క్రైమ్ కథ

నైట్ వాచ్‌మేన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పార్కర్ చెమట పట్టిన చేతిని పేంట్‌కి తుడుచుకుని తన హోల్‌స్టర్లోంచి రివాల్వర్ని అందుకున్నాడు. ఆయన కొద్దిగా ముసలివాడైనా చెవులు చక్కగా పని చేస్తాయి. పార్కర్ నైట్ వాచ్‌మేన్‌గా పనిచేసే ఆ ఫర్నిచర్ స్టోర్‌లో ఎవరో కదులుతున్నట్లుగా అలికిడి వినిపించింది.
మెజనైన్ ఫ్లోర్ రైలింగ్ దగ్గర నిలబడి కింది సేల్స్ ఫ్లోర్ వంక చూశాడు. షెల్ఫ్‌లు, కుర్చీలు, దివాన్లు అమ్మే ఆ ఫ్లోర్‌లో పైన లైట్ వెలుగుతోంది. పార్కర్ కింద నించి అప్పుడే కాఫీ కోసం పైకి కాఫీ మేకర్ దగ్గరికి వచ్చాడు. అద్దం పెంకులు రాలిన శబ్దం వినిపించడంతో కాఫీ మెషీన్ని ఆన్ చేయలేదు. వెంటనే భయంతో ఆయన గుండె కొట్టుకునే వేగం పెరిగింది. తను హేమర్ స్మిత్ ఫర్నిచర్ స్టోర్లో నైట్ వాచ్‌మేన్‌గా చేరినప్పుడే అర్ధరాత్రి చొరబడే దొంగల విషయంలో జాగ్రత్తగా ఉండాలని ఆయనకి తెలుసు. చాలా నెలలుగా పార్కర్ ఓ కుర్చీలో కూర్చుని నవలలు చదువుతూ మెళకువగా ఉంటున్నాడు.
ఫర్నిచర్ దుకాణంలోకి ఎవరు వస్తారు? సోఫాలు, కుర్చీలో జేబులో పెట్టుకుని తీసుకెళ్లేవి కావుగా? బహుశ ఆ రోజు అమ్మకాల సొమ్ము కోసం వచ్చి ఉండచ్చు. కాని హేమర్ స్మిత్ నిత్యం ఆ సొమ్ముని ఇంటికి తీసుకెళ్తూంటాడని పార్కర్‌కి తెలుసు. ఆ దొంగకి తెలీకపోవచ్చు.
లినోలియం ఫ్లోర్ మీద మెత్తటి బూట్ల చప్పుడు నెమ్మదిగా వినిపించింది. ఆయన దీర్ఘశ్వాస వదిలి అటు వైపు చూస్తే ఓ ఆకారం కనిపించింది. పార్కర్ కుడిచేతిని ఎత్తి ఆ ఆకారం తలకి కొద్దిగా పైకి బేరల్ని గురి పెడుతూ చేతిని కదపసాగాడు. ఆ ఆకారం ఆఫీస్ గది వైపు నడుస్తూండటంతో తన ఊహ నిజం అనుకున్నాడు. ఇంక ఆలస్యం చేయకుండా వాడు పారిపోయేలా చేయాలనుకుని గట్టిగా అరిచాడు.
‘ఆగు. కదలక’
అదే సమయంలో ఆ దొంగ తలకి కొద్దిగా పైకి గుండు దూసుకుపోయేలా రివాల్వర్ని పేల్చాడు. అదే సమయంలో పార్కర్ ఊహించనిది జరిగింది. ఆ ఆకారం రెండు మెట్లెక్కడంతో ఆ గుండు అతని తలకి తగిలి వాడు నేలకూలాడు. పార్కర్ నివ్వెరపోతూ ఏం జరిగిందో వెంటనే అర్థంకాక చూస్తూండిపోయాడు. ఆ దొంగ తన అరుపుకి కంగారుగా మెట్లెక్కి గుండు ప్రయాణించే మార్గంలోకి వచ్చాడని గ్రహించాడు. తను ఓ వ్యక్తిని కాల్చాడని తెలీగానే పార్కర్ చిన్నగా కేక పెట్టి గబగబా మెట్లు దిగాడు. అతను దెబ్బ తగిలినట్లుగా నటిస్తున్నాడేమో అనే జాగ్రత్తతో నెమ్మదిగా అతని వైపు అడుగులు వేశాడు. షో రూం మధ్యలో మెట్ల మీద పడి ఉన్న దొంగ మొహం మీదకి టార్చ్‌లైట్‌ని ప్రసరించి చూసాడు. మెట్ల మీద కారిన రక్తం, కదలిక లేకుండా వెల్లకిలా పడి ఉన్న ఆ దొంగని చూసి వాడు మరణించాడని అనుకున్నాడు.
