క్రైమ్ కథ

ఖరీదైన బేరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆ రాత్రి తుఫాను వల్ల చాలా చలిగా ఉండబోతోందని కాటిల్ ఊహించాడు. గది మధ్యలోని ఇనప కుంపటి దగ్గరికి వెళ్లి కొత్త కట్టెని నిప్పులో ఉంచాడు. అతనికి కొండల్లోని పైన్ వృక్షాల మధ్య నించి వచ్చే ఉత్తర గాలుల శబ్దం వినిపిస్తోంది. కిటికీలోంచి మంచు తునకలు పడటం కనిపిస్తోంది. బయట ఉన్న వాళ్లకి అది నరకపు రాత్రి అవుతుందని అనుకున్నాడు. కుంపటి నించి వేడి వస్తున్నా అతనికి స్వల్పంగా చలిగా ఉంది.
కిరోసిన్ లాంతరు వెలుతురులో మెయిల్ ఆర్డర్ కేటలాగ్‌ని మళ్లీ చదవసాగాడు.
ఆ భవంతి సింహద్వారపు తలుపు మీద మృదువుగా కొట్టిన మొదటి శబ్దం అతనికి వినపడలేదు. గాలి ఈల దాన్ని మింగేసింది. ఇంకాస్త గట్టిగా కొట్టడంతో రెండోసారి విన్నాడు. చొక్కాల కోసం రెండు పేజీల కేటలాగ్‌లో వెతికే కాటిల్ కొద్దిగా ఆశ్చర్యపోయాడు. నిర్మానుష్యమైన పర్వతాల్లో ఇంత రాత్రి ఈ బీభత్స వాతావరంలో ఏ మూర్ఖుడు బయటకి వస్తాడు. వెంటనే లేచి గుమ్మం దగ్గరికి వెళ్లి తలుపు తెరిచేలోగా తలుపు మీద కొట్టే శబ్దం కొనసాగింది. అతను తలుపు తెరవగానే మీద మంచుపడ్డ ఓ ఆకారం వేగంగా లోపలకి ప్రవేశించింది.
అతని తల మీద బూడిద రంగు టోపి, ఒంటి మీద తేలికపాటి రెయిన్ కోట్ ఉన్నాయి. బూట్ల నిండా బురద. అతను తక్షణం కుంపటి దగ్గరికి వెళ్లి చేతులని చాపి ఒంటిని వేడి చేసుకోసాగాడు. తలుపు మూసి అతని వైపు వెళ్లిన కాటిల్ అతను నగరవాసి అని గ్రహించాడు.
‘ఇక్కడ బాగా చలిగా ఉంది’ పళ్లు టకటక కొట్టుకుంటూంటే అతను చెప్పాడు.
‘అవును’
అతను తడిసిన రెయిన్ కోట్‌ని విప్పుతూ చెప్పాడు.
‘నా పేరు జాన్ డే...’
కొద్దిసేపాగి మళ్లీ చెప్పాడు.
‘..జాన్ డేస్’
‘నా పేరు కాటిల్. మీకేమైనా కావాలా?’
‘నా కారుకి పెట్రోల్ కావాలి. అది అయిపోవడంతో ఎనిమిది మైళ్ల దూరంలో ఆగిపోయింది. అక్కడ నించి నడిచి వచ్చాను’ జాన్ చెప్పాడు.
‘మీరు ఇటువైపు రావడం అదృష్టం. అవతలి వైపునకు వెళ్లుంటే సీడర్ గ్రామం ఇరవై ఐదు మైళ్ల దూరంలో ఉంది. దారిలో గడ్డ కట్టి మరణించేవారు’
‘నాకు తెలుసు. వచ్చే దారిలో మేమ సీడర్ గ్రామంలో ఆగాం. మీ దగ్గర పెట్రోల్ ఉందా?’
‘నా దగగర పెట్రోల్ ఉంటుందని ఎలా అనుకున్నారు?’
