క్రైమ్ కథ

భోజనానంతరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తలుపు చప్పుడు విని బట్లర్ తలుపు తీసి ఎదురుగా నిలబడ్డ వ్యక్తి వంక చూశాడు.
‘మిస్టర్ హార్డేకర్ నన్ను భోజనానికి పిలిచారు’
‘మంచిది. మీ పేరు?’
‘కెన్‌షా’
బట్లర్ వెంటనే అతన్ని లోపలికి ఆహ్వానించి తీసుకు వెళ్లి హార్డేకర్‌కి పరిచయం చేశాడు. అతనితో కరచాలనం చేస్తూ హార్డేకర్ చెప్పాడు.
‘నంబర్ వన్. గుడీవినింగ్ మిస్టర్ కెన్‌షా’
కొద్ది నిమిషాల తర్వాత మళ్లీ తలుపు చప్పుడైంది. బయట నిలబడ్డ వ్యక్తి తలుపు తెరిచిన బట్లర్‌తో చెప్పాడు.
‘నా పేరు లేంబర్ట్. మిస్టర్ హార్డేకర్ నన్ను ఈ రాత్రికి భోజనానికి పిలిచారు’
బట్లర్ వెంటనే అతన్ని కూడా లోపలికి తీసుకెళ్లి హార్డేకర్‌కి పరిచయం చేశాడు. అతనితో కరచాలనం చేస్తూ హార్డేకర్ చెప్పాడు.
‘నంబర్ టు. గుడీవినింగ్ మిస్టర్ లేంబర్ట్’
మరి కొద్దిసేపటికి తలుపు చప్పుడైంది. ఈసారి వచ్చింది మెకంజీ. అతనితో కరచాలనం చేస్తూ హార్డేకర్ చెప్పాడు.
‘నంబర్ త్రీ’
ఆఖరుగా వచ్చిన పెంటకోస్ట్‌తో కరచాలనం చేశాక ఆయన చెప్పాడు.
‘నంబర్ ఫోర్. ఒకటి, రెండు, మూడు, నాలుగు. మీ నలుగురూ వచ్చారు కాబట్టి ఇక మనం భోజనానికి వెళ్దాం. ఆ తర్వాత మిమ్మల్ని ఎందుకు ఆహ్వానించానో పూర్తి వివరాలు చెప్తాను’
అందరి కోట్లు బట్లర్ అందుకుని ఓ కొక్కేనికి తగిలించాడు. అంతా ఆయన వెంట డైనింగ్ హాల్‌లోకి నడిచారు. విందు పసందుగా ఉందని అంతా మనసులో అనుకున్నారు. భోజనానంతరం హార్డేకర్ లేచి చెప్పాడు.
‘ఎక్స్‌క్యూజ్‌మీ. నేను నా పని వాళ్లకి కొన్ని సూచనలని ఇచ్చి వస్తాను. ఆ తర్వాత మిమ్మల్ని పిలవడానికి కారణం చెప్తాను’
ఆయన వెళ్లగానే మెకంజీ మిగిలిన వాళ్లని అడిగాడు.
‘ఈ పిచ్చివాడు పని వాళ్లకి ఏం సూచనలు ఇస్తాడు?’
‘నాకూ తెలీదు. సహనం. కొద్దిసేపట్లో అంతా తెలుస్తుందిగా’ పెంటకోస్ట్ చెప్పాడు.
‘నలుగురు పూర్తి అపరిచితులని ఈయన భోజనానికి ఎందుకు ఆహ్వానించినట్లు? ఈయన మనసులో ఏం ఉంది?’ మెకంజీ మళ్లీ అడిగాడు.
‘వస్తే మనకి లాభం ఉంటుందని కూడా చెప్పాడు. నేను వచ్చింది ఆ లాభం కోసమే. అది ఎంతై ఉండచ్చు?’ కెన్‌షా ఆసక్తిగా చెప్పాడు.