చిన్నగా నిట్టూర్చి రిసీవర్ని అందుకుని షెరీఫ్ నంబర్ తిప్పాడు.
* * *
పార్కర్ భార్య వౌరీన్‌కి తన భర్త రాత్రిళ్లు పని చేయడం ఇష్టం లేదు. గురక పెట్టినా రాత్రిళ్లు ఆయన తన పక్కన లేకపోవడం లోటుగా అనిపిస్తూంటుంది. ప్రతీ ఉదయం పార్కర్ స్టోర్నించి వచ్చే సమయానికి బ్రేక్‌ఫాస్ట్ సిద్ధంగా ఉంచుతుంది. ఆయన తన మనవడు జోయెల్‌తో కలిసి బ్రేక్‌ఫాస్ట్ చేస్తాడు.
ఆ రోజు పార్కర్ ఇంటికి ఎప్పటికన్నా ఆలస్యంగా రావడానికి కారణం షెరీఫ్‌కి, డెప్యూటీ షెరీఫ్‌కి, హేమర్ స్మిత్‌కి, మళ్లీ షెరీఫ్‌కి, జర్నలిస్టులకి జరిగింది అనేకసార్లు చెప్పాల్సి రావడం. షెరీఫ్ టాం అనేకసార్లు ప్రశ్నించడానికి కారణం పార్కర్ చెప్పే దాంట్లో తేడా ఉందేమోనని.
టాం, పార్కర్‌లకి నలభై ఏళ్ల పరిచయం. బాల్యం నించే ఇద్దరూ మిత్రులు.
‘గ్రాండ్ పా! నువ్వు బ్రేక్‌ఫాస్ట్‌కి లేటయ్యావే?’ చేతిలో పుస్తకాలతో కూర్చున్న మనవడు జోయెల్ అడిగాడు.
‘మీ అమ్మమ్మకి కోపం వచ్చిందా?’
‘దారిలో ఎవరితోనో మాట్లాడుతూ ఆగావని అనుకుంది. ఇతరులతో మాట్లాడుతూంటే నీకు టైం తెలీదు అన్నది’
‘నిజమే. ఇవాళ మాట్లాడాల్సి వచ్చింది’
జోయెల్ స్కూల్‌కి వెళ్లిపోయాడు.
‘పార్కర్! ఏం జరిగింది?’ వౌరీన్ ప్రశ్నించింది.
‘నేను నిన్న రాత్రి ఛాంప్ డ్రమ్మండ్‌ని కాల్చి చంపాను’
వెంటనే వౌరీన్ చేతిలోని చెంచా చప్పుడు చేస్తూ ప్లేట్లో పడింది.
‘అయ్యో! ఏం జరిగింది?’ భయపడుతూ అడిగింది.
‘స్టోర్లోని కిటికీ పగలగొట్టి వచ్చి ఆఫీస్ గదిలోకి వెళ్తూండగా అతన్ని ఆగమని హెచ్చరికగా తలపైన కాల్చాను. కాని ఆ సమయంలో అతను రెండు మెట్లెక్కడంతో గుండు తల్లో దిగిపోయింది’
‘నీకేం కాలేదుగా?’
‘అతను కాల్చలేదు. నేను ఒక్కసారే కాల్చాను’
‘్ఛంప్ అంటే డ్రమ్మండ్ సోదరుల్లో ఆఖరి వాడా?’
‘అవును. జోయెల్‌కన్నా ఐదారేళ్లు పెద్ద’
‘హేమర్ స్మిత్ స్టోర్లో నైట్ వాచ్‌మేన్ ఉన్నాడని వాడికి తెలీదా?’
‘తెలీకపోవచ్చు. తెలిసినా లక్ష్యపెట్టక పోవచ్చు’
‘ఎవరి గురించైనా చెడ్డగా మాట్లాడటం నాకు ఇష్టం ఉండదు. కాని ఆ డ్రమ్మండ్ సోదరులు మంచివాళ్లు కారు’
వౌరీన్ తన భర్త చేతి మీద తన చేతిని వేసి చెప్పింది.