‘బయట పెట్రోల్ ఫిల్లింగ్ పంప్ గొట్టాలు కనిపించాయి’
‘మీరు ఉదయం చూసి ఉంటే అవి తుప్పు పట్టాయని గ్రహించేవారు. గత ఏడేళ్లుగా అవి వాడకంలో లేవు. ఆరు లేన్ల హైవేని నిర్మించాక నా వ్యాపారం దివాలా తీసింది. రెండు మూడు వారాలకి ఒకటి, రెండు కార్లు మించి ఇక్కడికి రావు’
‘కాని ఇప్పుడు నాకు పెట్రోల్ అవసరం ఉంది’ డేస్ భయంగా చెప్పాడు.
కాటిల్ జేబులోంచి నలిగిన ఓ సిగార్ని తీసి పొయ్యిలోని కట్టెతో అంటించుకుని చెప్పాడు.
‘నగరంలో ఉన్న వారితో వచ్చే ఇబ్బందే ఇది. అన్నిటికీ తొందర. ఓ వారం, పది రోజులకి ఏ కారైనా ఇటొస్తే మీ కారుని తాడుతో కట్టి లాక్కుని తీసుకెళ్తారు’
‘కాని నేను ఈ రాత్రే వెళ్లాలి’
‘అలాగా? అంత అవసరం ఏమిటి?’ కాటిల్ అడిగాడు.
‘నా భార్య కార్లో నా కోసం వేచి ఉంది. సూర్యోదయం లోపల ఆమె చలికి గడ్డ కట్టి కారులో మరణించవచ్చు. మీ దగ్గర ఒకటి, రెండు గేలన్ల పెట్రోల్ ఉంటే ఇవ్వండి. లేదా వెళ్లిపోతాను’ జాన్ డేస్ చెప్పాడు.
‘మీరు ఇక్కడ నించి వెళ్లడం మంచిది కాదు. మంచు అధికంగా పడుతోంది. సీడర్ గ్రామం ఇరవై నాలుగు మైళ్ల దూరంలో ఉందని చెప్పాగా? ఇక్కడికి సమీపంలోని స్టీవ్ చిన్న ఎయిర్‌పోర్ట్‌ని నడుపుతున్నాడు. అతన్నించి బహుశ మీరు కొంత పెట్రోల్ కొనచ్చు’
‘అది ఎంత దూరంలో ఉంది?’
‘పదిహేడు మైళ్లు’
డేస్ అతని వంక వలలో చిక్కిన జంతువులా చూసి చెప్పాడు.
‘నేను వెనక్కి వెళ్లి కార్లోంచి హెలెన్‌ని తీసుకుని వస్తాను’
‘వెళ్లి రావడానికి మొత్తం పదహారు మైళ్లు. బహుశా కారు దాకా చేరగలరు. కాని తిరిగి రావడం అనుమానమే. ముఖ్యంగా ఓ ఆడదానితో, చలికి గడ్డ కట్టి మరణించిన వారిని మీరు ఎప్పుడైనా చూశారా?’ కాటిల్ ప్రశ్నించాడు.
‘కాని నేనేదైనా చేయాలి’ డేస్ ఆదుర్దాగా చెప్పాడు.
‘అది నిజమే. బహుశ నా దగ్గర డ్రమ్‌లో కొంత పెట్రోల్ ఉండచ్చు. నా వేన్ టైర్లు ఊడిపోయి, రేడియేటర్ ఎండిపోయి కొద్ది దూరంలో పార్క్ చేసి ఉంది. కాబట్టి నాకు దాని అవసరం లేదు కాబట్టి మీకు నేను కొంత పెట్రోల్‌ని అమ్మే అవకాశం ఉంది’
వెంటనే డేస్ మొహంలోని వత్తిడి, భయం తగ్గాయి. దీర్ఘంగా నిట్టూర్చి అడిగాడు.
‘ఐతే మీ దగ్గర నిజంగా పెట్రోల్ ఉందా? రెండు గేలన్లు ఇస్తే చాలు’ చెప్తూ జేబులోంచి పర్స్ తీశాడు.