‘మన మధ్య ఉన్న సంబంధం ఏడాది క్రితం ఒకే లిఫ్ట్‌లో కలిసి ప్రయాణం చేయడం మాత్రమే’ లేంబర్ట్ చెప్పాడు.
‘కాని అక్కడ జరిగింది పోలీసులు క్షుణ్ణంగా పరిశోధించారు. అది ఇంకా నానుతోందని అనుకోను’ పెంటకోస్ట్ చెప్పాడు.
‘మిమ్మల్ని వెయిట్ చేయించినందుకు సారీ. మీరీ పాటికి ఇది నా కొడుక్కి సంబంధించిన వ్యవహారం అని గ్రహించి ఉంటారు’ హార్డేకర్ తిరిగి ఆ గదిలోకి వచ్చి చెప్పాడు.
‘కాని ఆ వ్యవహారం ముగిసింది కదా?’ కెన్‌షా అడిగాడు.
‘నిజమే. ముగిసింది. కాని ఒకటి, రెండు విషయాలు నాకు ఇంకా స్పష్టం కాలేదు. ఇది జరిగి సంవత్సరమైంది. కాబట్టి మీకోసారి జరిగింది గుర్తు చేస్తాను. క్రితం సంవత్సరం ఆగస్ట్ ముప్పైన, అంటే సరిగ్గా సంవత్సరం క్రితం సాయంత్రం ఐదు గంటలకి పూర్తిగా ఒకరికొకరు పూర్తిగా అపరిచితులైన మీరంతా మీమీ కారణాలవల్ల మన్‌హేటన్‌లోని మిడ్‌టౌన్‌లో ఉన్న నార్వింగ్ బిల్డింగ్ ఎక్స్‌ప్రెస్ లిఫ్ట్‌లో కలుసుకున్నారు. ఇరవై ఒకటో అంతస్థులో మిస్టర్ కెన్‌షా, లేంబర్ట్ ఆ రోజు లిఫ్ట్‌లోకి ఎక్కారు. అవునా?’
‘అవును’ లేంబర్ట్ చెప్పాడు.
‘ఇప్పుడు లిఫ్ట్‌లో లిఫ్ట్ బాయ్‌తో కలిసి ముగ్గురు ఉన్నారు. లిఫ్ట్ పద్దెనిమిదో అంతస్థులో ఆగింది. అక్కడ మిస్టర్ పెంటకోస్ట్, మెకంజీలు ఎక్కడంతో ఇప్పుడు లిఫ్ట్‌లో ఐదుగురు ఉన్నారు. పదిహేనో అంతస్థులో లిఫ్ట్ ఆగినప్పుడు నాకు గుడ్‌బై చెప్పి నా కొడుకు లిఫ్ట్‌లోకి ఎక్కాడు. ఇప్పుడు లిఫ్ట్‌లో ఆరుగురు ఉన్నారు. నిజమేనా?’ హార్డేకర్ అడిగాడు.
‘నిజమే’ అన్నట్లుగా నలుగురూ తలాడించారు. గొంతు సర్దుకుని మెకంజీ చెప్పాడు.
‘తర్వాతది నేను చెప్తాను. అకస్మాత్తుగా లిఫ్ట్ పేనల్‌లోని లైట్లు ఆరిపోయాయి. లిఫ్ట్ వేగంగా కిందకి జారసాగింది. మేమంతా భయపడ్డాం. పెంటకోస్ట్ భయంగా కేకలు పెట్టాడు’
‘అవును. నేను ఎమర్జన్సీ స్టాప్ బటన్ నొక్కినా లిఫ్ట్ ఆగలేదు’ కెన్‌షా చెప్పాడు.
‘అది తలుచుకుంటే నాకు ఇప్పటికీ భయంగా ఉంది. లిఫ్ట్ కూలిపోయింది. మేమంతా గాయపడ్డాం’ పెంటకోస్ట్ భయంగా చెప్పాడు.