* * *
మిస్టర్ హేమర్ స్మిత్ పార్కర్‌ని రెండు రోజులు విశ్రాంతి తీసుకోమని చెప్పాడు.
రెండు రోజుల తర్వాత జరిగిన విచారణకి పార్కర్ కోర్ట్‌కి హాజరయ్యాడు. ఛాంప్ డ్రమ్మండ్ స్టోర్ కిటికీ తలుపుని పగలకొట్టుకుని రావడం వల్ల అతను దొంగని నిశ్చయం అయింది. హేమర్ స్మిత్ ఫర్నిచర్ స్టోర్ ఉద్యోగిగా పార్కర్ తన బాధ్యతని నిర్వహించాడు. అతను ఛాంప్‌ని చంపాలనే ఉద్దేశంతో కాల్చలేదు. అది ప్రమాదవశాత్తు జరిగిన మరణం. ఛాంప్ కదలికలు తెలిసేంత వెలుతురు స్టోర్లో లేదు.
దానికి హాజరైన డ్రమ్మండ్ సోదరులు తనని బెదిరిస్తారని పార్కర్ ఎదురు చూశాడు. కాని అలాంటిదేమీ జరగలేలదు. హార్వే నీలం రంగు సూట్లో ఉన్నాడు. అతని పక్కనే తమ్ముళ్లు కూర్చున్నారు. వారి పక్కన కూర్చున్న వారి తల్లి కళ్లు తడిగా ఉన్నాయి. ఆవిడ భర్త చాలాకాలం క్రితమే పోయాడు. ఎలా పోయినా కొడుకు పోవడం తల్లిని బాధిస్తుంది. తను హెచ్చరికగా రివాల్వర్ని పేల్చకుండా ఉంటే బావుండేదని ఆ తల్లిని చూసాక పార్కర్ వందోసారి అనుకున్నాడు.
‘ఓ మనిషి జీవితాన్ని నేను అంతం చేసాననే బాధ నన్ను జీవితాంతం పీడిస్తుంది’ చివరగా పార్కర్ చెప్పాడు.
‘అది అతని తప్పిదం తప్ప నీది కాదు’ ఆ కేసుని విచారించే జడ్జ్ చెప్పాడు.
‘పార్కర్. నువ్వు కొన్ని రోజులు జాగ్రత్తగా ఉండాలి. ఛాంప్ అన్న హార్వే డ్రమ్మండ్ చెడ్డవాడు. వాడి తమ్ముళ్లు బాబ్, షేంక్‌లు కూడా మంచివాళ్లు కారు’ షెరీఫ్ టాం హెచ్చరించాడు.
‘షేంక్ అంటే కొంతకాలం జైల్లో ఉండి వచ్చిన వాడా?’ పార్కర్ అడిగాడు.
‘అవును. తాగి కోల్‌మేన్ హార్డ్‌వేర్ స్టోర్ని పట్టపగలే దోచుకోవడంతో జైలుకి వెళ్లాడు. డ్రమ్మండ్ సోదరుల్లో జైలుకి వెళ్లింది అతనొక్కడే. కాని మిగిలిన సోదరులు కూడా నేరస్థులే. ఐతే వాళ్లు ఇంత దాకా పట్టుబడలేదు. ఆ రాత్రి ఛాంప్ వెంట వాళ్లు వచ్చి బయట వేచి ఉన్నారో, లేదో మనకి తెలీదు. ఛాంప్ హత్య తప్పకుండా అతని సోదరులకి కోపం తెప్పిస్తుంది. వాళ్లు పగ తీర్చుకోవాలని అనుకుంటారో, లేదో మనకి తెలీదు’
తర్వాత షెరీఫ్ టాం హార్వేని, అతని సోదరుల్ని ఆపి చెప్పాడు.
‘మన ఊళ్లో ఎలాంటి ఇబ్బందినీ నేను సహించను’
‘మేం ఎవర్ని ఇబ్బంది పెట్టాం?’ బాబ్ కోపంగా ప్రశ్నించాడు.
‘నేను దేని గురించి మాట్లాడుతున్నానో మీకు తెలుసు. పార్కర్ కావాలని ఛాంప్‌ని చంపలేదు. అది అతని తప్పు కాదు. జరిగిందానికి బాధ పడుతున్నాడు.’