‘ఒక్క నిమిషం మిస్టర్’
‘ఏమిటి?’ డేస్ ఆదుర్దాగా అడిగాడు.
‘పెట్రోల్‌ని ఎలా తీసుకెళ్లాలో ఆలోచించారా? దాన్ని జేబులో పోసుకెళ్లలేరుగా?’
‘మీ దగ్గర ఖాళీ కేన్ ఏదీ లేదా?’
‘మీకు కేన్‌ని కూడా అమ్ముతాను. ఉదాహరణకి ఇది.’ కాటిల్ బల్ల మీద ఉన్న ఓ గాజు సీసాని తీసి చూపించాడు.
‘అర్థమైంది. ఈ లావాదేవీలో మీరు లాభాన్ని ఆశిస్తున్నారు. సీసాకి ఎంత?’ డేస్ పొడిగా నవ్వి చెప్పాడు.
‘ఐదు డాలర్లు’
‘అది చాలా ఎక్కువ. గేలన్ పట్టే ఇలాంటి సీసాలు నాకు రెండు కావాలి. నిర్మానుష్యమైన ఇలాంటి చోట మీరు ఎక్కువ గుంజడం బహుశ సబబే’
డేస్ పర్స్‌లోంచి పది డాలర్ల నోట్‌ని తీసి కాటిల్ వైపు చాపాడు. కాటిల్ వెంటనే దాన్ని అందుకోకుండా డేస్ కళ్లల్లోకి చూస్తూ చెప్పాడు.
‘నేను చెప్పింది మీకు అర్థమైనట్లు లేదు. ఐదు డాలర్లు సీసాకి. పెట్రోల్‌తో కాదు’
‘ఏమిటి! ఈ ఖాళీ సీసాకి ఐదు డాలర్లా? దీన్ని పాతిక సెంట్లకి ఏ దుకాణంలోనైనా నేను కొనగలను’
‘నిజమే. ఈ రాత్రి ఏ దుకాణానికి వెళ్లి కొనాలని అనుకుంటున్నారు?’ కాటిల్ నవ్వుతూ అడిగాడు.
డేస్ కిటికీలోంచి బయటకి చూస్తే అద్దం మీద గడ్డ కట్టిన మంచు కనిపించింది. కోపాన్ని అణచుకుంటూ అడిగాడు.
‘పెట్రోల్‌కి ఎంత?’
డేస్ చేతిలోని లావు పర్స్‌ని దురాశగా చూస్తూ కాటిల్ చెప్పాడు.
‘మీరు ఈ లావాదేవీలో సుముఖంగా ఉన్నారు. ఆపదలో ఉన్నారు కాబట్టి గేలన్‌కి ఏభై డాలర్లు’
‘ఏభై డాలర్లు! ఇది దారిదోపిడీ’
‘ఇక్కడ పెట్రోల్ ధర అధికమే’ కాటిల్ నవ్వుతూ చెప్పాడు.
‘జోక్ చేశారా?’
‘లేదు. నిజమే చెప్తున్నాను’
డేస్ నిస్పృహగా పర్స్‌లోని నోట్లని బయటకి తీసి లెక్క పెట్టి చెప్పాడు.
‘నా దగ్గర ఉన్నవి అరవై డాలర్లే’
‘అంటే మీకు ఓ గేలన్ పెట్రోల్‌ని, ఓ సీసాని కొనగా ఇంకా ఐదు డాలర్లు మిగులుతాయి. కుంపటి వేడికి నేనేమీ ఛార్జ్ చేయను’ కాటిల్ నవ్వుతూ చెప్పాడు.
‘ఐతే మంచివాడివి. కాని నాకు రెండు గేలన్లు అవసరం’
‘కాని కొనేందుకు మీ దగ్గర డబ్బు లేదు. మీ ఆవిడ దగ్గర ఉండచ్చు. అన్నట్లు ఆమెకి ఆ కారులో చాలా చలిగా ఉంటుంది’
‘దయచేసి రెండు గేలన్లని ఇవ్వండి. నా వాచీని ఇస్తాను’ డేస్ స్ట్రేప్‌ని విప్పతీస్తూ బతిమాలుతున్నట్లుగా చెప్పాడు.