‘లిఫ్ట్‌లో పూర్తిగా చీకటి అలుముకుంది. ఎవరి దగ్గరైనా అగ్గిపెట్టె ఉందా అని నేను అడిగాను. తన కాలు విరిగింది అని ఎవరో అన్నారు. అప్పుడు అతని పేరు లేంబర్ట్ అని తెలీదు’ మెకంజీ చెప్పాడు.
‘నేను చాలా భయపడ్డాను. నాకు భార్యాపిల్లలు ఉన్నారు. ఎవరైనా రక్షించండి అని వణికిపోతూ అరవసాగాను’ పెంటకోస్ట్ చెప్పాడు.
‘నీ ఒక్కడికే కాదు, అందరికీ భార్యాపిల్లలు ఉన్నారు, అరవక, ఎవరి దగ్గరైనా అగ్గిపెట్టె ఉందా అని మెకంజీ అడగడం నాకు గుర్తుంది’ కెన్‌షా చెప్పాడు.
‘నాకు ఊపిరి ఆడలేదు. లిఫ్ట్ బాయ్ పక్కన కూలబడ్డ నేను అతను పోయాడని గ్రహించాను’ లేంబర్ట్ చెప్పాడు.
హార్డేకర్ మళ్లీ చెప్పసాగాడు.
‘కొద్దిసేపటికి సమాచారం అందుకున్న ఫైర్‌మేన్ వచ్చి లిఫ్ట్ పైభాగాన్ని కట్ చేసి మిమ్మల్ని ఒక్కొక్కర్నీ రక్షించే దాకా మీరు వేచి ఉన్నారు. ఆ లిఫ్ట్‌లో ఆరుగురు. అందులో ఒకరు శవం. అంతా చీకటి. మీ మానసిక పరిస్థితి ఆ సమయంలో ఎలా ఉందో నేను అర్థం చేసుకోగలను. ఎప్పుడు సహాయం వస్తుందో తెలీకుండా చీకట్లో వేచి ఉండటం బాధాకరం.’
* * *
‘నేను ఫోన్ చేయడానికి ఆగి ఉండకపోతే ఈ లిఫ్ట్‌లో ఉండేవాడ్నే కాను’ లేంబర్ట్ చెప్పాడు.
‘సరే. మీరు ఇక్కడ ఉన్నారు కదా’ మెకంజీ విసుగ్గా చెప్పాడు.
వాళ్ల మూలుగుల మధ్య కొద్దిసేపటికి లిఫ్ట్ పైన కొడుతున్న శబ్దం వినిపించింది.
‘ఎవరో రక్షించడానికి వచ్చినట్లున్నారు. హలో’ పెంటకోస్ట్ అరిచాడు.
‘వస్తున్నాం’
‘త్వరగా’
‘ఎవరికైనా దెబ్బలు తగిలాయా?’
‘ఒకరు పోయారు’
‘మేము కొద్దిసేపట్లో కిందకి దిగుతాం’
వాళ్లకి చెవులు పగిలే శబ్దాలు వినిపించాయి. కొద్దిసేపటికి పైన కప్పులో సన్నటి కాంతి ప్రసరించడంతో మెకంజీ చెప్పాడు.
‘కప్పులో రంధ్రం చేస్తున్నట్లున్నారు’
‘మీరంతా గోడకి ఆనుకుని నిలబడండి. నిప్పురవ్వలు కింద పడతాయి’ పైనించి ఇందాకటి కంఠం వినిపించింది.
‘సరే’
‘ఎవరూ పైకి చూడకండి. ఆ కాంతికి కళ్లు పోవచ్చు’ లేంబర్ట్ చెప్పాడు.
వెల్డింగ్ చేసే చప్పుడు కర్ణకఠోరంగా వినిపిస్తోంది. ఒకరిద్దరు చెవులు మూసుకున్నారు.
‘ఎవరూ ఆ గట్టిగా అరిచింది? ఏమిటా చప్పుడు?’ పెంటకోస్ట్ భయంగా అడిగాడు.
