క్రైమ్ కథ

బ్లాక్‌మెయిల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆగస్ట్ నెల.
గురువారం.
రాత్రి 10.25. టేక్సీ డ్రైవర్ హాగ్‌లేండ్ బెవర్లీ హిల్స్‌లోని ఓ ఖరీదైన హోటల్ ముందు తన టేక్సీని ఆపి అప్పటికే పావుగంట అయింది. ఈసారి అతని వంతు వచ్చింది. సినిమా నటులు, దర్శకులు, నిర్మాతలు, ఫైనాన్షియర్లు తరచు వచ్చే హోటల్ అది.
డోర్ మేన్ ఈల విని వెళ్లి పోర్టికోలో టేక్సీని ఆపాడు. అతను తలుపు తెరవగానే ఓ నలభై ఏళ్లతను వెనక సీట్లో ఎక్కాడు. వెంటనే టేక్సీ అంతా ఆల్కహాల్ వాసన. డోర్ మేన్ అతను ఇచ్చిన కరెన్సీ నోట్‌ని అందుకుని తలుపు మూశాడు.
‘నైన్ ఎయిట్ త్రీ త్రీ. స్టోన్ వేలీ రోడ్’
హాగ్‌లేండ్ టేక్సీని ముందుకి పోనించాడు.

‘దీన్ని పాల వేన్‌లా నడుపు. అంబులెన్స్‌లా కాదు. నేను హాస్పిటల్‌కి కాదు బయలుదేరింది’ వెనక నించి మాటలు ముద్దగా వినిపించాయి.
హాగ్‌లేండ్ బదులు చెప్పలేదు. కొద్దిసేపు ఆగాక వెనక నించి మళ్లీ మాటలు వినపడ్డాయి.
‘నువ్వు మూగవాడివా? మీ టేక్సీ డ్రైవర్లు ప్రయాణీకులతో తెగ మాట్లాడుతూంటారు కదా?’
‘అది ప్రయాణీకుడి మీద ఆధారపడి ఉంటుంది’ హేగ్‌లేండ్ బదులు చెప్పాడు.
‘అంటే? నేను మాట్లాడటానికి పనికి రానివాడినని సూటిగా చెప్తున్నావా?’ అతను కస్సుమన్నాడు.
‘మాకు డబ్బిచ్చేది టేక్సీ నడపడానికి తప్ప మాట్లాడటానికి కాదు’
‘నువ్వు నా దగ్గర ఉద్యోగంలో ఉండి ఉండాల్సింది. నిన్ను ఎలా అణచేవాడినో తెలిసేది’
హాగ్‌లేండ్ వెంటనే బ్రేక్ వేసి టేక్సీని ఆపి వెనక్కి తిరిగి చూస్తూ చెప్పాడు.
‘చూడండి. మీరంటే నాకు ఇష్టం లేదు. నా వరకు మీరు మైలుకి ఇన్ని సెంట్లు అని తీసుకెళ్లే కొన్ని పౌన్లు బరువు గల మాంసం ముద్ద మాత్రమే. నన్ను నిశ్శబ్దంగా టేక్సీని నడపనివ్వండి. లేదా దిగి ఇంటి దాకా తూలుతూ నడిచి వెళ్లండి’
ఆ ప్రయాణీకుడు మారు మాట్లాడలేదు. ఆ చిరునామాకి చేరే దాకా అతను మళ్లీ నోరెత్తలేదు. మీటర్ పనె్నండు డాలర్లు చూపించింది. అతను పది, ఐదు డాలర్ నోట్లని ఇచ్చాడు. హాగ్‌లేండ్ చిల్లర తీసి ఇచ్చే లోపల అతను తూలుతూ తన ఇంటి వైపు వెళ్లిపోయాడు. హేగ్‌లేండ్ మూడు డాలర్లని టిప్ కింద భావించలేదు. చూస్తూ చూస్తూ అతను తనకి మూడు డాలర్ల టిప్ ఇవ్వడు. చిల్లర తీసుకోవడం మర్చిపోయి ఉంటాడు.
టేక్సీని ముందుకి పోనించాడు. కొద్ది దూరం వెళ్లాక రియర్ వ్యూ మిర్రర్ లోంచి అతనికి వెనక సీట్ మీద ఉన్న గోధుమరంగు బ్రీఫ్‌కేస్ కనిపించింది. అది అతను మర్చిపోయిందే. అందులో ఏముంటుంది? డబ్బా? ఇతర విలువైన వస్తువులా?