‘మా నించి ఈ విషయంలో మీకు ఎలాంటి జవాబూ రాదు’ షేంక్ చెప్పాడు.
‘పదండి’ హార్వే తన సోదరులతో చెప్పాడు.
హార్వే, షేంక్ ఓ పాత కారులో, బాబ్ తన తల్లితో ఓ కొత్త కారులో వెళ్లిపోయారు.
* * *
తర్వాత కొన్ని వారాలు ప్రశాంతంగా గడవడంతో డ్రమ్మండ్ సోదరులు పార్కర్ మీద పగ పట్టలేదని పార్కర్, ఆయన కుటుంబ సభ్యులు, టాం భావించారు.
పార్కర్ వంక అంతా వింతగా చూడటం కూడా తగ్గింది. డ్రమ్మండ్ సోదరులు పార్కర్‌కి మళ్లీ ఎక్కడా కనపడలేదు. పార్కర్ మళ్లీ తన ఉద్యోగాన్ని కొనసాగించాడు.
ఓ రాత్రి పది గంటలకి పార్కర్ స్టోర్లో ఉండగా ఆఫీస్ గదిలోని ఫోన్ మోగింది. అంత రాత్రి ఎన్నడూ ఫోన్ మోగలేదు. ఆ షాప్ ఆరుకి మూసేస్తారని అందరికీ తెలుసు. అది రాంగ్ నంబరై ఉండాలి. లేదా హేమర్ స్మిత్ ఎందుకో ఫోన్ చేసి ఉండాలి అనుకుంటూ వెళ్లి రిసీవర్ ఎత్తాడు.
‘హలో. హేమర్ స్మిత్ ఫర్నిచర్ స్టోర్’
‘పార్కర్. జోయి ఇంకా ఇంటికి రాలేదు’ వౌరీన్ కంఠం ఆదుర్దాగా వినిపించింది.
వెంటనే ఆయనకి డ్రమ్మండ్ సోదరులు గుర్తొచ్చారు. వాళ్లు జోయెల్‌ని ఏమైనా చేసారా?
‘ఎక్కడికి వెళ్లాడు?’ అడిగాడు.
‘ఎప్పటిలానే స్కూల్‌కి. బాస్కెట్‌బాల్ ప్రాక్టీస్ ఉందని, ఆలస్యంగా వస్తానని చెప్పాడు’
‘బహుశ మిత్రుల ఇంటికి వెళ్లి ఉండచ్చు. లేదా ప్రాక్టీస్ తర్వాత అంతా కలిసి ఎక్కడికైనా వెళ్లారేమో?’
‘లేదు. వాడి ఫ్రెండ్స్ అందరిళ్లకీ ఫోన్ చేశాను. వాళ్లంతా ప్రాక్టీస్ తర్వాత ఎవరి ఇళ్లకి వాళ్లు వెళ్లారు’
‘ఆట ఎప్పుడు ముగిసింది?’
‘తొమ్మిదికి. నేను కోచ్‌కి ఫోన్ చేస్తే జోయెల్ కూడా మిగిలిన వాళ్లతో కలిసి వెళ్లాడని చెప్పాడు’
‘కంగారు పడకు. ఇంకొద్దిసేపట్లో వాడు రావచ్చు’ తనకా ధైర్యం లేకపోయినా భార్యకి ధైర్యం చెప్పాడు.
‘వాడొక్కడే మనకి. వాడికి ఏమైనా ఐతే...’
‘నేను కార్లో వెళ్లి వాడ్ని వెదుకుతాను’
‘స్టోర్స్ మాటేమిటి?’ వౌరీన్ అడిగింది.
‘స్టోర్‌కి ఏం కాదు. ఆ సంఘటన తర్వాత మళ్లీ ఎవరూ ఇక్కడికి దొంగతనానికి వచ్చే ధైర్యం చేయరు’
‘నేను షెరీఫ్‌కి ఫోన్ చేయనా?’
‘ఒద్దు. వాడికేం కాకపోతే మనం అనవసరంగా భయపడ్డామని డ్రమ్మండ్ సోదరులకి తెలుస్తుంది’ చెప్పి పార్కర్ రిసీవర్ పెట్టేశాడు.
