క్రైమ్ కథ

హంతకుడు ఎవరు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆ సమయంలో ఇద్దరు కస్టమర్స్ మాత్రమే ఉన్న డ్రాప్‌బేక్ ఇన్ (బార్)లోకి వచ్చిన అతన్ని చూసి కేప్రిలియన్ నివ్వెరపోయాడు. నడిచి వచ్చే ఫ్రెడ్ వంక నోరు తెరచుకుని చూస్తూండిపోయాడు.
క్రితంసారి ఫ్రెడ్‌ని చూసింది కూడా వర్షపు సోమవారమే. ఆ రోజు అతను ఇద్దరి బరువుని మోస్తున్నట్లుగా కృంగిపోయి కనిపించాడు. ఇప్పుడతను చక్కటి ఖరీదైన సూట్‌లో, ఎన్నడూ వ్యక్తిగత విషాదం అనుభవించని సాధారణ మనిషిలా కనిపించాడు.
ఫ్రెడ్ కూర్చున్న బార్ కౌంటర్ ముందుండే పాత స్టూల్ మీద ఏడు నెలల క్రితం దాకా ప్రతీ రాత్రి కూర్చున్నట్లుగా కూర్చున్నాడు. అతను ఆఫీస్ నించి ఓ మధ్యాహ్నం ఇంటికి వచ్చాక, చచ్చి పడున్న తన భార్యని చూశాడు. తన భార్యని ఎవరో కొట్టి చంపాక వరసగా మూడు నెలలపాటు అలా బార్‌కి తాగడానికి వస్తూనే ఉన్నాడు.
ఫ్రెడ్‌లోని ఈ మార్పు కేప్రిలియన్‌కి ఆనందాన్ని కలిగించింది. ఆమె హత్యకి మునుపు అతనికి ఫ్రెడ్‌తో పెద్దగా పరిచయం లేదు. వాళ్లు బార్‌కి చుట్టుపక్కల ఓ ఇంట్లో ఉంటూ, బార్‌కి ఎప్పుడైనా తాగడానికి వచ్చే కస్టమర్స్‌గానే అతనికి పరిచయం. ఆ ఇద్దరంటే కేప్రిలియన్‌కి ఇష్టం ఏర్పడింది. ఫ్రెడ్ తాగడం మొదలుపెట్టాక, అతని గురించి ఎక్కువ తెలిసింది. త్వరలో ఫ్రెడ్ శవంగా మారచ్చని కూడా అతను భావించాడు. అంతలా తాగేవాడు. ఏడాది మించి బతకరని కేప్రిలియన్ నమ్మకం. ఫ్రెడ్ తన భార్యని ప్రేమించినట్లుగా, కేప్రిలియన్ ఎవర్నీ ప్రేమించకపోవడంతో వారి ప్రేమని అర్థం చేసుకోగలిగాడు. ఆమె హత్యానంతరం ఫ్రెడ్ ఒకటి రెండుసార్లు తను ఇంక జీవించి ఉండలేనని చెప్పాడు కూడా. ఆత్మహత్య చేసుకునే ధైర్యం లేక విస్కీని ఆశ్రయించాడు.
అతను బతికి ఉండాలనుకోడానికి మరో కారణం, తన భార్యని చంపిన హంతకుణ్ని పోలీసులు ఇంకా పట్టుకోలేకపోవడం. హంతకుడికి తగిన శిక్ష పడేదాకా జీవించి ఉండాలని ఫ్రెడ్ కోరుకున్నాడు. ఫ్రెడ్, అతని అందరు మిత్రుల ఎలిబీని పోలీసులు తనిఖీ చేశారు. అందరికీ బలమైన ఎలిబీలు ఉన్నాయి. పైగా ఫ్రెడ్ అమాయకుడై ఉంటాడని, తన భార్యని ఎంతగా ప్రేమిస్తాడో కూడా వాళ్లు పోలీసులకి చెప్పారు. దాంతో పోలీసులు హంతకుడి గురించిన రెండు ఊహాగానాలు చేశారు.