‘ఏమో? అదిగో కిందకి తాడు వేశారు’ మెకంజీ చెప్పాడు.
పై కప్పుని తొలగించాక వినిపించింది.
‘నేను కిందకి దూకుతున్నాను. జాగ్రత్త. మధ్యలో ఎవరూ ఉండకండి’
ఫైర్‌మేన్ కిందకి దూకాక అడిగాడు.
‘మీలో ఎక్కువ గాయపడింది ఎవరు?’
‘నా కాలు విరిగింది’ లేంబర్ట్ చెప్పాడు.
ఫైర్‌మేన్ హెల్మెట్‌కి ఉన్న టార్చ్‌లైట్ కాంతి అతని మీదకి ప్రసరించింది.
‘ఆఫీసర్. నన్ను ముందుకి బయటకి తీసుకెళ్లండి. నాకు భయంగా ఉంది’ పెంటకోస్ట్ బతిమాలాడు.
‘మీకేం కాలేదు. అతనికి కాలు విరిగింది’
చెప్పి లేంబర్ట్‌ని తాడుకి వేలాడే ఉయ్యాలలో కూర్చోపెట్టి పైకి లాగారు. కదలకుండా కింద పడి ఉన్న ఇద్దర్ని ఫైర్‌మేన్ పరిశీలించాడు. తాడు మళ్లీ కిందకి వచ్చాక ఫైర్‌మేన్ అడిగాడు.
‘ఈసారి ఎవరు?’
‘స్పృహ తప్పిన ఇతన్ని తీసుకెళ్లండి’ మెకంజీ సూచించాడు.
ఆఖరుగా లిఫ్ట్‌లోకి ఎక్కిన ఆ యువకుడ్ని ఫైర్‌మేన్ పరిశీలించి చెప్పాడు.
‘ఇతను తీవ్రంగా గాయపడ్డాడు. రక్తం కారుతోంది’
‘లైట్ బల్బ్ పగిలింది. గాజుముక్కలు గుచ్చుకున్నట్లున్నాయి’ కెన్‌షా చెప్పాడు.
‘కారణం అది అనుకోను. ఇతను పోయాడు’
‘అది తప్పు. ఇతను నిమిషం క్రితమే మాతో మాట్లాడాడు. తన తండ్రి ఈ లిఫ్ట్‌లో లేనందుకు సంతోషంగా ఉందని చెప్పాడు’ మెకంజీ చెప్పాడు.
‘అర నిమిషం క్రితం. ఇప్పుడు ఇతను మరణించాడు’ ఫైర్‌మేన్ చెప్పాడు.
* * *
హార్డేకర్ ఆ నలుగురికీ చెప్పాడు.
‘జెంటిల్‌మెన్. నా కొడుకు మరణించడం వాడి దురదృష్టం. మీరు జీవించి ఉండటం మీ అదృష్టం అని అనుకోకండి. ఐదు రోజుల తర్వాత శుక్రవారం సాయంత్రం మూడుకి మీరంతా మళ్లీ పోలీసుస్టేషన్‌లో కలిసారు. అక్కడికి ఆఖరిగా వీల్‌చెయిర్‌లో వచ్చింది లేంబర్ట్...’
* * *
‘మీ కాలు ఎలా ఉంది?’ మిగిలిన వారు ప్రశ్నించారు.
‘అతుక్కోడానికి కొంతకాలం పడుతుంది’
‘నా పేరు చీఫ్ ఇన్‌స్పెక్టర్ మెగ్‌మైన్. మీతో ఫోన్‌లో చెప్పినట్లుగా ఇక్కడ మిమ్మల్ని ఎక్కువసేపు ఆపను. ఆ రోజు లిఫ్ట్‌లో జరిగిన విషయం గురించి రొటీన్‌గా ప్రశ్నించడానికి మిమ్మల్ని పిలిపించాను. అందులో ఓ ఆత్మహత్య జరిగింది’
‘ఆత్మహత్యా?’ లేంబర్ట్ నివ్వెరపోతూ అడిగాడు.