ఆయన బయటకి వస్తూంటే ఏదో కింద పడ్డ శబ్దం వినిపించింది. స్టోర్‌లోకి ఎవరో వచ్చారు. వెంటనే పార్కర్ గుండె లయ తప్పింది. ఆ సంఘటన తర్వాత హేమర్ స్మిత్ ఏర్పాటు చేసిన కంట్రోల్ స్విచ్‌ని ఆన్ చేశాడు. స్టోర్లోని దీపాలు వెలగలేదు. వాళ్లు వైర్ని కట్ చేసారో, లేక ఫ్యూజ్‌ని తీసేసారో అనుకున్నాడు. అది ఎవరి పనో పార్కర్ తేలిగ్గా గ్రహించాడు.
‘పార్కర్’ ఓ కంఠం మృదువుగా వినిపించింది.
అది హార్వే కంఠంగా గుర్తు పట్టాడు. వెంటనే రిసీవర్ని ఎత్తి చెవి దగ్గర ఉంచుకున్నాడు. డయల్ టోన్ లేదు. దాని వైర్ కూడా ఆ కాల్ తర్వాత కట్ చేసారని గ్రహించాడు.
‘ఆఫీస్ గదిలోంచి బయటకి రా పార్కర్. మా చిన్న తమ్ముడ్ని చంపినంత తేలిగ్గా మమ్మల్నీ చంపగలవేమో చూడు’
తను బదులు చెప్తే ఎక్కడున్నాడో వారికి తెలిసి చీకట్లో తన వైపు కాల్పులు జరపచ్చని భయపడి వౌనంగా ఉండిపోయాడు.
‘బయటకి రా. ఒక్కడ్ని చంపినంత తేలిగ్గా ముగ్గుర్ని చంపలేవు. నీ దగ్గర రివాల్వర్ ఉందని మాకు తెలుసు’
తను కావాలని ఛాంప్‌ని చంపలేదని చెప్దామనుకుని కూడా విరమించుకున్నాడు. పార్కర్‌కి భయంగా ఉంది. ఎందుకంటే అతనికి మరోసారి చంపడం ఇష్టంలేదు.
‘నువ్వు మాకు సారీ కూడా చెప్పలేదు. కనీసం కోర్ట్ మెట్ల మీదైనా, కనీసం మా అమ్మకి సారీ చెప్పి ఉండాల్సింది. చెప్పినా మేం ఇక్కడికి వచ్చేవాళ్లమే’
డ్రమ్మండ్ సోదరులు హింసాత్మకమైన వాళ్లని తెలిసి కూడా వాళ్లు ఇక్కడికి వస్తారని తను ఎందుకు ఊహించలేదా అని పార్కర్ అనుకున్నాడు.
ఆఫీస్ గది తలుపు పైభాగం అద్దం. కాబట్టి లోపల తాళం వేసుకున్నా ప్రయోజనం ఉండదు. వాళ్లు అద్దం పగులగొట్టి లోపల నించి గడియని తీయగలరు. పార్కర్ సాధ్యమైనంత నిశ్శబ్దంగా తలుపు తెరచుకుని, ఒంగొని ఆఫీస్ గది లోంచి బయటకి వచ్చాడు.
‘పార్కర్, నీ మనవడికి ఏదైనా చెడు జరగక మునుపే బయటకి రా’
‘అంటే జోయెల్‌ని వెంట తెచ్చారన్నమాట’
అది పార్కర్‌కి ఆశ్చర్యాన్ని కలిగించలేదు. జోయెల్ ఇంకా ఇంటికి రాలేదని వౌరీన్ చెప్పినప్పుడే అది వారి పనై ఉండచ్చని పార్కర్‌కి అనిపించింది. తమ వెంట లోపలకి తెచ్చారా? లేక బయటెక్కడన్నా బంధించారా? లేక హార్వే అబద్ధం ఆడుతున్నాడా? వాడిని ఇప్పటికే చంపేసారా? వాళ్లు జోయెల్‌ని ఏదైనా చేసి ఉంటే ఇక ప్రాణాలతో బయటకి వెళ్లరు. డ్రమ్మండ్ సోదరులని చంపాలనే నిశ్చయించుకున్నాడు. వాళ్లు యువకులు, నేరస్థులు, కసాయి వాళ్లు. తను వారికి సరిసమానం కాదు.
‘సరే. వెదకండి’ హార్వే కంఠం వినిపించింది.