ఒకటి, ఆమె తన అపార్ట్‌మెంట్‌కి తిరిగి వచ్చే సమయానికి అక్కడున్న దొంగ ఆమెని చంపి పారిపోయి ఉండాలి. లేదా ఆ ఊరు మీంచి వెళ్లే అపరిచితుడు ఆ పని చేసి ఉండాలి. ఫ్రెడ్‌ని కేప్రిలియన్ ఆఖరిసారి చూసినప్పుడు ఫ్రెడ్ రాత్రి వర్షంలో తడుస్తూ మాయమయ్యాడు. ఆ తర్వాత మళ్లీ కనపడలేదు. కేప్రిలియన్ ఆనందంగా చెప్పాడు.
‘ఫ్రెడ్! నిన్ను చూడటం ఆనందంగా ఉంది. నువ్వు మాయమై మూడు నెలలైంది’
‘నేను మళ్లీ వస్తానని నువ్వు ఎదురుచూడలేదా?’ ఫ్రెడ్ అడిగాడు.
‘నిజం చెప్పాలంటే, ఎదురుచూడలేదు. నువ్వు ఆరోగ్యంగా కనిపిస్తున్నావు. ఇంతకాలం ఏమయ్యావు?’
‘నా జీవితానికి కొత్త అర్థాలను వెదుక్కుంటూ, పాతవి సవరిస్తున్నాను’
‘నువ్వు ఎలక్ట్రిక్ చైర్‌లోకో, ముందే సమాధిలోకో చేరి ఉంటావని నేను అనుకున్నానంటే, నీకు కోపం రాదుగా?’
‘రాదు. నువ్వు చెప్పింది నిజమే మిత్రమా! జైలుకి వెళ్లుంటానని కూడా అనుకోలేదా?’
‘లేదు. నీకే డ్రింక్ కావాలి?’ నవ్వుతూ అడిగాడు.
‘జింజర్ ఏల్. ఇప్పుడు ఆల్కహాల్ మానేశాను’
కేడ్రిలియన్ మరోసారి ఆశ్చర్యపోయాడు. కొందరు తాగడం ఆపలేరు.
‘బార్ యజమానిగా నేను ఈ మాట అనకూడదు కానీ అదీ నాకు ఆనందం కలిగించే విషయమే. నేను ఇరవై ఏళ్లు దీన్ని నడిపాక నేర్చుకున్న పాఠం, మీ కష్టాలని, దుఃఖాలని ద్రవంలో ముంచి ఆపలేరు. వందల మంది ఆ ప్రయత్నం చేసి, విఫలం అవడం చూశాను’
‘నువ్వు ఈ విషయాన్ని అనేకసార్లు చెప్పడం కూడా నాకు గుర్తుంది. ఓసారి నీ మాట నా మనసులో హత్తుకుంది’
కేప్రిలియన్ గ్లాస్‌లో సగం దాకా ఐసుముక్కలని నింపి, తర్వాత జింజర్ ఏల్ పోసి ఫ్రెడ్ ముందు ఉంచాడు. సరిగ్గా ఆ సమయంలో ఆ బార్‌లోని ఇద్దరు కస్టమర్స్ బీర్ కావాలని కోరారు. వాళ్లకి బీర్ ఇచ్చాక ఫ్రెడ్‌ని అడిగాడు.
‘ఏడు నెలల క్రితం నువ్వు ఎక్కడికి వెళ్లావు? ఊళ్లోనే ఉన్నావా? లేక ఎటైనా వెళ్లావా? నువ్వు ఇక్కడి ఇల్లు ఖాళీ చేశావని నాకు తెలుసు’
‘నేను ఊళ్లో లేను. మనిషిలో మార్పు చిత్రంగా వస్తుంది కేప్రిలియన్. మూడు నెలలపాటు నేను దేన్నీ పట్టించుకోకుండా చింతిస్తూ, తాగి చావాలనుకున్నాను. ఆల్కహాల్ దొరకని పర్వతాల్లోని ఓ కేబిన్ అద్దెకి తీసుకుని, ఈ అలవాటులోంచి బయటపడేదాకా అక్కడే గడిపాను. ఆ తర్వాత నేనేం చేయాలో నాకు అర్థమైంది’
‘ఏమర్థమైంది?’
‘నా భార్య కరెన్ హంతకుడ్ని కనుక్కోవాలి అన్నది’
కేప్రిలియన్‌కి అతన్ని చూస్తే, తను చూసిన ఓ టీవీ క్రైం నాటకంలోని ఓ పాత్ర గుర్తుకి వచ్చింది. ఇలాగే తిరిగి వచ్చిన హీరో పాత్ర నిజ జీవితంలో అలాంటి వ్యక్తిని చూడటం అతనికి ఆనందాన్ని కలిగించింది.’