వెంటనే టేక్సీ వేగాన్ని తగ్గించాడు. దాన్ని ఆపి దిగి వద్దనుకుంటూనే అందులో డబ్బుంటే, ఎంతున్నా సరే, తీసుకెళ్లి ఇవ్వాలనే నిర్ణయంతో దాన్ని తెరిచి చూశాడు. లోపల టైప్ చేసిన కాగితాలు. రెండు పెద్ద కంపెనీలు కలిసి ఒకటిగా మారడానికి సంబంధించిన కాగితాలు అవి.
దాన్ని మూసి డ్రైవింగ్ సీట్లో కూర్చుని తిరిగి ఆ ఇంటికి పోనించాడు. టేక్సీ దిగి, బ్రీఫ్‌కేస్‌ని అందుకుని తలుపు దగ్గరికి వెళ్లాడు. సరిగ్గా డోర్ బెల్ నొక్కే సమయంలో అతనికి లోపల నించి రివాల్వర్ పేలిన శబ్దాలు వరసగా మూడుసార్లు వినిపించాయి. వెంటనే అతని భృకుటి ముడివడింది. లోపల ఎవరో మరణించి ఉంటారని అనిపించింది. అతనికి వెంటనే కలిగిన ఆలోచన తక్షణం పోలీసులకి ఫోన్ చేసి ఆ ఇంటి అడ్రస్ చెప్పాలన్నది. కాని తనది భ్రమైతే?
కిటికీ తెరలన్నీ మూసి ఉండటంతో లోపలి భాగం కనపడటం లేదు. డోర్ బెల్ నొక్కాడు. లోపల గంట మోగిన శబ్దం వినిపించింది. మరోసారి, మూడోసారి కూడా నొక్కాక తలుపు నెమ్మదిగా తెరచుకుంది. ఎదురుగా ఓ పాతికేళ్ల అమ్మాయి కనిపించింది.
‘ఎస్? ఏం కావాలి?’ ఆమె అడిగింది.
తన చేతిలోని బ్రీఫ్‌కేస్‌ని చూపించి చెప్పాడు.
‘ఈ ఇంటికి టేక్సీలో వచ్చిన అతను దీన్ని మర్చిపోయాడు’
‘ఓ థాంక్స్. ఇవ్వండి’ చేతిని చాపింది.
‘కాని ఇందులోనివి విలువైన కాగితాలు. నేను వారికే దీన్ని ఇవ్వాలి’ చెప్పాడు.
‘అతనికే ఇస్తాను. ఇవ్వండి’
‘కుదరదు. సారీ. అతనికే ఇవ్వాలి. రేపు అతను నా కేబ్ కంపెనీకి ఫోన్ చేసి, ఇది అందలేదని ఫిర్యాదు చేస్తే నా ఉద్యోగం ఊడుతుంది. దయచేసి అతన్ని పిలుస్తారా?’
ఆమె హాగ్‌లేండ్ వంక అసహనంగా చూసింది.
‘మీరు అతని భార్యా?’ అడిగాడు.
‘కాదు. అతని భార్య స్నేహితురాలిని. ఆమె హాస్పిటల్‌లో ఉంది. వాళ్ల పిల్లల్ని చూడటానికి వచ్చాను’
హాగ్‌లేండ్ ఆమెని నెట్టుకుంటూ లోపలకి నడిచాడు.
‘ఏమిటీ దౌర్జన్యం?’ ఆమె అరిచింది.
‘కట్టిపెట్టండి. భార్య హాస్పిటల్‌లో ఉంటే, అతను తాగి ఇంటికి వచ్చాడంటే నమ్మశక్యంగా లేదు. అతన్ని పిలవండి. ఇచ్చి వెళ్లిపోతాను. స్నానానికి వెళ్తే వేచి ఉంటాను’
ఆమె హేండ్ బేగ్ తెరచి ఏభై డాలర్లు ఇస్తూ చెప్పింది.
‘ఆయన ఇంతకన్నా తక్కువ టిప్ ఇస్తారు’
‘దీనికి వంద రెట్ల డబ్బు కావాలి’
‘ఏమిటి?’ ఆమె అదిరిపడింది.
‘నాకు మూడుసార్లు రివాల్వర్ పేలిన శబ్దం వినిపించింది. అతన్ని ఎందుకు చంపావు?’ హాగ్‌లేండ్ సూటిగా ప్రశ్నించాడు.
