర్తి