‘కానీ ఫ్రెడ్, పోలీసులే ఆ హంతకుడ్ని కనుక్కోలేకపోతే...’
‘నేను అన్ని అనుమానాలని పక్కన పెట్టాను. ప్రయత్నం చేస్తే, సఫలవౌతాననే నమ్మకంతో తిరిగి ఈ నగరానికి వచ్చి ఆ హంతకుడి కోసం వెదుకుతున్నాను. చాలా సమయం చిల్లర నేరస్థులు వెళ్లే బార్లలో, వీధుల్లో నివసించే బీదవాళ్లతో గడిపాను. తర్వాత వాళ్లని ప్రశ్నలు అడిగి, సమాధానాలు రాబట్టాను’ ఫ్రెడ్ నవ్వుతూ చెప్పాడు.
‘అంటే, ఆ హంతకుడు ఎవరో నువ్వు కనిపెట్టావా?’
‘లేదు. నాకు వచ్చిన సమాధానాలన్నీ ప్రతికూలమైనవే. ఏదీ కచ్చితంగా తెలియలేదు. కానీ కరెన్‌ని చంపిన వ్యక్తి విషయంలో పోలీసులు పొరబడ్డారన్న విషయం మాత్రం నాకు అర్థమైంది’
అతను ఇంట్లోకి జొరబడిన దొంగో, ఇంకో ఊరికి వెళ్లే వీధి రౌడీనో కాదు’
‘మరి?’
‘నా భార్యకి బాగా తెలిసినవాడు. ఆమె నమ్మేవాడు. అపార్ట్‌మెంట్‌లోకి నా భార్య తేలిగ్గ రానిచ్చేవాడు’
‘అతనెవరో చూచాయగా అయినా తెలిసిందా?’
‘వెంటనే కాదు. నేను రహస్యంగా కొంత పరిశోధించాక. మా ఇంటి చుట్టుపక్కలకి అనేకసార్లు వెళ్లాక. లెక్కల్లో సమస్యకి సమాధానం వచ్చినట్లుగా వచ్చింది. ఆ హంతకుడు ఒక్కడే అయుంటాడు’
‘ఎవరు?’ కేప్రిలియన్ ప్రశ్నించాడు.
‘పోస్ట్‌మేన్’
‘పోస్ట్‌మేన్?’
‘అవును. నువ్వే ఆలోచించు కేప్రిలియన్. నా ఇంట్లోకి ఎవరికి అంత తేలిగ్గా ప్రవేశం దొరుకుతుంది? మా ఇంట్లోకి వస్తున్నా చూసి కూడా, గుర్తుంచుకోని వ్యక్తి ఎవరు? పోస్ట్‌మేన్’
‘ఆ తర్వాత నువ్వేం చేసావు?’
‘అతని పేరు కనుక్కుని క్రితం వారం ఓ రాత్రి అతని దగ్గరికి వెళ్లాను. అతను అపరాధి అన్న సంగతి నేను కనుక్కున్నానని చెప్పాను. సహజంగానే అతను తన తప్పు ఒప్పుకోలేదు. చివరి దాకా తనా నేరం చేయలేదనే చెప్పాడు’
‘చివరిదాకా?’
‘నేను చంపేదాకా’ ఫ్రెడ్ చెప్పాడు.
కేప్రిలియన్ మరోసారి నివ్వెరపోయాడు.
‘చంపావా? ఫ్రెడ్ నువ్వు నిజమే చెప్తున్నావా? అతన్ని చంపావా?’
‘ఎందుకంత ఆశ్చర్యం? నేనింకేం చేయగలను? నా దగ్గర సాక్ష్యం లేదు. కాబట్టి అతన్ని పోలీసుల దగ్గరికి తీసుకెళ్లలేను. అదే సమయంలో, కరెన్‌ని చంపిన అతను తప్పించుకోవడం చూడలేను. నాకు ఇంకో దారి లేదని అర్థం చేసుకో. నేను ఓ తాకట్టు దుకాణంలో కొన్న రివాల్వర్‌తో అతన్ని కాల్చి చంపాను. సరిగ్గా గుండు గుండెలో దిగేలా...’