‘నాకు వాచ్ అవసరం లేదు. ఇక్కడ కాలానికి విలువ లేదు. కాబట్టి ఒక్క గేలన్‌తో వెళ్లండి. మంచు పడటం అధికం అయిందని గమనించారా? ఇంకో గేలన్ కావాలని అనుకుంటే, మీ ఆవిడ దగ్గర డబ్బుంటే మళ్లీ కార్లో ఇక్కడికి రావచ్చు. ఉండటానికి మీకు ఓ గదిని ఇస్తాను. డైలీ అద్దె ఖరీదు. వీక్లీ అద్దె చవక’
జవాబు కోసం ఎదురుచూడకుండా కాటిల్ ఆ ఖాళీ సీసాతో వెనక గదిలోకి వెళ్లి పెద్ద పెట్రోల్ డ్రమ్‌లోంచి దాన్ని నింపి తెచ్చాడు. అప్పటికే డేస్ రెయిన్ కోట్‌ని తొడుక్కున్నాడు.
‘ఇదిగో మీ డబ్బు’ నోట్లని అందిస్తూ కోపంగా చెప్పాడు.
‘మీ ప్రాణాలని కాపాడే వ్యక్తి మీద కోపం మంచిది కాదు... సరిగ్గా ఏభై ఐదు డాలర్లు. మీతో వ్యాపారం చేయడం నాకు ఆనందంగా ఉంది’ కాటిల్ డబ్బుని లెక్క పెట్టుకుని చెప్పాడు.
జాన్ డేస్ గుమ్మందాకా వెళ్లాక కాటిల్ అడిగాడు.
‘ఇంకాసేపట్లో మళ్లీ వస్తారు కదా?’
అతన్ని గట్టిగా తిట్టి డేస్ తలుపు తెరచుకుని తుఫాన్ రాత్రిలోకి వెళ్లిపోయాడు.
దాదాపు అర్ధరాత్రి అయ్యాక బయట గాలి, మంచు పడటం ఆగిపోయాయి. తన ఇంటి బయట కీచుమంటూ కారు ఆగిన శబ్దాన్ని విని కాటిల్ తలుపు తెరిచాడు. కారు దిగిన డేస్‌ని అతన్ని అనుసరించే ఓ సన్నటి యువతిని చూశాడు. ఆమె ఒంటి మీది దుస్తులు చలిని ఆపేవి కావని గ్రహించాడు. చలికి వారి పెదవులు నీలం రంగులోకి మారాయి. వాళ్లు నిశ్శబ్దంగా లోపలకి వచ్చి కుంపటి దగ్గర ముడుచుకుని నిలబడ్డారు.
‘ఈమె నా భార్య హెలెన్. మీరు దయతో అమ్మిన పెట్రోల్ గురించి చెప్పాను’ డేస్ చలి నించి తేరుకున్నాక చెప్పాడు.
‘ఎవరికైనా సేవ చేయడం నాకు ఆనందం. మీ ఇద్దరూ ఇంకో గేలన్ కొనడానికి నిశ్చయించుకున్నారా?’ కాటిల్ నవ్వుతూ అడిగాడు.
‘నా దగ్గర కొంత డబ్బుంది. మేము పెట్రోల్ కొంటాం’ హెలెన్ మృదువుగా చెప్పింది.
‘మంచిది. కాకపోతే పెట్రోల్ ధర మళ్లీ పెరిగింది. గేలన్ ధర ఇప్పుడు అరవై ఐదు డాలర్లు. మీరు ఖాళీ సీసాని వాడితే ఐదు డాలర్లు ఆదా చేయచ్చు’
హెలెన్ తన హేండ్ బేగ్‌ని తెరచి ఓ నోట్ల కట్టని కాటిల్ వైపు విసిరింది. అది చప్పుడు చేస్తూ నేల మీద పడింది.