‘అవును’
‘అంటే లిఫ్ట్‌బాయ్ కావాలని లిఫ్ట్‌ని కూల్చేసాడన్నమాట?’ పెంటకోస్ట్ అడిగాడు.
‘కాదుకాదు. ఇందులో లిఫ్ట్‌బాయ్ తప్పు లేదు. జేమ్స్‌కి ఛాతీలో రివాల్వర్ పేలిన గాయం ఉంది. పాయింట్ 32 కేలిబర్ గుండు గుండెలో దిగడంతో అక్కడికక్కడే మరణించాడు’ చీఫ్ ఇన్‌స్పెక్టర్ చెప్పాడు.
‘అంటే లిఫ్ట్‌లో మా సమక్షంలోనే అతను కాల్చుకుని మరణించాడు అని అంటున్నారా?’ మెకంజీ అడిగాడు.
‘ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు?’ కెన్‌షా అడిగాడు.
‘మీ నలుగురిలో ఒకరు అతన్ని చంపకపోతే అది ఆత్మహత్యే. మీలో ఎవరికైనా అతను పరిచయమా?’
‘లేదు’ అందరూ చెప్పారు.
‘అతని తండ్రిని కూడా ఇంతకు ముందే ప్రశ్నించాను. మీ నలుగురికీ తన కొడుకుతో పరిచయం లేదని చెప్పారు. కాని నలుగురి సమక్షంలో లిఫ్ట్‌లో అతను కాల్చుకుని ఆత్మహత్య చేసుకోవడం వింతగా ఉంది. మీలో ఎవరైనా రివాల్వర్ పేలిన శబ్దం విన్నారా?’ చీఫ్ ఇన్‌స్పెక్టర్ అడిగాడు.
‘లేదు. బ్లో టార్చ్ శబ్దాలు భయంకరంగా వినిపించాయి. కాబట్టి ఇంకే శబ్దం వినిపించలేదు’
‘రివాల్వర్ మీద అతని వేలిముద్రలే ఉన్నాయి. కాబట్టి ఆది ఆత్మహత్యే అయి ఉండాలి’
‘అతని ఆత్మహత్యకి కారణం?’
‘ఆ విపత్కర పరిస్థితికి తాత్కాలికంగా మతిస్థిమితం తప్పి ఉండచ్చని పోలీస్ సైకియాట్రిస్ట్ చెప్పాడు. కాని అతని తండ్రి మాత్రం తన కొడుకు అంత పిరికివాడు కాడని, అది హత్యే అయి ఉంటుందని అంటున్నాడు. కాబట్టి మిమ్మల్ని ప్రశ్నించడానికి పిలిచాను’
‘ఆ శబ్దానికి భయం వేసి మతిస్థిమితం తప్పి ఉండచ్చు. పాపం. ఇంకా చాలా జీవితం ఉంది’ మెకంజీ చెప్పాడు.
‘అవును. ఇది మీలో ఎవరి పనో రుజువు దొరికి ఉంటే అతను ఇక్కడ నించి బయటకు వెళ్లేవాడు కాదు. ఇది రొటీన్ విచారణ మాత్రమే. ఇక మీరు వెళ్లచ్చు’ చీఫ్ ఇన్‌స్పెక్టర్ చెప్పాడు.
* * *
‘ఇది సంవత్సరం క్రితం జరిగింది. వారం క్రితం మిమ్మల్ని భోజనానికి ఆహ్వానిస్తూ ఫోన్ చేశాను. మిస్టర్ మెకంజీ. మీకు పెళ్లయింది కదా? మీ ఇంటికి మొన్న సోమవారం రాత్రి ఎనిమిదికి ఫోన్ చేశాను. ఆహ్వానిస్తే మీరేమన్నారో మీకు గుర్తుందా? ‘మీరు నాకు తెలీదు. నేను మీకు తెలీదు. నేను ఎందుకు రావాలి?’ అన్నారు.’