‘నా చేతిలోని రివాల్వర్ పొరపాటున పేలింది’ ఆమె భయంగా చెప్పింది.
‘వరసగా మూడుసార్లు? నేను నమ్మను. అతని పేరు?’
‘్ఫ్లయిడ్. అతను శాడిస్ట్. ఇక భరించలేక...’ ఏడుపుని ఆపుకుంది.
‘అతను ఎంత శాడిస్టో కొద్ది నిమిషాల్లోనే గ్రహించాను. ఆ గదిలోనా?’
తలుపు మూసి ఉన్న గదిలోకి హాగ్‌లేండ్ వెళ్లాడు. నేల మీద పడి ఉన్న అతని మెడ, ఛాతి, నుదుటి మీద గుళ్లు దిగిన గాయాలు ఉన్నాయి. అతని తెల్ల షర్ట్, బూడిద రంగు పేంట్ నిండా రక్తం.
‘అతనికీ, నీకు ఏమిటి సంబంధం?’ అడిగాడు.
‘అతని పర్సనల్ సెక్రటరీని. భార్య పిల్లలతో ఊరెళ్లింది. తండ్రి నించి అతనికి లక్షల వ్యాపారం సంక్రమించింది. అతన్ని కాదనలేకపోయాను’
ఆమె చేతులతో తన మొహాన్ని కప్పుకుంది.
‘మీకు నా సానుభూతి’
‘అతను తాగిన మత్తులో నేను తన భార్య అనుకుని నా మెడ పిసికి చంపబోయాడు. అతని రివాల్వర్ జేములోంచి కనిపిస్తూంటే తీసి కాల్చాను. లేదా నువ్వు నా శవాన్ని చూసి ఉండేవాడివి. బాగా తాగినప్పుడు అతను తన కార్‌ని బార్‌లో వదిలి టేక్సీలో వస్తూంటాడు. తన భార్యకి విడాకులు ఇచ్చి నన్ను చేసుకుంటానన్నాడు. అతని ఆస్తికి ఆశపడి కాదనలేక పోయాను. తాగనప్పుడు అతను పెద్ద మనిషి. పెళ్లయ్యాక అతనితో తాగుడు మాన్పించదలచుకున్నాను. నిజానికి అతనికి తన భార్య నించి విడాకులు లభిస్తే ఇక తాగాల్సినంత ఒత్తిడి ఉండదని నా నమ్మకం’
‘మీరు చెప్పిన కథని పోలీసులు నమ్ముతారనే అనుకుంటున్నాను. పోలీసులకి మీరే ఫోన్ చేయడం మీకు మంచిది’ సూచించాడు.
‘పోలీసులా? అసాధ్యం. అర్థం చేసుకోలేరా? వాళ్లకి అనుమానాలు ఎక్కువ. పైగా పేపర్లలోకి నా పేరు ఎక్కుతుంది. కేసు పూర్తయ్యే దాకా నేను జైల్లో ఉండాలి’ ఆమె ఏడవసాగింది.
‘మీరు చెప్పిందంతా నిజం. కాని ఓ హత్య గురించి తెలిసాక దాన్ని పోలీసులకి ఫిర్యాదు చేయకపోవడం కూడా నేరమే’
‘వారికి ఎలా తెలుస్తుంది? మీరీ ఇంటికి వచ్చారని నాకు తప్ప ఎవరికీ తెలీదు. ఒకవేళ తెలిసినా బ్రీఫ్‌కేస్ ఇవ్వడానికి వచ్చారని మీరు చెప్పచ్చు. మీరు వెళ్లాక హత్య జరిగి ఉండచ్చని చెప్పచ్చు’
‘మీరు నాకు నచ్చ జెప్తున్నారు. కాని...’
‘... వారానికి మీరు ఎంత సంపాదిస్తారు?’
‘ఐదు వందల డాలర్లు’
‘మీకు ఓ ఏడాది సంపాదనని ఇస్తాను’
ఆమె హేండ్‌బేగ్ తెరిచి అతనికి రెండు నోట్ల కట్టలని తీసి ఇచ్చింది. వాటిని అతను జేబులో ఉంచుకుని అడిగాడు.
‘ఇప్పుడు మీరు ఏం చేయదలచుకున్నారు?’