‘ఇది పెట్రోల్‌కి సరిపోతుందని అనుకుంటా?’ కోపంగా అడిగింది.
కాటిల్ ఆ నోట్ల కట్టని చూసి ఆశ్చర్యంగా అడిగాడు.
‘ఇంత డబ్బే?’
‘నీకు కావాల్సింది అదేగా?’ హెలెన్ అడిగింది.
‘నిజమే. కాని ఈ పేపర్ స్లిప్ మీద..’
‘.... అవును. బేంక్ ఆఫ్ సీడర్ విలేజ్ అని ఉంది’
డేస్ చేతిలో రివాల్వర్ ప్రత్యక్షమైంది.
‘ఇలాంటి నోట్ల కట్టలు మా కారు ట్రంక్‌లో ఇంకా చాలా ఉన్నాయి. మేము సీడర్ విలేజ్‌కి వెళ్లామని చెప్పాను కాని, ఎందుకో చెప్పలేదు’ డేస్ కాటిల్‌కి రివాల్వర్‌ని గురి పెట్టి చెప్పాడు.
‘మీరు... మీరు ఆ బేంక్‌లో దొంగతనం చేశారా? కాని ఇందాక మీ దగ్గర డబ్బు లేదని అబద్ధం ఆడారే?’ కాటిల్ నిందిస్తున్నట్లుగా అడిగాడు.
‘నడిచేప్పుడు ఎవరైనా అంత డబ్బుని దగ్గర ఉంచుకుంటారా? దారిలో రోడ్ మీద ఎలాంటి వారు తారసపడతారో తెలీదు కదా?’
‘చూడండి మిస్టర్ డేస్. మీరు ఇక్కడికి వచ్చినట్లు ఎవరికీ తెలీదు. మీ రహస్యాన్ని కాపాడడానికి నేను...’
‘... ఎంత తీసుకుంటావు? కాని నీ ధర అధికం. ఇంకాస్త చురుగ్గా నీ నోటిని మూయగలను. హెలెన్. ఆ గోడకి కట్టిన వైర్‌ని విప్పి ఇతన్ని కట్టు’ డేస్ ఆజ్ఞాపించాడు.
‘నోట్లో బట్టలు కుక్కాలా?’ హెలెన్ అడిగింది.
‘ఒద్దు. అరవనీ. అతను చెప్పడం మరో రెండు రోజుల దాకా ఎవరూ ఇటువైపు రారదు. అప్పటికి మనం చాలా దూరం వెళ్లిపోతాం’
కొద్దిసేపటికి కాటిల్ కుర్చీకి కట్టబడ్డాడు. సహాయం లేకుండా అతను ఆ ఇనప వైర్‌లోంచి బయటపడలేడు. పాదాలు నేలకి తాకకుండా కుర్చీ కింద ఉన్న అడ్డ కర్రల మీద పాదాలు ఉంచి కట్టడంతో అతను కదల్లేడు.
‘ఇప్పుడు మాకు అవసరమైన పెట్రోల్‌ని నీ అనుమతితో తీసుకుంటాం’ డేస్ నవ్వుతూ చెప్పాడు.
కాటిల్ వౌనంగా ఉండిపోయాడు.
‘రెండు గేలన్లు ఇచ్చి ఉంటే నీ పరిస్థితి ఇలా అయేది కాదు’ హెలెన్ చెప్పింది.
‘అంటే?’ కాటిల్ అడిగాడు.