‘అవును’
మెకంజీకి తర్వాత తన భార్యతో జరిగిన సంభాషణ గుర్తుకు వచ్చింది.
‘ఏమిటది? ఎవరు?’ రిసీవర్ పెట్టేశాక అతని భార్య అడిగింది.
‘పేరు హార్డేకర్. క్రితం సంవత్సరం లిఫ్ట్‌లో ఆత్మహత్య చేసుకున్న యువకుడి తండ్రి’
‘ఏం కావాలిట?’
‘శనివారం రాత్రి అతని ఇంటికి భోజనానికి ఆహ్వానించాడు’
‘ఎందుకట?’
‘తెలీదు. తన కొడుకు మరణించిన ఆఖరి నిమిషంలో అతని దగ్గర ఉన్న మరో ముగ్గుర్ని కూడా పిలిచానని చెప్పాడు. తనకి బంధువులు ఎవరూ లేరని, తన కొడుక్కి చాలా డబ్బుందని, కొడుకు మరణించిన సమయంలో అతని దగ్గరున్న వాళ్లకి దాన్ని పంచితే ఎలా ఉంటుంది? అని అడిగాడు’
‘మరి మీలో సంతోషం లేదే? వందలా? వేలా? లేదా కొన్ని వందల వేలా?’
‘ఇది పిచ్చి పని’
‘దాతృత్వం పిచ్చి పని

లానే అనిపిస్తుంది’
‘తన కొడుకు గుర్తుగా ఏదైనా సంస్థకి విరాళం ఇవ్వచ్చు. లేదా బీద విద్యార్థులకి స్కాలర్‌షిప్ ఇవ్వొచ్చు. హాస్పిటల్స్‌కి ఇవ్వచ్చు. ఆయనకి కొంత ఉన్మాదం ఉండుండాలి. కొడుకు పోయాక కొంతకాలం మెంటల్ హాస్పిటల్‌లో ఉన్నాడని చదివాను. ఈ డబ్బు ఎర వేయడం పగ తీర్చుకోడానికై ఉండచ్చు. మాలో ఒకరం అతన్ని చంపామని ఆయన నమ్ముతున్నాడని చీఫ్ ఇన్‌స్పెక్టర్ ఆ రోజు చెప్పాడు. అందుకే అందర్నీ పిలుస్తున్నాడు అని నా అనుమానం’
‘అలా ఎందుకు అనుమాన పడుతున్నాడు?’
‘తన ఆస్థిని పూర్తి అపరిచితులకి ఎందుకు పంచాలని అనుకుంటున్నాడో అందుకు. పిచ్చి’
‘ఐతే వెళ్లకండి’
‘కాని వస్తానని మాట ఇచ్చాను’
‘మీరు బేంక్‌లో పని చేసేప్పుడు కొన్న రివాల్వర్ మీ దగ్గర ఇంకా ఉందిగా. దాన్ని తీసుకెళ్లండి’ మెకంజీ భార్య సూచించింది.
‘మంచి ఆలోచన. దాన్ని ఆయిల్ చేస్తాను’ మెకంజీ అంగీకరించాడు.
* * *
‘మీ అందరూ నా ఆహ్వానాన్ని మన్నించి వచ్చినందుకు మీకు కృతజ్ఞుడ్ని. మిస్టర్ మెకంజీ. మీ వెనుక నిలబడ్డ నా పని వాడు మీకు రివాల్వర్ గురి పెట్టి నించున్నాడు. మీ జేబులోని రివాల్వర్‌ని నాకు ఇవ్వండి’ హార్డేకర్ కోరాడు.
మెకంజీ దాన్ని ఇస్తూ అడిగాడు.
‘ఎలా తెలుసు?’
‘నా పని వాడు మీ కోట్‌ని అందుకున్నప్పుడు చొక్కా కింద ఉబ్బెత్తుగా ఉన్న రివాల్వర్ ఆకారాన్ని గమనించాడు.