వెంటనే అడుగుల చప్పుడు కూడా.
చీకటైనా ఏ సామాను ఎకడ ఉందో పార్కర్‌కి తెలుసు కాబట్టి నడవడానికి ఇబ్బంది పడలేదు. తన వైపు నడిచి వచ్చే వ్యక్తిని కాల్చబోయి ఆగిపోయాడు. కిటికీ లోంచి పడే వీధి లైటు వెలుతురులో ఆ వ్యక్తి చేతులు కట్టి, నోట్లో బట్టలు కుక్కారని గమనించాడు. వాడు జోయెల్. చీకట్లో తను వాడిని డ్రమ్మండ్ సోదరుడని కాల్చి చంపుతాడన్నది వాళ్ల పథకంగా అర్థం చేసుకున్నాడు. జోయెల్ కింద పడ్డాడు. వాడి చెవుల్లోని దూదిది, నోట్లోని బట్టని తీసి పార్కర్ నిశ్శబ్దం అని చెవిలో హెచ్చరించి ఏం చేయాలో చెప్పాడు. తర్వాత ఓసారి గాల్లోకి రివాల్వర్ని కాల్చాడు. దెబ్బ తగిలినట్లుగా జోయెల్ గట్టిగా అరిచాడు.
‘నువ్వు నా తమ్ముడ్ని పొరపాటుగా కాల్చినట్లుగా నీ మనవడ్ని కూడా పొరపాటుగా కాల్చావు’ హార్వే కంఠం వినిపించింది.
ఆ కంఠం వినిపించిన వైపు పార్కర్ రివాల్వర్ని కాల్చాడు. హార్వే దబ్బున నేల కూలిన శబ్దం వినిపించింది. మరోసారి రివాల్వర్ పేలింది. ఈసారి గుండు పార్కర్ ఎడమ జబ్బలో గుచ్చుకుంది. కుడిచేత్తో అటువైపు రివాల్వర్ గుళ్లని ఖాళీ చేసాడు.
* * *
‘చేతులు కట్టేసి, నోట్లో బట్ట, చెవుల్లో దూది కుక్కి, జోయెల్‌కి ఏం జరుగుతోందో తెలియకుండా చేసి నీ చేత నీ మనవడ్నే చంపించాలన్నది హార్వే పథకం. అది విఫలమైంది’ షెరీఫ్ టాం చెప్పాడు.
హాస్పిటల్ మంచం మీది పార్కర్ ఔనన్నట్లుగా తల ఊపాడు.
‘వాళ్ల పథకం వల్ల ముగ్గురు డ్రమ్మండ్ సోదరులు మరణించారు. నువ్వు త్వరలో డిశ్చార్జ్ అవుతాడు’ టాం చెప్పాడు.
పార్కర్ కొద్ది క్షణాలు బాధగా కళ్లు మూసుకున్నాడు. తర్వాత చెప్పాడు.
‘కేవలం గాయపడ్డారని అనుకున్నాను’
వౌరీన్ ఆయన చేతిని మృదువుగా నొక్కింది.
‘చీకట్లో కూడా నీ గుళ్లు గురి తప్పలేదు. నువ్వు గొప్ప షూటర్‌వి’ టాం మెచ్చుకున్నాడు.
‘అదృష్టం. దేవుడి దయ. అంతే’ పార్కర్ నీరసంగా చెప్పాడు.
‘అవును. లేదా కాకపోవచ్చు కూడా. ఈ ఊరికి పట్టిన శని వదిలింది. ఇక మీద హేమర్ స్మిత్ ఫర్నిచర్ స్టోర్‌లోకి నువ్వు నైట్ వాచ్‌మేన్‌గా ఉండగా దొంగతనానికి వచ్చే ధైర్యం ఎవరూ చేయలేరు’ టాం చెప్పాడు.
‘అది నాకు సంబంధం లేని విషయం. నేను అక్కడ నైట్ వాచ్‌మేన్ ఉద్యోగాన్ని మానేస్తున్నాను. పైగా ఈ సీజన్ అంతా జోయెల్ బాస్కెట్‌బాల్ ఆటని చూస్తూ గడపాలని ఉంది’ పార్కర్ చెప్పాడు.
*
జేమ్స్ రీజనర్ కథకి స్వేచ్ఛానువాదం

మల్లాది వెంకట కృష్ణమూర్తి