‘అయ్యో! అయ్యో!’ కేప్రిలియన్ చెప్పాడు.
ఫ్రెడ్ తాగడం ఆపి గ్లాస్‌లోని జింజర్ ఏల్ వంక కొద్ది క్షణాలు చూశాడు. అకస్మాత్తుగా మూడీగా, నిశ్శబ్దంగా మారాడు. అక్కడంతా నిశ్శబ్దం. ఇద్దరు కస్టమర్స్ లేచి డబ్బు చెల్లించి గుడ్‌బై చెప్పి వెళ్లిపోయారు.
చాలా సేపటికి ఫ్రెడ్ చెప్పాడు.
‘కానీ కరెన్‌ని చంపింది అతను కాదని నాకు అర్థమైంది’
‘ఏమిటి?’ కేప్రిలియన్ ఉలిక్కిపడ్డాడు.
‘హంతకుడు పోస్ట్‌మేన్ అయుండడు. అతనిది ఎడమచేతి వాటం. హంతకుడిది కుడిచేతి వాటం అని పోలీసులు చెప్పారు. కరెన్‌ని చంపిన కోణం వల్లో, మరి దేనివల్లో నాకు గుర్తులేదు. దాంతో నేను ఇది మరెవరి పని అని అలోచించాను. అకస్మాత్తుగా నాకు సరుకులు తెచ్చే పచారీ దుకాణం కుర్రాడు గుర్తుకువచ్చాడు. మేము రెండు పచారీ దుకాణాల నించి సరుకు తెప్పించుకునేవాళ్లం. వాటిని తెచ్చే ఇద్దరిదీ కుడిచేతివాటం. మొదటివాడితో మాట్లాడాక, వాడే హంతకుడని నిశ్చయించుకుని, రివాల్వర్‌తో కాల్చి చంపాను. తర్వాత నేను తప్పు చేశానని, హంతకుడు రెండోవాడని తెలిసాక అతన్నీ కాల్చి చంపాను’
‘ఏమిటి ఫ్రెడ్? ఏమిటి నువ్వనేది?’ కేప్రిలియన్ గుడ్లప్పగించి చూస్తూ అడిగాడు.
కొద్దిసేపు జింజర్‌ఏల్ తాగుతూ వౌనంగా ఉన్నాక ఫ్రెడ్ చెప్పాడు.
‘నేను అనేది ఆ ఇద్దరు కుర్రాళ్లు హంతకులు కాదని’
‘అదెలా గ్రహించావు?’ పెగల్చుకుని అడిగాడు.
‘వాళ్లు కాక మరింకెవరు? ఈ చుట్టుపక్కల వాళ్లలోని ఒకరే. అకస్మాత్తుగా నాకు ఎవరో స్ఫురించింది.. జింజర్ ఏల్ బావుంది’
‘ఈ చుట్టుపక్కల వారిలోని ఒకరా? ఎవరు?’ ఆత్రంగా అడిగాడు.
‘నువ్వు’ ఫ్రెడ్ చెప్పాడు.
కేప్రిలియన్ అతని చేతిలో ప్రత్యక్షమైన రివాల్వర్ వంక నమ్మలేనట్లుగా చూశాడు. వరసగా మూడు నెలలు ఆల్కహాల్ తాగాక ఫ్రెడ్ మెదడుకి ఏమైందో కేప్రిలియన్‌కి తక్షణం స్ఫురించింది.
ఫ్రెడ్ టీవీ ఆన్ చేసి శబ్దాన్ని పెంచాడు. కేప్రిలియన్ విన్న ఆఖరి కంఠాలు - ఓ క్రైం నాటకం, అందులో ఓ భర్త తన భార్య హంతకుడ్ని కనుక్కొని అతన్ని చంపడంతో ముగియడం. తద్వారా ఆ భర్త ప్రేక్షకుల దృష్టిలో హీరో అవడం. ప్రకటన వస్తూండగా ఫ్రెడ్ చేతిలోని రివాల్వర్ రెండుసార్లు పేలింది.
***
బిల్‌ప్రొంజినీ కథకి స్వేచ్ఛానువాదం

మల్లాది వెంకట కృష్ణమూర్తి