‘ఇంటికి వెళ్తాను’
‘రివాల్వర్‌ని ఏం చేశారు?’
‘నా హేండ్‌బేగ్‌లో ఉంది’
‘దాని మీద వేలిముద్రలు ఉన్నాయా?’
‘ఉన్నాయని అనుకుంటాను’
‘వాటిని తుడిచేసి సముద్రంలో పారేయండి. మిమ్మల్ని చూస్తే మీకు సహాయం చేయాలని అనిపిస్తోంది. మీరు ఇక్కడికి వస్తున్నట్లు ఎవరికైనా తెలుసా?’ హాగ్‌లేండ్ అడిగాడు.
‘తెలీదు’
‘మీరు ఇక్కడికి వస్తున్నట్లు ఇతను ఎవరికైనా చెప్పి ఉంటాడా?’
‘ఎవరికీ చెప్పి ఉండడు. తన భార్యకి తెలుస్తుందని భయం’
‘సరే. బయలుదేరుదాం’
ఇద్దరూ బయటకి వచ్చారు. టేక్సీ ఎక్కబోయే ముందు ఆమె అకస్మాత్తుగా అతన్ని కౌగిలించుకుని గాఢంగా చుంబించి చెప్పింది.
‘మీరు చాలా మంచివారు. దయ గలవారు’
‘కూర్చోండి’
ఇద్దరూ కూర్చున్నాక టేక్సీ కదిలింది.
‘ఎక్కడ దింపాలి?’
‘బెవర్లీ హిల్ హోటల్‌లో. ఇంత రాత్రి ఇంటికి వెళ్లను. లేదా చాలా ప్రశ్నలకి జవాబులు చెప్పాల్సి ఉంటుంది. ఆ హోటల్‌లో మా కంపెనీ సూట్ ఉంది’
టేక్సీ అక్కడికి చేరుకునే దాకా వారి మధ్య మాటలు లేవు. కారు హోటల్ పోర్టికోలో ఆగగానే అతన్ని మరోసారి చుంబించి ఆమె దిగి లోపలకి వెళ్లిపోయింది. హాగ్‌లేండ్ టేక్సీని హోటల్ ఎదురుగా రోడ్ మీద ఆపి వేచి ఉన్నాడు. అతను ఎదురు చూసిందే జరిగింది. ఆమె ఐదు నిమిషాల్లో హోటల్ లోంచి బయటకి వచ్చి ఓ టేక్సీని ఎక్కింది. హాగ్‌లేండ్ దాన్ని అనుసరించాడు. ఆమె ఓ ధనవంతుల కాలనీలోని ఓ ఇంటి ముందు టేక్సీ దిగి డబ్బు చెల్లించి లోపలికి వెళ్లింది.
* * *
మర్నాడు మధ్యాహ్నం హాగ్‌లేండ్ ఆమె ఇంటి డోర్ బెల్ నొక్కాడు. తలుపు తెరచిన ఆమె అతన్ని చూసి కళవిళపడింది.
‘నన్ను నిన్న రాత్రి అనుసరించారా?’ కోపంగా అడిగింది.
‘అవును’
‘ఎందుకు వచ్చారు?’
‘ఆసక్తి’
‘నిన్న మన మధ్య ఏర్పాటుతో మీరు తృప్తి చెందారు. ఇరవై నాలుగు గంటలు కాకుండానే మళ్లీ... ఎంత? నిన్న రాత్రి అది ఇష్టపడి ఇచ్చిన బహుమతి. ఇవాళ బ్లాక్‌మెయిల్’ కోపంగా అడిగింది.
‘నేను డబ్బడిగానా?’
‘మరెందుకు వచ్చారు?’
‘ఒకవేళ నేను అడిగితే ఎంత ఇస్తారు?’
‘నా దగ్గర లేదు. దాన్ని సంపాదించాలి’
‘నేను బ్లాక్‌మెయిల్ చేయడానికి రాలేదు. నిజానికి మీ నించి నిన్న డబ్బు తీసుకోవడం తప్పని తర్వాత నాకు అనిపించింది. నా అప్పులు కొన్ని తీరతాయని ఆ క్షణంలో అనిపించినా అది రక్తంతో తడిసిన డబ్బు. కాబట్టి అది తిరిగి ఇవ్వాలనుకుంటున్నాను. అలా అని నాకు డబ్బంటే ప్రేమ లేదని అనుకోకండి’
‘మీకు పిచ్చా? ఇలాంటి వాళ్లని నేను ఇంత దాకా చూడలేదు. బ్లాక్‌మెయిల్ చేస్తే మిమ్మల్ని అర్థం చేసుకోగలను. ఆ డబ్బు వెనక్కి తీసుకోను. దాన్ని మీరు ఖర్చు చేసి ఆనందించండి. మళ్లీ ఇక్కడికి తిరిగి రావద్దు’ అతని బుగ్గ మీద తట్టి చెప్పింది.