‘నువ్వు చెప్పిన ఎయిర్‌పోర్ట్ గురించి ఈ దొంగతనాన్ని ప్లాన్ చేసినప్పుడే మాకు తెలుసు. ఇక్కడ నించి పదిహేడు మైళ్ల దూరం. పోలీసులు మా కోసం హైవేలో వెదుకుతూంటే, మేం అడ్డదారిలో అక్కడికి బయలుదేరాం. ఓ పైలట్ కొద్దిసేపట్లో చిన్న విమానంలో మా కోసం ఆ ఎయిర్‌పోర్ట్‌లో దిగుతాడు. ఎవరైనా ఎయిర్‌పోర్ట్‌కి చేరుకునేలోగా మేం అక్కడికి చేరుకుంటాం’
‘కాని నువ్వు కార్లో పెట్రోల్ ఎంతుందో చూసుకోలేదు’ హెలెన్ అతనితో కోపంగా చెప్పింది.
‘అవును. నువ్వు మాకు రెండు గేలన్ల పెట్రోల్‌ని ఇచ్చి ఉంటే మళ్లీ ఇక్కడ పెట్రోల్ కోసం ఆగకుండా సరాసరి ఎయిర్‌పోర్ట్‌కి వెళ్లేవాళ్లం. నువ్వు దురాశకి పోయి, పెట్రోల్ కోసం మేం మళ్లీ ఇక్కడికి వచ్చేలా చేసావు. ఈలోగా నువ్వు రేడియోలో ఆ బేంక్ దొంగతనం గురించి వినలేదని ఏమిటి మాకు నమ్మకం?’
‘నా దగ్గర రేడియో లేదు. కావాలంటే వెదికి చూడండి’ కాటిల్ ఆదుర్దాగా చెప్పాడు.
‘సారీ. అది మా ముందు తెలీదు. ఇప్పుడు ఆలస్యంగా తెలిసింది. ఇంక తేడా లేదు’
కార్లో పెట్రోల్‌ని నింపుకున్నాక డేస్ లోపలికి వచ్చి మరోసారి అతని కట్లని పరిశీలించాడు.
‘గుడ్‌బై మిస్టర్ కాటిల్’ చెప్పాడు.
‘ఆగండి మిస్టర్ డేస్’ కాటిల్ బొంగురు గొంతుతో గుసగుసగా చెప్పాడు.
‘ఏమిటి?’ డేస్ ఆగి అడిగాడు.
‘మంచు తుఫాను వచ్చినపుడు ఆ కొండల్లో చలి చాలా అధికం అవుతుంది’
‘అని విన్నాను. ఒకోసారి జీరోకన్నా తక్కువకి పడిపోతుందని కూడా విన్నాను. అది నిజమేనా?’
‘నిజమే. కుంపటిలోని మంట కొద్ది గంటలు మాత్రమే ఉంటుంది’
‘అది అబద్ధం అవుతుంది. మేము కట్టెలని బయటకి తీసి మంచులో పడేస్తే’
‘వద్దు. చలికి గడ్డ కట్టి చచ్చిపోతాడు’ హెలెన్ ఎగతాళిగా నవ్వుతూ చెప్పింది.
‘కాని ఇందాక నువ్వు చలిలో కారులో గడ్డ కట్టుకుని మరణిస్తావని తెలిసినా కాటిల్ బాధపడలేదు’
‘మిమ్మల్ని పెట్రోల్ విషయంలో కొంత ఎక్కువ ధర అడగడం సబబు అవునో, కాదో కాని అందుకోసం చంపడం సబబు కాదు’ కాటిల్ అర్ధింపుగా చెప్పాడు.
‘దీనికి సమాధానం ఇందాక నువ్వే చెప్పావు’ డేస్ నవ్వుతూ చెప్పాడు.
‘ఏమిటది?’
‘పెట్రోల్ ధర పెరిగింది. ఇప్పుడు దాని విలువ నీ ప్రాణాలకన్నా అధికం’ డేస్ హెలెన్ వెనక బయటకి నడుస్తూ చెప్పాడు.
‘పైగా సాక్షిని బతకనివ్వడం మంచిది కాదు కూడా’ హెలెన్ చెప్పింది.

విలియం బ్రెటైన్ కథకి స్వేచ్ఛానువాదం

మల్లాది వెంకట కృష్ణమూర్తి