‘నేను వెళ్తాను. నేను వచ్చింది భోజనానికే. పనైంది’ పెంటకోస్ట్ వెంటనే చెప్పాడు.
‘ఈ రహస్యం ఏమిటి? చెప్పండి. నన్ను ఎందుకు పిలిచారు?’ మెకంజీ అడిగాడు.
‘అవును చెప్పండి’ కెన్‌షా అడిగాడు.
‘నేను ఫోన్‌లో చెప్పినట్లుగా మా అబ్బాయి ఆస్థిని మీకు పంచడం మీకు అయిష్టం అనుకోను. నేను నెల క్రితమే మీ అందరి గురించి ఆరా తీశాను’
‘ఇదంతా ఏమిటి? ఉన్న విషయం సూటిగా చెప్పండి’
‘చెప్పబోయే ముందు నాకోటి తెలియాలి’
హార్డేకర్ సైగ చేయగానే బట్లర్ దాన్ని తీసుకొచ్చి బల్ల మధ్య ఉంచాడు. గాజు గ్లాసులోని ద్రవాన్ని చూసి మెకంజీ అడిగాడు.
‘ఆయుర్వేద ఔషధంలా ఉంది?’
‘అవును.. నేను పిలిచేదాకా మీలో ఎవరూ లోపలకి రాకూడదు’ వెళ్తున్న బట్లర్‌తో హార్డేకర్ చెప్పాడు.
‘ఏమిటిది?’ లేంబర్ట్ అడిగాడు.
‘పాలు, ఆవాలు, ఇంకా విషానికి విరుగుడు’
‘దేనికి విరుగుడు?’ పెంటకోస్ట్ ఉలిక్కిపడి అడిగాడు.
‘సరిగ్గానే విన్నావు. విషానికి. ఈ గదిలో ఇప్పుడు ఓ హంతకుడు ఉన్నాడు. మీలోని ఒకడు నా కొడుకుని చంపారు. ఇంకా దానికి పరిహారం చెల్లించలేదు’
‘కాని అది ఆత్మహత్య’
‘మెకంజీ. ఇక్కడ చర్చల్లేవు. మరణశిక్ష మాత్రమే ఉంది’
‘నేను వెళ్తున్నాను’ కుర్చీని వెనక్కి తోసి లేచి పెంటకోస్ట్ కోపంగా చెప్పాడు.
‘నా పనివాళ్లు నిన్ను బయటకి వెళ్లనివ్వరు. ఈ గదిలోంచి బయటకు వెళ్తే దెబ్బలు కొట్టి తెచ్చి ఇక్కడే పడేస్తారు’
‘మనం వివేకంగా ఆలోచించాలి’
‘చర్చకి ఇది సమయం కాదని ఇందాకే చెప్పాను మెకంజీ. మీలో నా కొడుకుని ఎవరు చంపారో నాకు తెలుసు. అతనికి విష ప్రయోగం చేశాను. పది నిమిషాల్లో మరణిస్తాడు’
నలుగురూ ఒకరి మొహాలని మరొకరు భయంగా చూసుకున్నారు.
‘తెలిస్తే పోలీసులకి చెప్పచ్చుగా?’
‘ఇది చట్టం చేయలేని పని. చట్టానికి కావాల్సింది రుజువులు మాత్రమే. సరిపడ రుజువులు నా దగ్గర లేవు. అందువల్లే నేనీ శిక్షని అమలు చేస్తున్నాను. విషానికి విరుగుడు ఎదురుగా బల్ల మీద ఉంది. హంతకుడు తను చేసిన నేరాన్ని ఒప్పుకుని దాన్ని తాగాలి. లేదా ఇక్కడే మరణిస్తాడు’
‘అప్పుడు మీరు జైలుకి వెళ్తారు’ మెకంజీ చెప్పాడు.