‘నిన్న రాత్రి నువ్వు నన్ను ముద్దు పెట్టుకుని ఉండకపోతే మళ్లీ వచ్చేవాడిని కాను’
ఆమెని దగ్గరకి లాక్కున్నాడు. ఆమె కొద్ది క్షణాలు మాత్రమే ప్రతిఘటించింది. తర్వాత కొద్దిసేపటికి అతను వదిలాక చెప్పింది.
‘అది నా కృతజ్ఞతని అప్పటికప్పుడు తెలియజేయాలని అనిపించి చేసింది తప్ప ఇంకేం కాదు. మళ్లీ మళ్లీ మీకు నేను కృతజ్ఞత చెప్పాల్సిన అవసరం లేదు. మళ్లీ రాకండి’
‘మీ పేరు?’
‘లోరా’
‘లోరా. మీ గురించి చెప్పండి’
‘అది మీకు మంచిది కాదు. మళ్లీ రాకండి. ఇదంతా మర్చిపోయి టేక్సీని నడుపుకుంటూ నిజాయితీగా జీవించమన్నది నా సలహా. నేను హంతకురాలిని కాను. నా గురించి మీరు ఎంత తక్కువ తెలుసుకుంటే నాకు అంత మంచిది. మీరు మీ భద్రత కోసం మళ్లీ రాకండి. నేను ఫీలింగ్స్ గల మనిషిని, దుర్మార్గురాలిని కాను అని నా గురించి గుర్తుంచుకుంటే చాలు’
‘సరే. ఇక అది వదిలేద్దాం. ఈ రాత్రి ఇద్దరం కలిసి భోజనం చేసి సినిమాకి వెళ్దాం. నేను ఆహ్వానిస్తున్నాను’ హాగ్‌లేండ్ చెప్పాడు.
ఆమె చిన్నగా నిట్టూర్చి చెప్పింది.
‘మీరు నేను చెప్పింది ఏదీ వినేలా లేరు. నేను చెప్పిన ఒక్క మాట వినలేదు. నన్ను మర్చిపోండి. మీకు పరిచయం ఉండి మర్చిపోయిన గర్ల్‌ఫ్రెండ్స్‌లా నన్నూ మర్చిపోండి’
‘నేను వారానికి ఆరు రాత్రులు పని చేస్తాను. ఏడో రాత్రి పనె్నండు బై పనె్నండు గదిలో ఒంటరిగా పుస్తకాలు చదువుతూ గడుపుతాను. నాకు గర్ల్‌ఫ్రెండ్ లేదు. విడాకులు తీసుకున్న నా భార్య భరణంగా చాలా కొట్టేసింది. మీ మనసు మారదా?’
‘మారదు. వెళ్లండి. మళ్లీ రాకండి’ కఠినంగా చెప్పింది.
‘మీకు డబ్బు కావాలా?’ హాగ్‌లేండ్ అడిగాడు.
‘నాకు డబ్బూ వద్దూ, మీరూ వద్దు. మళ్లీ రాకండి. నాకు కావల్సింది మీరు మళ్లీ ఇక్కడికి రాకపోవడమే’ అరిచింది.
* * *
మరో రెండు వారాలపాటు అతను వారానికి ఏడు రాత్రులు పని చేశాడు. కాని లోరాని మర్చిపోలేక పోయాడు. ఓ రాత్రి ఎయిర్‌పోర్ట్ నించి ఓ ప్రయాణీకుడ్ని లోరా ఇంటి సమీపంలో దింపాడు. ఆమెని చూడాలనే వ్యామోహాన్ని ఆపుకోలేక, వెళ్లి ఆమె ఇంటి డోర్ బెల్‌ని నొక్కాడు.
తలుపు తీసిన అతన్ని చూసిన లోరాకి కోపం వచ్చింది.
‘నాకు తెలుసు నువ్వు వస్తావని. నీలాంటి వారి గురించి నాకు బాగా తెలుసు. ఎందుకు వచ్చావు?’ కోపంగా అడిగింది.
‘నాతో నువ్వు మాట్లాడే విధానం ఇది కాదు’
‘సరిగ్గా ఇదే. రావద్దన్నానా? వెళ్లు’ అరిచింది.
‘లోరా. నువ్వు వొంటరిగా ఉన్నావు. నేనూ వొంటరినే. బయటకి వెళ్దాం. సినిమాకి. భోజనానికి’
‘ఆమె వొంటరిగా ఉందని ఎలా అనుకున్నావు?’ ఓ మగ కంఠం విని తల తిప్పి చూస్తే హాగ్‌లేండ్‌కి లోపలి గది గుమ్మం ముందు నిలబడ్డ ఓ వ్యక్తి కనిపించాడు. అతను మెక్సికన్ అని గ్రహించాడు.
అతని చేతిలోని రివాల్వర్ చూసి హాగ్‌లేండ్ నివ్వెరపోయాడు. రివాల్వర్ రెండుసార్లు పేలింది. రెండు గుళ్లూ ఛాతీలోనే దిగాయి. హాగ్‌లేండ్ తక్షణం నేలకూలాడు.
‘ఎందుకు కాల్చావు? అతను వస్తే బెదిరించి పంపుతానని నాకు మాట ఇచ్చావు’ లోరా బాధగా అతన్ని నిలదీసింది.
‘అతను ఈ గుళ్లని కోరి వచ్చాడు. నాకు ఇలాంటి వాళ్ల గురించి తెలుసు. ఓ పట్టాన వదలరు. జీవించి ఉంటే ఇంకో రెండు వారాలు గడిచాక నీ నించి ఏభై వేలు తీసుకునేవాడు’
‘నువ్వు దొంగవి కాబట్టి దొంగలా ఆలోచిస్తావు. అంతా నీలాంటి దొంగలే అనుకుంటావు. టోనీ! అసలు నేను నీతో ఎందుకు నా జీవితాన్ని పంచుకుంటున్నానా అని నాకు అప్పుడప్పుడూ అనిపిస్తూంటుంది’ లోరా బాధగా చెప్పింది.
‘ఎందుకా? డబ్బు కోసం. నాలా నీకూ డబ్బు పిచ్చి. నేనా రాత్రే ఇతన్ని చంపి ఉండాల్సింది. ఇంట్లో దొంగతనం చేస్తున్న ఇతన్ని చూసి ఫ్రిడో ఇతన్ని కాల్చి చంపాడని, బదులుగా ఇతను ఫ్రిడోని కాల్చాడని పోలీసులు భావించి ఆ కేసుని మూసేసేవారు. కాని నువ్వు అడ్డుపడ్డావు. ఫ్రిడో ఇంటికి మనం దొంగతనానికి వచ్చామని నిజం చెప్పకుండా గొప్ప కట్టుకథ అల్లి చెప్పావు. అతను ఆ కథని నమ్మాడు. మనం ఆ ఇంట్లోని ఐరన్ సేఫ్‌లోంచి దొంగిలించిన దాంట్లో పదో వంతు అతనికి అనవసరంగా ఇచ్చావు’
‘అతను పోలీసులకి ఫిర్యాదు చేసి, నన్ను వారికి పట్టించి ఉంటే నేనెవరో పోలీసులు ఇట్టే గుర్తించేవారు. నాతోపాటు నిన్నూ పట్టుకునేవారు. కాబట్టి నేను అంత ఒత్తిడిలో కూడా నీ క్షేమానే్న ఆలోచించాను. బదులుగా నువ్వు ఓ మంచివాడిని చంపావు. అతన్ని నేను ఇష్టపడ్డాను’
‘ఇతను ఎంతటి దుర్మార్గుడో ఓ రెండు వారాలు ఆగితే నీకు తెలిసేది’
‘ఇతనితో పోలిస్తే నువ్వు రాక్షసుడివి. టోనీ. ఓ హాగ్‌లేండ్! రావద్దన్నా మళ్లీ ఎందుకు వచ్చావు?’ లోరా ఏడుస్తూ అతని పక్కన కూర్చుని అతని జుట్టుని ప్రేమగా నిమరసాగింది.
**
రాబర్ట్ కోల్బీ కథకి స్వేచ్ఛానువాదం

మల్లాది వెంకట కృష్ణమూర్తి