‘అది నాకు తెలుసు. దీని ఫలితాలకి నేను సిద్ధంగా ఉన్నాను. కాని హంతకుడు అంతకు మునుపే తగిన శిక్షని అనుభవిస్తాడు’
‘కాని హంతకుడి విషయంలో మీరు పొరబడి ఉండచ్చుగా?’
‘హంతకుడు ఎవరో అతనికి తెలుసు. అతను ఎవరో నాకు తెలుసు. మిగిలిన వారు భయపడక్కర్లేదు. నా కొడుకుని హత్య చేసినవాడు ఇంక ఏడు నిమిషాలే జీవిస్తాడు’
ఆ గదిలో కొంత సమయం భారంగా గడిచింది.
‘ఇది ప్రాక్టికల్ జోక్‌లా ఉంది’ కొద్దిసేపాగి లేంబర్ట్ చెప్పాడు.
‘అలాంటి ఆలోచనే చేయద్దు. ఇది ప్రాణ సమస్య. నేను చెప్పింది నిజమే. ఇంక ఐదు నిమిషాలు మాత్రమే’
‘మనం అంతా దాన్ని తలా కాస్తా తాగుదాం’ అప్పటికే ముచ్చెమటలు పట్టిన పెంటకోస్ట్ సూచించాడు.
‘దురదృష్టవశాత్తు అది ఒకరికి సరిపడే విరుగుడు మాత్రమే’
‘మీకు పిచ్చెక్కింది’ కెన్‌షా చెప్పాడు.
‘కావచ్చు. నీకో కొడుకున్నాడా? లేడు కదా? ఉండి ఉంటే నీకు తెలిసేది ఇది పిచ్చి కాదని’
మరి కొంత సమయం ఆ గదిలో భారంగా గడిచింది. మరో మూడు నిమిషాలు ఉందనగా కెన్‌షా గ్లాస్ అందుకుని గటగటా తాగేశాడు.
‘ఇప్పుడు మీకు హంతకుడు ఎవరో అర్థం అయిందా?’ హార్డేకర్ ప్రశ్నించాడు.
‘నేను జేమ్స్‌ని ఇంకోసారి కూడా చంపుతాను. వద్దని వారించినా నేను ప్రేమించిన అమ్మాయిని వాడు పెళ్లి చేసుకోవాలి అనుకున్నాడు. వాడి రివాల్వర్‌తోనే వాడ్ని కాల్చాను. తర్వాత నా వేలిముద్రలు తుడిచి దాన్ని వాడి చేతిలో ఉంచాను. వాడ్ని చంపినందుకు నాకు ఆనందంగా ఉంది’ కెన్‌షా క్రోధంగా చెప్పాడు.
తర్వాత కుప్పకూలిపోయాడు.
‘అతను ఆలస్యం చేశాడు. విరుగుడు పనిచేసినట్లు లేదు’ మెకంజీ చెప్పాడు.
‘అతను తాగింది విరుగుడు కాదు. విషమే. నా కొడుకుని మీలో ఎవరు, ఎందుకు చంపారో నాకు తెలీదు. కాని మీలోని ఒకరు చంపారని మాత్రం తెలుసు. కెన్‌షా తన నేరానికి తనే మరణశిక్షని విధించుకున్నాడు. ఆ పాలు తాగేదాకా అతని ఒంట్లో విషం లేదు. నేను మీకు మాట ఇచ్చినట్లుగా నా కొడుకు ఆస్థిని మీ ముగ్గురికీ సమానంగా పంచుతాను. ఎవరైనా పోలీసులకి ఫోన్ చేయండి. ఇతన్ని నేను చంపానో లేదా ఇతని అపరాధ భావన చంపిందో అన్నది కోర్టు నిర్ణయించాలి’ హార్డేకర్ చెప్పాడు.

కార్నెల్ ఊల్‌రిచ్ కథకి స్వేచ్ఛానువాదం

మల్లాది వెంకట కృష్ణమూర్తి